Site icon Sanchika

సంపాదకీయం జనవరి 2023 – నూతన సంవత్సర శుభాకాంక్షలు

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు, సాహిత్యాభిమానులందరికీ, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తెలుగు సాహిత్యం నూతన పోకడలు పోతూ, వినూత్న ప్రయోగాలతో సాహిత్య విశ్వంలో తనదయిన ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్న ఆశ సంచికకు వుంది.

సంచిక పత్రిక దృష్టి కేవలం సాహిత్యం పైనే కేంద్రీకృతమయి వుంటుంది. దీన్లో వ్యక్తిగతాలకు తావు లేదు. వ్యక్తి అశాశ్వతం. సాహిత్యం శాశ్వతం. భారతీయ ధర్మం దృష్టి ఎప్పుడూ శాశ్వతాల పైనే. వ్యక్తులు వస్తూ పోతూ వుంటారు. సరస్వతీదేవిని అర్చిస్తూ రచనల మాలలు అర్పిస్తూనే వుంటారు. కాబట్టి సరస్వతీ స్వరూపమయిన సాహిత్యం శాశ్వతం. అందుకే ప్రపంచంలో ఇతర ఏ నాగరికతలో, ధర్మంలో లేని విధంగా భారతీయ ధర్మంలో సాహిత్యానికి అత్యంత ప్రాధాన్యం. శబ్దం దైవం. శబ్దాన్ని వెన్నంటి వుండే అర్థం దైవం. అక్షరం దైవ స్వరూపం. మన జీవితం దైవానికి అంకితం. దైవం ధర్మం. అందుకే సత్యం వద, ధర్మం చర అన్నది మన జీవన విధానంలో విడదీయరాని సూత్రం. కాబట్టి దైవ స్వరూపమయిన సాహిత్యం ధర్మబద్ధమైన జీవితం గడపటంలో సమాజానికి మార్గదర్శనం చేసేదిగా వుండాలి. మంచిని చెడు నుంచి వేరు చేసి చూడగలిగే విచక్షణనివ్వాలి. ఎలాంటి కష్ట నష్టాలెదురయినా, ధైర్యంగా ఎదుర్కొంటూ ధర్మాన్ని ఆచరించే ఆత్మవిశ్వాసాన్నివ్వగలగాలి. అందుకే సమాజహితం కోరేది సాహిత్యం అయ్యింది.

