సంపాదకీయం మార్చి 2023

0
2

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు. సంచిక పాఠకుల సంఖ్య  దిన దిన ప్రవర్ధమానమవుతూండటం ఆనందదాయకం. తమకు మంచి అనిపించిన దాని గురించి మరో పదిమందిచే చదివించి, మంచిని పంచుతూ పెంచుతున్న సంచికను, ఉత్తమ సాహిత్యాన్ని అభిమానించేవారందరికీ బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.

ఎంత వద్దనుకున్నా సాహిత్యం రాజకీయంతో, ఇజాల రాజకీయాలతో విడదీయరాని సంబంధం ఏర్పరచుకుంది. ఇటీవలే కొందరు మేధావి రచయితలంతా ఒక చోట బహిరంగంగా సమావేశమయి,  రాబోయే సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో ప్రస్తుతం అధికారంలో వున్న పార్టీ గెలవకూడదనీ, అందుకు ఆచరించవలసిన ప్రణాళికను చర్చించారు. దీన్లో ఎలాంటి వింతలేదు. ఆలోచించవలసిందేమిటంటే, వీరెవ్వరికీ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధంలేదు. వీరంతా పేరున్న రచయితలు. పలు అవార్డులు గెలుచుకున్నవారు. Who is who of  contemporary Telugu literature. రాజకీయాలతో సంబంధంలేనివారు రాజకీయాల గురించి ఇంతగా ఆలోచిస్తూ తీవ్రమైన చర్యలు చేపట్టాలని అనుకోవటం వారి వారి రాజకీయ దృష్టిని స్పష్టం చేస్తుంది. రచయితలకు రాజకీయ ఇష్టాయిష్టాలుండటంలో తప్పులేదు. కానీ, పేరున్న రచయితలంతా ఒకే రకమయిన భావజాలానికి, ఇజానికి  చెందినవారవటం ఆలోచించాల్సిన విషయం. ఈ పరిస్థితిని మరింత హాస్యాస్పదం చేసి, వీరి ఆలోచనల్లోని డొల్లతనాన్ని స్పష్టం చేసే అంశం ఒకటుంది. వీరు ప్రకటించిన అజెండాల్లో ఒక అంశం – సాహిత్య అకాడెమీని కాషాయీకరణం చేయాలని జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుని అది కాకుండా చూడాలన్నది. సాహిత్య అకాడెమీ ప్రస్తుతం ఒకే రంగు పులుముకుందనీ, సాహిత్యానికీ అదే రంగు పులిమి ఇతర ఏ రంగుకూ స్థానం లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నదని, అవార్డులందుకుంటున్నవారూ, అవార్డు కమిటీల్లో వున్నవాళ్ళు, అకాడెమీ సమావేషాలకు పిలుపులందుకుంటున్నవారూ, అకాడెమీలో చర్చించే అంశాలూ గుడ్డివాడికి కూడా ఒకే రంగు (నలుపు కాదు) అజెండా అత్యంత స్పష్టంగా తెలిసేట్టున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కమిటీ కూడా పాత కమిటీకి భిన్నంకాదు. అందరూ అదే తాను గుడ్డలు. అయితే,  సాహిత్య అకాడెమీ  కాషాయీకరణాన్ని అడ్డుకోవాలని  పిలుపు నిచ్చిన రచయిత కొత్తగా ఏర్పడిన సాహిత్య అకాడెమీలో సభ్యుడు!!!!!! ఇదీ తెలుగు సాహిత్య దుస్థితి.  I have contempt for Telugu writers  అన్న వ్యక్తీ సాహిత్య అకాడెమీలో సభ్యుడే!!!! ఇక్కడ భావ జాలమూ, రాజకీయమూ, రంగుల గోలలు తప్ప సాహిత్యం ప్రసక్తిలేదు. కొత్తగా ఏర్పడిన కమిటీని చూస్తే, సాహిత్య అకాడెమీకి కాషాయం రగూ పులమద్దు, ఎరుపు రంగూ వద్దు. తెలుగు సాహిత్యానికి కావాల్సింది  సప్తవర్ణ సమ్మిశ్రితమయిన శ్వేతవర్ణం అనిపిస్తుంది. రచనా ప్రతిభ, నైపుణ్యం, వైశిష్ట్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప రచయితకూ, ఇజానికీ , రంగుకూ కాదు.

