ఈ దీపావళి అమ్మకు నివాళి

0
3

[dropcap]అ[/dropcap]మ్మ లేక రెండు నెలలు అయ్యాక దీపావళి పండగ (2020) వచ్చింది. సంవత్సరం దాకా పండుగలు చేసుకోకూడదు కాబట్టి ఆరోజు లక్ష్మీపూజ లేదు. కరోన కాలం కాబట్టి టపాసులు పేల్చకూడదని హై కోర్ట్ చెప్పింది చివరికి రెండు గంటలు గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఇచ్చింది సుప్రీం కోర్ట్. ఏది ఏమైనా ఈ దీపావళి అమ్మకు నివాళి మాత్రమే. ఆ ఏడు బాలల దినోత్సవం, దీపావళి కలసివచ్చాయి. బాలల కళ్ళలో వెలిగే కాంతులే దీపావళి చిచ్చు బుడ్లు, రెండు ఆనందాలు ఒక రోజు బంపర్ ఆఫర్‌లా వచ్చాయి.

“ఈ రోజు లక్ష్మీపూజ చేయ్యటం లేదు, టపాకాయలు పేల్చడం లేదు ఇంకెందుకు ఇంటికి రావడం హైదరాబాద్ లోనే ఉంటాంలే” అన్నారు పిల్లలిద్దరూ. అమ్మ లేదు, పిల్లలు రావడం లేదు, దీపావళి బోసి పోతుందని మేము బాలల దినోత్సవం చేద్దామనుకున్నాం. జబ్బులతో బాధలతో ఆసుపత్రిలోనే పేషెంట్లుగా ఉండే బాలలకు ఉత్తేజాన్నీ, ఉల్లసాన్ని కలిగించాలని అనిపించింది. నేను తయారు చేసిన బొమ్మల్ని కొలువు దీరుస్తున్నాం. దాంతో పాటు ‘సృజన’ అనే పేర్ల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం. నూతనంగా తల్లిదండ్రులయ్యే వారికి బహుమతిగా ఈ పుస్తకాన్ని రూపొందించాము. పిల్లలకు ఏ పేరు పెట్టాలనే ఆలోచనలకు సమాధానంగా ఈ పుస్తకాన్ని ‘సృజన్ పిల్లల హాస్పిటల్’ ద్వారా వెలుగులోకి తీసుకువస్తున్నాం. కొత్తగా పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇస్తున్నాం.

ఏదైనా పండగ వచ్చిందంటే అమ్మ హడావిడే వేరు. ‘మామిడి కొమ్మలు తెప్పించుకున్నవా లేదా, ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారా లేదా’ అని నిద్ర లేవగానే అడుగుతుంది. “నేను గారెలు, పొంగలి వండుతాను గాని నువ్వు దేవుడి అలంకారం చెయ్యి” అంటుంది. సాయంత్రం పూట లక్ష్మీదేవి పూజ. ఉదయమంతా ఇంట్లోనే పనంతా. పోయిన సంవత్సరం ఇంటి ముందు కాస్త వెరైటీగా ముగ్గు వేయ్యాలని అనుకున్నాను. పిల్లల పాలపీకలతో ముగ్గుల్ని వేద్దామని డిజైన్ చేశాను. హాస్పిటల్లో వాడి పారేసిన పాలపీకల మూతల్ని సేకరించాము. వాకిట్లో ఒక పద్మాన్ని గీసుకొని దానిపై పాలపీకల్ని అమర్చుకుంటూ వచ్చాము. రంగు రంగుల పాలపీకలతో ముగ్గు తయారైంది. ఆ ముగ్గు మధ్యలో బంతి పూలు నింపాము. ఎంత అందంగా అమరిందో రంగవల్లి. అమ్మ చాలా సంతోషించింది ఈ రంగవల్లిని చూసి. నేను వేస్తున్నంతసేపు కుర్చీ వేసుకొని అక్కడే కూర్చుంది. ముగ్గులంటే అమ్మకు ఎంతో ఇష్టం.

