[డా. దేవరాజు మహారాజు రచించిన సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కారం పొందిన ‘నేను అంటే ఎవరు?’ పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ]
~
[dropcap]పు[/dropcap]స్తకానికి ముందుమాట ఇంటికి గుమ్మం లాంటిది. ఇంట్లో అడుగుపెట్టాలంటే గుమ్మం దాటి లోపలకు వెళ్ళాలి. గుమ్మం చూడగానే ఇంటి పరిస్థితి అర్థమవుతుంది. ‘నేను అంటే ఎవరు?’ పుస్తకం ముందుమాటలో ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక ప్రముఖులు చెప్పేవి నిజ నిర్ధారణకు రావంటూ మనిషి – చంకల క్రింద విశ్వాసాల కర్రలు దోపుకుని అవిటివాడి లాగా బ్రతకకూడడు, సర్వస్వతంత్రంగా జీవించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘మనిషి తనను తాను తెలుసుకోవడమంటే, ఆధ్యాత్మికంగా పలాయనం చిత్తగించటం కాదు, జీవశాస్త్ర పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, ఆహార పరంగా, విహారపరంగా వాస్తవాల్ని, వాస్తవాలుగా తెలుసుకోవటం మాత్రమే’ అని పుస్తక రచనలో తన లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు.
‘నేనంటే ఎవరు?’ అని శ్రీరామచంద్రుడికి సందేహం వస్తే, వశిష్ఠుడు ఆ సందేహ నివృత్తి చేయటం వల్ల ఇరవై వేల శ్లోకాల ‘యోగవాశిష్ఠం’ వెలసింది. ‘యోగవాశిష్ఠం’లో ఆరు అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలో, ప్రపంచంలోని అసమానతలు, జీవితంలోని అన్యాయం వంటి విషయాల పట్ల రాముడు దిగులు పడడం ఉంటుంది. రెండవ అధ్యాయంలో తనని తాను తెలుసుకోవాలని, మోక్షం సాధించాలని తపన పడడం ఉంటుంది. తరువాతి రెండు అధ్యాయాలలో వాల్మీకి రాముడి సందేహాలకి విశ్వరచన ప్రణాళిక, అంతరిక్ష రహస్యాల నుంచి ఆధ్యాత్మిక సిద్ధాంతాల వరకూ అనేక విషయాలను అత్యద్భుతంగా వివరిస్తాడు. అయిదవ అధ్యాయం ధ్యానానికి సంబంధించినది. ఆరవ అధ్యాయం ఆనంద సాధన తెలుపుతుంది. ‘యోగవాశిష్ఠం’ మానవుడి ఇచ్ఛాశక్తికి, మానవుడి సృజనాత్మకతకు పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా మూడు నాలుగు అధ్యాయాలయిన ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణాలు చదువుతుంటే ఆధునిక ఖగోళ, భౌతిక, భౌగోళిక, జీవ, రసాయన శాస్త్రాల ఆవిష్కరణలకు ఏ మాత్రం తీసిపోని అనేక సిద్ధాంతాలు, సత్యావిష్కరణలు కనిపించి ఆశ్చర్యపరుస్తాయి. నిజంగా ఎవరికయినా ‘నేను ఎవరు?’ అని తెలుసుకోవాలని ఉంటే తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ‘యోగవాశిష్ఠం’. కానీ చంకల క్రింద, అవిటివాడిలా విశ్వాసాల కర్రలు దోపుకోవాల్సిన పని లేదని రచయిత భావించటంతో ఈ పుస్తకంలో జీవశాస్త్ర పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక, ఆహార, విహార పరంగా వాస్తవాలని వాస్తవాలుగా తెలుసుకోవటమే ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకోవటం అని రచయిత భావించి, నిరూపించాలని ప్రయత్నించారు.
రచయిత ఈ పుస్తకాన్ని రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగం వైజ్ఞానిక వివరణ, రెండవ భాగం సామాజిక వివరణ. వైజ్ఞానిక వివరణలో మొత్తం పది ఉప భాగాలున్నాయి. సామాజిక వివరణలో ఏడు ఉప భాగాలున్నాయి. మొత్తం 17 భాగాలలో తాత, మనవడు, ఓ పని మనిషి, ఇద్దరు పిల్లలు కలిసి సంభాషిస్తూ ‘నేను’ అంటే ఏమిటన్న విషయాన్ని ఆవిష్కరిస్తారన్న మాట. అయితే, ఈ ప్రతిపాదనతో ఓ సమస్య వస్తుంది.
