[dropcap]ఎం[/dropcap]త అలసిపోయి పడుకున్నా, రేవంత్ పెట్టే కాఫీ వాసనకి తెలివి వస్తుంది, మీరాకి.
‘అబ్బా.. నైట్ ఆఫీస్ వర్క్, డెడ్లైన్ అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది, బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే పడుకుండిపోయాను’ అనుకుంటూ ఆవలిస్తోంది మీరా. ‘ఏ టైం కి లేచినా ఏమీ అనని పార్టనర్ ఉండటం సుఖమా కాదా’… అంటూ ఆలోచిస్తోంది.
ఏసీ గాలి మాత్రమే సర్కులేట్ అయిన గదిలో అద్దాల బాల్కనీలో వొళ్ళు విరుచుకుందామా అనుకొనేలోపు ‘సూర్యుడు దూరపు చుట్టమే.. నువ్వు పొద్దున్న లేవకపోతే, వొక ఉదయాన్ని కాదు, వొక అద్భుతమైన రోజుని మిస్ అవుతావు’ అన్న రేవంత్ మాట గుర్తొచ్చి, కాఫీ వాసనతో మళ్ళీ రీ-ఇంఫోర్స్ అయి గబగబా మంచం దిగేసి, కాళ్ళకి అడ్డుపడుతున్న చెప్పుల్ని తప్పించుకొని, బాత్రూం లోకి పరిగెత్తి, రాత్రి బట్టలు, బద్ధకం అన్నీ విదిలించుకొని, అదే సమయంలో అద్దంలో కనబడిన అలసిన మొహాన్ని, డార్క్ సర్కిల్స్‌ని, ఇరవై ఏడేళ్ళకే అక్కడక్కడా కనబడుతున్న వొకటీ రెండు తెల్ల వెంట్రుకలనీ, తలచుకొని నిట్టూర్చి,.. గబగబా పరిగెత్తి, రేవంత్ కాఫీ తేచ్చేలోగా బాల్కనీలో సెటిల్ అయింది..!
నిజంగా పొద్దున్న లేవటం ఎంత అవసరం అనుకుంటోంది మీరా. కానీ, లేవను.. అనుకుంటూ నిట్టూర్చింది. అందమైన సూర్యోదయాల్ని డెస్క్ టాప్ వాల్ పేపర్‌లా కంటే, నిజంగా చూడొచ్చుగా.. అనే ఫ్రెండ్ మాటలు గుర్తొచ్చి గిల్టీగా ఫీల్ అయి, దులిపేసుకుంటూ ఉండగా, పెద్ద కప్పుతో పొగలు కక్కే కాఫీ వచ్చింది. చాలా కృతజ్ఞతగా, రేవంత్ వైపు చూసింది మీరా. కాఫీ కప్ అందుకుంటూ ఉండగా అన్నాడు రేవంత్-“రేమీని చూసావా… రాత్రి నీకోసం చాలాసేపు అడిగి, పడుకుంది..” ఆరోపణ కాని ఆ స్వరం మీరా గిల్ట్ డబుల్ చేసింది. రేమీ వాళ్ళ మూడేళ్ళ పాప. రేవంత్, మీరా పేర్ల మొదటి అక్షరాలూ కలిసి వచ్చేలా, రేవంత్ ఇష్టంగా పెట్టుకున్న పేరు.
“వెళ్లి చూస్తాను…” గభాల్న అంటూ లేవబోయింది మీరా… లేవబోతున్న మీరాని, భుజాలు పట్టుకొని కూర్చోబెట్టాడు రేవంత్ …” రాత్రి ఏడ్చి పడుకొని, మంచి నిద్రలో ఉంది అది.. ఇప్పుడు డిస్టర్బ్ చేయకు..” అంటూ ఆప్యాయంగా భుజాలు వత్తి, కూర్చోబెట్టాడు. తన కాఫీ మగ్ అందుకుంటూ.. ‘నీతో కొంచం మాట్లాడాలి..!” అన్నాడు.
“ఏంటో చెప్పు చిన్ను…!” బుద్ధిగా సర్దుకొని కూర్చుంది మీరా… ఇతనికి కోపం రాదా? అనుకుంటూ
“చిన్నూ… మా అమ్మ పిలిచేవారలా, థాంక్స్ మీరా గుర్తు చేసినందుకు…” ఆబ్జెక్టివ్‌గా ఉన్న రేవంత్ స్వరం విని కొత్త్తగా రేవంత్ వైపు చూసింది మీరా…!
రేవంత్ చెప్పటం మొదలు పెట్టాడు – “మీరా.. నా గురించి నీకు ఎంత తెలుసో, మన ఈ నాలుగేళ్ల కాపురంలో నేను సరిగ్గా చెప్పలేను. ఎప్పుడూ, నీ గురించి నీ గోల్స్ గురించి, నువ్వు చెప్తే వినటం తప్ప నేను నా గురించి, చెప్పింది తక్కువ. నువ్వంటే నాకు గౌరవం, అభిమానం ఉన్నాయి. నువ్వు చేసే పని మీద నువ్వు చూపించే డెడికేషన్ నాకు చాలా ముచ్చటేస్తుంది. అంతే కాదు.. నువ్వు విషయాల్ని హేండిల్ చేసే విధానం, నీ ఎఫిషియన్సీ నాకు అబ్బురంగా అనిపిస్తుంది. నిజానికి, నాకు నువ్వుంటే ధైర్యంగా కూడా ఉంటుంది..”
రేవంత్ వైపు వింతగా చూసింది మీరా- “ఏంటి ఇవాళ కొత్తగా? నేను నీకు నాలుగేళ్ళుగా తెలుసు. అంతకుముందు, మన పేరెంట్స్ చాలాకాలంగా ఫ్రెండ్స్ కూడా కదా?” సూటిగా అంది మీరా.
