కాజాల్లాంటి బాజాలు-94: ఎదురుచూపులు

1
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]దే[/dropcap]నికోసమైనా లేదా ఎవరికోసమైనా ఎదురుచూడడమన్నది ఒక గొప్ప అనుభవం.

ఇదివరకు ఇష్టమైనవారి దగ్గరినుంచి వచ్చే ఉత్తరాన్ని అందుకుందుకు పోస్ట్‌మేన్ కోసం ఎదురుచూసే ఘట్టాన్ని రచయితలు ఎంతో అందంగా వర్ణించేవారు. అలాగే ఇష్టమైనవారు వచ్చేవరకూ వారికోసం ద్వారం దగ్గర తచ్చాటలాడడం కూడా అంతే అందంగా చెప్పేవారు.

కాలక్రమేణా మనుషులలో రసాస్వాదన తగ్గి, లౌకిక విషయాల మీదకి దృష్టి ఎక్కువవడంతో ఉద్యోగులు ఫస్ట్ తారీకు కోసం ఎదురుచూడడం, వ్యాపారస్తులు లాభాలకోసం ఎదురుచూడడం మొదలయింది.

అందులో భాగమే ఇంటి ఇల్లాళ్ళు తెల్లారుతూనే తనకి ఇంట్లో సహాయాని కొచ్చే మనిషి కోసం ఎదురుచూడడం. ఆమెని చూడగానే ఆ ఇల్లాలికి ఎంత రిలీఫో..

కానీ ఇవాళ నేను ఎదురుచూసేది మరొకరికోసం..సరిగ్గా చెప్పాలంటే ఇద్దరికోసం ఎదురుచూస్తున్నాను. ఎవరు ముందొస్తారో వాళ్లకి ఒక బహుమతి కూడా గిఫ్ట్ పేక్ చేసి ఎదురుగా అందుబాట్లో ఉంచుకున్నాను. అంత గిఫ్ట్ కూడా రెడీగా పెట్టుకుని ఎదురుచూడవలసిన వాళ్ళెవరంటారా…. అవధరించండి.

ఈ మధ్య కొన్నాళ్లనుంచి మా వంటింట్లో సింక్ దగ్గర ఉండే కుళాయి(నల్లా, టాప్) గారాలు పోవడం మొదలెట్టింది. పిడి(నాబ్) తిప్పితే పూర్తిగా కట్టుబడకుండా చుక్కలు రాల్చడం మొదలెట్టింది. ఒక్కో చుక్కా కలిస్తే సంద్రమౌతుందనే విషయం గుర్తొచ్చింది. దానికితోడు టీవీల్లో అప్పుడప్పుడు కొందరు పెద్దలు చెప్పే విషయాల్లో మరో విషయం గుర్తొచ్చింది. ఇంట్లో కుళాయిలో నీళ్ళు కారిపోతుంటే వెంటనే దాన్ని బాగుచేసుకోకపోతే ఇంట్లోంచి లక్ష్మీదేవి ఆ నీళ్ళలాగే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందని. ఇంక రాత్రుళ్ళు లక్ష్మీదేవి చేతిలో బంగారుకాసులున్న వెండిబిందె పట్టుకుని దీనంగా నావైపు చూస్తూ అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఒకటే కలలు.

ఇంకిలా లాభంలేదని నాకు నేను ధైర్యం తెచ్చుకుని కుళాయిని గట్టిగా కట్టడానికి ప్రయత్నిస్తే అస్సలు లొంగలేదు. నేను దానిని కాస్త బతిమాలి ఆ నాబ్‌ని కాస్త ముందుకీ వెనక్కీ తిప్పి, ఒక్కసారి కట్టేసేను. హాశ్చర్యం.. చక్కగా ఒక్క చుక్కకూడా నీరు కారకుండా కట్టుబడిపోయింది. భలే సంతోషపడిపోయేను.

నా తెలివికి నన్ను నేనే మెచ్చేసుకున్నన్ని రోజులైనా పట్టకుండా రెండురోజులకే మళ్ళీ కారడం మొదలైంది. ఇప్పుడుకూడా మొన్నట్లాగే ప్రయత్నించేను. ఊహు..అబ్బే.. లొంగలేదు. ఈసారి ఆ టాప్‌ని ఇంకొంచెం బతిమాలి పిడిమీద నెమ్మదిగా చేత్తో తట్టేను. భలేగా కట్టుబడిపోయింది.

హమ్మయ్య అనుకునేలోగానే మళ్ళీ రెండ్రోజులకి మళ్ళీ నీరు కట్టడం ఆగిపోయింది. ఈసారి దాన్ని విసుక్కుంటూ పిడిమీద కాస్త గట్టిగా కొట్టేను. దెబ్బకి దెయ్యం జడిసినట్టు టక్కున కట్టుబడిపోయింది.