లక్ష్మీ పూజను మేము కింద హాస్పిటల్‌లో చేసుకుంటాం. అది సాయంకాలం పూట అందరం పట్టు బట్టలు కట్టుకొని చక్కగా లక్ష్మీపూజను ఆచరిస్తాము. పోయిన సంవత్సరం ఈ పండుగకు దీపాలు వెలిగించడం కూడా అందంగా చేద్దామనుకున్నాం. అమ్మకు ఐడియా చెప్తే చాలా బాగుందని ప్రోత్సహించింది. సాధరణంగా ప్రతి సంవత్సరం పిట్ట గోడల మీద అక్కడక్కడ వరసగా దీపాలు పెడతాం. ఈ సారి అన్నీ చిన్న చిన్న దివ్వెలు కొనుకొచ్చాము. ఈ దివ్వెలను గుండ్రంగా అమర్చాము. దగ్గర దగ్గరగా పెట్టి గుండ్రంగా పెట్టి దీపాలు వెలిగించే సరికి చాలా అందంగా వచ్చింది. పూజకు వచ్చిన వాళ్ళు కూడా బాగుందని మెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం మా హాస్పిటల్ స్టాఫంతా కలసి దీపావళి చేసుకుంటాం. కాబట్టి కొద్ది మండి స్నేహితులనూ ఆహ్వానిస్తాం పూజకు. పూజ చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళతారు స్నేహితులంతా.

పూజ తర్వాత పటాకాలు పేల్చేపని పిల్లలదీ, స్టాఫ్‌దీ. మేం గేటు బయట కుర్చీలు వేసుకుని కూర్చుంటే స్టాఫ్ పిల్లలు కలసి కాకర పువ్వొత్తులు, తారాజువ్వలు, లక్ష్మి బాంబులు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, చిచ్చుబుడ్లు ఒకటేమిటి దీపావళి హడావిడంతా వారి టపాకాయల్లోనే ఉంటుంది. టెన్ థౌజండ్ వాలా అని టపాసుల హారాలు మూడు తెస్తారు ప్రతి సంవత్సరము. మొదటగా వాళ్ల డాడీతో అంటుపెట్టిస్తారు పిల్లలు, స్టాఫంతా కలసి. ఆ తర్వాత రెండు టెన్ థౌజండ్ వాలాలను పిల్లలే వెలిగించి చప్పట్లు, కేరింతలతో మోతలు మొగిస్తారు. దీని తర్వాత లక్ష్మి బాంబులు, రాకెట్లు పేలుస్తుంటారు. అందుకని ఆ టైముకు అమ్మ పైకెళ్లి పోతుంది వంటమ్మాయిని తోడు తీసుకొని. ఈ మోతలకు అమ్మ భయపడుతుంది. గుండె ఆపరేషన్ తర్వాత నుండి తాను టపాసుల మోతలకు దూరంగానే ఉంటున్నది. అందుకే మేము కూడా అమ్మను పైకి వెళ్లిపొమ్మనే చెబుతాం. ఈ సారేమో నిజంగానే ఆ పైకి వెళ్లిపోయింది. ఎవరికి అందనంత దూరాలు, తిరిగిరాని దూరం వెళ్లిపోయింది.

దీపావళి పూజలయ్యాక ప్రతి సంవత్సరము జరిగే ప్రధాన ఘట్టం ఫోటో సెషన్. ప్రతి సంవత్సరము కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు గ్రూప్ ఫోటోలు తీయించు కోవడం మాకు చాలా సరదాగా ఉంటుంది. ప్రతి ఫోటోలో అమ్మ ఉంది. ఈ సంవత్సరం ఫోటోలో అమ్మ స్థానం ఖాళీగా ఉంది. మా మనసులు కూడా బోసిగా నిర్లిప్తంగా ఉన్నాయి. మా గ్రూప్ ఫోటోలో మా పెంపుడు కుక్క సైతం ఉంటుంది. ఈ సంవత్సరం అది కూడా హైదరబాద్‌లో ట్రెయినింగ్‌కి వెళ్లింది. కాబట్టి అది కూడా లేదు. ఇంకేముంది పండుగ చేసుకోవడానికి అన్నట్లుగా ఉంది.

అమ్మ ఫోటో దగ్గరే దీపాలు ముగ్గు వేస్తూన్నా నేను. అమ్మ ఫోటో దగ్గరే దీపాలు వెలుగుతున్నాయి. అవే దీపావళి వెలుగులు అమ్మ ఆశీర్వాదాలే మాకు దీవెనలు. తల్లిదండ్రులే అసలైన దేవతలు అన్నట్లుగా, అమ్మ ఫోటోలోనే లక్ష్మీదేవిని చూస్తున్నాము. అమ్మకు నివాళే ఈ దీపావళి మా ఇంట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here