Site icon Sanchika

కొన్ని సంతోషాలు-కొన్ని విషాదాలు

[dropcap]జీ[/dropcap]వితం సుఖదుఖాల కలగలుపు. సుఖం అందినప్పుడు పొంగక, దుఖం కలిగినప్పుడు క్రుంగక తన నిర్దిష్ట కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగిపోవటమే విజ్ఞుడు చేసే పని అంటారు. కానీ, ఒకోసారి మన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు స్పందించకుండా వుండలేము. ఆవేశమో, నిరాశానిస్పృహలో చుట్టుముడతాయి. అలాంటి పరిస్థితులలో ఆవేశం, నిరాశనో తొలగే ఒక్క క్షణంసేపు ఓపిక పడితే మళ్ళీ మనిషి మామూలు అయిపోతాడు. ఎందుకంటే మనిషిలో ముందుకు సాగిపోయే లక్షణం అంతర్గతంగా వుంది. అది ఈ సృష్టిలోనే వుంది. సృష్టిలో అన్నీ ముందుకే సాగుతాయి. వెనక్కు పోదేదీ. కాలం ముందుకే పరుగిడుతుంది. నీరు ముందుకే ప్రవహిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం రోజూ జరిగేవే అయినా, ఏ రోజూ మరో రోజులా వుండదు. వీచే గాలి కూడా అంతే….. ఏ జంతువు కూడా గతాన్ని తలవలేదు. అలా తలవగలిగింది, తలుచుకుని బాధపడగలిగింది, కుమిలిపోయేదీ మనిషి ఒక్కడే.. అందుకే కొందరు ఇలా గతాన్ని తలచుకుని పొంగటమో క్రుంగటమో అప్రాకృతికం అంటారు.

కాబట్టి గడచిన దాన్ని తలచుకుని ఎక్కువకాలం కుమలకూడదు మనిషి. అది అప్రాకృతికమయిన లక్షణాలకు దారి తీస్తుంది. ఈ నెల సంచికలో ఆర్.దమయంతి గారు ఆత్మహత్యల గురించి కొందరు ప్రముఖుల అభిప్రాయాలను సేకరించి అందిస్తున్నారు. ఉపయోగకరమయిన రచన ఇది. ఆత్మహత్య అప్రాకృతికమయిన చర్య. ఇందుకు దారితీసే మానసిక స్థితి గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగివుండటం తప్పనిసరి. ఇలాంటి సామాజికావశ్యకత వున్న పలు అంశాలగురించి విశ్లేషణాత్మకమయిన రచనలను అందించాలని సంచిక విజ్ఞప్తి చేస్తోంది.

జగతి జగద్ధాత్రి గారి అకాల నిష్క్రమణం తద్వారా సాహిత్యప్రపంచంలో వారి వ్యక్తిగత జీవితం గురించి చెలరేగిన చర్చలు అత్యంత శోచనీయం. సాహిత్య ప్రపంచంలో నెలకొనివున్న విచిత్రమయిన మానసిక స్థితికి ఇది దర్పణం పడుతుంది. ఎదుటివ్యక్తి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి తీర్పులిచ్చి సంతృప్తి పొందేది నీచ మనస్తత్వం. సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన రచయితల సమూహాల్లో ఇలాంటి మనస్తత్వం శోచనీయం. జగతి జగద్ధాత్రి గారి ఆత్మకు శాంతి కలగాలని సంచిక భగంతుని ప్రార్ధిస్తోంది.

సోమరాజు సుశీలగారు సంచికకు రచనలు అందించకున్నా సంచిక భావజాలంతో వారికి దగ్గరి సంబంధంవుంది. సంచిక ఆరంభ సంచికలో ‘ఇల్లేరమ్మ కథల’ విశ్లేషణ వుండాలని అనుకున్నాము. కానీ పలు కారణాలవల్ల అది కుదరలేదు. కానీ, ఆవిడ ఆశీస్సులు సంచికకు అందిస్తూనేవున్నారు వారు. వారు అత్యంత స్నేహమయి. హాస్య చతురులు. వారి మరణానికి సంచిక అశ్రునివాళి ఘటిస్తోంది.

