Site icon Sanchika

ఈ లోకంతో జాగ్రత్త చిన్నా..

[dropcap]భ[/dropcap]లేగుంది ఆడుకుందామని భ్రమ పడి పరిగెత్తకు
అబ్బో బోలెడు నిచ్చెనలని సంబర పడిపోకు
ఏ నిచ్చెన ఎపుడే పాముగా మారి మెలికలు తిరుగుతుందో
ఈ పాము పటంలో ఎవరికీ తెలియదు

చూసిందంతా పచ్చని గరికే అనుకోకు
ఏ పూల మొక్క దాపున ఏ ఊబి ఉంటుందో
ఏ గుంటలు తీసి నక్కి ఎవరు దాగుంటారో తెలియదు
అంతా నాకిష్టమైన వారే
అంతా నన్ను ప్రేమించేవారే
అని నమ్మి అసలే పరిగెత్తి పోకు
ఉన్నట్టుండి నీవెవరో తెలీనట్టే వెళ్లిపోతారు
ఈ లోకంతో జాగ్రత్త చిన్నా

అన్ని నవ్వులూ కూడా నిజమనుకోకు
చాచిన ప్రతి చెయ్యీ నీకు ఆసరా ఇస్తుందనీ అనుకోకు చిన్నా
నవ్వుతూనే విషాన్ని చిమ్మే నోళ్ళుంటాయి
ఉన్నట్టుండి వేళ్ళు ముళ్ళ కత్తులై పోతాయి
ఇంకొన్ని చేతులు అందుకునే లోపే మాయమూ అయిపోతాయి
‘అయ్యో అందుకున్నావనుకున్నానే’
అని పరిహసిస్తూ జాలీ నటించబోతాయి
భలే మర్యాదస్థులున్న చిత్రమైన లోకం చిన్నా ఇది

అయితే ఇక ఇంతేనా ఈ లోకమని నిరాశా పడకు
నీ నీడై మసిలే దేవతలూ ఉంటారు
నీ ప్రాణమై నిలిచే ఆప్తులూ ఉంటారు
కన్ను తెరిచి చూసుకో
కపటమేదో తెలుసుకో
ప్రతిమాట వెనకా దాగిన పరమార్థం గ్రహించుకో

Exit mobile version