ఇబ్బందిగా నవ్వాడు రేవంత్
“ఎంత కాలంగా తెలిసినా మనుషుల గురించి తెలీని విషయాలు ఉంటాయి మీరా… మా అమ్మగారు, నాన్నగారికి చాలా కాలం సంతానం కలుగలేదు, అమ్మ దగ్గర బంధువుల అమ్మాయి, గంపెడు సంతానం, పేదరికంతో బాధపడుతూ, మా అమ్మగారి దగ్గరకి వచ్చారంట, వాళ్ళ చిన్న కొడుకు అయిన నన్ను పెంచుకోమని. అప్పటికే మా నాన్నగారు అంటే నీకు తెలిసిన మీ మామగారు, డిప్యూటీ తాశీల్దారుగా ఉన్నారు. వీళ్ళకి కావలసింది, వాళ్ళు వదిలించుకోవాల్సినదీ ఒకటే అవటంతో, నన్ను దత్తతకి తీసుకున్నారు. భార్య మాట కాదనలేక, నన్ను అడాప్ట్ చేసుకున్న నాన్నగారు వొప్పుకున్నారు. కానీ, అయన రెవెన్యూ బుద్ది పోనిచ్చుకోకుండా, నన్ను కన్న అమ్మానాన్న ఇంక రాకూడదు, ఏ రకమైన లావాదేవీలు ఉండకూడదు అని పకడ్బందీగా రాయించారు. దానికి వాళ్లకి ఏదో కాస్త డబ్బు ఇచ్చి ఉంటారు..! బహుశా నాకు ఏడెనిమిది ఏళ్ళు ఉంటాయేమో.. తర్వాత నాకు వాళ్ళు గుర్తు లేరు. అప్పటి పెంకుటిల్లు, అమ్మ చీర చెంగు.. అరుగు మీద కూర్చొనే జ్ఞాపకం లీలగా. నన్ను పెంచుకున్న అమ్మని మొదట అమ్మగారూ అని పిలిచేవాడ్ని. తర్వాత ఆమెని అమ్మా అని పిలవటం ఎప్పుడు మొదలెట్టానో గుర్తులేదు. కానీ, అమ్మా.. మీరు అనే తప్ప ఎప్పుడూ చనువుగా ఉండలేదు. ఆమె నన్ను బాగానే చూసేవారు. కానీ ఆ దగ్గరతనం కూడా నాన్నగారి దగ్గర లేదు.. ఇప్పటికీ లేదు ..!!”
మొదటిసారి రేవంత్‌ని చూస్తున్నట్టు వింతగా వింటోంది.. మీరా.. అంతలో ఆఫీస్ పని గుర్తొచ్చి, ఫోన్ అందుకుంటూ ఉండగా అన్నాడు రేవంత్- “మీరా, ఇవాళ వీలైతే సెలవు పెట్టకూడదూ, నీతో మాట్లాడే పని ఉంది”. మౌనంగా తలూపింది మీరా, ఫోన్ రింగ్ అవుతూ ఉండగా. అటువైపు నుండి రెస్పాన్స్ రాగానే, తాను లేట్‌గా వస్తాను అని చెప్పింది. ఫోన్ పక్కన పెట్టి – “హా.. ఇప్పుడు చెప్పు చిన్నూ ఉరఫ్ రేవంత్.. ఇంకా ఎన్ని షేడ్స్ ఉన్నాయో.. హహ” నవ్వుతూ అంది మీరా.
“హ్మ్మ్… ” నిట్టూర్చాడు రేవంత్. “ఉన్నాయి మీరా, నువ్వు తెలుసు కోవాల్సినవి చాలా ఉన్నాయి.”
“చెప్పు వింటాను, మధ్య మధ్యలో కాఫీ ఇస్తానంటే… ” నవ్వుతూ అంది మీరా.
“నా చిన్నతనం చాలా నిశ్శబ్దంగా గడిచింది మీరా, తెలీని వొక దూరపు తనం, ఎవరో చుట్టాలింట్లో ఉండినట్టే ఉండేది. జాగ్రత్తగా, వాళ్ళ పర్మిషన్ అడిగి ఊపిరి పీల్చుకున్నట్టు, ఏది ఇరుకుగా ఇబ్బందిగా ఉండేది. అమ్మగారి చుట్టాలు ఎవరెవరో వచ్చేవారు. వాళ్ళు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు వోకలా ఉండేవారు ఆమె. వంటామె ఒకరు ఉండేవారు, ఆండాళ్ గారు. నా చిన్నతనం ఎక్కువ ఆమె దగ్గరే గడిచిందని చెప్పాలి. ఏమన్నా అడిగితే, విసుక్కోకుండా చేసి పెట్టేవారు. నాన్నగారి కోసం వచ్చేవాళ్లతో, కళకళలాడుతూ ఉండేది ఇల్లు. నేను, ఆండాళ్ గారు ఒక రూమ్‌లో పడుకొనే వాళ్ళం. ఆమె చెప్పే కథలే నా జోలపాటలు. నన్ను పెంచుకున్న రాధమ్మ గారు, గొప్ప అందగత్తే. తెల్లగా, పెద్ద జుట్టుని నీట్‌గా పెద్ద బన్‌లా చుట్టి పిన్నులు పెట్టేవారు, మంచి ముదురు రంగు చీరలు కట్టేవారు ఆమె. తర్వాత సిగ చుట్టూ పూలు, బొట్టు ,కాటుక నడుముకి ఇంటి తాళాలు, ఇలా ఆవిడ తయారవటం,నేను పక్కనుండి చూడటం, నాకిష్టమైన చైల్డ్ హుడ్ గేం. బయటకి ఎక్కువ వెళ్ళనిచ్చేవారు కాదు. నువ్వు తాశీల్దారు గారి అబ్బాయివి. నీ స్థాయిలో నువ్వుండాలి అనేవారు. అమ్మగారు తయారయితే చూడటం, ఆండాళ్ గారికి కాఫీ కలపటం దగ్గర నుండీ, అన్నింటిలో సాయం చేయటం, చదువుకోవటం అదే నా దినచర్య. నెమ్మదిగా ముగ్గులేసేవాణ్ణి, పేపర్లో, వంటలు, ముగ్గులు కలక్ట్ చేయటం నా హాబీ. ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఉండేవారు కాదు. ఎక్కడికి వెళ్ళినా అమ్మగారు, వేగంగా వచ్చేయమనేవారు. అలా ఇంట్లో ఉండటం అలవాటు అయింది. నాన్నగారికి అసలు తీరిక ఉండేది కాదు. ఉన్నప్పుడు, “చదువుతున్నావా? బాగా చదవాలి.. మీ వాళ్ళెవరూ ఊహించనంత అదృష్టం పట్టింది నీకు, నిలబెట్టుకోవటమే నీ పని” – అనేవారు. కొంచం కొంచం ఇంట్లో అలవాటు అవుతున్న నాకు, నేను దత్తుడ్ని అని మళ్ళీ గుర్తుకొచ్చేది. ఇలాగే, ఇంట్లో నుంచి వెళ్తూనే ఇంజినీరింగ్ చదివాను. బయట సీట్ వచ్చినా పంపటానికి అమ్మగారు వొప్పుకోలేదు. నాన్నగారు పట్టించుకోనూ లేదు. నాన్నగారు