Site icon Sanchika

సంపాదకీయం జూన్ 2023

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.

మే నెల చివరి ఆదివారం (28-5-2023) రచనలు అప్‍లోడ్ అయిన కొద్దిగంటలకే ‘సంచిక’ వెబ్ సైట్‍పై సాంకేతిక దాడి జరిగింది. ఎవరో మొదట సైట్‍ని ‘డౌన్’ అయ్యేలా చేశారు. కొన్ని గంటల తర్వాత సైట్‍ని ‘అప్’ చేయగల్గినా, సైట్ లోని కంటెంట్‍ని కనబడకుండా చేశారు. ‘సంచిక’ వెబ్ సైట్ చూసిన వారందరికీ 404 Error అని కనబడింది. సంచిక పాఠకులు, అభిమానులు, సాహిత్య ప్రేమికులు అందరూ ఎంతో ఆతురత కనబరచారు. అభిమానాన్ని కురిపించారు. ధైర్యం చెప్పారు. మా సాంకేతిక బృందం సభ్యులు సైట్‍ని రెస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఆదివారం రోజంతా సైట్‍ని పునరుద్ధరించలేకపోవడంతో – ఆదివారం ప్రచురితమైన అన్ని రచనలను సోమవారం (29-5-2023) నాడు సంచిక ఫేస్‍బుక్ పేజీలో పోస్ట్ చేసి – పాఠకులకు చేరేలా చేశాము. సంచిక ఫేస్‍బుక్ పేజీలో రచనలను చదివిన పాఠకులు సానుకూలంగా స్పందించారు. సంచిక వెబ్ సైట్ పనిచేస్తోందో లేదో తెలుసుకునేందుకు పాఠకులు పదే పదే చెక్ చేస్తూనే వున్నారు.

అయితే, ఈ సమయంలో సంచికపై పాఠకులు, రచయితలు ప్రదర్శించిన విశ్వాసం, ఆదరణ, చెప్పిన ధైర్యం, కురిపించిన ప్రేమలు ‘సంచిక’ సరయిన దిశలో ప్రయాణిస్తున్నదన్న నమ్మకాన్ని కలిగించాయి. ఒక రకంగా చెప్పాలంటే, నిప్పుల్లో కాలి కూడా మెరిసేదే అసలయిన బంగారం అని నిరూపిస్తూ, 30-5-23 అర్ధరాత్రి నుంచి ‘సంచిక’ వెబ్ సైట్ మళ్ళీ పనిచేయటం ఆరంభించింది. ఇప్పుడు మరింత వేగంగా పనిచేస్తోంది. కంటెంట్‍ని ఏ మాత్రం కోల్పోకుండా సైట్‍ని పునరుద్ధరించినందుకు మా సాంకేతిక బృందానికి ధన్యవాదాలు, అభినందనలు.

‘సంచిక’ ఇక కనిపించదంటూ వ్యాపించిన కొన్ని గాలి వార్తలు గాల్లోనే కలిసిపోయాయి.

త్వరలో మరిన్ని మార్పులతో మరింత సుందరంగా, మరిన్ని విభిన్నము, విలక్షణమూ, ఉపయోగకరమూ అయిన రచనలతో మరింత పెద్ద సంఖ్యలో తెలుగు పాఠకులను అలరించే రీతిలో రూపొందుతోంది.

ప్రాచీన భారతీయ సాహిత్యం ఆధారంగా వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకునే మార్గాలను వివరించే పాణ్యం దత్తశర్మ గారి వ్యాస పరంపరని సంచిక మాస పత్రికలో ప్రారంభిస్తున్నాం. సంచికలో ఆంగ్ల రచనలు కూడా ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ప్రముఖ ఆంగ్ల రచయిత Hansda Sowendra Shekhar గారిని వి. బి. సౌమ్య గారు చేసిన ఇంటర్వ్యూతో ప్రారంభిస్తున్నాం. వీలుని బట్టి ఇకపై సంచికలో ఆంగ్ల రచనలను కూడా విరివిగా అందించాలని సంకల్పించాం.