‘నేను’ అన్న భావన, భౌతికమా, భౌతికేతరమా? భౌతికమైనదైతే, చర్చల ద్వారా, తర్కంతో తెలుసుకోవచ్చు. కానీ ‘నేను’ అన్న భావనలో ‘నేను’ అనేది ఎవరు? అన్న ప్రశ్న వేసుకుంటే సమస్య వస్తుంది. ఈ సమస్యను కేవలం జీవశాస్త్ర, సామాజిక, ఆర్థిక, ఆహార, విహారాల పరంగా పరిష్కరించలేము అన్నది ఏ మాత్రం ఆలోచన ఉన్నవారికైనా అర్థమవుతుంది. కానీ విశ్వాసాల కర్రలను వదిలి సర్వస్వతంత్రుడుగా మనిషి కావాలన్న మహదాశయంతో పుస్తకం రచించారు కాబట్టి, ఆరంభంలోనే అనవసర తర్కంతో కాలయాపన చేయకుండా పుస్తకం లోపలికు అడుగుపెడదాం.
రెండు భాగాలు, అంటే, వైజ్ఞానిక వివరణా, సామాజిక వివరణలు చదివిన తరువాత స్పష్టంగా తెలిసే విషయం ఏమిటంటే, పుస్తకం అయితే రాశారు కానీ, రచయితకు కూడా ‘నేను’ అంటే ఏమిటో తెలియదని, రచయిత తనకు తెలిసిందని అనుకున్నా, అది ఎలా చెప్పాలో తెలియటం లేదన్నది. ఎందుకంటే, ముందుమాటలో జీవాత్మా, పరమాత్మలు నిజ నిర్ధారణకు నిలబడవని ఘంటాపథంగా ప్రకటించిన రచయిత, పలు సందర్భాలలో భారతీయ తాత్త్విక చింతనను దాదాపుగా సమర్థించి, ఆమోదించే స్థాయికి వెళ్ళి, హఠాత్తుగా తానేది చేస్తున్నాడో గ్రహించి, తల విదుల్చుకుని, వైజ్ఞానిక శాస్త్రం వైపు వెళ్ళటం కనిపిస్తుంది. మొదటి భాగంలో మొదటి రంగంలో ‘నేను అంటే ఎవరు?’ అన్నది చర్చ. ఈ చర్చలో ఎంత ప్రయత్నించినా ‘నేను’ అంటే ఏమిటన్న జిజ్ఞాస కనబడదు.
‘నేనంటే ఏమిటి?’ అన్న ప్రశ్నను ‘నొసటి రాత?’ వైపు మళ్ళించి.. ‘నేను అనే వ్యక్తి మాంసంతో, ఎముకలతో, రక్తంతో, ధమనులతో, సిరలతో, నాడులతో.. ఇంకా చెప్పాలంటే జీవకణాలతో తయారయ్యాడు’ అని తీర్మానిస్తారు రచయిత. అంతా చదివిన తరువాత, సరే, ఇదంతా బాగానే ఉంది కానీ, ‘నేనంటే ఏమిటి?’ అని అడగాలని అనిపిస్తుంది. ఇదే చర్చలో ‘పుర్రెకో బుద్ధి’ అని శ్వాసక్రియలు, జీర్ణక్రియల గురించి మాట్లాడి, ‘గుండే అంటే హృదయం’ అని, హఠాత్తుగా మనసు ప్రసక్తి తెచ్చి, అన్ని భావనలకు మెదడు కేంద్రం అని చెప్పి, మనసంటే మెదడు అని తేల్చి ‘మనసు చెబుతోంది అంటే అది మెదడు చెబుతోంది అని అర్థం చేసుకోవాలి’ అని తీర్మానిస్తారు. అలా చదివిన తరువాత ‘ఇది సరే గాని, నేనంటే ఏమిటి?’ అన్న ప్రశ్న వేసి ఏవేవో సొల్లు కబుర్లు చెప్పి, ‘నేను’ను వదిలి మనసు, మెదడు ఒకటే అని తీర్మానించి, ‘హృదయం విప్పి చెప్పడమన్నా, మనసు విప్పి చెప్పడమన్నా అది మెదడు విప్పి చెప్పటమే అని నిర్ధారించుకున్నాం’ అని ముగిస్తారు రచయిత. సొల్లు కబుర్లు బాగానే ఉన్నాయి కానీ ‘నేనంటే ఎవరు?’ అని అడగాలనిపిస్తుంది ఈ అధ్యాయం పూర్తయిన తరువాత. ఇంతకీ మనసు, మెదడు ఒకటేనా? మనసే మనిషా? అంటే మెదడే మనిషా? అని అడగాలనిపిస్తుంది. రెనె దెకార్తే అనే తత్త్వవేత్త ‘I think therefore I am’ అన్నాడు. కానీ ‘What is mind’ అంటే ‘that which is not matter’ అంటారు. ‘what is matter ? అంటే ‘that which is not mind?’ అంటారు. Mind, matter ఒకటేనా, వేర్వేరా? అన్న విషయంలో శాస్త్రవేత్తలకూ, తత్త్వవేత్తలకూ ఎవరికీ స్పష్టత లేదు. ఇంతకీ మనిషి మనసా? మెదడా? అన్న విషయం గురించి రచయిత ఏం చెప్తారు? అంటే ఏమీ లేదు. మొదటి అధ్యాయమే కాదు, మొత్తం పుస్తకం ఏమీ స్పష్టంగా చెప్పకపోవటం, ఏదో చెప్తూ ఎటో పోయి, ఇంకెక్కడో ముగించటం కనిపిస్తుంది. పుస్తకమంతా చదివిన తరువాత తానేం చెప్పదలచుకున్నారో రచయతకే స్పష్టత లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇదే వైజ్ఞానిక వివరణ అయితే ఇంత కన్నా అవైజ్ఞానికం మరొకటి లేదు. ఎందుకంటే మెదడు, మనసు, హృదయం ఒకటేనని తీర్మానించటం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. మనిషి అంటే రక్తం, కండరాలు, న్యూరాన్లు మాత్రమేనా? అన్న సందేహం వస్తుంది. ‘నేనంటే ఎవరు?’ అంటూ మొదలై, అసలు ‘నేను’ను వదిలి సంభాషణ మెదడు గురించి చిన్న పిల్లల పాఠ్యపుస్తకాలలో ఉండే విషయాలపై చర్చ వైపు మళ్ళుతుంది. ఈ పుస్తకంలో రచయిత చెప్పిన విషయాలన్నీ ఏ నాలుగో తరగతి సైన్స్ పుస్తకం తీసుకున్నా, మామూలు జెనరల్ నాలెడ్జ్ పుస్తకం తీసుకున్నా ఇంకా స్పష్టంగా దొరుకుతాయి.
ఈ పుస్తకం ముందుమాటలో ఎంత నిర్ద్వందంగా రచయిత భారతీయ తాత్త్వికతను కొట్టి పడేశారో, ఈ పుస్తకం చదువుతుంటే వైజ్ఞానిక దృక్పథంలోని పరిమితులు అర్థమయి, భారతీయ తాత్త్విక చింతన పట్ల గౌరవం పెరుగుతుంది. యోగ మానవ మేధను ఆరు విభిన్నమైన కోణాల్లో విశ్లేషించింది. బుద్ధి, మనస్సు, అహంకారం, చిత్తం అన్న ఈ నాలుగు విభజనలలో ఒక్కో అంశాన్ని మరింత లోతుగా, తార్కికంగా విశ్లేషించింది. ఇలాంటి వివేచన లేకుండా కేవలం న్యూరాన్లు, frontal lobe అంటూ ఓ నాలుగు వైజ్ఞానిక పదాలను వాడేసి, భారతీయ తత్త్వాన్ని పనికిరాదని నిరూపించి వైజ్ఞానిక వివరణ ఇచ్చేశానని ప్రకటించుకోవటం హాస్యాస్పదమే కాదు శోచనీయం కూడా. అలాంటి పుస్తకం పిల్లలు చదవదగినదని భావించి అవార్డు నివ్వటం మూర్ఖత్వానికి పరాకాష్ట అయితే, ఇది పిల్లల పుస్తకం కాదని రచయిత భావించటం అమాయకత్వానికి పరాకాష్ట. పెద్దలకు ఈ మాత్రం విజ్ఞానశాస్త్ర అంశాలతో పరిచయం లేదని రచయిత భావిస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి, రచయితల దృష్టిలో చిన్న పిల్లల పుస్తకం కాదు. కానీ, పెద్దల పుస్తకం కన్నా చిన్నది. ఇలాంటి పుస్తకాన్ని , ఉత్తమ బాలల పుస్తకం అని నిర్ణయించటం మన అవార్డు వ్యవస్థలోని లోపాలను స్పష్టం చేసింది.