రిటైర్మెంట్ దగ్గర పడుతున్న టైం అది. కొంచం ఎక్కువ టైం ఇంట్లో ఉండేవారు. వంటలో సాయం చేస్తే తిట్టేవారు. మానేసాను. ఒకసారి ముగ్గు వేయటం చూసి, కొట్టారు. నేను దాచుకున్న అన్ని పుస్తకాలు, క్లాస్ పుస్తకాలు వదిలేసి, కాల్చేశారు. నాకు భయంగా ఉండేది. నా ఇంజినీరింగ్ పూర్తి అవటం, పీజీ సీట్ రావటంతో, నేను ఆ ఇంట్లోంచి బయటకి రావటం, మొదటిసారి, నేను బయట ప్రపంచం చూసినట్టు నాకు అనిపించేది. పీజీలో విపరీతంగా చదివేవాడ్ని, అన్ని పుస్తకాలూ.. రకరకాల మనుషులు, వాళ్ళ అలవాట్లు, పద్ధతులు, ఆశయాలు కలలు ఇవి గమనిస్తూనే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది. అవుతూనే, కేంపస్ సెలక్షన్స్‌లో ఈ ఉద్యోగం రావటం. ఇంచుమించు అదే లాంటి కంపెనీలో పని చేస్తున్న నీ ప్రొఫైల్ మా వాళ్లకి రావటం, మీ అమ్మా నాన్న, మా అమ్మగారు, నాన్నగార్లకి తెలిసిన వాళ్ళే కావటంతో, మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, వాళ్ళే డిసైడ్ చేసేసి పెళ్లి జరగటం కూడా నేను తేరుకొనేలోపుగా అయిపొయింది…”
“వావ్.. చిన్ను.. మన జీవితం, వొక్క పేరాగ్రాఫ్‌లో చెప్పేసావ్.. ఇది చెప్పటానికేనా ఏదో మాట్లాడాలి అన్నావు.. ?” ఆశ్చర్యంగా అడిగింది మీరా
“లేదు మీరా… నా గురించి, నేనేం కావాలనుకుంటున్నానో చెప్పటానికి, చాలా ధైర్యం కూడదీసుకొని ఉండమన్నాను.. ఉఫ్ఫ్.. ‘నో’ అని చెప్పటం నాకు చాలా కష్టం మీరా… ఎటూ కాకుండా అన్నిటికీ తల వూపేసి కష్టాల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కొనే అమ్మాయిలలా..” ఇబ్బందిగా అన్నాడు రేవంత్.
“నాకేం అర్థం కావటం లేదు రేవంత్, ఏ విషయం” అడిగింది మీరా.
“మన విషయమే… మన బంధం విషయం, పెళ్లి హడావిడిగా జరిగింది, తర్వాత నువ్వు నేను వోకర్ని వొకరు అర్థం చేసుకొనే లోగా రేమీ మన మధ్యకు వచ్చింది. ఫస్ట్ ప్రేగ్నన్సీ, సగం పైగా టైం నువ్వు మీ అమ్మా వాళ్ళతోనే ఉన్నావు. అందరూ దగ్గర దగ్గర గా ఉండటం వల్ల, మన చుట్టూ మనుషులు, రేమీ పుట్టటం, అండర్ వెయిట్ అని, దాని హెల్త్ జాగ్రత్తలు, నువ్వు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయటం, ఇలా ఈ హడావిడిలో మధ్యలో నేనెక్కడో తప్పిపోయాను అనే ఫీలింగ్ నాకు గత సంవత్సరంగా ఉంది.. అప్పుడే నాకు సుధ పరిచయం.. తర్వాత తనతో ప్రేమలో పడటం, కలిసి ఉండాలనుకోవటం త్వరత్వరగానే జరిగిపోయాయి. రోజూ నీకు నిజం చెప్పాలనుకోవటం, చెప్పలేకపోవటం నా తప్పే.. ఇంకా ఇలా ఉండదలచుకోలేదు మీరా.. నేను.. నేను మన బంధం నుండి రిలీజ్ కావాలి.. ఈ పెళ్లి నుండి స్వేచ్చ కావాలి ..” చెప్పాల్సింది అంతా వొక గుక్కలో చెప్పేసి ఊపిరి పీల్చుకున్నట్టు ఆగాడు రేవంత్.
తొరకలు కట్టిన కాఫీ కప్పు వైపు.. చూస్తోంది మీరా, ఏం చెప్పాలో తెలీనట్లు వాల్ పేపర్‌లా మిగిలిన బయట వాతావరణం
“నేను… నేను… నేను బిజీగా ఉన్నాననా… రేమీ… నేను…” జిగ్ సా పజిల్‌లా మాట్లాడుతోంది మీరా.
“కాదు… మీరా… కానే కాదు… ఇది నా గురించి… నా ఛాయిస్, అర్థం చేసుకో, నువ్వు కాదు కారణం” – కళ్ళనిండా బాధతో రేవంత్
“చిన్ను… ప్లీజ్, మనం ఫిక్స్ చేద్దాం ఇది, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నేను, రేమీ నువ్వు లేకుండా, ఇంపాజిబుల్, ప్లీజ్.. లెట్స్ ఫిక్స్ ఇట్. ఎవరు? సుధ… ఆ రిస్క్ మేనేజ్మెంట్ టీం అమ్మాయా, లేదా సుధా కృష్ణన్ మన హెచ్ ఆర్ అమ్మాయా..? ఎవరు? ప్లీజ్ మనం మాట్లాడుదాం.. ప్లీజ్” మాటలు వర్షంలా వస్తున్నాయి మీరాకి.
“హ్మ్మ్.. మీరా.. కాదు కానేకాదు..” – విహ్వలంగా చెప్పాడు రేవంత్
“వన్ నైట్ స్టాండ్‌లా కార్పోరేట్ లైఫ్ నీకు తెలుసు కదా.. ఇవన్నీ మామూలే అనుకో.. నాకు కష్టం గానే ఉంది, విచిత్రంగా కూడా, ఏదో నేను అడిగితే గానీ వొప్పుకోని మన conjugal లైఫ్‌లో .. నువ్వు లవ్ .. ఓకే ఓకే .. మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం.. ఒకే నా?” – బ్రతిమాలుతున్నట్లు మీరా.
“నువ్వు అనుకున్నట్టు కాదు మీరా.. ప్లీజ్ అర్థం చేసుకో .. సుధ నా వొయాసిస్”
“మరి ఎవరు? హూ ఇస్ దట్ బిచ్.. Let me know damn it.. how can she fuck my life..??” అరుస్తున్నట్టు అడిగింది మీరా
“సుధాకర్… నా కొలీగ్, లవర్, నా జీవితం” – ఖచ్చితంగా చెప్పాడు రేవంత్.
