[dropcap]తె[/dropcap]లుగు సాహిత్య వేదిక సంచిక పాఠకులకు అభినందనలు.
నిజానికి ఇది సంచిక రెండవ సంచిక అయినా, ఇప్పటికే సంచికకు ఒక గుర్తింపు, ప్రత్యేకతను ఆపాదించి అభిమానిస్తున్న తెలుగు సాహిత్యాభిమానులకు వందనాలు. తెలుగు పత్రికలకు పాఠకులు తక్కువయ్యారు, ఆదరణ తరిగిపోయింది అనే వ్యాఖ్యానాలన్నీ అపోహలేనని నిరూపిస్తూన్నది సంచికకు రోజురోజుకీ పెరుగుతున్న పాఠక ఆదరణ, ఆప్యాయత. పాఠకులు అత్యంత విచక్షణ కలవారు. వారు నాణ్యమయిన దాన్ని దేన్నీ తిరస్కరించరు. ఆదరించి అక్కున చేర్చుకుంటారు. ఈ రెండు నెలలలో సంచికకు లభిస్తున్న ఆదరణ ఉత్సాహ ప్రోత్సాహాలు ఈ భావన నిజమని నిరూపిస్తున్నాయి. సంచిక పత్రిక అనుక్షణం పాఠకులకు ఆనందాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే విభిన్నమయిన రచనలను విశిష్టమయిన రీతిలో అందించాలని తపన పడుతుంది. ప్రయత్నిస్తోంది.
ఈ నెల ప్రత్యేక వ్యాసం వికలాంగులకు, విధిసర్పదష్టులకు విశిష్టమయిన సేవ చేస్తున్న స్వచ్చంద సంస్థ పరిచయ వ్యాసం. అన్నీ ప్రభుత్వం అందించాలని ఎదురుచూస్తూ దూషించే బదులు, చీకటిలో చిరుదీపాన్ని వెలిగించి, ఆ వెలుగులో ఎంతో మందికి దారిచూపించే ఇలాంటి సంస్థల ఆవశ్యకత ప్రస్తుతం సమాజంలో ఎంతో వుంది. అందరూ సంస్థలు స్థాపించి సేవ చేయలేరు. అలా సేవ స్వయంగా చేయలేనివారు, సేవ చేస్తున్న వారికి సహాయ సహకారాలందించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని వెలిగించలేకున్నా, కనీసం ఆ దీపానికి చమురును అందిస్తూనో, వొత్తిని ఎగదోస్తూనో వెలుగు మరింత దేదీప్యమానమయ్యేందుకు తోడ్పడవచ్చు. సమాచారాన్ని అందిస్తూనే ప్రేరణాత్మకమయిన వ్యాసం ఇది.
సంచిక పత్రిక పద్య కవితలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తుంది. పద్య కవులనుంచి పద్యాలు, ఖండ కావ్యాలను ఆహ్వానిస్తోంది. వినాయక చవితి సందర్భంగా హాస్యకథల పోటీ , దసరా సందర్భంగా పద్య కావ్యాల పోటీ, వచన కవితల పోటీ, దీపావళి సందర్భంగా కథల పోటీలను సంచిక నిర్వహిస్తుంది. ఈ పోటీల వివరాలను త్వరలో ప్రకటిస్తాము. రచయితలు, కవులూ తమ కలాలకు పదును పెట్టి శ్రుతి చూసుకుని సిద్ధంగా వుండాలి.
ఇంకా, సాహిత్య వ్యాసాలు, విశ్లేషణలు, కథలు, కవితలు, సినీ విశ్లేషణలు, పుస్తక సమీక్షలతో పాఠకులని అలరించాలని సంచికను తీర్చి దిద్దుతున్నాము. పాఠకుల సలహాలు, సూచనలు నిర్మొహమాటమయిన అభిప్రాయాలకు ఆహ్వానం. రచయితలు సైతం తమవంతుగా విభిన్నమయిన రచనలతో సంచికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి.
