Site icon Sanchika

ఏ మావి చివురులు తిని ఎవరిని కీర్తిస్తూ పాడుతున్నావు?

[box type=’note’ fontsize=’16’] “ఆనాటి కవులలో సహజంగా ఉండే విరోధాలు, అసూయలు, విమర్శలు, దూషణలు రాయప్రోలులో చాలా తక్కువగా ఉండేవి” అంటున్నారు కోవెల సుప్రసన్నాచార్య ఈ వ్యాసంలో. [/box]

[dropcap]1[/dropcap]9 వ శతాబ్దం చివరి దశకంలో.. తర్వాతి శతాబ్దంలోని అధికభాగాన్ని పరిపాలించిన తెలుగు కవులు అందరూ పుట్టారు. రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, బసవరాజు అప్పారావు, శివశంకరశాస్త్రి, కృష్ణశాస్త్రి, జాషువా, అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి, నాయని సుబ్బారావు, గుడిపాటి వెంకటచలం మొదలైన వాళ్లందరూ ఈ దశాబ్దంలో వెలసిన మధుకోశాలే. ఒకచోట గుడిపాటి వెంకటచలం ఈ దశాబ్దం గురించి మాట్లాడుతూ తెలుగునాటకు గంధర్వులు దిగి వచ్చారు అని వ్యాఖ్యానించారు. రాయల యుగం తర్వాత ఇంత సంపన్నమైన తెలుగు సరస్వతి పుత్రుల రాక మరెప్పుడూ జరుగలేదు. వీరందరిలోనూ ఒక కొత్త మార్గాన్ని పలుకుబడిని, భాషను దర్శనాన్ని ఇచ్చి నూతన యుగానికి సంస్థాపకుడుగా వెలసినవారు రాయప్రోలు సుబ్బారావు. అభినవ కవితాయుగానికి ఆయన సంస్థాపకుడు. నన్నయ్య తర్వాత తెలుగు కవిత్వ భాష ఆమూలంగా పరివర్తనం పొందింది రాయప్రోలు వల్లనే. ఆయన తెలుగు సంస్కృత భాషలే కాకుండా.. రవీంద్రుని ప్రభావంతో భారతీయ జాతీయతా భావాలను కొత్త రొమాంటిసిజం తెలుగు కవితలో ప్రవేశపెట్టారు. గురుదేవులు రవీంద్రుల వద్ద శిక్షణ పొందారు. శాంతినికేతన్ చేరకముందే ‘అనుమతి’ అనే కావ్యం రచించినా.. తర్వాత తృణ కంకణం నిర్మాణంతో అమలిన శృంగార తత్త్వాన్ని సంస్థాపించి తన తర్వాత తరానికి మార్గదర్శకుడైనాడు. ఆనాటి కవులలో కవిత్వ దర్శనానికి సంబంధించిన గ్రంథాలు రచించిన వారు అరుదు. ఆయన రమ్యాలోకము, మాధురీ దర్శనం ఆధునిక కవిత్వానికి మార్గదర్శకాలైన లక్షణ గ్రంథాలు. ఆ తరంలో విశ్వనాథ ఒక్కడే కవిత్వ లక్షణానికి సంబంధించిన ‘కావ్యామృతము’ అనే రచన చేశారు. రాయప్రోలు కవిత్వాన్ని జాతీయ భావ ప్రేరకంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి కవిత్వ ప్రేమికులు భావించి 1913 నాటి బాపట్ల ఆంధ్ర మహాసభల్లో వాటిని గానంచేశారు. రాయప్రోలు రచించిన ‘ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా’ అన్న గీతం భారతీయ సాహిత్యంలో ప్రముఖమైన ప్రతిష్ఠ పొందిన జాతీయగీతం. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ‘జయజయ జయ భారత జనయిత్రీ దివ్యధాత్రి’ దీని తర్వాత కొన్ని దశాబ్దాలకు రచింపబడ్డ రచన. ఇక్బాల్ ‘సారే జహాసె అచ్ఛా’ అన్న గీతం కంటే రాయప్రోలు గీతం విలక్షణమైన జాతీయతా భావానికి ముద్రవేసింది. ఇది ఆత్మాభిమానాన్ని ప్రకటిస్తుందే కానీ ఎవరినీ కించపరచదు. రాయప్రోలు సుబ్బారావు తొలి రోజుల్లో మేనమామ గారితో కలిసి అవధానాలు చేసినా ఆ ఆశుకవితా పద్ధతికి దూరమై.. ఆశుకవితా సన్యాసమిప్పింపవే అని కోరుకున్నాడు. తీరికగా భావించి రాసే రచనల్లో ఉండే చిక్కదనం భావకవిత్వంలో ఉండదని ఆ ‘వేగాతి వేగోక్తి దుర్వ్యసనం’ సత్కవిత్వానికి దారి తీయదని ఆయన భావించారు. రాయప్రోలు రచనల్లో తరువాతి పరిణామాలను గమనిస్తూ పోతే ముఖ్యంగా రూపనవనీతం లాంటి భావ రూపకాలను పరిశీలిస్తే ఆయన చిత్తంలో ఎంతగా వాల్మీకి వ్యాసులు, కాళిదాస భవభూతులు నిండివున్నారో తెలియవస్తుంది. ఆయన నిత్య మననంలో ఉపనిషద్వాక్యాలు దొర్లుతూ ఉంటాయి. ఒక ఆర్ష సంప్రదాయాన్ని అచ్చంగా అకలుషితంగా తెలుగు కవిత్వంలోకి తీసుకుని వచ్చిన భావ భగీరథుడు ఆయన.