సూర్యుడు వొక్కసారిగా మరింత ఆరెంజ్‌గా మారినట్లు కనబడుతున్నాడు… అంతా వొక్కసారి blinding bright గా తోస్తోంది.., అప్పటిదాకా వినబడని, ట్రాఫిక్ వొక్కసారిగా వినబదినట్టుగా ఉక్కిరి బిక్కిరిగా ఉంది.. జీవితం లాగే..!!
పదేళ్ళ తర్వాత …
విపరీతమైన పనిలో, ఫ్లైట్ డిలేస్ కూడా అవసరమే.. అనుకుంటోంది మీరా, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో అనౌన్స్‌మెంట్ వింటూ.. ప్రయాణం అంత సుఖం లేదనుకో, ఏరకమైన డెసిషన్ తీసుకోనక్కర లేదు, నా ఫోన్ నెట్వర్క్ లేకపోతే చాలు – అన్న వొక ఫారేనర్ మాటలు విని, ..అబ్బా ఎంత నిజం అనుకుంది. రేమీకి ఫోన్ చేయాలని గుర్తొచ్చి.. వెంటనే ఫోన్ తీసి రింగ్ చేసింది.. “ఏ ములాకాత్ ఏక్ బహానా హాయ్.. ప్యార్ కా సిల్ సిలా..” అన్న రింగ్ టోన్ వినబడి.. ‘అబ్బ.. ఈ దేవకిది మంచి మ్యూజికల్ టేస్ట్’ అనుకుంది.. కాస్సేపు రింగ్ అయ్యాక “హా దీదీ బోలో” – అన్న గొంతు వినపడగానే.. హిందీలో దేవకిని పలకరించి “రేమీ ఎక్కడుంది??” అని అడిగింది మీరా.
“ఇక్కడే ఐ పాడ్‌లో ములిగి ఉంది” – అని చెప్పి రేమీకి ఫోన్ ఇచ్చింది దేవకి. “హాయ్ అమ్మన్నా.. కమింగ్ టు డే?” అని అడిగిన రేమీకి, ఫ్లైట్ రెండు గంటలు డిలే అయింది అని చెప్పింది మీరా.. “ఓహ్ అవునా.. రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది.. నువ్వు లేట్‌గా వచ్చినా, పొద్దున్న ఎయిట్ కల్లా స్కూల్లో ఉండాలి అమ్మన్నా.. మార్క్ ఇట్” అని చెప్పింది రేమీ..
“ఒకే నాన్నా ..” అంది మీరా..
“ఐ యామ్ నాట్ నాన్న.. దిస్ ఈజ్ రేమీ” – అని కాస్సేపాగి, “will you wake up? Or you want me to wake you up? How many times I told you to get up early..??” – అని నింద, నిష్ఠూరం, ఫాక్ట్ కలిపినట్టున్న స్వరంలో అడిగింది రేమీ..
“ఓకే ఓకే .. you told me world times…” అంది మీరా, తనలో తనే నవ్వుకుంటూ ..
“No.. I told you universe times..” నాటీగా నవ్వుతూ చెప్పి .. రెండు ముద్దులతో బై చెప్పింది రేమీ ..
‘దీనికీ తెలివితేటలకేం తక్కువ లేదు’ – అనుకుంది మీరా.. అబ్బా.. ఇంకా రెండు గంటలు ఎలా అబ్బా ? అని చుట్టూ చూసుకుంటూ, సర్కులర్ సీటింగ్‌కి ఉన్న గ్లాస్ పానల్‌లో తన ముఖం చూసుకుంటూ .. ఉలిక్కి పడింది మీరా. ఎంత టైర్డ్‌గా ఉన్నాను..? మగవాళ్ళకి కళ్ళ కింద కెరీ బేగ్స్, ఆడవాళ్ళకి నల్ల చారలు కార్పోరేట్ గిఫ్ట్స్ అన్న కొలీగ్ మాటలు గుర్తొచ్చి, భలే నిజం అనుకుంది. ఈ మధ్య వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ రావటం వల్ల, మరీ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది, ఇది కొంచం స్ట్రీమ్‌లైన్ చేయాలి అనుకుంటూ, బోర్‌గా చుట్టూ కలియజూసింది. బుక్ షాప్స్, సావనీర్ షాప్స్ అన్నీ ఇవే…. ఏమీ చదవబుద్ధి కావటం లేదు. లాప్టాప్ తీసి కాస్సేపు పని చేద్దామా అనుకుంది.. అది కూడా చిరాగ్గా అనిపించింది. హైదరాబాద్ అంటేనే యేవో జ్ఞాపకాలు, ఇది వొకప్పుడు హోమ్ సిటీ, ఇప్పుడు ఎంత వేగంగా వెళ్లి ఢిల్లీలో వాలదామా అని ఉంటుంది. పదేళ్ళలో ఎంత మార్పు.. హ్మ్మ్ అని నిట్టూర్చింది మీరా.
చేతులు, కాళ్ళు చూసుకుంటే.. రఫ్‌గా డ్రైగా అనిపించింది మీరాకి. మాంచి మసాజ్ లేదా మేనిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుంటేనో.. అన్న ఆలోచనతో చుట్టూ చూస్తే ‘కాయా స్కిన్ అండ్ బ్యూటీ క్లినిక్’ ఆర్టిస్టిక్ సైన్ బోర్డ్ కనబడి, ఆ చిన్న క్యూబికల్ లోకి నడిచింది, చూడానికి చిన్న కబ్బీ హోల్స్ లా కనపడే ఇలాంటి ప్లేసెస్‌లో క్వాలిటీ సర్వీసెస్ ఎలా చేస్తారో అన్న కుతూహలంతో .. డెస్క్ దగ్గరున్న అమ్మాయిని, “మీ ప్రొడక్ట్స్ హాండ్స్‌కి ఫీట్‌కి ఏమున్నాయి?” అని అడిగింది.
అక్కడున్న అందరూ వొకే యూనిఫారంలో ఉన్నారు, పింక్ అండ్ పర్పుల్, సగం బ్రాండ్స్ వాళ్ళ స్టాఫ్‌ని వాళ్ళ ప్రోడక్ట్ సీసాల్లా తయారు చేస్తారు – అనుకుంది మీరా .
డెస్క్ దగ్గరున్న అమ్మాయి.. వెంటనే ఫుల్‌గా చార్జ్ అయిన బాటరీలా మొదలెట్టింది… “మేమ్, మావి చాలా హై క్వాలిటీ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్, అంతా ట్రైనడ్ స్టాఫ్.. మాకు స్టాఫ్ అంతా ఢిల్లీ నుండి వస్తారు, అన్ని ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్.. ఫ్రూట్ పల్ప్‌తో తయారు చేస్తాము.. మీకైతే పపయా ఆక్సీ ఫేషియల్ ఇంకా మేనిక్యూర్ చాలా సూట్ అవుతుంది.. let me give you the best kaaya can offer” – అంటూ ..