కానీ, తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక పద్ధతి ప్రకారం సాహిత్యంలోంచి హితం తొలగించారు. ఒక పద్ధతి ప్రకారం సాహిత్యానికి పరిధులు విధించి, అనంతమయిన రచయిత సృజనాత్మకతను సంకెళ్ళలో బిగించి, ఈ పరిధులు పరిమితులు ఎవరూ అధిగమించకుండా చుట్టూ కంచుకోట నిర్మించారు. ఇది ఒక్కడివల్ల సాధ్యమయ్యే పనికాదు. కలసికట్టుగా పనిచేస్తూ, ఒకరికొకరు తోడవుతూ సాహిత్యాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఇదే సాహిత్యం, ఇలా రాసేదే సాహిత్యం, దీని గురించి రాసేదే సాహిత్యం అంటూ ప్రామాణికాలేర్పరచారు.  మొత్తం సాహిత్యం స్వరూపాన్నే మార్చేశారు. ఇందుకు ఒప్పుకోకుండా సృజనాత్మక స్వేచ్చను ప్రదర్శించే రచయితలను పద్ధతి ప్రకారం విస్మృతిలోకి నెట్టారు. ఫలితంగా, ఈ రోజు ఒక రచయిత పేరు వినబడాలన్నా, ఒక రచయిత రచనలు ప్రచారంలోకి రావాలన్నా, అతని మరణం తరువాత అతని రచనలు సజీవంగా వుండాలన్నా ఏదో ఒక ముఠాలో చేరటం తప్పనిసరి అవుతోంది. లేకపోతే, అతని రచనలను మోసే కుటుంబ సభ్యులయినా వుండాలి. ఇలాంటి పరిస్థితుల్లో, ఒక ఉత్తమ రచన చేసినా అది గుర్తింపు పొందుతుందన్న నమ్మకం లేదు. కాబట్టి, పేరు, గుర్తింపు కోరే రచయితలు, ముఖ్యంగా యువ రచయితలు, సరిగా రచనలు చేయటం రాకున్నా ఏదో ఓ ముఠాలో చేరి పేరు సంపాదించటంపైనే దృష్టి పెడుతున్నారు. ఇది సాహిత్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతున్నది. ఎంతగా అంటే కథ సరిగ్గా అల్లటం తెలియనివారి కథలు ఉత్తమ కథల సంకలనాల్లో చేరుతున్నాయి. దాంతో, ఇంకా అడుగులు సరిగ్గా వేయటం రాకముందే, అన్నీ తెలుసన్న విశ్వాసం ఏర్పడి వారి ఎదుగుదలను దెబ్బ తీస్తోంది. వీరిని చూసి ఇతర రచయితలు ఈ దారిలో ప్రయాణించటమో, లేక, పేరు తెచ్చుకునేందుకు మరో అడ్డదారిని వెతుక్కోవటమో చేస్తున్నారు తప్ప, రచనల్లో నైపుణ్యం సాధించాలన్న తపనను ప్రదర్శించటంలేదు. దీని దుష్ఫలితం సంచిక గ్రహించింది. అందుకే ‘ఇయర్ హుక్’ అనే ఆడియో ప్లాట్‌ఫారంతో జతకట్టి యువ రచయితలకు రచనా పద్ధతులు నేర్పి, వారి కథలను సంచికలో ప్రచురిస్తుంది. ‘ఇయర్ హుక్’ ఆడియో కథను ప్రసారం చేస్తుంది. ఈ రకంగా రచనా నైపుణ్యం కల చక్కని రచయితలను తయారు చేయటం ద్వారా భవిష్యత్తులో చక్కని రచనలు చేసే యువ రచయితలతో సాహిత్య రంగాన్ని ఉన్నత స్థానంలో నిలపాలని ప్రయత్నిస్తోంది.

ఈ ప్రయత్నాలలో భాగంగానే సాహిత్య అకాడమీ అవార్డుల నిర్ణయాలలోని అనౌచిత్యాలను వివరింఛే ప్రయత్నం చేస్తోంది సంచిక. ఇది ఆయా రచయితలపై వ్యక్తిగత విమర్శ కాదు. ఈ విమర్శ సాహిత్య సంబంధి మాత్రమే. సమాజానికి మంచి చెప్పి సరయిన మార్గం చూపే రచనలను విస్మరించి ఒకే రకమైన భావజాలాన్ని సమర్ధించే రచనలకే పట్టం కట్టి అలాంటి రచనలను ప్రామాణికం చేయాలన్న ప్రయత్నాలను వ్యతిరేకించటం తప్ప, ఈ విమర్శలో వ్యక్తిగతం ఏమీ లేదు.

ఒకవైపు సాహిత్యంలోని అనవసరమైన హానికరమయిన అంశాలను ప్రక్షాళన చేయాలని ప్రయత్నిస్తూ, మరోవైపు, విభిన్నమయిన రచనలను ప్రచురించటం ద్వారా సాహిత్యాన్ని పరిపుష్టం చేయాలని సంచిక ప్రయత్నిస్తోంది. సంచిక చేస్తున్న ఈ ప్రయత్నాలకు సహృదయులయిన సాహిత్యాభిమానుల సమర్థన ఎల్లప్పుడూ వుంటుందన్న నమ్మకంతో సంచిక తాను నమ్మిన కర్తవ్యాన్ని, ధర్మమమనుకున్న దానిని నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సంచికను మరింత పెద్ద సంఖ్యలో పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తోంది సంచిక.

~

సంచికలో 1 జనవరి 2023 తేదీన ప్రచురితమవుతున్న రచనల వివరాలివి.

సంభాషణం:

సీరియల్స్:

కాలమ్స్:

భక్తి:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కవితలు:

కథలు:

పుస్తకాలు:

ప్రయాణం:

సినిమాలు/వెబ్ సిరీస్:

బాల సంచిక:

అవీ ఇవీ:

ఎప్పటిలాగే మీ సూచనలు, సలహాలతో సంచికను ముందుకు నడిపిస్తారన్న విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం

Exit mobile version