సంపాదకీయం జూలై 2021-

2
2

[dropcap]ఇ[/dropcap]ప్పుడిప్పుడే కరోనా వైరస్ తుఫాను గాలుల తీవ్రత తగ్గుతోంది. నెమ్మది నెమ్మదిగా ప్రజలు ఇళ్ళలోంచి బయటకు వస్తున్నారు. ప్రభుత్వం మామూలుగా ఉండమని ప్రకటిస్తున్నా, ప్రజలు తమంతట తామే జాగ్రత్తలు పాటిస్తున్నారు. నిజంగా కరోనా ఒక భయంకరమైన పీడకల. ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను హఠాత్తుగా కోల్పోయాయి. చివరి చూపు కూడా దక్కని కోల్పోవడం అది. ఎన్నో కుటుంబాలు అల్లకల్లోలమయ్యాయి. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలయ్యారు. కొడుకూ కూతుళ్ళను కోల్పోయి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు. ఉద్యోగాలు లేక, ఆదాయం లేక ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. భవిష్యత్తుపై ఆశ లేక, కనుచూపు మేరలో ఆశాకిరణం కనబడక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. భవిష్యత్తు తలచుకుంటే, భయం వేసే పరిస్థితి. త్వరలో ఆర్థిక పరిస్థితి పుంజుకోకపోతే ఇంకెంతమంది జీవనోపాధి కోల్పోతారో తెలియదు. ఎన్ని ఆత్మహత్యలు సంభవిస్తాయో తెలియదు. నిరాశా నిస్పృహలలో దిగజారిన మనిషి ఏయే అఘాయిత్యాలకు పాల్పడతాడో తెలియదు. నేర ప్రవృత్తి ఎంతగా ప్రబలుతుందో తెలియదు. ఇలాంటి అగమ్య గోచరమయిన పరిస్థితిలో ప్రజలకు ధైర్యం చెప్పి విశ్వాసాన్ని ఇవ్వవలసిన మేధావులు, నాయకులు స్వార్థపూరిత హ్రస్వదృష్టి రాజకీయాలాటలు ఆడుతూ ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు.

నరేంద్ర మోడి దేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుంచీ దేశంలో ఒక విచిత్రమైన, అవాంఛనీయమూ, అనర్థదాయకమూ అయిన పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు తమ నేతను ఎన్నుకొంటారు. ఎన్నికలు అయిన ప్రజలు తీర్పు ఇచ్చిన తరువాత, ప్రత్యర్థులు సైతం పరస్పర సహకారంతో, చేతులు కలిపి పని చేస్తారు. సైద్ధాంతికంగా విభేదిస్తూ, పథకాల లోపాలను ఎత్తి చూపిస్తూ, అవసరమైన చోట నిరసనలు తెలుపుతూ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది ప్రతిపక్షం. అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కానీ మన దేశంలో 2014 నుంచి పరిస్థితి ఇందుకు భిన్నంగా, వ్యవస్థను దెబ్బతీసే విధంగా, అనౌచిత్యమూ, అవాంఛనీయం, అనర్థదాయకమూ, ఆందోళనకరమైన రీతిలో కొనసాగుతున్నది.