రాయప్రోలు తన జీవిక కోసం ఆంధ్ర ప్రాంతాన్ని విడిచి తెంగాణకు రావలసి వచ్చింది. ఆయన మంథెనలో పాఠశాల అధ్యాపకుడిగా పనిచేసినట్లుగా తెలియవచ్చింది. అయితే తరువాత 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించడం.. అక్కడ తెలుగు శాఖ ఏర్పడటం..ఆయనకు ఒక అద్భుతమైన అవకాశాన్నిచ్చింది. ఆయన ఉస్మానియా తెలుగు శాఖకు తొలి ఆచార్యుడిగా నియమింపబడ్డారు. రవీంద్రుడు సంస్థాన ముఖ్యమంత్రి సర్ అక్బర్ హైదరీకి ఒక లేఖ రాసారని.. రాయప్రోలు ఆచార్యత్వ నియామకానికి అది కారణమైందని నేను చదువుకునే రోజుల్లో వినబడ్డ మాట. తొలి రోజుల్లో తెలుగు శాఖలో విద్యార్థులు ఉండేవారు కారు. ఆయన సాహిత్య కృషి నిరంతరాయంగా సాగుతూనే ఉండేది. నిరంకుశుడైన నిజాం ప్రభువు పరిపాలనలో ఉన్న ఆయన.. నిజాం ప్రభువునకు అనుకూలంగా ప్రవర్తించక తప్పలేదు. కురుగంటి సీతారామయ్య, మహమ్మద్ ఖాసింఖాన్, తాను కలిసి ఒక సాహిత్య సంస్థను (హైదరాబాద్ తెలుగు అకాడమీ కావచ్చు) స్థాపించి కొన్ని ప్రచురణలు చేపట్టారు. ఆ సంస్థ నిజాం పాలన రజతోత్సవ సందర్భంలో ‘ఆదర్శ ప్రభువు’ అనే రచనను వెలువరించింది. అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజ్యాధికారానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తున్నది. సాహిత్య సంస్థలు, ఆర్య సమాజం.. ఇతర రాజకీయ వ్యవస్థలు నిజాంను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నడిపేవి. ప్రజల భాషకు ఆదరం ఉండేది కాదు. తమ భాషను నిలుపుకోవడానికి సారస్వత పరిషత్ లాంటి సాహిత్య సంస్థలు, భాషా నిలయం వంటి గ్రంథాలయాలు.. లక్ష్మణరాయ పరిశోధక మండలి వంటి చారిత్రక సంస్థలు తీవ్రంగా కృషిచేసేవి. వీటిలో సంస్థానంలో భాగమైన మహారాష్ర్ట, కన్నడ ప్రజలు కూడా విస్తృతంగా పాల్గొనేవారు. అయితే జాతీయ కవిత్వ రంగంలో దేశంలోనే ప్రతిష్ఠ సంపాదించిన రవీంద్రుని శిష్యుడైన రాయప్రోలు సుబ్బారావు నిజాం ప్రభువునకు అనుకూలంగా ప్రవర్తించడం.. ప్రజలకు వ్యతిరేకంగా ఉండటం నాటి జాతీయోద్యమ నాయకులకు నచ్చలేదు. సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, మాడపాటి హనుమంతరావు మొదలైన యోధులకు రాయప్రోలుతో వైరుధ్యం ఏర్పడింది. వీళ్ల వేదికలమీద ఆయన అరుదుగానే కనిపించేవారు. కాళోజీనారాయణరావు నా గొడవలో ‘ఓ కోయిలా.. ఏ మావి చివురులు తిని ఎవరిని కీర్తిస్తూ పాడుతున్నావు?’ అని ఒక గేయం రాశారు. అది రాయప్రోలును ఉద్దేశించిందే. రాయప్రోలు వైమనస్యం పెరుగటం వల్ల ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చే.. జాతీయ పక్షం వైపుచేరే ఇతర పండితులకు ఆదరణ లభించేది. అలాంటి ఆదరణ పొందినవారిలో విశ్వనాథ సత్యనారాయణ ఒకరు. ప్రతాపరెడ్డిగారితో కలిసి గద్వాల వనపర్తి సంస్థానాలను ఆయన పర్యటించారు. హైదరాబాద్‌లో ‘పక్షం రోజులు’ అని రాసిన వ్యాసం గోలుకొండ పత్రికలో వచ్చింది. అది నేను ఎంత వెతికినా నాకు లభించలేదు.
