Site icon Sanchika

సంపాదకీయం : 2022కు స్వాగతం

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు సాహిత్య ప్రపంచంపై సంచిక తనదైన ప్రభావం చూపిస్తున్నది. ఇటీవలి కాలంలో సంచికలో ప్రచురితమయిన పలు రచనలు పుస్తకరూపంలో వెలువడి పాఠకాదరణ పొందదటం ఆనందం కలిగించే విషయం. ఈ రచనలన్నీ ప్రత్యేకమయినవి, తెలుగు సాహిత్య ప్రపంచంలో దీర్ఘకాలం మన్నేవీ, కొన్ని తరాలకు ఉపయోగపడేవీ అవటం ఇంకా ఆనందం కలిగిస్తోంది.

  1. నీలమత పురాణం: కశ్మీరుకు చెందిన అతి ప్రాచీన పురాణం ఇది. నీలుడనే నాగు చెప్పిన పురాణం. కశ్మీరు భారతదేశంలో అంతర్భాగమనీ, అవిభాజ్యమయిన అంగమనీ నిరూపిస్తుందీ పురాణం. సంస్కృతము,  హిందీ, ఇంగ్లీషుకాక తెలుగుభాషలోనే ఈ పురాణం అందుబాటులోవుంది.
  2. కార్తీకంలో కాశీయాత్ర: భారతీయులకు అతి పవిత్రమయిన వారణాసి గురించి, వారణాసిలో దర్శనీయమయిన స్థలాల గురంచి సవివరంగా అందించే పుస్తకం ఇది. కాశీ ప్రయాణం చేయాలనుకునేవారికే కాదు, కాశీ గురించి తెలుసుకోవాలనుకునే వారందరికీ ఉపయోగపడుతుందీ పుస్తకం.
  3. సత్యాన్వేషణ: ఆధ్యాత్మిక సత్యాన్వేషణలో భాగంగా గురువు కోసం జరిపిన అన్వేషణకు అక్షర రూపం ఇది. ఇతర భాషల్లో వున్న ఆధ్యాత్మిక అన్వేషణ రచనల అనువాదాలు చదివి ఆనందిస్తాము కానీ, తెలుగు భాషలో అరుదయిన పుస్తకం ఇది. రచయిత్రి వ్యక్తిగత సత్యాన్వేషణ ఫలితం ఈ పుస్తకం.
  4. బృందావన సారంగ: పురాణ గాథలలోని భక్తి తత్వాన్ని, ఆధ్యాత్మిక సత్యాలను అత్యంత సుందరంగా ప్రదర్శించిన కథల సంపుటి ఇది. తెలుగులో అతి అరుదయిన లోతయిన భక్తి భావనలను అతి సరళంగా ప్రదర్శించిన కథలివి.
  5. గొంతువిప్పిన గువ్వ: ఇటీవలి కాలంలో ప్రచురితమయిన రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందిన రచన ఇది. స్వీయానుభవాలను కాల్పనిక కథన పద్ధతిలో వినిపిస్తూ, ఆత్మకథ రచనకూ, ఆత్మకథాత్మక కాల్పనిక రచనకూ నడుమ ఉన్న తేడాలను చెరిపివేస్తూనవల రచన పరిథులను విస్తరింపచేసిన రచన ఇది.
  6. నవలా సాహిత్య సార్వభౌమ శ్రీ కొవ్వలి నరసింహారావు: తెలుగు సాహిత్య ప్రపంచం నిర్దాక్షిణ్యంగా విస్మరించిన అత్యంత సృజనాత్మక రచయిత సహస్ర అపూర్వ రచనల సృష్టికర్త అయిన కొవ్వలి నరసింహారావుగారి రచనలను మళ్ళీ తెరపైకి తేవటమే కాదు, వారి జీవితం గురిచంచి సంక్షిప్తంగానయినా ప్రామాణికంగా అందించిన పుస్తకం. తెలుగు సాహిత్య పరిశోధకులకు మార్గదర్శనం చేయగల పుస్తకం.
  7. రామం భజే శ్యామలం: భారతదేశంలో ఏ రకంగా రామవైరం అన్నది చారిత్రికంగా ఒక సిద్ధాంతంగా మారి రామ భావనపై, రామాయణంపై విషం వెదజల్లుతూ దుష్ప్రచారం చేస్తోంది అన్న సత్యాన్ని సవివరంగా నిరూపించిన రచన ఇది.
  8. 99 సెకన్ల కథలు: తక్కువలో ఎక్కువ అన్నది పరిణతిని నిదర్శనం. సృజనాత్మక పరిణతికి అద్దంపడుతూ 99 సెకన్లలో చదవగలిగే కథల్లో పాత్ర చిత్రణ, సామాజిక, వ్యక్తిగత మానస్తత్వాల చిత్రణ, ఆసక్తికరమయిన కథనం, సార్వజన్నీన సందేసాలను జోడించి ఆశ్చర్యంకలిగించే ముగింపుతో ఆనందింపచేసే కథల సంపుటి ఇది.
  9. కావ్య: ఏ రకంగా ఒక చిన్న పొరపాటు ఒక యువతి జీవితాన్ని అనూహ్యమయిన రీతిలో మలుపు తిప్పిందో హృద్యంగా ప్రదర్శించిన హిందీ నవలకు తెలుగు అనువాదం. ఒరిజనల్‌తో పాటూ అనువాద రచన కూడా ఒకేసారి విడుదలవటం ఒక ప్రత్యేకత.
  10. తహ్జీబ్‌ కా బాద్‌షాహ్ దిలీప్ కుమార్: హిందీ సినిమాల రారాజుగా పరిగణనకు గురయ్యే దిలీప్ కుమార్ కు నివాళిగా ఆయన నటించిన సినిమాలన్నిటీ సమగ్ర విశ్లేషణను అందించిన పుస్తకం. దిలీప్ కుమార్ విషయమేకాదు, హిందీ సినిమాకు సంబంధించిన పలు ఇతర అంశాలకూ రిఫరెన్స్ పుస్తకంగా ఉపయోగపడుతుందీ పుస్తకం.
  11. తెలంగాణ మలితరం కథకులు- కథన రీతులు: తెలంగాణ తొలితరం కథకులను వారి కథన రీతులను విశ్లేషించి అందించే పరిశోధనాత్మక రచన ఇది. భావి తరాలకు రిఫెరెన్స్ పుస్తకంగా ఉపయోగపడటమే కాదు, పరిశోధకులకు మార్గదర్శనం చేయగల పుస్తకం.

