పద్యాలు, కవితలు, కథలకు ఆహ్వానం-పోటీ ప్రకటన

    2
    3

    [dropcap]అ[/dropcap]త్యంత ఆనందకరము, ఉత్సాహం కలిగించే రీతిలో ‘సంచిక’ను ఆదరిస్తున్న సాహిత్య ప్రేమికులందరికీ  బహు కృతజ్ఞతలు. ‘సంచిక’ పత్రిక పట్ల అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూ, ఆత్మీయతతో సూచనలు, సలహాలు ఇస్తున్న వారందరికీ ధన్యవాదాలు. వీలైనంత వరకూ విభిన్నము, విశిష్టము అయిన రచనలను అందిస్తూ అలరించాలని ‘సంచిక’ తపన పడుతోంది, ప్రయత్నిస్తోంది. ఇంతవరకూ మా ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వటం ఎంతో ఆనందం కలిగించే విషయం. అయితే, ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. కొత్త కొత్త పాఠకులను ఆకర్షించాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే ‘సంచిక’ తన దృష్టిని ఏ ఒక్క అంశానికో పరిమితం చేయకుండా విభిన్నం, విస్తృతం చేస్తోంది.

    గత నెలలో తెలుగు సాహిత్య ప్రపంచంలో రెండు విభిన్నమైన ప్రక్రియలలో విశిష్టమైన రచనలు చేసి విశేష ప్రజాదరణ పొంది తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన రచయితలిద్దరు మన నడుమ నుంచి భౌతికంగా నిష్క్రమించారు. 79 ఏళ్ళ వయసులో పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు కాలధర్మం చేశారు. 78 ఏళ్ళ వయసులో యద్దనపూడి సులోచనారాణి గారు మరణించారు. కానీ వారు భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళినా, వారి రచనలు మన వెంటే ఉంటాయి. వారి స్మృతులను సజీవంగా ఉంచుతాయి. కళాకారుడికి మరణం అంటూ ఉండదు. భౌతిక నిష్క్రమణ వల్ల అతని  కళాసృష్టి ధార ఆగిపోవచ్చు కానీ అంతకు ముందు సృష్టించిన కళ అతడిని చిరంజీవిగా నిలుపుతుంది. భవిష్యత్తు తరాలపై తన ప్రభావం చూపుతూనే ఉంటుంది. పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారికి, యద్దనపూడి సులోచనారాణి గారికి ‘సంచిక’ శ్రద్ధాంజలి ఘటిస్తోంది.

    ప్రతి నెల ఒకటవ తారీఖున విడుదలయ్యే సంచికలో పది పైగా కథలు ప్రచురిస్తున్నాం. కానీ పదీ ఒకేసారి ప్రచురించడం వల్ల అన్ని కథలు చదవలేకపోతున్నామన్న ఫిర్యాదు పాఠకుల నుండి అందుతుండడంతో, ఇకపై కథలు కవితల ప్రచురణను కూడా ‘డైనమిక్’గా మార్చాము. నెల మొదటి సంచికలో నాలుగు కథలు ప్రచురితమవుతాయి. ఆపై ప్రతి ఆదివారం విడుదలయ్యే సంచికలో నాలుగు కథలుంటాయి. అంటే నెలకు 16 కథలు ప్రచురితమవుతాయి. ఈ రకంగా నెలలో అధిక సంఖ్యలో కథలు/కవితలు అందించడమే కాదు, అన్ని కథలు అందరూ చదివే వీలు కలుగుతుంది. దీనికి తోడు కథల ప్రచురణకు రచయితలు ఎదురుచూసే సమయం కూడా తగ్గుతుంది. ఈ ప్రయోగంపై పాఠకుల స్పందనకు ఆహ్వానం. పాఠకుల అభిప్రాయాల ప్రకారం, అందరికీ ఆమోదయోగ్యంగా ‘సంచిక’ను తీర్చిదిద్దే  దిశలో ఇది ఒక అడుగు. ఇకపై పుస్తక పరిచయాలు కూడా ప్రతి ‘సంచిక’లోనూ కనీసం రెండయినా ఉంటాయి.