మెజారిటీ మద్దతుతో అధికారం సాధించి దేశ ప్రధానిగా  ఎంపికయిన వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకున్నా గౌరవం ఇవ్వాలి. అతడికి గౌరవం ఇవ్వటం మనల్ని మనం గౌరవించుకోవటం. నచ్చని పాలసీ పట్ల నిరసన వ్యక్తపరచటం తప్పనిసరి. కానీ ఆ నిరసన వ్యక్తపరిచేందుకు ప్రజాస్వామ్యంలో పద్ధతులున్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దాన్ని పార్లమెంటులో వ్యతిరేకించవచ్చు. కోర్టులో వ్యతిరేకించవచ్చు. ప్రజలకు ఆ పాలసీ వల్ల జరిగే నష్టాన్ని వివరించి ప్రజా మద్దతు కూడగట్టుకోవచ్చు. కానీ దేశంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించటమే కనిపిస్తోంది. ఈ వ్యతిరేకత ప్రదర్శనలో వ్యవస్థ దెబ్బతిన్నా ఫరవాలేదు. ప్రజా జీవితం అల్లకల్లోలమయినా ఫరవాలేదు. ఈ వ్యతిరేకత ఎలాంటి స్థాయికి వెళ్తోందంటే, తార్కికంగా పథకాన్ని విశ్లేషించి, వాదించే బదులు, ‘ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ కాదు, కమాండ్ చేస్తూ వీధులలోకి దిగుతున్నారు. ‘బ్లాక్‌మెయిల్’ రాజకీయాలు సాగిస్తున్నారు. వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే ఎవరినయితే మెజారిటీ ప్రజలు ఎంచుకున్నారో ఆ వ్యక్తికి పాలన రాదని, అతనికి అధికారార్హత లేదని నిరూపించి తన అహాన్ని సంతృప్తి పరచుకోవాలన్న తపన.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో సమావేశానికి హాజరు కాదు. దాని దోషం కూడా ప్రధానిదే అంటుంది. మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని మాట్లాడనివ్వడు. ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశాన్ని ‘లైవ్ స్ట్రీమ్’ చేస్తాడు, అదీ తన ఫిర్యాదులకే. ఓ ముఖ్యమంత్రి పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు పరచనంటాడు. ఇంకో ముఖ్యమంత్రి ప్రధానికి పాలించే అర్హత లేదంటాడు. బహిరంగంగా చట్ట వ్యతిరేకతను ప్రోత్సహిస్తాడు.  కాలేజీ విద్యార్ధులు ప్రధాని వస్తే నిరసనలు తెలుపుతారు. సినీ నటులువస్తే హర్ధధ్వానాలతో ఆహ్వానిస్తారు. ఒక వ్యక్తిని ఎంతగా అవమానించాలో అంతగా అవమానిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తి దేశ ప్రధాని కావటం అత్యంత బాధాకరమయిన విషయం.  ఏమిటిదంతా? ఒక వ్యక్తికి ‘పాలన’ రాదని నిరూపించటానికి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? దీని పరిణామాలేమిటి? దీర్ఘకాలిక ప్రభావం ఏమిటి? అని ఆలోచించకుండా కేవలం ‘వ్యతిరేకత’ మాత్రమే ప్రదర్శించటం ఏ రకంగానూ నిర్మాణాత్మక రాజకీయం కాదు. చివరికి పరిస్థితి ఎంతగా దిగజారిందంటే ప్రభుత్వం పార్లమెంటుకు కాదు, ‘కోర్టు’కు జవాబుదారీ అయ్యే దుస్థితి వస్తోంది. నిర్ణయాలు పార్లమెంటులో ప్రజాప్రతినిధులు కాదు, కోర్టులో న్యాయమూర్తులు తీసుకునే పరిస్థితి వస్తోంది. పాలన ప్రభుత్వం కాదు, ‘న్యాయస్థానం’ నిర్వహించే పరిస్థితి వస్తోంది.  ఒకవేళ కోర్టే ప్రభుత్వానికి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో, ఏమేం తీసుకోవాలో చెప్పేట్టయితే ఇక ఎన్నికలెందుకు? పార్లమెంటెందుకు? రాజకీయాలెందుకు?  అయితే, ఇంత చేసి ఈ అంధ వ్యతిరేకులు కోర్టు మాటయినా గౌరవిస్తున్నారా? అంటే, అదీ లేదు. కోర్టు కూడా తము కోరిన తీర్పే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కోర్టు మీద నమ్మకం లేదు. పార్లమెంటు మీద నమ్మకం లేదు. ఎన్నికల కమీషన్ మీద నమ్మకం లేదు. సైన్యం మీద నమ్మకం లేదు. పోలీసు మీద నమ్మకం లేదు. మీడియా మీద నమ్మకం లేదు. నాయకుడి మీద నమ్మకం లేదు. దైవం మీద నమ్మకం లేదు. చివరికి తమ మీద తమకి నమ్మకం లేదు.