ప్రపంచ సాహిత్యంలో ఒక రచనకు గుర్తింపు ఆ రచనలో రచయిత ప్రదర్శించిన మానవీయ విలువలు, మానవ సమాజంపట్ల ఆ రచన కలిగించే అవగాహన, లోతయిన ఆలోచన, రచనా నైపుణ్యం వంటి సాహిత్య సంబంధిత విషయాల వల్ల లభిస్తుంది తప్ప రచయిత భావజాలంవల్ల కాదు. అందుకే అయాన్ రాండ్ సరసన హవార్డ్ ఫాస్ట్ వుంటాడు. అప్టాన్ సిక్లెయిర్ సరసన చినువా అచెబె వుంటాడు. డోరిస్ లెస్సింగ్ సరసన మేరీ షెల్లీ వుంటుంది.  బిల్కిసూ ఫుంటువా సరసన తస్లిమా నస్రీన్ వుంటుంది. మురకామీ సరసన మార్క్వెజ్ వుంటాడు. కాఫ్కా సరసన మిలన్ కుందేరా వుంటాడు. నట్ హామ్సెన్ పక్కనే స్టీఫెన్ కింగ్ కూర్చుంటాడు. ఆర్థర్ క్లార్క్ అసిమోవ్‌ల వరసలోనే అగాథా క్రిస్టీ, మైకెల్ కొనలీలుంటారు. డికెన్స్, లూయీస్, జెఫ్రీ ఆర్చర్ లతో రౌవ్లింగ్ వుంటుంది. ఇలా ఎంతో విభిన్నమూ, విశిష్టమయిన సాహిత్యం కనిపిస్తుంది. సమకాలీన తెలుగు సాహిత్యంలో పేరున్న రచయితల రచనలు, అవార్డులందుకునే రచయితల రచనలు చూస్తే వైవిధ్యమూ, వైశిష్ట్యమూ అటుంచి, ఏక బిగిన చదివించగలిగే లక్షణం కనబడితే సంబరాలు చేసుకునే పరిస్థితి వుంది. ఈ పరిస్థితిని మెరుగు పరచి అసలు సాహిత్య విలువలున్న రచనలను తెరపైకి తేకపోతే భావి తరాలముందు దోషుల్లా నిలవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని మెరుగు పరచేందుకు సంచిక పలు ప్రణాళికలు వేస్తోంది. పథకాలు రచిస్తోంది. రచయితలందరినీ ఒక వేదిక మీదకు తేవాలని ప్రయతినిస్తోంది. ఈ విషయాల గురించిన వివరాలు త్వరలో సంచిక ప్రకటిస్తుంది.

విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’. త్వరలో సంచికలో బాబా బందా సింగ్ బహాదూర్ చారిత్రక ఫిక్షన్ నవల ధారావాహికంగా ప్రారంభవుతుంది.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 మార్చి 2023 సంచిక.

1 మార్చి 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

  • కవి, కథకుడు, శ్రీ సర్వసిద్ధి హనుమంత రావు అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

కాలమ్స్:

  • సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…11 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
  • సంచిక విశ్వవేదిక – సాంఘిక మాధ్యమాలు – సారధి మోటమఱ్ఱి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- మార్చి 2023 – దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -36 – ఆర్. లక్ష్మి

కథలు:

  • నగరంలో మరమానవి-6 – చిత్తర్వు మధు
  • విదేశీ పక్షులు – గంగాధర్ వడ్లమాన్నాటి
  • కృష్ణ వ్యూహం – సిహెచ్. సి. ఎస్. శర్మ
  • ప్రకృతి పులకింత – దాసరి శివకుమారి

కవితలు:

  • కవిత పూర్తయింది – శ్రీధర్ చౌడారపు
  • ఈ లోకంతో జాగ్రత్త చిన్నా.. – డా. విజయ్ కోగంటి
  • తేజఃకవిత – డా. కొండపల్లి నీహారిణి

బాలసంచిక:

  • ఫలించిన విద్య – కంచనపల్లి వేంకటకృష్ణారావు

పుస్తకాలు:

  • మంచి మనుషుల మంచి కథలు – గాండ్లమిట్ట – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్

సభలు:

  • ‘కార్వేటినగరం కథలు’ బాలల బొమ్మల పుస్తక ఆవిష్కరణ సభ నివేదిక – ఆర్.సి. కృష్ణస్వామి రాజు

అవీ ఇవీ:

  • జ్ఞాన సంపత్తిని అందించే యాజ్ఞవల్క్య మహర్షి – అంబడిపూడి శ్యామసుందర రావు

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here