ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారమా?

11
2

[dropcap]ఇ[/dropcap]టీవలి కాలంలో అందరి దృష్టి ఎలాంటి రచనలకు సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తున్నారన్న విషయంపై కేంద్రీకృతమయి ఉంది. ముఖ్యంగా, భాస్కరయోగి వెలుగు పత్రికలో రాసిన వ్యాసం,  సంచికలో ప్రచురితమైన శరచ్చంద్రిక వ్యాసం, దాని ప్రేరణతో కృష్ణచైతన్య రాసిన Conflict of Interest వ్యాసాల వల్ల సాహిత్య అకాడమీ అవార్డుల ఎంపికలో ‘సాహిత్యం’ తప్ప మిగతా ఇతర విషయాలన్నీ ప్రాధాన్యం వహిస్తున్నాయన్న ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచనకు బలమిస్తుంది సాహిత్య అకాడమీ బాల సాహిత్యం పురస్కారం పొందిన ‘నేను అంటే ఎవరు?’ [ఒక వైజ్ఞానిక వివరణ] అన్న పుస్తకం. దేవరాజు మహారాజు రచించిన ఈ పుస్తకానికి బాలసాహిత్యం అవార్డు రావటాన్ని రచయిత స్వయంగా వ్యతిరేకించటం గమనార్హం. అయితే బాల సాహిత్య పురస్కారమే కాదు, అసలీ పుస్తకం ఏక పక్షంగా వుండి  – పెద్దలకూ ఎలాగో పనికిరాదు, పిల్లలకి కూడా పనికిరాదు అన్నది పుస్తకం చదివిన తరువాత తెలుస్తుంది. పైగా  పిల్లల  మెదళ్ళను విషపూరితం చేసి ప్రపంచమంతా భక్తితో, ఆరాధనతో అధ్యయనం చేస్తున్న భారతీయ ధర్మం, తత్వాలపై బాలల్లో చిన్నచూపు కలిగించి, వారి మెదళ్ళను ద్వేష మయం  చేసి, న్యూనతాభావం కలిగించేట్టుగా ఉండడం ఈ పుస్తకానికి అర్హత లేకపోయినా, అవార్డు ఎలా లభించిందో చెప్పకనే చెబుతుంది. ఇలాంటి పుస్తకాలకే అవార్డులివ్వటం వెనుక వున్న ఆలోచన అర్ధమవుతుంది.

ముందుగా ‘ఇది బాలల పుస్తకం కాదు’ అని రచయిత ఎంతగా నమ్మించాలని ప్రయత్నించినా, పుస్తక రచన తాతయ్యకూ, మనవళ్ళకూ జరిగిన సంభాషణల్లా ఉండడంతో ఈ పుస్తకాన్ని బాల కేటరిగీలో చేర్చటంలో అభ్యంతరాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. బహుశా జీవితమంతా ‘సీరియస్ లిటరేచర్’ సృజించిన రచయితకు చివరికి బాల సాహిత్యం కేటగిరిలో అవార్డు రావడం  బాధ కలిగించి ఉంటుందేమో! కథా రచనకు పేరు పొందిన పి. సత్యవతికి అనువాదానికి అకాడమీ అవార్డు రావటం లాంటిదే ఇది!

ఇక ‘నేను అంటే ఎవరు?’ పుస్తకం తెరవగానే కనిపించే ‘ముందుగా ఒక మాట’ లోని మొదటి పేరాలో మొదటి రెండు వాక్యాలు చదవగానే ఈ పుస్తకానికి అవార్డు పొందే అర్హత ఎందుకు లభించిందో అర్థమైపోతుంది. అసలీ పుస్తకాన్ని అవార్డుకు ఎంచుకోవాలన్న ఆలోచన రచయిత వామపక్ష భావ సమర్థకుడు కాకపోతే వచ్చేదే కాదన్నది ప్రధాన విషయం.  మొదటి రెండు వాక్యాలు అవార్డు అర్హతను నిర్ధారించాయి.