    ‘సంచిక’ వరుసగా రచనల పోటీలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ నెలలో వినాయక చవితి సందర్భంగా ‘హాస్య కథల పోటీ‘, అక్టోబరు నెలలో దసరా సందర్భంగా ‘పద్య కవిత’, ‘వచన కవిత‘ పోటీ, నవంబర్ నెలలో దీపావళి సందర్బంగా ‘కథల పోటీ’ నిర్వహిస్తోంది. ప్రతి పోటీలో మూడు బహుమతులు – ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి.  అయితే ఈ బహుమతులు ‘సంచిక’ న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన కథలతో పాటు, పాఠకులు ఎంపిక చేసిన కథలకు కూడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి పోటీకి ఆరుగురు రచయితలు బహుమతులు పొందే వీలుందన్న మాట. క్రిటిక్స్ అందించే  మూడు బహుమతులు, పాఠకులు ఎంపిక చేసిన మూడు బహుమతులు!

    ఇవేకాక ప్రతి పోటీలో అయిదు ప్రోత్సాహక బహుమతులుంటాయి..అయితే, ఈ ప్రోత్సాహక బహుమతులకు వోటింగ్ వుండదు. వీటిని సంచిక సంపాదక వర్గం నిర్ణయిస్తుంది.

    అన్ని పోటీలలో

    ప్రథమ బహుమతి      రూ.5000/-
    ద్వితీయ బహుమతి   రూ.3000/-
    తృతీయ బహుమతి   రూ 2000/-

    ప్రోత్సహక బహుమతి  రూ.1000/-

     

    హాస్య కథల పోటీకి కథలు 31 జూలై 2018 తేదీ కల్లా పంపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆగస్టు నెల నుంచి సెప్టెంబరు నెల వరకూ ఈ కథల పోటీకి అందిన కథలను పాఠకుల ఎంపిక కోసం ప్రచురించడం జరుగుతుంది. ఇలా ప్రచురితమైన కథలలోంచి పాఠకులు తమకు నచ్చిన కథలు మూడింటిని ‘ఓటింగ్’ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అధిక శాతం ఓట్లు సాధించిన మొదటి మూడు కథలు పాఠకుల బహుమతిని పొందుతాయి. కాబట్టి హాస్య కథకులు వెంటనే కలాలు పదును పెట్టుకుని 31 జూలై 2018 తేదీ లోగా కథలు పంపించాల్సి ఉంటుంది.

    అలాగే దసరా పద్య, వచన కవితల పోటీలో కూడా క్రిటిక్స్ బహుమతులు మూడు, పాఠకుల బహుమతులు మూడు ఉంటాయి. పద్యాలు, కవితలను 31 ఆగస్టు 2018 తేదీ లోగా పంపించాలి. అలాగే దీపావళి కథల పోటీకీ కథలు 30 సెప్టెంబరు 2018 తేదీ లోగా అందేట్టు పంపించాలి. కథలు, పద్యాలు, కవితల నిడివి విషయంలో కానీ, అంశం విషయంలో కాని ఎలాంటి పరిమితులు లేవు. ఒకటే నియమం ఏమిటంటే భాష విషయంలో కాని, భావన విషయంలో గాని రచనలు ఆమోదించిన సభ్యసమాజపు పరిధులలోనే ఉండడం వాంఛనీయం.

    పాఠకులు ఎలా ఓటింగ్ చేయాల్సి ఉంటుందన్న వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఈ ఓటింగ్‌లో ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నారో బహిర్గతం కాదు. కానీ ఏ రచనకు ఎన్ని ఓట్లు వస్తున్నాయో ఓటింగ్ కౌంటర్‌లో క్షణక్షణం తెలుస్తూనే ఉంటుంది. అయితే ఓటింగ్ చేసే పాఠకులు విధిగా సంచికకు  సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితం. సబ్‌స్క్రైబ్ చేయని పాఠకులు ఓటింగ్‍కి అనర్హులు. కాబట్టి ఈ రోజు నుంచే సంచికకు సబ్‌స్క్రైబ్ చేసి ఓటింగ్‍కి అర్హత సంపాదించండి. ఉత్తమ రచనకు పట్టం కట్టడంలో సంచికకు సహాయపడండి. ఇలా రెండు అవార్డులు ఇవ్వడం ఎందుకంటే క్రిటిక్స్ దృష్టికీ, పాఠకుల దృష్టికీ నడుమ ఉన్న అంతరాన్ని విశ్లేషించడం. పారదర్శకమైన రీతిలో బహుమతి రచనలను ఎంపిక చేసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టి ‘బహుమతి రచనల’ విషయంలో ఉన్న దురూహలు, అపోహలకు ఆస్కారం ఇవ్వకుండా పోటీలు నిర్వహించాలన్నది మరో ఉద్దేశం. అయితే పోటీకి వచ్చిన ప్రతి రచనను పాఠకులకు రచయిత పేరు లేకుండా నెంబరుతో అందించడం జరుగుతుంది. పాఠకులు తమకు నచ్చిన నెంబరు కథలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

