సంపాదకీయం అక్టోబరు 2021

0
2

[dropcap]సం[/dropcap]చికను ఆదరిస్తూ, తెలుగు పాఠకుల పరిణతి, విచక్షణల పట్ల మాకున్న విశ్వాసాన్ని ఇనుమడింపచేస్తున్న పాఠకులందరికీ ధన్యవాదాలు. ఉత్తమము, నాణ్యము అయిన రచనలతో పాఠకులను ఆకర్షించటం కష్టం అనుకునే వారందరికీ కనువిప్పు కలిగించే రీతిలో సంచికకు పాఠకాదరణ లభించటం ఆనందదాయకమే కాదు, ఆశావహం కూడా. సంచికలో విపరీతమయిన పాఠకాదరణ లభిస్తున్న రచనలన్నీ ఉత్తమస్థాయిలో ఉన్నవే. అయితే, యువ రచయితలు రాయాల్సినంతగా రాయకపోవటము, రాసే విధంగా రాయకపోవటము, వారిలో కొత్త కొత్త విషయాలు రాయాలి, కొత్త ప్రయోగాలు చేయాలి, విభిన్నమయిన రీతిలో విశిష్టమయిన రచనలు చేయాలి అన్న తపన కనబడకపోవటము కాస్త ఆలోచించాల్సిన విషయము. ఈ విషయంలో సంచిక రచయితల సమావేశాలను ప్రతి నెలా నిర్వహించి విభిన్నమయిన రచనలు చేసేందుకు ఊపునివ్వాలని ఆలోచిస్తోంది. ఈ విషయమై ఒక స్పష్టమయిన ప్రణాళిక ఏర్పాటు కాగానే ఆచరణలో పెడతాము.

సంచిక యువ రచయితలకోసమే ప్రత్యేకంగా ఒక కథలపోటీ నిర్వహించాలని అనుకుంటోంది. అయితే ప్రభుత్వం ప్రకారం 35ఏళ్ళలోపువాళ్ళు యువరచయితలు. కానీ, సంచిక ఈ వర్గీకరణను ఒప్పుకోదు. ఆటగాళ్ళు యవ్వనంలోనే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారు. వయసు పెరుగుతున్నకొద్దీ వారి ప్రతిభ తరుగుతుంది. కానీ, రచయితలు ఇందుకు భిన్నం. వయసుతో రచయితకు పరిణతి పెరుగుతుంది. అనుభవ విస్తృతి కలుగుతుంది. ఆలోచనలు రాటుదేలుతాయి. రచయితగా ఉత్తమ రచనలు చేయగలుగుతాడు. సమాజం పట్ల, బాధ్యతలు, కర్తవ్యాల పట్ల, ధర్మం పట్ల ఒక అవగాహన వస్తుంది. అప్పుడు అతని రచనలు భావితరాలకు మార్గదర్శనం  చేసే రీతిలో నిలుస్తాయి. కాబట్టి, ఇంకా పరిణతి చెందకముందే రచయితకు పొగడ్తలు, అవార్డులు లభించటంవల్ల అహంకారం తలకెక్కుతుంది. తనని మించినవాడులేడని నమ్ముతాడు. రచయితగా దిగజారి, లాబీయిస్టుగా, అవార్డిస్టుగా మిగులుతాడు. కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార గ్రహీతలలో కొందరిని వదిలితే మిగతా అందరి ప్రవర్తన ఈ నిజాన్ని నిరూపిస్తుంది. తమకు లభించిన గుర్తింపు ప్రధానంగా తమ వయసు వల్ల తప్ప ప్రతిభ వల్ల కాదన్న గ్రహింపు లేకుండా, ఇక తాము నేర్వాల్సిందేమీ లేదు, నేర్పేది తప్ప అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అవార్డు రాకముందు, అవార్డు తరువాత వారి రచనలను గమనిస్తే ఈ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అనేక అవార్డీలు రాయటంలేదు కూడా. అందుకని కనీసం 45 ఏళ్ళ వరకూ రచయితను యువ రచయితగా పరిగణించాలనుకుంటోంది సంచిక. త్వరలో ఈ పోటీల ప్రకటన వెలువడుతుంది.

ఇది దృష్టిలో వుంచుకుని సంచిక రచయితల నిర్మాణాం గురించి సంచిక పథకాలు వేస్తోంది. ఈ వివరాలు త్వరలో….