ఆ నాళ్లలో ఆంధ్రప్రాంతం నుంచి వచ్చే కవి పండితులకు హైదరాబాద్‌లో కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం పక్కనే ఉండే డాక్టర్ పిసుపాటి వెంకటరమణయ్య గృహము ఆశ్రయంగా ఉండేది. ఆతిథ్యపు ఏర్పాట్లు అక్కడ జరిగేవి. రమణయ్యగారు రచయిత కూడా. ఆయన ‘నాయనమ్మ కథలు’ అనే పుస్తకం రాశారు. రమణయ్య గారి ఇంట్లో తాను ఆతిథ్యం పొందినట్లు దువ్వూరి రామిరెడ్డి గారు పేర్కొన్నట్లు నాకు గుర్తుకు వస్తున్నది. 1956 ప్రాంతంలో విశ్వనాథ హైదరాబాద్‌లో విడిదిచేసినప్పుడు ఇంటి ముందరి ఖాళీ స్థలంలో హైదరాబాద్ సాహిత్య పరులు చేరడం.. ఆయన ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడటం నాకు గుర్తుగానే ఉన్నది. మా తరం వాళ్లంతా అక్కడికి వెళ్లేవారం. ఒకానొక సందర్భంలో శివశంకర శాస్త్రిగారు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఉస్మానియా వర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది. దానిలో పాల్గొన్న సభాపతి శివశంకరశాస్త్రి.. రాయప్రోలువారికి, కురుగంటి సీతారామయ్య వారికి ‘భట్టాచార్యులు’ అని బిరుదు ఇచ్చారు. ఒక సందర్భంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తూ  తాము రచిస్తున్న యుద్ధకాండలో ఇంద్రజిత్తు వేసిన నాగబంధాలకు చిక్కుబడ్డ రామలక్ష్మణులు గరుడుని వల్ల పాశ విమోచనం చెందిన సన్నివేశం మాకు చదివి వినిపించారు.
భాషా నిలయంలో విశ్వనాథ సాహిత్య సమాలోచనం జరుగుతున్న రోజుల్లో రెండవరోజు రమణయ్య గారి ఇంట్లో ఉన్న విశ్వనాథ హఠాత్తుగా సమావేశానికి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచి ప్రసంగించారు. ఆయన వస్తున్న సందర్భంలో ఆ సమావేశంలో అధ్యక్ష స్థానంలో కూర్చున్న అనుముల కృష్ణమూర్తి ‘అతిథిగ వచ్చెనేడు ఋషి అంతటివాడు’ అన్న తన పద్యాన్ని అద్భుతంగా చదివి ఆయనను, సభను సమ్మోహనపరిచారు.
1958 ప్రాంతాల్లో జువ్వాడి గౌతమరావు జయంతి పత్రిక నడిపేవారు. దాన్లో సాహిత్యధార అనే శీర్షికను నిర్వహించేవారు. ఆరోజుల్లో కాళిదాస మేఘ సందేశాన్ని దూతమేఘము అన్న పేరుతో యతి ప్రాసలు లేకుండా రాయప్రోలు వారు రచించారు. దానిని జయంతి పత్రిక, భారతి తీవ్రంగానే విమర్శించాయి.