మీరా ఏదో చెప్పబోయెంతలో ..
“తను పపయాకి ఎలర్జిక్.. తనకి ఆ వాసన పడదు..” – అంటూ వినిపించిన స్వరంతో ఉలికిపడిన మీరా.. ఇంచుమించు చేతిలో ఉన్న ల్యాప్టాప్ బాగ్ కిందపడిపోయి మళ్లీ తమాయించుకుంది ఎదురుగా రేవంత్…. కంపెనీ వాళ్ళు ఇచ్చిన పింక్ పర్పుల్ కలర్స్ కలగలిపి ఉన్న యూనిఫాంలో తనని అలా చూడగానే మీరాకి చాలా కొత్తగా అనిపించింది. కొత్తగా ఉన్నాడు కూడా. చాలా వరకు గ్రాండ్‌గా కలర్ వేసిన జుట్టు లైట్‌గా లిప్‌స్టిక్ వేసిన పెదాలు, నున్నగా షేవ్ చేసిన గడ్డం ఇలా కొత్తగా..
“రేవంత్…!!!” అంది మీరా…. ఆశ్చర్యంగా… “నువ్వేనా…” తను ఏదో అనబోతుంటే రేవంత్ గబగబా ఒరియాలో చెప్పాడు… “నేను తెలిసినట్టుగా ఇక్కడ బిహేవ్ చేయకు, అలా చేస్తే నన్ను నీకు మసాజ్ చేయడానికి అసైన్ చేయరు” … ఒరియా వాళ్ళిద్దరికీ మాత్రమే తెలిసిన చిన్ననాటి లాంగ్వేజ్. ఏం చేస్తోందో, తెలియకుండానే తలూపింది మీరా. రేవంత్ చకచక కౌంటర్‌లో మాట్లాడి “1500 పే చేయాలి మేడం” అని చెప్పాడు. కలలో మనిషిలా, అయోమయంగా తన కార్డుతో పే చేసింది మీరా.
“This way please..” అంటూ మీరాను వరుసగా రెండు క్యాబిన్ దాటి ఒక చిన్న క్యాబిన్ లోకి తీసుకు వెళ్ళాడు రేవంత్. అది చాలా చిన్న క్యాబిన్. ఒక ఈజీ చైర్ ఇంకా cushion తో ఉన్న ఒక స్టూల్ మాత్రమే ఉంది. “హెడ్ అండ్ ఫుట్ మసాజ్ మాత్రమే కదా మేడం…” అని అడుగుతూ, తనని కూర్చోబెట్టాడు రేవంత్.
“హెడ్ మసాజ్ చేయనా, చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. వర్క్ బాగా ఎక్కువ అయ్యిందా…” అని రేవంత్ అడగ్గానే ఒక జీవితకాల దుఃఖం కళ్ళముందు కదిలినట్లు అయింది మీరాకి.. “ఏమీ వద్దు ముందు నీతో మాట్లాడాలి” తేరుకుంటూ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తున్న మనిషిలా ఖచ్చితత్వాన్ని గొంతులో నింపుకుంటూ చెప్పింది మీరా..
“ఇక్కడ మాకు అంతా కంట్రోల్ ఉంటుంది సిసి కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఏదో ఒకటి చేయించుకోకపోతే మాకు మానిటరింగ్ ఉంటుంది” – అని చెబుతూ మీరా కాళ్లను స్ట్రెచ్ చేసి ఆమె షూస్‌ని తీసి పక్కన పెట్టాడు రేవంత్.
‘నేను మసాజ్ చేస్తూ మాట్లాడుతూ. ఉంటాను… చాలా మాట్లాడాలి మీరా’ – అన్నాడు రేవంత్
“ఏమైంది ఇంతకీ నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు… సోల్ మేట్ సుధా…” అంటూ ఆగింది మీరా..
“సుధా… నా… సుధా… చివరికి సుధాకర్ గానే మిగిలాడు… తన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ముఖ్యంగా మా రిలేషన్‌షిప్‌నీ ఎక్సేప్ట్ చేయలేని తన తల్లి ఉరి వేసుకుంటాను అంటే ఆమె కోసం తన వాళ్లు చెప్పిన అమ్మాయి మెడలో తాళి కట్టాడు రెండేళ్లయింది, ఇప్పుడు వాళ్ళకి పాపో బాబో ఎవరో ఒకరు పుట్టే ఉంటారు, నాకు చివరగా తెలిసేటప్పటికి అతని వైఫ్ ప్రెగ్నెంట్” అన్నాడు రేవంత్
తన పాదాలపై అతని చేతులు ఎంత నిశితంగా బలంగా కదులుతున్నాయా మీరా మనసులో అలజడి అంత అనిశ్చితంగా ఉంది…
పాదాలకి క్రీమ్ రాస్తూ చెప్తున్నాడు రేవంత్. సినిమాలోనో మరి ఎక్కడో చదివిన కధ లాంటి రేవంత్ జీవితాన్ని శ్రద్ధగా వింటోంది మీరా
“చాలా జీవితం చూసాను మీరా.. ప్రేమ, నేను అనుకొనే జీవితం అనుభవించటం, నా సహజమైన సెక్సువల్ ఓరియంటేషన్‌తో నేను బ్రతకాలి అనుకోవటం అనేది నాకు శ్వాస తీసుకున్నంత సహజంగా అనిపించింది. నేను వొక ఫ్రెండ్‌గా నీతో మెలిగాను, రేమీ ద్వారా మనమధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది అనుకున్నాను, అది వొక భరించలేని బర్డెన్ లాగా అనిపించేది. సుధా పరిచయం తర్వాత, టీనేజ్ ప్రేమని అనుభవించే వ్యక్తిలా తయారయాను నేను. ఈ సమాజం ఆంక్షలు అనే వాటికి దూరంగా వెళ్ళిపోదాం అనుకొనేవాళ్ళం. ఆ ధైర్యం తోనే నీతో నేను విడిపోయాను. సుధా నేనూ కలిసి బ్రతికాం ..ఒక సంవత్సరం.. జీవితంలో ఇప్పటికీ నేను ప్రేమని సంపూర్ణంగా అనుభవించిన క్షణాలవి. ఆఫీసుకి దూరంగా ఇల్లు తీసుకున్నాం. సుధా వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. మా రంగురంగుల ఇంద్ర ధనుస్సు లాంటి ప్రేమలో, సుధా నెమ్మది నెమ్మదిగా వొత్తిడికి గురి అవటం, ఆందోళన నేను గమనించలేకపోయాను. ఫలితం.. పదేళ్ళ క్రితం నేను నీకు చెప్పిన మాటలు, సుధా ద్వారా నేను విన్నాను. ప్రేమించే మనిషి రిజక్షన్ ఎలా ఉంటుందో.. చాలా సున్నితస్తుడిని అనుకుంటూ నీ మనసుని ఎంత గాయపరిచానో నాకు అర్థం అయింది. సుధా వెళ్ళిపోయాడు, మర్యాదస్తుల ప్రపంచంలోకి. తెగిన గాలిపటంలా అయ్యాను నేను. ఉద్యోగం మానేసాను. ఆఫీసులో కూడా నా గురించి తెలిసి, నోటితో నవ్వి నొసలుతో వెక్కిరించే వ్యక్తులు ఎక్కువయ్యారు. ఉండాలని అనిపించలేదు. చిన్న, చిన్న ఉద్యోగాలు, కొన్నాళ్ళు హిజ్రా/థర్డ్ జెండర్ అనే గ్రూపులలో.. అన్ని చోట్లా ‘ప్రేమ’ అనే పదం చుట్టూ రాజకీయాలు, అస్తిత్వ పోరాటాలు..” – బయట కేబిన్ డోర్ తట్టినట్టు అయి ఆపాడు రేవంత్.