    రచనలను ఈమెయిల్ ద్వారా పంపదలచుకున్నవారు kmkp2025@gmail.com కు పంపించవచ్చు. సబ్జెక్ట్ లైన్‌లో ఏ పోటీ కోసం పంపుతున్నారో స్పష్టంగా రాయాలి.  రాతప్రతిని పంపాలనుకున్నవారు ఈ క్రింది అడ్రసుకు పోస్టులో గానీ కొరియర్‌లో గాని నిర్ణీత గడువులోగా అందేట్లు పంపించవచ్చు.  కవరుపై ఏ పోటీ కోసం పంపుతున్నారో స్పష్టంగా రాయాలి.ఒక రచయిత ఒకే రచన పంపాలన్న నియమం లేదు. వాట్స్‌అప్ ద్వారా రచనలు పంపాలనుకున్నవారు 9849617392 నంబరుకు తమ రచనలను వాట్స్ ఆప్ చేయవచ్చు. అయితే, పోటీకి రచనలు పంపేవారు విధిగా పోటీ రచన అన్నది స్పష్టంగా రాయాల్సివుంటుంది. లేకపోతే ఆ రచనను సాధారణ సంచికకు పంపిన రచనగా భావించే అవకాశం వుంది.

    Kasturi Muralikrishna

    Plot no.32, H.No 8-48

    Raghuram nagar colony, Aditya hospital lane

    Dammaiguda, Hyderabad-83

    Ph: +919849617392

    ఈ ‘సంచిక’ నుంచి ‘నీలమత పురాణం’ అనువాదం ధారావాహిక ఆరంభమవుతోంది. కశ్మీర్‌కు సంబంధించిన అత్యంత ఆసక్తికరము, అద్భుతము అయిన అంశాలకు ఆలవాలం నీలమత పురాణం. ఈ పురాణం గురించి ఎవరికీ అంతగా తెలియదు. బహుశా తెలుగులో దీన్ని అనువదించి అందించడం ఇదే ప్రథమం.

    ఇక ఈ ‘సంచిక’లో ప్రచురితమవుతున్న రచనల వివరాలు:

    కథలు:

    1) పులి పేల్చని తుపాకీ – చిరంజీవివర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతిరాజు

    2) యథాకాష్ఠంచ – శివరామకృష్ణారావు వంకాయల

    3) మీకు ఇంగ్లీషు వచ్చా? – మోహిత కౌండిన్య

    4) ఆనాటి ఫోటో – ఆర్. దమయంతి

    5) చీరాంకిత జీవితాలు – పోడూరి కృష్ణకుమారి

    కవితలు:

    1) నన్ను చంపెయ్యండి – భువన చంద్ర

    2) ఎటూ అర్థం కాని  చూపు – స్వాతీ శ్రీప్రాద

    3) సమ్మోహనంగా సవాలక్ష – సి. ఎస్. రాంబాబు

    4) కాకెత్తుకెళ్ళిన ఖాళీ సమయం – శ్రీధర్ చౌడారపు

    5) మైత్రి – ఐదు పద్యాలు – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

    అనువాద ధారావాహిక

    1) నీలమత పురాణం – కస్తూరి మురళీకృష్ణ

    ప్రత్యేక వ్యాసం:

    1) కొత్తరాతియుగం: తెలంగాణలో పశుపాలకవ్యవస్థ – (కురుమ) సంస్కృతి – శ్రీరామోజు హరగోపాల్