ఇలాంటి పరిస్థితిలో ‘కరోనా’ మన నాయకుల చేతకానితనాన్ని, ఆలోచనా రాహిత్యాన్ని ప్రదర్శించటమే కాదు; తమ తప్పులని కప్పిపుచ్చుకుని, నేరాన్ని కేంద్రంపైకి తోసేసే బాధ్యతా రాహిత్యాన్ని చూపించి భవిష్యత్తుపై భయాన్ని కలిగిస్తోంది. ఆక్సీజన్ డిమాండును పెంచి, ఉన్న మందులను దాచి, లేని డిమాండును పెంచి, ఓ రకంగా ప్రజల జీవితాలతో నాయకుల దగ్గర నుంచి బ్రోకర్ల వరకూ ప్రతి ఒక్కరూ ఆటలాడుకున్నారు. దోషం ప్రధానిది అన్నారు. ప్రధాని రాజీనామా చేయాలని మేధావులంతా తమ తెలివిని ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పూర్తిగా మెజారిటీ ఉన్నా, ప్రపంచ దేశాలలో ఎంత ప్రతిష్ఠ ఉన్నా, కొందరు కలిసికట్టుగా, గుడ్డిగా ప్రదర్శిస్తున్న ద్వేషం, వ్యతిరేకతల ముందు ప్రధాని చేతకానివాడిలా కనిపిస్తున్నాడు. సంవత్సరాల తరబడి సాగే నిరసనలు, జనజీవితాలను అశాంతిమయం చేసె వ్యతిరేకతలు  చెలరేగుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయుడిలా కనిపిస్తున్నాడు. ఇది ఆందోళన కలిగించే విషయం. అంటే, కొందరు పట్టుదలగా ప్రవర్తిస్తే మెజారిటీ అభిప్రాయం పనికి రానిది, పస లేనిది అవుతుందా? ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమా? వ్యతిరేకులకు కావాల్సిందీ ఇదేనా? ఎందుకంటే, ప్రభుత్వం బల ప్రదర్శన చేస్తే అదొక గోల. చేయకపోతే ఇంకోగోల. ఇలాంటి ఇబ్బందుల్లో పెట్టటమేనా ప్రభుత్వ వ్యతిరేకులకు కావాల్సింది? ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత కూడా నిర్మాణాత్మకంగా వుండాలి, విధ్వంసకారకంగా కాదు.

ఇది ఆలోచించవలసిన విషయం. ఇదే సమయంలో మరో ప్రజాస్వామిక దేశమైన అమెరికాను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది అన్ని వైపుల నుంచీ. కానీ ఎవరూ వ్యవస్థను నిర్వీర్వం చేయాలని ప్రయత్నించలేదు. ఎన్నికలలో ఓడించారు. అంతే తప్ప వీధుల్లో పాలన నిర్ణయాలను నిర్ణయించాలని పట్టుబట్టలేదు. ప్రస్తుతం మన దేసంలోని పరిస్థితి చూస్తూంటే ఇర్వింగ్ వాలేస్ రాసిన ది మాన్ అన్న నవల గుర్తుకువస్తోంది. దాన్లో అనుకోని పరిస్థితుల్లో డగ్లస్ డిల్మాన్ అనే నల్లవాడు దేశాధ్యక్షుడు అవుతాడు. పైకి అందరూ మద్దతునిచ్చేవారే. కానీ, ఒక నల్లవాడు పాలించటం ఏమిటన్న అహంకారంతో అతనికి పాలన రాదనీ, నిర్ణయాలన్నీ పొరపాట్లని పలు రకాలుగా ఇబ్బందిపెట్టి, చివరికి దుశ్ప్రవర్తన ఆరోపణలు సైతం తెచ్చి అతడిని గద్దె దింపాలని చూస్తారు. ప్రస్తుతం భారతడేశంలో రాజకీయాలు ఇర్వింగ్ వాలేస్ నవల ది మాన్ లో లానే వున్నాయి. ఇది కాల్పనిక రచనల శక్తి. వారూహించి రాసింది భవిష్యత్తులో నిజమవుతుంది.