ఇంకా సంచికలో ప్రచురితమయిన కథలు, కవితలు,  వ్యాసాలు, విమర్శలు, పరిశోధనాత్మక వ్యాసాలు వివిధ సంపుటాల్లో, సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. ఇంకొన్ని పుస్తకాలు తయారవుతున్నాయి. ఈ రకంగా సంచిక ఆరంభమయిన మూడేళ్ళలోనే తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయటంలో తనవంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకు దోహదం చేస్తున్న రచయితలకు, పాఠకులకు, సాహిత్యాభిమానులందరికీ బహు కృతజ్ఞతలు,  ధన్యవాదాలు. భవిష్యత్తులో మరింత చక్కని చిరకాలం నిలచి ఉపయోగపడే రచనలను అందించాలని రయత్నిస్తోంది సంచిక. ఇందుకు రచయితలు, పాఠకుల సహాయ సహకారాలను అభ్యర్ధిస్తోంది సంచిక.

సంచికకు ఇజాలు లేవు. ముఠాలు లేవు. సంచికకు సాహిత్యం తప్ప మరొకటి పట్టదు. సంచిక దృష్టిలో రచయితనే రాజు. రచనకే ప్రాధాన్యం. అందుకే సంచిక ఒకేసారి రెండు రకాల కథల పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఉగాదికి సంచిక ఆరంభించి మూడేళ్ళు పూర్తయి నాలుగో సంవత్సరంలోకి సంచిక అడుగిడుతుంది. ఆ సందర్భంగా సంచిక కథల పోటీలు కవితల పోటీ నిర్వహిస్తోంది. ఈ వివరాలు త్వరలో…

~

సంచికలో 1 జనవరి 2022 తేదీన ప్రచురితమవుతున్న రచనల వివరాలివి.

సంభాషణం:

ప్రత్యేక వ్యాసం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

ఎప్పటిలాగే మీ సూచనలు, సలహాలతో సంచికను ముందుకు నడిపిస్తారన్న విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం

Exit mobile version