    వ్యాసాలు:

    1) వేయిపడగలు ఎందుకు చదవాలి? – కోవెల సుప్రసన్నాచార్య

    2) భారతీయ శాస్త్రాల్లో కాలమాన విజ్ఞానం – డా. ఎం. ప్రభావతి దేవి

    3) దేశభక్తి – దైవభక్తి – డా. వి. ఎ. కుమారస్వామి

    4) కథ ప్రస్తుత ధోరణులు – భీమరాజు వెంకటరమణ

    బాలసంచిక:

    1) నేటి సిద్ధార్థుడు – సీరియల్ – సమ్మెట ఉమాదేవి

    2) ధ్రువుడు – బెల్లంకొండ నాగేశ్వరరావు

    3) కాపలా – శాఖమూరి శ్రీనివాస్

    భక్తి:

    1) జుకాత్ – పేదల హక్కు – ఎం. డి. ఉస్మాన్‍ఖాన్

    మంత్లీ ఫీచర్స్:

    1) రంగుల హేల – నీ గతమే నీ బలం: అల్లూరి గౌరీలక్ష్మి

    2) తెలికడలి సుడులలో -3: మైథిలి అబ్బరాజు

    3) అంతనపొంతన లేని యాజ్ఞసేని – టి. శ్రీవల్లీ రాధిక

    అవీ ఇవీ:

    1)       సైకోసిస్ -నివారణోపాయాలు – శ్రీసత్య గౌతమి

    2)      “ఇందూరు దర్శిని” డైరక్టరీ కోసం కవులు, రచయిత వివరాలు – ప్రకటన

    పుస్తక సమీక్ష:

    1) ‘నీల’ నవలా రూప రేఖలు – జగద్ధాత్రి

    పుస్తక పరిచయాలు:

    1) నిర్ణయం

    2) చిగురించే మనుషులు

    కార్టూన్స్:

    1) కెవి సుబ్రహ్మణ్యం – 1

    2) అరిశెట్టి సుధాకర్ -1

    ‘సంచిక’ డైనమిక్ పత్రిక. అంటే నెలలో మొదటి తారీఖున ప్రధాన పత్రిక విడుదలైనా, నెలలో కొన్ని ఫీచర్లు వారం వారం, మరికొన్ని పదిహేను రోజులకొకసారి అప్‌లోడ్ అవుతాయి. ఆ క్రమంలో ప్రతి నెల ఒకటో తారీఖు ప్రధాన పత్రిక అప్‌లోడ్ అయిన తర్వాత ప్రతి ఆదివారం కొన్ని రచనలు అప్‌లోడ్ అవుతాయి. అయితే ఈ నెల ఒకటవ తారీఖు శుక్రవారం అయింది. శుక్రవారం కొత్త పత్రిక అప్‌లోడ్ అయిన తర్వాత ఆదివారం మళ్ళీ కొత్త ఆర్టికల్స్ అప్‍లోడ్ అవడం వల్ల ఒకటవ తారీఖు పత్రికలోని రచనలు చదివేలోగా మరిన్ని కొత్త రచనలు వచ్చి చేరటం వల్ల అన్ని రచనలు చదవటం పాఠకులకి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఈసారి ఒకటవ తారీఖు పత్రిక అప్‌లోడ్ అయిన తరువాత మళ్ళీ రెండవ ఆదివారం అంటే 10వ తారీఖున కొత్త ఆర్టికల్స్, వీక్లీ ఫీచర్లు అప్‌లోడ్ అవుతాయి.

    ‘సంచిక’కు రచయితలు తమ విభిన్నమైన, విశిష్టమైన రచనలు విస్తృతంగా పంపి ‘సంచిక’ పాఠకులను అలరించడంలో తోడ్పడుతారని ఆశిస్తున్నాము. పాఠకులు తమ నిర్మొహమాటమైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో ‘సంచిక’ను మరింత ఆకర్షణీయం చేసి పాఠకులకు మరింత చేరువ చేయడంలో తోడ్పడాలని విన్నపం.

    ఈ నెల ‘సంచిక’ మిమ్మల్ని అలరిస్తుందన్న ఆశతో…

    సంపాదక వర్గం

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here