Site icon Sanchika

సంపాదకీయం జనవరి 2021

[dropcap]అం[/dropcap]దరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2020వ సంవత్సరం మొత్తానికి కాలగర్భంలో కలసిపోయింది. కొత్త సంవత్సరం వైపు ఆశగా చూస్తూ, కరోనా విముక్త ప్రపంచాన్ని దర్శించే ఆ ఉదయం ‘వోహ్ సుబహ్ కభీతో ఆయెగీ’ అనుకుంటూన్నది ప్రపంచం. అయితే, కత్తి పోయి డోలు వచ్చె అన్నట్టు కరోనా మరో కొత్త రూపం ధరించి భయపెడుతోంది. మానవ జీవితంలోని గొప్పతనం ఇదే. భవిష్యత్తు గురించి భయపడుతూ ప్రమాదాల్లోంచి ప్రయాణిస్తూ కూడా ప్రమోదాలనుభవిస్తూంటాడు మనిషి. ఆశల అందమయిన వలలల్లుకుంటాడు. భవిష్యత్తు గురించి భయపడుతూనే భవిష్యత్తు కోసం ఆశపడుతూంటాడు. ఇది మానవ జగత్తును ఒక అత్యద్భుతమయిన అనుభవంలా మలుస్తుంది. సృజనాత్మక రచయితలు ఈ అత్యద్భుతాన్ని తమ రచనలలో ప్రతిబింబించటం ద్వారా సమాజానికి భవిష్యత్తు గురించిన ఆలోచనలు కలిగిస్తారు. ఆశల రంగుల వలలల్లి పంచరంగుల స్వప్నాలు చూపిస్తూ ఆశలు కల్పిస్తారు. కష్టాలను దాటి సుందర భవిష్యత్తును దర్శింపచేసి భరోసానిస్తారు. సంచిక ఆరంభం నుంచీ సృజనాత్మక కళాకారుల బాధ్యత, సాహిత్య ప్రయోజనం, దీర్ఘకాలిక ప్రభావం, లక్ష్యాలను అర్థం చేసుకున్నది. అందుకే నిత్యం నూతన ఆలోచనలను, వినూత్నమయిన రీతిలో అందించటం ద్వారా పాఠకులను ఆకర్షించాలని తపనపడుతోంది.

పాఠకులను పెంచుకుంటూ ఎలాంటి ఉద్రేకపరిచే విషయాలు, ద్వేషాలు, ఆవేశాలు పెంచి అడ్డుగోడలు నిర్మించే అంశాలు, దిగజారుడు రాతలు లేకుండా ఉత్తమము, ఉన్నతము అయిన విలువలు పాటిస్తూ, సంస్కారవంతంగా తెలుగు పాఠకులను పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చని నిరూపించాలని తపనపడుతోంది. అందుకు సహకరిస్తున్న పాఠకులు, రచయితలు శ్రేయోభిలాషులంతా ఈ నూతన సంవత్సరంలో కూడా అదే విధంగా సహకరించాలని, సంచికను సాహితీసుసంపన్నంగా మలచటం ఒక సామూహిక బాధ్యత అని గుర్తించాలని ఆశిస్తోంది. ఇంకా పలు కారణాలవల్ల సంచికకు దూరంగా వుంటూ, దూరంపెడుతున్న సాహితీ అభిమానులు కూడా ఈ నూతన సంవత్సరంలోనయినా వ్యక్తిగత స్థాయిని దాటి చూడగలిగి సంచిక జరుపుతున్న సాహితీ యజ్ఞంలో పాల్గొనాలని భ్యర్ధిస్తోంది.