అమితాభ్ బచ్చన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే బహుమతి రావటం ముదావహం. నిజానికి ఈ బహుమతి ఇంకో పదేళ్ళముందు రావాల్సింది. ఆలస్యంగానయినా అమితాభ్‌కు ఈ బహుమతి రావటం అత్యంత ముదావహం. అయితే, కొందరు స్వయం ప్రకటిత మేధావులు, అమితాభ్‌కు అవార్డు రావటాన్ని ఆయన గుజరాత్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా వుండటానికి ముడిపెట్టి వ్యాఖ్యానిస్తున్నారు. తమ నీచ స్వభావాన్ని నడిబజారులో నిస్సిగ్గుగా ప్రదర్శిస్తూ అదే అభ్యుదయం అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఇలా ప్రతి విషయాన్నీ వక్ర దృష్టితో చూసి అతి నీచంగా వ్యాఖ్యానించి కాలర్లెగరేయటం కనిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతమవుతున్నప్పటినుంచీ, ప్రతి ఒక్కరికీ తన అభిప్రాయాన్ని పదిమందికీ ప్రకటించే వీలు చిక్కటంతో ఇలాంటి అడ్డూఅదుపూలేని వ్యాఖ్యలు సర్వసాధారణమవుతున్నాయి. సినీ రంగానికి కళాకారుడు చేసిన సేవకు గుర్తింపుగా అందించే ఈ అవార్డుని రాజకీయాలతో ముడిపెట్టటం అసంబద్ధం. సినీరంగం నుంచి అమితాభ్ సినిమాలను తొలగిస్తే ఒక 40 ఏళ్ళపాటు సినీపరిశ్రమ శూన్యం అయిపోతుంది. సంచిక అమితాభ్‌కు అభినందనలు తెలుపుతోంది. అమితాభ్ లాంటి నటుడు వంద సంవత్సరాలకో, వెయ్యి సంవత్సరాలకో ఒకడు వస్తాడు. అలాంటి నటుడి సినిమాలు చూస్తూ, అతనునున్న కాలంలో జీవిస్తున్నందుకు గర్వపడుతోంది సంచిక..

అక్టోబరు 2019 సంచిక లోని రచనలు

ప్రత్యేక వ్యాసం:

తెనుంగురాయని స్వగతం – ఇ.ఎన్.వి.రవి

సీరియల్స్:

ఎండమావులు-1- గూడూరు గోపాలకృష్ణమూర్తి

కాలమ్స్:​

రంగులహేల-19- కలర్‌ఫుల్ కదంబం – అల్లూరి గౌరిలక్ష్మి​

వ్యాసాలు:

సాహిత్య పరిణామంలో విరోధాభాసాలు – కోవెల సుప్రసన్నాచార్య

ఓ మంచి పాత కధ ‘టార్చ్ లైట్’ – అంబడిపూడి శ్యామసుందర రావు

ఆత్మహత్య – నేరమా? శాపమా? పాపమా? అనారోగ్యమా? – ఆర్. దమయంతి

కథలు:

విజేత – కోడుగంటి విజయలక్ష్మి

బుగ్గన చుక్క్ – జొన్నలగడ్డ సౌదామిని

జగదీష్ రాజ్ యొక్క బీరకాయ-బిర్యానీ కథ – జగదీష్ రాజ్

మనిషితనం – సురేఖ దేవళ్ళ

కవితలు:

ఎందుకలా! – శ్రీధర్ చౌడారపు

అందుకే అందకు – డా. విజయ్ కోగంటి

చెట్టు మాటలు – డా. సి. భవానీదేవి

మహాత్మా! – మట్ట వాసుదేవమ్

బాలసంచిక:

కాళిదాసు వాక్శుద్ధి – శంకరప్రసాద్

అమ్మ ప్రేమ – బి. జాహ్నవి

పుస్తకాలు:

ఇందుమతి కవిత్వం – పరిచయం – సంచిక టీమ్

పాఠకులను అలరిస్తూ, కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ తెలుగు పఠనాసక్తిని పెంచేందుకు సంచిక తపన పడుతోంది. సలహాలతో, సూచనలతో, మీ రచనలతో సంచికను మరింత ఆకర్షణీయం చేసేందుకు తోడ్పడమని సంచిక అభ్యర్ధిస్తోంది.

విజయ దశమి పండుగ అందరికీ శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ, పండగ శుభాకాంక్షలు అందిస్తోంది సంచిక.

సంపాదక వర్గం

Exit mobile version