దీనికన్నా ముందు ప్రస్తావించుకోవాల్సిన అంశం ఇంకొకటి వుంది.   అది   conflict of interest. ఈ పుస్తకాన్ని విశాలాంధ్రవారు ప్రచురించారు. కాబట్టి రచయిత ఆ సంస్థకు తగ్గ భావజాలాన్ని తన రచనలో ప్రదర్శించటంపట్ల ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు, ఆక్షేపణలు వుండే వీలు  లేదు. వున్నా పట్టించుకోవాల్సివ అవసరమూ లేదు. రచయిత అభిప్రాయం రచయితది. ప్రచురణకర్తల భావజాలం, రచయిత భావజాలం ఒకటే అయితే ఎవరికీ ఎలాంటి సమస్యవుండాల్సిన  అవసరంలేదు. నచ్చిన వారు చదువుతారు. నచ్చనివారు వదిలేస్తారు.    అయితే, ఈ ఒక భావజాలానికి అనుగుణంగా రాసిన పుస్తకానికి సాహిత్య అకాడెమీ అవార్డు ఇవ్వటం ద్వారా ఆ భావజాలానికి, ఆరకమైన ఆలోచనకూ  ప్రామాణికతను ఆపాదించి, దేశంలో అన్ని భాషలలోకీ తర్జుమా అయి అందరికీ , ముఖ్యంగా బాలలందరూ చదవి, ఆకళింపు చేసుకుని, అనుసరింఛదగ్గది అనే స్థాయి వచ్చేట్టు చేయటం అభ్యంతరకరం. అకాడెమీలో సభ్యులంతా ఈ భావజాలాన్ని సమర్ధించేవారే కావటంతో  appropriation of literature to a particular ideology and a set of thoughts, which is another form of conflict of interest అన్న ఆలోచన బలపడుతుంది. ఈ పుస్తకానికి నాణ్యతవల్ల కాదు, చక్కటి విషయాలు  పిల్లలకు బోధిస్తున్నందుకు కాదు, కేవలం ఒక భావజాలాన్ని సమర్థిస్తున్నందుకే అవార్డ్ ఇచ్చారనిపిస్తుంది. ఇందుకు కారణం  ముందుమాటలో మొదటి లైన్ చదవగానే తెలుస్తుంది.

“ఏళ్ళకేళ్ళుగా జీవాత్మ-పరమాత్మ అంటూనో, అహం బ్రహ్మస్మి అంటూనో ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక ప్రముఖులు ఇచ్చే వివరాలు వింటూ కాలం గడిపేశాం. మానవుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి అవి కొన్ని శతాబ్దాల పాటు ఉపయోగపడ్డాయి. నిజమే! కాని, అవి నిజ నిర్ధారణకు నిలబడేవి కావు.”

ఏవి నిజ నిర్ధారణకు నిలబడేవి కావు? జీవాత్మ-పరమాత్మ, అహం బ్రహ్మస్మి, ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక ప్రముఖులు ఇచ్చే వివరాలు నిజ నిర్ధారణకు నిలబడేవి కావట!  అస్విలు నిజ నిర్ధారణ అంటే ఏమిటి?  నిజ నిర్ధారణకు నిలబడేవి కావని ఏ పరిశోధనల ద్వారా తీర్మానించారు రచయిత? ముక్కు మూసుకుని అరణ్యాలలో కందమూలాలు తింటూ ఎన్నేళ్ళు తపస్సు చేశారు? ఒంటిపై నూలుపోగు లేకుండా, శరీరం గడ్డ కట్టే మంచుకొండలలో ఒంటికాలిపై నిలబడి ఎన్నేళ్ళు తపస్సు చేశారు? కనీసం ఎన్నడైనా తనలోకి చూసుకునే ప్రయత్నం  ఎంత చేశారు? కనీసం ఎలాంటి పరిశోధనలు చేశారు? నిజ నిర్ధారణకు నిలబడదనేందుకు ఆధారాలేమిటి?   భారతీయ ధర్మం స్పష్టంగా చెబుతుంది – పుస్తక పరిజ్ఞానం పరమాత్మను చేరే దారిని మాత్రమే చూపిస్తుందని . పరమాత్మ భావనను గ్రహించాలనుకున్నవాడు, అన్నీ వదిలి ఏక భావనతో ఆ మార్గంలో ప్రయాణించాలి. ఇవన్నీ నిజ నిర్ధారణకు నిలబడేవి కావని ఎన్ని పరిశోధనలు చేసి, ఎంతగా ఆధ్యాత్మిక భావనలను మథించి ఈ రచయిత తీర్మానించారు? ఆ తీర్మానానికి దారితీసిన పరిశోధనల ఫలితాలేవి? ప్రయోగం, ఫలితాల విశ్లేషణ తరువాత నిర్ధారణ అంటుంది విజ్ఞానశాస్త్రం. ఏవీ రచయిత ఈ తీర్మానం చేయటానికి దారి తీసిన ప్రయోగాల ఫలితాలు, విశ్లేషణలు? Experiments, Observations and Inferences  అన్నవి విజ్ఞానశాస్త్రంలో ఒక ప్రతిపాదనను సిద్ధాంతంగా, సత్యంగా నిరూపించేవి. అవేవీ లేకుండా ‘అవి నిజ నిర్ధారణకు నిలబడేవి కావు’ అని  ప్రకటించేంత ధైర్యం, అహంకారం, మూర్ఖత్వానికి మేధావి ముసుగు వేసి చలామణీ అయ్యే తెగింపులు ఎలా వచ్చాయి రచయితకి? నిలదీసి అడిగేవారు లేరని!  కొన్ని వేల ఏళ్ళ నుంచి మహా మహా మేధావులు ఎంతో పరిశ్రమించి, మథించి, శోధించి, సాధించి, హలాహలాన్ని గళంలో నింపుకుని సమస్త విశ్వానికి అమృతం లాంటి సత్యాలను ఆవిష్కరించి అందించిన వేల ఏళ్ళ సంస్కృతి, వారసత్వాలను ఒక్క ముక్కలో తేల్చివేసే ధైర్యం ప్రదర్శించిన రచయితకు అవార్డు రావటంలో ఆశ్చర్యం ఉందా! ఈ ఒక్క మాటతో భారతీయ ధర్మాన్ని, వారసత్వాన్ని, తత్త్వాన్ని, విలువలను కొట్టి పడేశారు రచయిత. వేద ఋషులు, ఉపనిషత్కారులు, శంకరులతో సహా సమస్త ఆచార్యులు, వివేకానందులు, అరబిందో, రమణ మహర్షి వంటి వారందరినీ ఒక్క మాటతో తేల్చి పారేశారు రచయిత. ‘తనని తాను తెలుసుకోవడమంటే, ఆధ్యాత్మిక పరంగా పలాయనం చిత్తగించడం కాదు’ అంటారు రచయిత ముందుమాటలో.