మే నెల చివరి ఆదివారం నుంచి రెండు కొత్త ధారావాహికలు – భువనచంద్ర గారి ‘మహతి’, డా. ప్రభాకర్ జైనీ గారి ‘నాదొక ఆకాశం’ ప్రారంభమయ్యాయి. జూన్ 2023 మెదటి ఆదివారం నుంచి వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’  ధారావాహిక మొదలవుతోంది.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ ప్రయత్నంలో భాగంగా త్వరలో ‘పాఠకుల లేఖలు’ శీర్షిక ప్రవేశబెట్టబోతున్నాము. మరొకొన్ని వినూత్న శీర్షికలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

ఇటీవలి కాలంలో సాహిత్య ప్రపంచంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తూంటే, సాహిత్య పెద్దలమని చెప్పుకుంటున్నవారు  కానీ, సాహిత్య ప్రపంచంలో తారాపథానికి దూసుకుపోతున్న యువ విప్లవ అభ్యుదయ మేధావి రచయితలుగా గుర్తింపు పొంది, వేదికలెక్కి ఉపన్యసించి, ఉద్యమాల ఊపులో గొప్ప పేరు సంపాదిస్తున్న నడివయసు యువ రచయితలు కానీ, తెలుగులో ఒక వాక్యం చదివి, దాన్ని తమ వ్యక్తిగత వికృతుల దృష్టిలో తప్ప మామూలుగా అర్థం చేసుకోలేని  దుస్థితిలో వున్నారని అర్థమవుతోంది.  అందుకే త్వరలో ‘సంచిక’లో కథలు చదవటం ఎలా? అన్న శీర్షికను ఆరంభిస్తున్నాం. ఇంతవరకూ, కథలెలా రాయాలో, కథలిలా కూడా రాయాలని, కథలు ఇలాగే రాయాలని చెప్పినవారున్నారు కానీ, సాహిత్యానికి మౌలికమైన విషయం చదవటం ఎలానో నేర్పే వ్యవస్థ తెలుగులో లేదు. అందుకే ఒక మామూలు వాక్యాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేని దుస్థితిలో మన తెలుగు సాహిత్యం వుంది. ఆ లోటును తీర్చే ఉద్దేశంతో ‘సంచిక’ త్వరలో చదవటం నేర్పే శీర్షికను ఆరంభిస్తోంది.

సాహిత్య ప్రపంచంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లోపం యువ రచయితల లేమి. అలాగని యువ రచయితలు లేరని కాదు. చిత్తశుద్ధి, రచన పట్ల భక్తిభావన, బాధ్యతలతో పాటూ రచన అంటే అంతులేని పాషన్ ఉన్న యువ రచయితలు కనిపించటంలేదు. తెలుగులో ప్రస్తుతం అనేక కారణాలవల్ల తమలో అణగివున్న సాహిత్య తృష్ణను, పదవీ విరమణ తరువాత తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా రచనలు అధికంగా చేసేవారు కనిపిస్తున్నారు. కానీ, యువ రచయితల లేమి వల్ల సాహిత్యం యువతను అంతగా ఆకర్షించలేక పోవటం, యువత ఆకాంక్షలు, ఆశలు నిరాశలను ప్రతిబింబించలేకపోతోంది. దాంతో తెలుగు సాహిత్యంలో తరువాత తరం రచయితలు అధికంగా కనిపించటంలేదు. ఈ లోటును పూడ్చి యువతను సాహిత్యం చదవటం వైపు, రాయటంవైపు ఆకర్షించాలని ‘సంచిక’ ప్రయత్నిస్తోంది.

చదువరుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 జూన్ 2023 సంచిక.

1 జూన్ 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

కాలమ్స్:

Special Interview:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version