[dropcap]సా[/dropcap]ధారణంగా అనువాద కథలంటే ఒక భాషనుండి మరొక భాషకు అనువదించడం. కానీ ఈ “ఏడుగంటల వార్తలు” పుస్తకంలో అనువాద కథలంటే వేరే వేరే విదేశీభాషల్లోని కథల ఇంగ్లీషు అనువాదాలను చదివి, వాటిని తెలుగులోకి తర్జుమా చెయ్యడం జరిగింది. అసలు ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి అనువదించడమే కష్టం. ఎందుకంటే అలా అనువదిస్తున్నప్పుడు మూలకథలోని భావం చెడకుండా, ఆ కథ జరిగే సామాజిక సంస్కృతి అర్ధమయేలా వేరొక సమాజానికి తెలియచెప్పడమంటే సామాన్యమైన విషయం కాదు.
అటువంటిది అరబిక్, పోర్చుగీస్, పశ్తో, నేపాలీ, పర్షియన్, కజక్ వంటి భాషల్లోని కథల ఆంగ్లానువాదాలను చదివి, ఆ మూలకథలోని భావాన్ని అర్థం చేసుకుని, తేటతెల్లంగా తెలుగువారికి అందచెయ్యడమంటే అది ఒక యజ్ఞంతో సమానం. అటువంటి అక్షరయజ్ఞాన్ని కొల్లూరి సోమశంకర్ ఈ పుస్తకంలో దిగ్విజయంగా పూర్తిచేసారు.
ఈ పుస్తకంలో వున్న 14 కథలలోనూ ఇంగ్లీషుభాషలో కథలు ఎనిమిదుంటే మిగిలిన ఆరుకథలూ వేరే వేరే భాషల్లోనివే. ఇంగ్లీషు కథల్లో కూడా కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అమెరికా దేశాల వంటి వేర్వేరు దేశాలకు సంబంధించిన కథలు. ఇటువంటి వైవిధ్యభరితమైన సమాజాలలో కూడా మనుషులందరిని కలిపే ఏకైక సూత్రం వారిలోని హృదయస్పందన. ఏ దేశం వాడైనా, ఏ భాష మాట్లాడినా, ఏ రంగైనా అందరూ మనుషులే. ఎలాగైతే ఆకలీ, నిద్రా మనిషికి భౌతికావసరాలో అలాగే ప్రతివారిలోనూ హృదయస్పందన వుంటుంది. అటువంటి సార్వజనీనత కలిగిన హృదయస్పందనను నేపథ్యంగా వున్న కథలను అనువాదానికి ఎన్నుకుని సోమశంకర్ గారు మంచి పాఠకులను సంపాదించుకున్నారు.
ఒకరిమీద ఇంకొకరు ఆధిపత్యం చలాయించడంకోసం ఈ భూమ్మీద చాలా యుధ్ధాలు జరిగాయి. వాటి ప్రభావం కేవలం యుధ్ధంలో సైనికులమీదే కాకుండా ఆ దేశాలలోని ప్రజలమీద కూడా పడుతుంది. అటువంటి యుధ్ధవాతావరణంలో, ఆ యుధ్ధాలు జరిగినప్పుడు అక్కడి మనుషుల్లో మానవత్వం, భయం, కరుణ ఎలా వుంటాయో తెలియచెప్పే కథలు ఈ కథలు.
ఒక్కొక్క కథ చదువుతుంటే ఒక్కొక్క భావోద్వేగం మనలని ఊపేస్తుంది. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. గుండె గొంతుకలో పట్టుకుపోతుంది. మనసు నీరవుతుంది. కళ్ళు చెమ్మగిల్లుతాయి. కథ పూర్తయాక కాసేపటివరకూ మనలను ఆ భావోద్వేగంలోంచి బయటపడనీయదు. అందుకే ఇవన్నీ మంచి కథలయ్యాయి.
ఆలోచించడానికి ఇష్టపడే పాఠకులు తప్పక చదవవలసిన పుస్తకం ఈ “ఏడుగంటల వార్తలు..”
114 పేజీలున్న ఈ పుస్తకం వెల విలువ కట్టలేనిదే. అయినా అందరికీ అందేలా కేవలం 120 రూపాయిలకే అందచేస్తున్నారు సోమశంకర్ గారు.
***
ఏడు గంటల వార్తలు
(మరికొన్ని విదేశీ కథలు)
కొల్లూరి సోమ శంకర్
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్
విశాలాంధ్ర బుక్ హౌజ్, విజయవాడ, ఇతర శాఖలు,
సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643
అమెజాన్ నుంచి తెప్పించుకోడానికి లింక్:
https://www.amazon.in/dp/B081VLKPQG/