రాయప్రోలువారి సప్తతి సందర్భంలో విజయవాడలో జరిగిన సభలో తాను రాయప్రోలు వల్ల ప్రేరణ పొందినట్లు తొలి రచనలు చేసినట్లు విశ్వనాథ పేర్కొన్నారు. ‘అంతర్జ్వాలా స్వరూపస్య శివస్య బహిరాకృతిం.. వందే మహిమతాం వాణిం విద్వత్ జిహ్వాగ్ర నర్తకీం’ అని సరస్వతి దేవిని వర్ణించే శ్లోకం కూడా ఆశువుగా ఆ సభలో చెప్పారు. ఆనాటి కవులలో సహజంగా ఉండే విరోధాలు, అసూయలు, విమర్శలు, దూషణలు రాయప్రోలులో చాలా తక్కువగా ఉండేవి. మారేడుపల్లిలో ఆయన ఉన్న రోజుల్లో 60ల చివర్లోనో.. 70ల మొదట్లోనో.. ఆయన్ను నాలుగైదుసార్లు కలుసుకున్నాను. విస్తృతంగా మాట్లాడాను. ఎక్కువగా ఆయన కాళిదాస భవభూతులను తలచుకొని తాదాత్మ్యం చెంది మాట్లాడటమే విన్నాను. సమకాలీన కవులను గూర్చి ఆయన కొన్ని అభిప్రాయాలున్నా.. కటువుగా వెల్లడించేవారు కారు. రాయప్రోలుకు విశ్వనాథకు మధ్య ఒక చిన్ని కారణం వల్ల కొంతకాలం వైమనస్యం కొనసాగింది. 1947-48 ప్రాంతాల్లో రాయప్రోలు పదవీవిరమణ చేయవలసి వచ్చింది. ఆ సందర్భంలో ఇరవై ముప్ఫై మంది మహా విద్వాంసులు ఆ పదవికోసం ఇంటర్వ్యూకి వచ్చారు. అప్పుడు దానికి ఎవరినీ సెలెక్ట్ చేయలేదు. విశ్వనాథ కూడా అలా ఇంటర్వ్యూకి వచ్చినవారే. ఇంటర్వ్యూలో సభ్యుడుగా రాయప్రోలు ఆయన్ను కొంత తగ్గించి మాట్లాడినట్లుగా చెప్పుకొన్నారు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లల్లో రాయప్రోలువారి అల్లుడు కొత్తపల్లి వీరభద్రరావు (అప్పుడు విజయనగరం కాలేజీలో పనిచేస్తుండేవారు) ఉన్నారు. ఆయన కూడా పదవికి ఎంపిక కాలేదు. రాయప్రోలువారి కాలంలో తెలుగు శాఖలో చదువుకున్న విద్యార్థుల్లో పల్లా దుర్గయ్య ఒకరు. తరువాత అనుముల కృష్ణమూర్తి కూడా ఆయన ప్రత్యక్ష శిష్యుడే. మా మేనమామ ఠంయాల రంగాచార్యులు ఆయన దగ్గరే బీఏ తెలుగు చదువుకున్నారు. జువ్వాడి గౌతమరావు అప్పుడు బీకాం చదువుతూ ఉన్నా.. సాహిత్య ప్రేమ వల్ల అనుముల కృష్ణమూర్తితోపాటు రాయప్రోలువారి తరగతులు కొన్నింటిని విన్నారు. ఇంతకుముందు మనం కాళోజీ ప్రసక్తి తీసుకొచ్చి రాయప్రోలువారిని అన్యాపదేశంగా విమర్శించిన అంశం అనుకున్నాం. కానీ, 1962-63 ప్రాంతాల్లో నేను విద్యార్థి సంఘ సలహాదారుగా ఉన్నప్పుడు వారిని ఉపన్యాసానికి ఆహ్వానించినప్పుడు కాళోజీ వారింట్లోనే ఆతిథ్యానికి ఏర్పాటుచేశాను. వారిరువురిలోనూ అప్పుడు సౌహార్దమే వెల్లివిరిసింది. ఆ రెండు రోజుల్లోనే ఒక సాయంకాల సభలో నేను రాయప్రోలు వారి అమలిన శృంగారం గురించి ఉపనిషత్ ప్రమాణాలతో మాట్లాడగా ఆయన ఎంతో సంతోషపడ్డారు. తర్వాత చాలాకాలం ప్రత్యక్షంగా, పరోక్షంగా నా యందు అపారమైన తమ వాత్సల్యాన్ని కురిపించారు. వారింట్లో ఒక రోజు భోజనం కూడా చేసే అవకాశం లభించింది.

Exit mobile version