ఏడు గుర్రాల రౌతు!!

0
2

[dropcap]అం[/dropcap]జలిదె మింటి దీపమ!నీ వెలుగుండ,దేవ
కంజనాథ, యగుపడు నన్ని అద్దమై,స్పష్టమై!
సంజ, ఆ ముక్కంటి యాటతో నీవిలు మరలెదొ
వింజమాకిడినట్లౌ,మాయెడ,మిత్ర,భానుమూర్తీ!
***
వీస మలయని దివ్వెవై నీవుంట మా పున్నెమే
పసరు టాకులు, హరిత సిరి కళలై వెల్గి
పసితనంపు మొగ్గలు,విరి బాలలై విరిసి
సస్యంపు పైడి,ప్రజల అన్నార్తి కౌషధికాగ!
***
కణకణల రగిలి మాకై, నీవు మండి మండీ
అణువణువు లవణముల నీరు తోడి తోడీ
పెను మొయిలు ధారలతో ధర కిచ్చి యిచ్చీ!
నిను నేమందు నౌర! ప్రత్యక్ష నారాయణా!
***
ముసురు పట్టీ,మబ్బులురిమీ,నింగి మంకుదైతే
మసక తెరచాటై నీవు మునిగిపోతే,యెద
ఊసురంటూ చింత రేపునుర,వెల్గు యాగాధ్వర్య!
నీ సముఖమునకై కనులు కాయలౌర,సూర్యా!!
***
మిన్నేటి వేవేల రేకుల కాంతిపద్మము నీవు
పన్నీటి జాబిలి చలువ వెన్నెల దాత వీవే
అన్నింటి కాధారమైన మా జీవన సారధివే
నిన్నెంత పొగడిన చిరు దీపికయె ద్యుమణీ!!
***
తుహినముల కరగించు లోకబాంధవ,ప్రభో,
అహరహము కంటి కగుపించు దైవరూపమ
అహమహమను ఘన శైత్య తమముల బాపి
దహరముల దయ దీపింపర, ధీ భాస్కరమై !!
***
ఏడు వాజుల యేక చక్ర రథమట, సారధి
వాడర్ధ దేహుడు,మార్గమ నిరాలంబము,అర్క!
ఱేడవై వెలిగి వసుంధర గాతు వనిశము
వాడదే శుష్కమై జగజ్జీవనాబ్ధి, నీవు వినా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here