‘ఆధ్యాత్మిక పలాయనం’ అనటంతోనే  భారతీయ ధర్మం పట్ల, తాత్త్విక జిజ్ఞాస పట్ల రచయితకు ఏ మాత్రం అవగాహన, ఆలోచనలు లేవని స్పష్టం అవుతుంది. ‘సుళ్ళు తిరుగుతున్న నీటి  ప్రవాహంలో ఉంటూ కూడా తడి అంటకుండా నిశ్చలంగా నిలబడటం  ఆధ్యాత్మికత’. సుఖానికి పొంగకుండా, దుఃఖానికి క్రుంగకుండా, నిర్మోహంగా తన కర్తవ్యాన్ని నిర్వహించే స్థితప్రజ్ఞత ఆధ్యాత్మికత. లోకకళ్యాణం కోసం ‘నేను’ అన్న భావనను త్యజించి, సమస్త విశ్వంపై ప్రేమ భావనల చిరుజల్లు కురిపిస్తూ, సర్వం త్యజించి కూడా, అందరూ తన వారేనన్న భావనను ప్రదర్శించడం ఆధ్యాత్మికత. ‘నేను కర్మలు చేయాల్సిన అవసరం లేదు. అయినా కర్మలు చేయటం ద్వారా ఆదర్శంగా నిలుస్తాను’ అనటం ఆధ్యాత్మికత. అహం బ్రహ్మస్మి, త్వమేవాహం వంటి భావనలు భారతీయుల ‘అస్తిత్వం’. వాటిని ‘పలాయనం’గా భావించి,  దాన్ని  ఏదో గొప్ప విషయంలా ప్రకటించటం, దాన్ని వైజ్ఞానికం అనటం హాస్యాస్పదం మాత్రమే కాదు, శోచనీయం కూడా.

‘నేను నా పూర్వీకుల భుజాలపై నిలబడటం వల్ల ముందుకు చూడగలిగాను’ అన్న గొప్పతనం ఐన్‍స్టీన్‌ది. ‘నా పూర్వీకులంతా మూర్ఖులు. పనికిరాని వారు. నేనే మేధావిని’ అనటం ఆధునిక తెలుగు మేధావుల లక్షణం!

‘నేను చేయలేని పని మీరు చేయాలని’ అన్న రామకృష్ణ పరమహంస, ‘నా తపశ్శక్తిని సమస్త విశ్వానికి ధారపోస్తున్నాను’ అన్న అరబిందో, ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అన్న రమణ మహర్షి లాంటి వాళ్ళు ఒక్క భారతదేశంలోనే జన్మిస్తారు.  ఇదీ భారతీయ ఆధ్యాత్మిక శక్తి ప్రభావం. ఇది  పలాయనవాదమా?

సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం పొందిన పుస్తకం ముందుమాట చదివితే కలిగిన ఆలోచనలు ఇవి. ఈ పుస్తకం పిల్లలంతా చదివి, అర్థం చేసుకుని, ఆదర్శంగా తీసుకోవాల్సిన పుస్తకమా? నేను అంటే ఎవరు ? అన్న ప్రశ్నకు వైజ్ఞానిక వివరణ ఇస్తే ఎవరికీ అభ్యంతరం వుండదు. కానీ, వైజ్ఞానిక వివరణ ఇవ్వాలంటే ప్రాచీన భారతీయ తాత్త్విక సిద్ధాంతాలను, సత్యాన్వేషణను చులకన చేసి పనికిరానిదని నిర్హేతుకంగా, విశ్లేషణ, వివరణ రహితంగా కొట్టిపారేయాల్సిన అవసరంలేదు కదా!!! ఈ పుస్తకానికి అవార్డు ఇవ్వటంవల్ల, భారతీయ ధర్మాన్ని చులకనచేస్తేనే వైజ్ఞానిక వివరణ సాధ్యం అన్న ఆలోచన వస్తుంది. ఇది అభ్యంతరకరం.

(వచ్చే వారం పుస్తకం లోపలకు వెళ్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here