“హేవ్ యు ఫినిష్డ్? ఫైవ్ మోర్ మినిట్స్” – అన్న స్వరం వినిపించి, “ఎస్, ఆల్మోస్ట్” అని సమాధానం చెప్పాడు రేవంత్.
సమయం వృథా అవటం ఇష్టం లేని అసహనంతో మీరా అడిగింది – “నన్ను కాంటాక్ట్ చేయాలని అనిపించలేదా?”
పాదాల్ని టవల్‌తో తుడుస్తూ చెప్పాడు రేవంత్ .. “అనిపించింది మీరా.. చాలా సార్లు, రేమీ గుర్తొచ్చి ఏడవని రోజు లేదు. నిన్ను చూడాలని, నీతో ఎప్పటిలా మాట్లాడాలని చాలా సార్లు అనిపించేది. మన పాత నంబర్స్ అన్నీ మారిపోయాయి. ఒకసారి మీ ఫాదర్‌కి ఫోన్ చేసి, తలవాచేలా చీవాట్లు తిన్నాను. సారాంశం నువ్వు హైదరాబాద్‌లో లేవని అర్థం అయింది. నన్ను పెంచిన అమ్మావాళ్ళు ఎప్పుడో నాకు పిండం పెట్టారని విన్నాను ఆండాళ్ అమ్మ ద్వారా.. హ్మ్మ్ – వేరే అమ్మాయితో వెళ్ళిపోయి నిన్ను వదిలేసానని అనుకుంటున్నారు అని తెలిసినప్పుడు, నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు… కాస్సేపు రిలీఫ్ అనిపించింది కూడా, నిజం తట్టుకునే స్థితిలో వాళ్ళూ లేరు, వాళ్లకి నిజం చెప్పే ధైర్యంలో నేనూ లేను..!! ఒకే ఒక్కసారి, మన పాత అపార్ట్‌మెంట్ దగ్గరకి వచ్చాను. నువ్వు వేరే జాబ్‌లో మూవ్ అయ్యావని చెప్పారు. మీ పేరెంట్స్‌కి ఫోన్ చేసే ధైర్యం నాకు లేదు.”
హ్మ్మ్… – వింటూ సాలోచనగా అన్నది మీరా – “ఎలా ఉన్నావు ఇన్నేళ్ళు? జాబ్ చేసావా? ఇంజినీరింగ్ చదువుకొని, ఈ పని..” సగంలో ఆగింది మీరా ..
బిట్టర్‌గా నవ్వాడు రేవంత్ .. “ఒక మనిషి ముసుగులు వేసుకున్నంత వరకూ.. అందరూ ముసుగుని ప్రేమిస్తారు, ఓన్ చేసుకుంటారు.. ఎప్పుడైతే ముసుగు తీసి, నిజంగా బ్రతుకుదాం అనుకుంటే.. ఫేక్‌నెస్ మాత్రమే అలవాటైన వాళ్ళు.. నిజాన్ని భరించలేరు. చాలా చోట్ల చేసాను ఉద్యోగాలు.. నేను ‘గే’ అన్న పదం స్ప్రెడ్ అవగానే.. సడన్‌గా మేనేజ్మెంట్ ఆలోచనల్లో మార్పు వచ్చేది. నేను టీం ప్లేయర్‌ని కాను అనో, మరేదో.. ఒకవేళ మేనేజ్మెంట్ బావున్న ప్లేసెస్‌లో, కొలీగ్స్‌తో చాలా ఫేస్ చేశాను. చెప్తే అదో పెద్ద కథ.. నా ఐడెంటిటీ నాకు కులంలా మారింది. కుల మతాల్లాగే ఇలాంటి ఐడెంటిటీ గ్రూపుల్లో కూడా రాజకీయాలు, అహాలు, ఫైనాన్షియల్ గొడవలు.. ఇవన్నీ భరించలేక పోయాను. మధ్యలో కొన్ని బంధాలు, ఏవీ నిలవలేదు. వొంటరితనం..” – బజ్జర్ శబ్దానికి ఆగాడు రేవంత్..
“నీ మసాజ్ టైం అయిపొయింది” – పదేళ్ళ దూరాన్ని కోలుస్తున్నట్టు చెప్పాడు రేవంత్
“రేవంత్… నా ఫ్లైట్‌కి ఇంకో గంట టైం ఉంది.. నేను లాంజ్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు పర్మిషన్ తీసుకొని త్వరగా .. రా .. నీతో మాట్లాడాలి ..” ఆదేశిస్తున్నట్టు చెప్పింది మీరా.
తమాషాగా నవ్వాడు రేవంత్ – “చాలా ఏళ్ళు అయింది, నీ డిమాండ్స్ విని..” – క్షణ కాల నిశ్శబ్దం తర్వాత, – “వస్తాను” అన్నాడు.
లాంజ్‌లో కూర్చొని, ఆలోచనల్లో ఎంత టైం అయిందో మీరా చూసుకొనే లేదు, భుజం మీద సున్నితంగా ఎవరో పాట్ చేసినట్టయితే ఉలిక్కిపడి తిరిగింది మీరా.. ఎదురుగా రేవంత్.. యూనిఫారం లేకుండా.. కొంతవరకూ తనకు తెలిసిన రేవంత్‌లా.