ఇక మే 2018 సంచికలో ప్రచురితమవుతున్న రచనలు వివరాలు:
కథలు:
1) బృందావన సారంగ –జొన్నలగడ్డ సౌదామిని
2) మ్యూజిక్ మొదలైంది – భీమరాజు వెంకటరమణ
3) మేడ మీద దెయ్యం – శంకరప్రసాద్
4) జీవనహేల – శ్రీలక్ష్మి చివుకుల
5) పెరటిచెట్టు – కె.కె.భాగ్యశ్రీ
6) హృదయానికి ప్రేమ లేఖ – చొప్పదండి సుధాకర్
7) జీవన రాగం – నండూరి సుందరీ నాగమణి
8) ఏం మాయరోగాలో – పెయ్యేటి శ్రీదేవి
9) రాయడానికి ఏమీ లేదు – కొల్లూరి సోమ శంకర్
10) అనుగ్రహం – శివరామకృష్ణారావు వంకాయల
11) టీచరమ్మమ్మ – వావిలికొలను రాజ్యలక్ష్మి
కవితలు:
1) జాహ్నవి మినీ కవితలు – జాహ్నవి శ్రీధరాల
2) నీవు నీలా మిగిలివున్నట్లే! – డా. విజయ్ కోగంటి
3) శ్మశానము -శ్రీ కాంత గుమ్ములూరి
4) దోమకు దండం – సింగిడి రామారావు
5) చిన్నప్రాణం – శ్రీరామోజు హరగోపాల్
6) సమ్‌ఝే…! – శ్రీధర్ చౌడారపు
7) జీవనగమనాలు – పద్మావతి రాంభక్త
8) ఆసరా – సి.ఎస్. రాంబాబు
9) ఏమో – ముకుంద రామారావు
10) మధ్యాహ్నార్కుడూ మానవలోకము – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
వ్యాసాలు:
1) మోసకారి మోహనవంశి – టి. శ్రీవల్లి రాధిక
2) రజనీగారు – కొన్ని జ్ఞాపకాలు – దాసరి శిరీష
3) కల్పవృక్షం – ఆధునికేతిహాసము – సుప్రసన్నాచార్య
4) రామదాసు సాహిత్యం విశిష్టాద్వైత స్వరూపం – సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి
సీరియల్స్:
1) ఏమవుతుందో?? ఎటుపోతుందో? ఏమో -3: పొత్తూరి విజయలక్ష్మి
బాలసంచిక:
1) నేటి సిద్ధార్థుడు – 2: బాలల నవల – సమ్మెట ఉమాదేవి
2) వజ్రాలమూట – పిల్లల కథ – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
3) ఔదార్యం – పిల్లల కథ – శాఖమూరి శ్రీనివాస్
ప్రత్యేక వ్యాసం:
1) గ్లోబల్ ఎయిడ్ పుట్టుక, ప్రస్థానం, ప్రస్తుతం! – సాయిపద్మ
కాలమ్స్:
1) రంగుల హేల – పాటల పూలు – అల్లూరి గౌరీలక్ష్మి
2) మిర్చీ తో చర్చ – 2 – వేదాంతం శ్రీపతి శర్మ
3) తెలికడలి సుడులలో – 2 – డా. మైథిలి అబ్బరాజు
భక్తి:
1) సాఫల్య సోపానం – ఎండి ఉస్మాన్ ఖాన్
2) భద్రాద్రి రాముడు – డా. జొన్నలగడ్డ మార్కండేయులు
అవీ ఇవీ:
1) ఆర్జవం – అనిల్ ప్రసాద్ లింగం
2) తెలుసుకోదగ్గ నిర్వచనాలు – జీడిగుంట నరసింహమూర్తి
3) వీనుల నుండి వినువీథుల దాకా! వేటూరి పాట బాట – రాజన్ పిటిఎస్‌కె
పుస్తక సమీక్షలు:
1) నిరాడంబర కథల సంపుటి దేవుడికి సాయం – కోడిహళ్ళి మురళీమోహన్
2) మురికివాడలను నిర్మూలించగలమా? – కె.పి. అశోక్ కుమార్
3) అద్భుత లోకంలోకి ప్రయాణం – పాడుతా… తీయగా పఠనం – భువనచంద్ర
4) మనసు పొరల్లో – వారణాసి నాగలక్ష్మి
త్వరలో సంచికలో నీలమత పురాణం అనువాదం ప్రచురణ ప్రారంభమవుతుంది. కశ్మీరుకు చెందిన అత్యంత ప్రాచీనము, పవిత్రము అయిన పురాణం ఇది. దీన్ని పురాణంగా అంగీకరించేందుకు ఇష్టపడని వారు, ఇది పురాణం కాదు, మాహాత్మ్యం అంటారు. ఎవరేమనుకున్నా నీలమత పురాణ ప్రాచీనత్వం కానీ, కశ్మీరు చరిత్రను, ప్రజల మానసిక స్థితిగతులను, కశ్మీర్ పరిణామక్రమాన్ని అర్ధంచేసుకోవటంలో నీలమత పురాణం గురించి తెలుసుకోవటం, దాన్ని అవగాహన చేసుకుని విశ్లేషణ చేస్తూ ఆధునిక పరిస్థితులతో అన్వయించటం అత్యంత ఆవశ్యకం. కళ్హణుడు రాజతరంగిణి రచనలో నీలమత పురాణాన్ని రిఫరెన్స్ పుస్తకంలా ఉపయోగించాడు. సంచిక పాఠకులకు సంచిక అందిస్తున్న అపురూపమయిన కానుక నీలమత పురాణానువాదం.
ఇంకా త్వరలో పలు విభిన్నమయిన ఆకర్షణీయమయిన రచనలతో పాఠకులను అలరిస్తూ, తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక సుందర పుష్పంలా నిలవాలని సంచిక ప్రయత్నిస్తుంది. సంచిక గురించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలను నిర్మొహమాటంగా అందించాలని ప్రార్థన.
సంపాదక బృందం