అప్పుడర్థమయింది.. ఓహో.. దీనిని బతిమాలడం కాదూ. నాలుగు తగల్నివ్వాలీ అనుకున్నాను. అదేవిటో ఇంకో రెండ్రోజులకి అది కూడా ఫలించకుండా మళ్ళీ కారడం మొదలయింది. ఈసారి దాన్నే కాదు నన్ను కూడా విసుక్కుంటూ అమాందస్తా గూటంతో పిడిమీద నెమ్మదిగా ఒక్కటిచ్చేను. టక్కున కట్టుబడింది.

ఈ లోపల నేనేమీ ఉట్టినే కూర్చోలేదండోయ్.. ప్లంబర్‌కి ఫోన్ చేసేను. ఇదిగో వచ్చేస్తున్నానని పదిరోజుల్నించి అంటున్నాడు. మామూలు రోజుల్లోనే ఇదిగో అంటే పదిరోజులు తీసుకునే ఈ టెక్నికల్ మనుషులు ఇలాంటి కష్టసమయాల్లో మరీ నల్లపూసలైపోతారు. రోజూ ప్లంబర్‌కి ఫోన్ చెయ్యడం, ఈ కుళాయి పిడిమీద అంచెలంచెలుగా దెబ్బలు పెంచడం జరుగుతోంది.

ఇలా ఎన్నాళ్లని చేస్తాను.. రానురాను రంధ్రం పెద్దదైనట్టు ఈ పిడికి దెబ్బలు కూడా బాగా ఎక్కువగా తగలాలని అర్థమైంది. అమాందస్తా గూటంతో ఈ రెండ్రోజుల్నించీ దెబ్బ గట్టిగానే తగిలిస్తున్నాను. కానీ ఇంకో రెండ్రోజులకి ఆ గూటం దెబ్బ కూడా సరిపోదేమోననే అనుమానమొచ్చింది.

ప్లంబర్ ఎప్పుడొస్తాడో తెలీదు. ఇంత గట్టిగా కొడుతున్న గూటం దెబ్బ ఎన్నిరోజులదాకా పనిచేస్తుందో తెలీదు. అది పని చెయ్యకపోతే దానికన్నా బలమైనది పిడిని కొట్టడానికి ఏముందా అని ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది రోకలిబండ. అవును రోకలిబండతో కొడితే గూటం కన్న బలంగా తగులుతుంది అనుకుంటూనే మళ్ళి నీరసపడిపోయేను. ఎందుకంటే ఈ మిక్సీలు వచ్చేక రోటిపచ్చళ్ళే చెయ్యటంలేదు. రోటిపచ్చళ్ళు లేనప్పుడు రోకలిబండలు ఎక్కడుంటాయ్.. మా ఇంట్లో కూడా లేవు. చటుక్కున బైటకెళ్ళి రోడ్డు పక్కన అమ్ముతున్నవి కొని తెచ్చుకుందామంటే ఇదివరకు రోజులు కావాయె..

ఇప్పుడెలా..

నేనేం ఊరుకునేదాన్నా.. వెంఠనే ఆన్‌లైన్‌లో రోకలిబండకి ఆర్డర్ పెట్టేద్దామని రెడీ అయిపోయేను.. హతవిధీ… అక్కడ రోకలిబండలు ఔట్ ఆఫ్ స్టాక్ అంటూ కనపడింది. రోకలిబండలకి ఇంత డిమాండా… నాతోటివాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట అనుకుంటూ స్టాక్ రాగానే చెప్పమని మెసేజ్ పెట్టేను.

దానికి రెండ్రోజుల తర్వాత స్టాక్ వచ్చిందనీ, తొందరలో పంపుతామనీ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చి కూడా రెండ్రోజులైంది. నేనిక్కణ్ణించి ఎప్పుడు పంపుతారని మెసేజ్‌లు కొడుతూనే ఉన్నాను. అట్నించి జవాబు లేదు.

ఇప్పుడు రోజూ నాకిదే పని. పొద్దున్నే పనవగానే ప్లంబర్‌కి ఫోన్ చెయ్యడం, వెబ్‌సైట్‌కి మెసేజ్ పెట్టడం.. ఎట్నించీ జవాబు లేదు.

నాకప్పుడనిపించింది. మనం ఏదైనా వాళ్లకి బహుమతిగా ఇస్తే దానికోసమైనా వాళ్ళు తొందరగా వస్తారేమోనని. అందుకే ఫోన్‌లో ప్లంబర్‌కీ, ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ వాళ్లకీ ఇలా బహుమతి ఇస్తానని చెప్పేను.

అందుకే అందమైన బహుమతిని తీసుకుని చక్కగా గిఫ్ట్ పేక్ చేసి ఎదురుగా అందుబాటులో పెట్టుకున్నాను. ముందు ప్లంబర్ వస్తాడా… ఆన్‌లైన్ బాయ్ వస్తాడా… ఎవరికి ఆ బహుమతి అందుతుందా అనుకుంటూ ఎదురుచూపులు చూస్తున్నాను..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here