“కూర్చో రేవంత్, కాఫీ తెచ్చుకుందామా??” – అటూ ఇటూ హడావిడిగా కాఫీ కౌంటర్ కోసం చూస్తూ అడిగింది మీరా.. మౌనంగా తన చేతిలో పొగలు కక్కుతున్న ఎక్స్‌ప్రెస్సో కాఫీ ఉంది.. ఇంకో చేతిలో గ్రీన్ టీ చూసి, ఆశ్చర్యంగా చూసింది మీరా.. “కాఫీ నీకో ఎడిక్షన్ కదా.. ఎడిక్షన్స్ విషయంలో మార్పు వచ్చి ఉండదని తెచ్చాను” – అన్నాడు రేవంత్.. గలగలా నవ్వుతూ, “ అస్సలు మార్పు లేదు ఈ విషయంలో.. వర్క్ స్ట్రెస్‌తో ఇంకా ఎక్కువైంది ..” అంది. చుట్టూ ఎయిర్‌పోర్ట్ నిశ్శబ్దం వాళ్ళిద్దరి మధ్యా.. ఒకేలా కంపించే కలవని రైలు పట్టాల్లా..!!
ఆలోచనల్నీ, అనుభవాల్నీ, సంవత్సరాల్నీ పక్కకు నెట్టేస్తూ చెప్పింది మీరా.. “నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు నేను చెప్పేది విను”
నవ్వాడు రేవంత్- “నువ్వేం మారలేదు మీరా .. చెప్పు..!!”
“హ్మ్మ్.. నువ్వు వెళ్ళిపోయాక, మొదటిసారి నాకు వొంటరితనం, ఇన్సెక్యూరిటీ పరిచయం అయ్యాయి. పెళ్లి, రేమీ, కెరీర్ అంటూ పరుగులెత్తిన నా జీవితం, ఒక్కసారి క్రీచ్ మంటూ సడన్ బ్రేక్ పడినట్టు అయింది. అమ్మ, నాన్న వచ్చారు, కనిపెట్టుకొని ఉన్నారు. ఆఫీసులో అందరికీ తెలిసిపోయింది. సిక్ అయ్యాను. ఏదో ఆటో ఇమ్యూన్ ప్రోబ్లం అన్నారు డాక్టర్లు.. నేను నిన్ను ప్రేమించలేక పోయానా? అందుకే నువ్వు వెళ్ళిపోయావా అని గంటల తరబడి ఆలోచించేదాన్ని. దగ్గరవాళ్ళు మొదట ‘కొంగున కట్టేసుకోలేక పోయావు’ – అంటూ నాకు కౌన్సెలింగ్ ఇచ్చేవాళ్ళు, విషయం తెలియగానే, నిన్ను బూతులు తిట్టేవాళ్ళు.. రెండూ భరించలేక పోయేదాన్ని. నాకేమీ అర్థం అయ్యేది కాదు.. నువ్వు ప్రేమా? అవసరమా? రేమీ తండ్రి అనే గౌరవమా? లేదా నన్నిలా వదిలేసావు అనే అసహ్యమా? – ఏదీ అర్థం అయ్యేది కాదు. నీమీద చాలా కోపం వచ్చేది. నా జీవితం నాశనం చేసావు అనుకోనేదాన్ని. నా ఫ్రెండ్స్ జీవితంతో కంపేర్ చేసుకోనేదాన్ని. ఏదీ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఉద్యోగానికి రిజైన్ చేశాను. ఎక్సేప్ట్ చేసారో లేదో కూడా పట్టించుకోలేదు.. ఎప్పుడూ డిప్రెషన్‌లో , నా ధ్యాసలో నేను ఉండేదాన్ని. అమ్మ, నాన్న నాతో చాలా కాలం ఉన్నారు. ఏదో పని ఉంది, ఒక వీక్ వాళ్ళు వూరు వెళ్తే.. వొకరోజు మూడేళ్ళ రేమీ ఆకలేసి.. తనకి అందని వస్తువులు అందుకోవటానికి ప్రయత్నిస్తూ పడిపోతూ, ఒక బిస్కెట్ పాకెట్ తీసుకొని తినటం చూసాను. నా మీద నాకే సిగ్గు, అసహ్యం వేసింది. నా జీవితాన్ని నీ నిర్ణయంతో ముడిపెట్టి, నా బాధ్యతల నుండి నేను తప్పుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. తర్వాత, జాబ్‌లో అక్కడ కంటిన్యూ అవ్వలేకపోయాను. మార్పు కావాలి అనిపించి, రేమీని తీసుకొని డిల్లీ వచ్చేసాను. కల్చరల్‌గా ఎవరూ ఎవర్నీ పట్టించుకోని ఈ వాతావరణం నాకు నచ్చింది. ఐదేళ్ళు రేమీని పెంచటంలో నరకం చూసాను. నాకేమీ తెలీదు, అని నాకు డైలీ బేసిస్ మీద తెలిసిన రోజులవి. తన ఫీడింగ్, స్కూల్, సింగిల్ పేరెంట్‌గా అవన్నీ చూసుకుంటూ, జాబ్ చేయటం.. మళ్ళీ పెళ్లి చేసుకోమ్మని అమ్మ, నాన్న వత్తిడి..!! ..అవైలబుల్ అని ఆఫీసులో కొలీగ్స్, వీటన్నిటి మధ్య, దూసుకొని వెళ్ళినట్లు కెరీర్ మీదే ధ్యాస పెట్టాను. మధ్యలో డేటింగ్ అంటూ, మేచ్ మేకింగ్ ప్రపోజల్స్, కొన్ని ఆఫీసు దగ్గరితనాలు, ఏవీ నాకు రేమీ కంటే ముఖ్యమైనవి అనిపించలేదు. ఎక్కువ టైం రేమీ నీ గురించి గురించి, తానేదో అన్యాయం అయ్యాను అన్నట్లు ఫీల్ అవకుండా, మంచి కేర్‌టేకర్ అమ్మాయిని పెట్టాను. దానికి తోడు, నా ఫ్రెండ్స్, డిజేబిలిటీతో ఉండి పిల్లల్ని పెంచుతున్నవాళ్ళు, ఎంతోమంది సింగిల్ ప్రొఫెషనల్ వుమన్ అండ్ మెన్ నాకు వొక బలమైన సర్కిల్‌లా తయారు అయారు. ఉద్యోగం, రేమీ నా రెండు కళ్ళు అయ్యాయి. రేమీకి గత సంవత్సరమే నీ గురించి చెప్పాను. కేవలం ఫాక్ట్స్ చెప్పాను. నిన్ను నిందించకుండా చెప్పటానికి నాకు ఈ టైం పట్టింది…”
వింటున్న రేవంత్ కళ్ళల్లో నీళ్ళు .. “ఏమంది??” –
నిట్టూరుస్తూ చెప్పింది మీరా- “రెండు రోజులు మౌనంగా ఉంది. అప్పటికి దానికి పన్నెండేళ్ళు. ఇంటర్నెట్‌లో విపరీతంగా ‘గే’ కమ్యూనిటీ మీద, వాళ్ళ బంధాల మీద, హక్కుల మీద రీసెర్చ్ చేసింది… అలాంటి కమ్యూనిటీలలో క్రైం ఉంటుందని చదివి ఆందోళన పడింది. “తనకి తెలీదా? నీకు ముందే ఎందుకు చెప్పలేదు??” ఇలాంటి ఆక్రోశం కొన్నాళ్ళు నడిచింది. తర్వాత సమాధానపడిందేమో.. మా ఫ్రెండ్స్‌లో ఇద్దరు ‘గే’ అబ్బాయిలు వొక బిడ్డని లీగల్‌గా దత్తత తీసుకొని పెంచుతున్నారు. వాళ్ళని బోల్డు ప్రశ్నలు వేసింది. ఇప్పటికీ నాన్న అంటే.. ఐ అమ్ నాట్ నాన్న .. ఐ యాం రేమీ అంటుంది.. మళ్ళీ నా పేరులో ఉన్న ‘రే’ నాన్న పేరనా?? అని అడుగుతుంది…” ఆయాసపడుతున్నట్లు ఆగింది మీరా .