ఇదే రకమైన ‘నేను చెప్పిందే నిజం’, ‘నా మాటే చెల్లాలి’  మా మాటకాదన్నవాడికి ఏమీరాదు, అని గుంపులను ఏర్పరుకుని తామే సాహిత్య లోకంలో ‘కొత్త మార్గం’ కనిపెట్టాం అన్నట్టు ప్రవర్తిస్తూ తన ముందు ఎవరూ లేరు, తమకు ధీటు ఎవ్వరూ లేరనే అహంకార పూరిత ప్రవర్తన తెలుగు సాహిత్య ప్రపంచంలో కనిపిస్తోంది. అధ్యయనం లేదు. అవగాహన లేదు. ఆలోచన లేదు. కానీ డబ్బుంది. డబ్బుతో గుంపులను, వందిమాగద భజన బృందాలను ఏర్పాటు చేసుకుని వాళ్ళతో పొగిడించుకోవటం, వాళ్ళతో మాటిమాటికీ అంతా ‘అంతా నీవే’ అనిపించుకుని పీఠాధిపతులై అసలు సాహిత్యాన్ని అణగద్రొక్కటం తెలుగు సాహిత్యంలో పరిపాటి అయింది. అందుకే మనకు పీఠాధిపతులు, మఠాధిపతులు, ఘాకం కేకలు పెట్టేవారు, బేకం బాకాలు ఊదేవారు బోలెడు మంది ఉన్నారు. కానీ, పట్టుమని పదిమంది పాఠకులు లేరు. చెప్పుకోదగ్గ సాహిత్యం గురించి చెప్పకపోవటం వల్ల అది ఉండీ లేనట్టు అవుతోంది. చెప్పుకునే సాహిత్యం ‘ఒద్దురా, చెప్పుకుంటే సిగ్గురా’ అనిపించేట్టుంటోంది.

ఇలాంటి పరిస్థితిలో ముఠాలకు, మఠాలకు భిన్నంగా , వారిని విస్మరిస్తూ, తెలుగు సాహిత్యం కొత్త దారిలో ప్రయాణించాల్సి ఉంటుంది. అసలైన రచయితలను, రచనలను వెతికి పట్టుకుని తెరపైకి తీసుకురావాల్సి ఉంటుంది. యువ రచయితలకు ఉత్సాహ ప్రోత్సాహాలిచ్చి ముఠాలు, మఠాల కతీతంగా వారు ఆత్మవిశ్వాసంతో, స్వేచ్ఛగా ఎదిగే వీలు కల్పించాల్సి ఉంటుంది. సంచిక ఆరంభం నుంచీ ఈ దిశగా ఆలోచిస్తోంది, ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఔత్సాహిక రచయితల పరిచయం ప్రారంభించింది. త్వరలో వీరందరితో సమావేశాలు నిర్వహించి వారి రచనలను పాఠకుల ముందుంచుతుంది. ఈ రకంగా కొత్త నీటిని స్వేచ్ఛగా ప్రవహింప చేయటం వల్ల ముఠాలు, మఠాలు, చలామణీ రచయితల మలినాలను కడిగివేయాలని సంచిక ప్రయత్నిస్తోంది.

ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూపులు, పత్రికలతో సహా ఎక్కడా ప్రచురితం కాని రచనలను మాత్రమే స్వీకరించాలని సంచిక ఒక పద్ధతిని, నియమాన్ని ఏర్పర్చుకుంది. ఈ నియామాన్ని అనుసరిస్తూ ఒక రచన ఎక్కడయినా ప్రచురితమయిందని తెలియగానే, సంచికలో ప్రచురించినా ఆ రచననను తొలగిస్తోంది సంచిక. అయితే, ఈ నియమాన్ని కాస్త సడలించ వలసిన పరిస్థితి ఏర్పడింది.

