[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘ఏడు చేపలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]నగనగా ఒక ఊరికి ఒక రాజు గారు
ఆయనకు ఉన్నది ఒకడే కొడుకు
రాజు గారి కొడుకు వేటకు వెళ్ళాడు
ఊరి చెరువులోని చేపల వేటకు
రాజు గారి కొడుకు చేపలు పడతాడా..?
పట్టాలి తప్పదు పట్టాభిషేకానికి
చెరువులో ఉచితాల వల విసిరాడు
అమాయక చేపలు అమాంతంగా పడ్డాయి
ఏడు చేపలు ఎగిరి పడ్డాయి
ఉచితాల వలలో ఉచితంగా పడ్డాయి
ఎండలో పెట్టి ఎండగట్టాడు
బండ మీద రుద్ది పొలుసు తీసాడు
కోటకు తీసుకెళ్ళి పులుసు చేసాడు
చేపల ఉసురు పులుసు అయ్యింది
ఏనాటిదో ఆ ఏడు చేపల కథ
రాజులు రాజ్యాలు పోయినా
చేపల చపల బుద్ధి పోలేదు
ఉచితం అంటే చాలు ఉరుకుతాయి
నీతి కథలు ఎన్ని చదువుకున్నా
అవినీతి నాయకుల ఆశల వలలో
వచ్చి పడతాయి రాజు గారికి
విందు భోజనమవుతాయి