“సారీ.. మీరా .. నేను నిన్ను రేమీని.. చాలా..!”- అంటున్న రేవంత్‌ని మధ్యలోనే ఆపేసింది మీరా..
“చిన్నూ.. నాకు ఫైనల్ బోర్డింగ్ కాల్ వచ్చేసింది. ఒక్కమాట.. మన మధ్య బంధానికి పేరు ఉండాల్సిన స్టేజ్ నువ్వు నేనూ కూడా దాటిపోయాం అనుకుంటున్నాను. నువ్వు వెనక్కి మా దగ్గరకి వచ్చేయి..” చెప్పింది మీరా..
“కానీ.. మీరా..” – విహ్వలంగా అన్నాడు రేవంత్..
రేవంత్ చేతిని తన రెండు చేతులతో పట్టుకొని చెప్పింది మీరా.. “చిన్నూ… నువ్వు రేమీ తండ్రివి.. నాకు మంచి ఫ్రెండ్‌వి.. నీ నిర్ణయాలు, సెక్సువల్ ఓరియంటేషన్ మార్చుకొని, నాకు భర్తగా ఉండమని నేను అడగటం లేదు.. అలా ఉన్నా, మనసు లేని బంధాన్ని నేను భరించలేను కూడా.. కానీ, ఇప్పుడు నీకు వొక భద్ర జీవితం అవసరం…. రేపు రేమీకి తన తండ్రి పిరికివాడిలా జీవితం నుండి పారిపోయాడు అని అనుకోకూడదు.. వచ్చేయి.. నేను డిల్లీ వెళ్లేసరికి ఇంకో రెండు గంటలు పడుతుంది. దిగాక, లగేజ్ తీసుకున్నాక ఫోన్ ఆన్ చేస్తాను. ఇది నా మొబైల్ నంబర్…” అంటూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చింది మీరా.. దూరంగా లాస్ట్ బోర్డింగ్ కాల్ వినపడుతోంది.
రేవంత్‌ని ఆప్యాయంగా కావిలించుకుంది మీరా.. “హ.. అన్నట్టు, మాకు ఎక్స్‌ట్రా బెడ్ రూమ్ ఉంది.. ఇంట్లో ఉండేది ముగ్గురూ ఆడవాళ్లే.. నువ్వు పూర్తి సేఫ్..” అని చిలిపిగా నవ్వుతూ పరిగెత్తింది మీరా..
శిలలా నిలబడిన రేవంత్‌ని వదిలేసి..!!
ముగింపు:
సగం పైగా రాంగ్ కరూసల్ మీద ఉన్న తన లగేజ్‌ని, దెబ్బలాడి తెచ్చుకొని.. కంపెనీ కార్‌లో కూర్చొనేసరికి.. డ్రైవర్ మంచి నీళ్ళ బాటిల్ ఇచ్చాడు మీరాకి.. “థేంక్ యు భయ్యా..” అంది. వర్షం పడినట్లు నేలంతా చిత్తడిగా ఉంది. ఈ డిల్లీ అంతా అతి అనుకుంది మీరా..
“క్యా మేడమ్.. ఏక్ ఘంటా హోగయా.. పార్కింగ్ కో డబుల్ చలాన్ లగేగా” – అన్నాడు డ్రైవర్.
ఫోన్ ఆన్ చేయలేదని చప్పున గుర్తొచ్చింది మీరాకి.. ‘ఓహ్ నో..’ అనుకుంటూ ఆన్ చేసింది. తెలియని నంబర్ నుండి ఐదు మిస్డ్ కాల్స్ ఉన్నాయి.
కార్ వెళ్తూ ఉంది.. మీరా డయల్ చేసింది. రింగ్ అవుతూనే ఉంది, ఎవరూ తీయలేదు.. ఫోన్ పెట్టేసి మీరా నిస్సత్తువగా వెనక్కి జారబడేటంతలో, ఫోన్ మళ్ళీ మోగింది.
చప్పున ఫోన్ లిఫ్ట్ చేసి, ‘చిన్నూ’ .. అంది మీరా ..
“వస్తాను మీరా.. పేరు పెట్టలేకపోయినా, నాకున్న బంధం నువ్వు, రేమీ .. నేను ఎప్పుడొస్తున్నానో నీకు మెసేజ్ చేస్తాను.. ఇక్కడ చిన్న చిన్న ముగింపులు హుందాగా చేసేసి వస్తాను, నాన్న పిరికివాడు కాదు.. అని రేమీకి చెప్తావు కదూ..” – వొక చిన్న నిశ్శబ్దం తర్వాత, ఫోన్ డిస్కనెక్ట్ అయింది.
రేవంత్‌కి రూమ్ రెడీ చేయాలని, రేమీతో మాట్లాడాలని వెంటనే దేవకికి కాల్ చేసింది మీరా. అట్నుంచి “ఏ ములాకాత్ ఏక్ బహానా హై.. .ప్యార్ కా సిల్ సిలా పురానా హై..” అని వినబడుతూనే ఉంది.
తెరిచిన కార్ విండోల నుంచి, తడి గాలి మీరా చెంపల్ని తాకుతోంది. సందిగ్ధత వర్ధంలా వెలిసిన తర్వాత, భిన్న ప్రపంచాల ఇంద్రధనుస్సు గర్వంగా,రంగురంగులుగా మెరుస్తోంది.