వాట్సప్‍లో ‘సిరికోన’ అని ఒక అద్భుతమైన సాహిత్య గ్రూప్ ఉంది. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు నిర్వహించే ఈ గ్రూపులో పలువురు పండితులు, మేధావులు, విద్వాంసులు, సృజనాత్మక రచయితలు ఉన్నారు. ఈ గ్రూపులో సాహిత్య పరంగా, ధార్మిక, తాత్త్విక, సాంస్కృతిక అంశాలపై పలు లోతైన చర్చలు సాగుతాయి. ఆ చర్చల్లో వ్యక్తమైన అభిప్రాయాలతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ చర్చల లోతును, చర్చలలో వ్యక్తమయ్యే భావాలను, గాఢతను, పాండిత్యాన్ని కాదనలేము. ప్రస్తుతం సాహిత్య ప్రపంచంలో ఇలాంటి scholarly discussions ఆవశ్యకత చాలా ఉంది. మీడియాలోను, పత్రికలలోనూ ఇలాంటి చర్చలు కరువయ్యాయి. ఇలాంటి అత్యంత ఉపయోగకరమైన చర్చలు కేవలం ఓ రెండు వందల మంది సభ్యులున్న వాట్సప్ గ్రూపుకే పరిమితం కావటం సముచితం, సమంజసం అనిపించలేదు. ఇవి సాహిత్య ప్రపంచానికి చెందిన చర్చలు. విస్తృతంగా ప్రచారం పొందాల్సిన చర్చలు. అందుకని సాహితీ సిరికోన అడ్మిన్‍ల అనుమతితో ప్రతి నెలా ఆయా నెలలో ‘సిరికోన’లో జరిగిన సాహిత్య చర్చలను ‘సిరికోన కదంబం’ పేరిట సంచిక తెలుగు పాఠకులకు, సాహిత్యాభిమానులకు అందిస్తోంది. ఇందుకు గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారికి కృతజ్ఞతలు. తెలుగు సాహిత్యాభిమానులు ఈ చర్చలను చదివి లాభం పొందుతారని సంచిక ఆశిస్తోంది.

1 జూలై 2021 తేదీ సంచికలో అందిస్తున్న రచనల వివరాలు:

సంభాషణం:

  • సంభాషణం: ‘కార్టూన్ – కథా విరించి శ్రీ సరసి’ అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

ప్రత్యేక వ్యాసం:

  • గొల్ల రామవ్వ – పీవీ నరసింహారావు సృజనాత్మక వ్యక్తిత్వం – కస్తూరి మురళీకృష్ణ

కాలమ్స్:

  • రంగుల హేల 40: తస్మాత్ జాగ్రత్త!! – అల్లూరి గౌరిలక్ష్మి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక-జూలై 2021- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -16 – ఆర్. లక్ష్మి

కథలు:

  • గాంధీ మార్గం – చావా శివకోటి
  • ఎట్నుంచెటో! – సముద్రాల హరికృష్ణ
  • ప్రారబ్ధం – గంగాధర్ వడ్లమాన్నాటి

కవితలు:

  • పిట్ట – శ్రీధర్ చౌడారపు
  • అదే నిప్పు… – డా. కోగంటి విజయ్
  • యెర్ర గులాబీ! – Savvy

బాలసంచిక:

  • వడ్రంగి పిట్ట – కొబ్బరి చెట్టు – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • మహర్షులు – సనకాదులు – అంబడిపూడి శ్యామసుందర రావు
  • నేను కరోనా పాజిటివ్…. అయితే ఏంటిట? – ద్విభాష్యం రాజేశ్వరరావు
  • ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు లభిస్తుందో???? – గంగిశెట్టి లక్ష్మీ నారాయణ

ఎప్పటిలానే ఈ సంచిక కూడా పాఠకులని ఆకట్టుకుందని ఆశిస్తూ…

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here