ఇటీవలి కాలంలో తాము తప్ప, తమకన్నా ముందు, తమ తరువాత ఎవరూ లేరన్న ధోరణి ప్రబలుతోంది. ప్రాచీనులను విస్మరించటమంటే వారసత్వ సంపదను తృణీకరించతం మాత్రమేకాదు, దాన్ని తుడిచిపెట్టేయటం కూడా. గతం లేనివాడికి వర్తమానం లేదు. వర్తమానం లేనివాడికి భవిష్యత్తు వుండదు అన్న కనీసమైన గ్రహింపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. మనకెంత అపారమయిన సాహితీ సంపద వుందో, ఎంతో లోతయిన విశ్లేషణలు, చర్చలు జరిగేవో నవతరానికి తెలియచెప్తూ, పాత తరానికి గుర్తుచేస్తూ, మళ్ళీ ఆరోగ్యవంతమయిన వాతావరణం సాహిత్య ప్రపంచంలో నెలకొనేందుకు అందరూ ప్రయత్నించాలన్న లక్ష్యంతో సంచికలో ఇకపై ఒకప్పటి ఉత్తమ సాహిత్య వ్యాసాలు ప్రచురిస్తున్నాము. ఈ ప్రయత్నం ఆరంభం కృష్ణశాస్త్రి గీతాలపై ఇంద్రగంటి శ్రీకాంతశర్మ విశ్లేషణాత్మక వ్యాసాన్ని పునః ప్రచురిస్తున్నాము. ఇలాంటి  ఉత్తమ విలువలు కల సాహిత్య వ్యాసాలను సంచిక సాహిత్యాభిమానుల కోసం, సాహిత్యౌత్సాహికుల కోసం అందిస్తోంది. ఈ వ్యాసాలు సాహిత్యం గురించి, సాహిత్య విశ్లేషణ గురించి, రచన ప్రక్రియ గురించి వివరిస్తాయి. ఈ వ్యాసాలు అందరికీ ఉపయుక్తంగా వుంటాయని సంచిక ఆశిస్తోంది.

తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ. విశ్వవ్యాప్తంగా వున్న తెలుగువారందరినీ ఒక వేదిక మీదకు తీసుకువచ్చి, వారి జీవితాలు, అనుభవాలలోని సారూప్యాలు,  విభేదాలు, విభిన్నత్వం, వైశిష్ట్యాలు తెలుపుకునే విశ్వవేదికగా ‘సంచిక విశ్వవేదిక’ను ఈ నెల నుంచీ ఆరంభిస్తున్నాము. ఈ వేదిక నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన మోటమర్రి సారధికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ శీర్షికను జయప్రదం చేయవలసిందని విశ్వమంతా వ్యాపించివున్న తెలుగువారిని అభ్యర్ధిస్తున్నది సంచిక.

తెలుగు సాహిత్యాభిమానులను అలరించేందుకు సంచికలో 1 అక్టోబరు 2021 తేదీన ప్రచురితమవుతున్న రచనల వివరాలివి.

సంభాషణం:

  • డా. సుశీల(మ్మ) – డా. కె.ఎల్.వి. ప్రసాద్

ప్రత్యేక వ్యాసం:

  • కృష్ణశాస్త్రి పాట – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

కాలమ్స్:

  • రంగుల హేల 43: అనారోగ్యాలూ – అతి జాగ్రత్తలూ – అల్లూరి గౌరిలక్ష్మి
  • సంచిక విశ్వవేదిక – 1 – మోటమర్రి సారధి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- అక్టోబరు 2021- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -19 – ఆర్. లక్ష్మి

కథలు:

  • కనువిప్పా? కొసమెరుపా? – అక్షర
  • అంతకు మించిన వాడు – గంగాధర్ వడ్లమాన్నాటి
  • బాధ్యత – దాసరి శివకుమారి

కవితలు:

  • మగవాని ప్రాప్తం!! – శ్రీధర్ చౌడారపు
  • ఎవరు? – డా. కోగంటి విజయ్
  • ఆమె ద్వంద్వం – ముకుంద రామారావు

పుస్తకాలు:

  • డా. ఏనుగు నరసింహారెడ్డి రుబాయిలలో తాత్త్వికత – పుస్తక సమీక్ష – డా. సిహెచ్. సుశీల
  • చచ్చినట్టు చదివించే నవల ‘మరణంతో నా అనుభవాలు’ – పుస్తక సమీక్ష – బిందుమాధవి మద్దూరి

బాలసంచిక:

  • నారికేళ పురం – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • మన అష్టాదశ పురాణాలు – అంబడిపూడి శ్యామసుందర రావు
  • ‘సిరికోన’ చర్చా కదంబం 3 – డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
  • చిరునవ్వుల మృదుభాషి శ్రీ సి. ఎస్. రాంబాబు!! – డా. కె.ఎల్.వి. ప్రసాద్

– సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here