Site icon Sanchika

సంపాదకీయం మార్చి 2022

[dropcap]ఇ[/dropcap]టీవల ఒక పత్రికలో ఒక కార్టూన్ వచ్చింది. కరోన వైరస్‌లు మాట్లాడుకుంటుంటాయి. ఒక వైరస్ మరో వైరస్‌తో అంటూంటుంది, ‘వీళ్ళు బిలియన్లు ఖర్చుపెట్టారు మనల్నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి. ఇప్పుడొకరినొకరు చంపుకోటానికి బిలియన్లు ఖర్చుపెడుతున్నారు’ అని. కరోనా ఉధృతి తగ్గి ఊపిరి పీల్చుకునేలోగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఈరోజు కాకపోతే రేపయినా శాస్త్రవేత్తలు టీకాను కనుక్కుంటారు. కానీ, స్వార్థం, అహంకారాలకు మాత్రం ఎలాంటి మందు లేదు. అందుకే, మానవ ప్రపంచానికి మానవుడిని మించిన శత్రువు మరొకరులేరంటారు. ప్రస్తుతం జరుగుతున్నది గమనిస్తే, అధికారంలో వున్న వారి అహం, సామాన్య ప్రజలకు శాపం అని అర్థమవుతుంది. ఉక్రెయిన్ పశ్చిమ దేశాల కూటమిలో చేరటం రష్యాకు ఇష్టం లేదు. ఎందుకంటే, ఉక్రెయిన్ నుంచి రష్యాపై దాడిచేసి నష్టం కలగచేయటం సులభం. కానీ, ఉక్రెయిన్ ప్రజలకు పశ్చిమ దేశాలతో పొత్తు ఇష్టం. అందుకే, సామాన్యులు సైతం ఆయుధాలు చేబట్టి, ప్రాణాలను లెక్కచేయకుండా రష్యా సైన్యాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు. ఇక్కడ రష్యన్లదీ దేశభక్తే. వారికి తమ దేశం భద్రంగా వుండాలి. ఉక్రెయిన్లదీ దేశభక్తే. కానీ, ఉక్రెయిన్ ఆధారంగా పశ్చిమ దేశాలు రష్యాను ఇబ్బంది పెట్టటం, చుట్టుముట్టే ప్రయత్నాలు చేయటం గమనిస్తే, చిన్న దేశాలను పావులు చేసుకుని అగ్ర రాజ్యాలాడే అహంకారాలాటలు అర్థమవుతాయి.

గతంలో అఫ్ఘనిస్తాన్‌తో అగ్రరాజ్యాలాడిన అహంకారాలాటల ఫలితంగా రాజుకున్న అగ్ని ఇంకా అఫ్ఘన్‌నే కాదు పరిసర దేశాలనూ దహిస్తూనే వుంది. ఇరాన్, ఇరాక్, సిరియా, లిబియా ఒకటేమిటి ప్రపంచంలోని పలు ప్రాంతాలు అహంకారాలాటల వేదికలై అశాంతికాలవాలాలవుతున్నాయి. చివరికి భారతదేశం కూడా అగ్రరాజ్యాల అహంకారాల ఆటలలో తన ప్రమేయం లేకుండా ఇరుక్కుని వుంది. భారత్‌కు పాకిస్తాన్, చైనాలతో ప్రమాదం పొంచివుంది. ఉత్తరం వైపు నుంచి వచ్చే ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఆసియాలో రష్యా అవసరం వుంది. సముద్రంపై ఆధిపత్యం సాధించి భారత్‌ను దక్షిణం వైపునుంచి చుట్టు ముట్టే చైనాను ఎదుర్కొనేందుకు పాశ్చాత్య దేశాల అవసరం భారత్‌కు వుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం లాంటి పరిస్థితి ఇది. అందుకే, భారత్ ఐక్యరాజ్య సమితిలో ఓటు వేయకుండా తటస్థంగా వుంది. యుద్ధాన్ని ఖండిస్తోంది. కానీ, ప్రస్తుతం సంభవిస్తున్న పరిణామాలు ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదు.

అరణ్యంలో నీతి న్యాయం చెల్లవు. బలమున్నవాడిదే రాజ్యం. కరోనా వైరస్ వూహాన్ నుంచి విస్తరించినా చైనా కళ్ళెర్రజేస్తే అంతర్జాతీయ సంస్థలన్నీ మాటలు మార్చేస్తాయి. ఇజ్రాయెల్ పాలెస్తీనాపై దాడి చేస్తే అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఇసిస్‌లూ, తాలిబన్లూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎవరూ ఏమీ చేయలేరు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పోషిస్తూ, బహిరంగంగా నీతి రీతి లేనట్టు వ్యవహరిస్తున్నా ఇదేమిటనేవాడు లేడు. చైనా అంతర్జాతీయ సరిహద్దు రేఖలను లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నా ఎవరూ ఏమీ చేయలేరు. ఇంతగా అభివృద్ధి చెంది, ఇన్ని వ్యవస్థలను ఏర్పాటుచేసుకుని, నాగరీకంగా భావించుకుంటున్న మనం నిజంగా పురోగమిస్తున్నామా, సాంకేతికంగా ప్రగతి చెందినా మానసికంగా ఇంకా ఆటవిక దశలోనే వున్నామా??

పరిస్థితులెలా వున్నా తన కర్తవ్యాన్ని నిర్వహించటం, తన ధర్మాన్ని నిర్వర్తించటమే మనిషి పని. అందుకే, తన నిర్దేశిత కర్తవ్యాన్ని అనుసరించి సంచిక పాఠకులను ఆకర్షించే పలు శీర్షికలను అందించాలని ప్రయత్నిస్తోంది. త్వరలో వివరాలు అందిస్తుంది.

అలాగే, పలువురు కవుల అభ్యర్ధన మేరకు కవితలపోటీ గడువును మరోవారం పెంచింది. ఈ విషయమై ప్రకటన ఈ నెల సంచికలో చూడవచ్చు.

~

సంచికలో 1 మార్చి 2022 తేదీన ప్రచురితమవుతున్న రచనల వివరాలివి.

సంభాషణం:

ప్రత్యేక వ్యాసం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

బాలసంచిక:

సినిమా:

అవీ ఇవీ:

సంచిక ప్రకటనలు:

ఎప్పటిలాగే మీ సూచనలు, సలహాలతో సంచికను ముందుకు నడిపిస్తారన్న విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం

Exit mobile version