2020 మానవజీవితం ఎంత సున్నితమయినదో ఎత్తిచూపించింది. ఆప్తులను, సన్నిహితులను, సాహితీవేత్తలను, ప్రముఖులను కక్షగట్టినట్టు పొట్టనపెట్టుకున్నది. దీనినుంచి మనమంతా గుణపాఠం నేర్చుకోవాలి. ఏ సిద్ధాంతమయినా, ఇజమయినా, విభేదమయినా మనిషిని మించినది కాదు. కాబట్టి ఊపిరివున్నన్నాళ్ళూ అందరము కలసి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, మనలోని విభేదాలను అవగాహన చేసుకుంటూ, మన్నిస్తూ కలసిమెలసి ముందుకుసాగాలని, ఒకరికోకరం ఆనందకరమయిన అనుభవాలను, అనుభూతులను ఇస్తూ ముందుకు సాగాలని సంచిక అభిలషిస్తోంది. ఈ సందర్భంగా ఒక సినీకవి రాసిన పంక్తులను గుర్తుచేస్తోంది.

ఆద్మీ ముసాఫిర్ హై, ఆతాహై జాతాహై,

ఆతే జాతే రాస్తేమే యాదే ఛోడ్ జాతేహై….

నిజం మనిషి ఒక ప్రయాణీకుడు. జీవితం ఒక ప్రయాణం.. వస్తూంటాడు. పోతూంటాడు. ఈ వస్తూ పోతూ బోలెడన్ని జ్ఞాపకాలు వదిలి వెళ్తూంటాడు. అలా వెళ్ళినవారి జ్ఞాపకాలను గుండెల్లో పదిలపరచుకుంటూ మన కర్తవ్యాన్ని నిర్వహించాల్సివుంటుంది.

ఆజ్ గాలో ముస్కురాలో, మహఫిలే సజాలో

క్యాజానే కల్ కొయి సాథి ఛూట్ జాయే,

జీవన్ కిదోర్ బడి కంజోర్,

కిసో ఖబర్ హై కహాన్ టూట్ జాయే…

కాబట్టి ఈ రోజే సంబరాలు జరుపుకోవాలి, ఆడి పాడాలి. ఎందుకంటే జీవితపు బంధం చాలా బలహీనమయినది, ఎప్పుడు వదిలిపోతుందో తెలియదు.

ఈ సంచికలో చిత్తర్వు మధు సైన్స్ ఫిక్షన్ కథ, తోట సాంబశివరావు కథ, జియో లక్ష్మణ్, గంగాధర్ వడ్లమన్నాటి కథలను ప్రత్యేక శ్రద్ధతో చదవండి. అలాగే ఆదివారం అగరం వసంత్, వల్లీశ్వర్‌లు రచిస్తున్న ధారావాహిక చిన్న కథలను చదవండి. సంచికలో విభిన్నమయిన కథలు విశిష్టంగా వుంటూ తెలుగు కథ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కథ గురించి కథకులు విహారి, బీవీఎన్ స్వామిలు రచిస్తున్న శీర్షికలు చదవండి. ఇంకా, సంచికలోని పలు శీర్షికలు, ధారావాహికలు, వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు, కవితలు, ప్రయాణవిశేషాల రచనలు చదవండి. ఇలా ప్రతి ఒక్కరినీ ఏదో విధంగా ఆకర్షించి చదివింపచేసే రచనలను ప్రచురించాలని సంచిక ప్రయత్నిస్తోది. ఈ ప్రయత్నంలో రచనలతో సహకరించమని రచయితలను, సలహాలు, సూచనలతో మార్గదర్శనం చేయమని పాఠకులను సాహితీ పెద్దలను అభ్యర్థూ స్తూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను సంచిక తెలియచేస్తోంది.

1 జనవరి 2021 సంచికలోని రచనలు:

సంభాషణం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

భక్తి:

బాలసంచిక:

అవీ ఇవీ:

ప్రకటన:

ఈ నూతన సంవత్సరంలో పాఠకులు రచయితలూ సంచికను ఆదరిస్తారని తమ సలహాలు, సూచనలు, రచనలతో సంచికను పరిపుష్టం చేస్తారని ఆశిస్తున్నాము.

సంపాదక బృందం

Exit mobile version