‘చేతనత్వానికి మూలం మెదడే’ అనే గొప్ప పేరున్న అధ్యాయంలో చేతనత్వం పేరులో తప్ప పాఠంలో లేదు. ‘మెదడును స్వాధీనంలో ఉంచుకోవటం ఎలా?’ అనే అధ్యాయంలో పాపం రచయిత ఏ విశ్వాసాల కర్రల్ని వదిలివేయాలని ముందుమాటలో రాశారో, ఆ విశ్వాసాల కర్రలకు బలమివ్వటం కనిపిస్తుంది. ‘కొంతమంది యోగులను, సాధువులను పరీక్షించి తెలుసుకొన్నదేమిటంటే.. వారు ఏకాగ్రతతో సాధన చేస్తున్నప్పుడు వారి మెదడులో అసాధారణ రీతిలో ఈ రసాయనాలు (ఎండోర్ఫిన్) ఉత్పత్తవుతున్నాయ’ని అంటూ యోగాభ్యాసాన్ని సమర్థిస్తారు. అంతలోనే తాను వీటన్నింటిని ఖండిస్తానని ముందుమాటలో ప్రకటించినట్లు గుర్తుకొచ్చి ‘ఏదో కొద్దిపాటి అసాధారణ చర్యలు అభ్యసించి వాటిని మహిమలుగా ప్రచారం చేసుకుని, తమలో దైవాంశ ఉందని చెప్పుకునే వారు చెప్పుకుంటున్నారు, నమ్మే జనం నమ్ముతున్నారు’ అని తాతతో అనిపించి, పిల్లవాడితో ‘కామన్‍సెన్స్ ఉన్నవాళ్ళు అలా నమ్మరు తాతగారూ. వివేకవంతుల పరిధి వేరుగా ఉంటుంది’ అంటూ అలవాటయిన రీతిలో అసలు విషయాన్ని వదిలి దారి మళ్ళారు రచయిత. ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తలు శోధించి ఏర్పాటు చేసిన యోగ గొప్పది. కానీ ఆ యోగకు మూలమైన భారతీయ తత్త్వం మాత్రం నిజ నిర్ధారణకు నిలబడదు. ఇదీ రచయిత ఈ పుస్తకాన్ని రాసిన పద్ధతి.
‘మృత్యువు అంటే ఏమిటి?’లో రచయిత సందిగ్ధత, అస్పష్టతలు తేట తెల్లమవుతాయి. ఏం రాస్తున్నారో, ఏం రాయాలనుకుంటున్నారో తెలియకుండా ఏదో రాస్తూ, హఠాత్తుగా మేల్కొని ‘అరే నేను భారతీయ తత్త్వాన్ని పొగడద్దు’ అని గుర్తు తెచ్చుకుని దారి మళ్ళటం స్పష్టంగా తెలుస్తుంది. ‘మృత్యువు అంటే ఏమిటి?’ అని ప్రశ్నిస్తూ భగవద్గీత గురించి చెప్పి ‘ఆ వేదాంతం మనకిక్కడ పనికిరాదు’ అనిపిస్తారు. ఆపై ‘మృత్యువు అంటే ఏమిటి? అనేదానికి నిర్వచనం తరువాత వెతుక్కోవచ్చు’ అని దారి మళ్ళుతారు రచయిత. అటు నుంచి మృత్యు సమయ నిర్ధారణ వైపు వెళ్ళి అనాలోచితంగా పప్పులో కాలేశారు.
‘శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఆత్మ అనేది ఉందని కానీ, లేదని కానీ బయటపడలేదు. ఉందని తేల్చి చెప్పలేకపోయినా, లేదని అయితే, ఇంతవరకూ తేలలేదు. ( నిజనిర్ధారణకు నిలబడవన్న రచయితే లేదని ఇంతవరకూ తేలలేదు అనటం ముందుమాట రాసినవారు వేరు, పుస్తకం రాసిన వారు వేరేమో అనిపిస్తుంది). ‘ కాని ఒకటి మాత్రం నిజం. ఊపిరి ఆగిపోవడం, గుండె ఆగిపోవటం, మెదడు శక్తిహీనమై పోవడం లాంటివి కాకుండా.. శరీరంలో ఇంకేదో కూడా ఉంది. అది ఏమిటనేది ఇంకా తేలలేదు. కానీ ఆడుతూ పాడుతూ హాయిగా బతుకుతున్న మనిషి ఉన్న ఫళాన చనిపోతున్నాడంటే ఏదో తెలియని జీవశక్తి అతని శరీరాన్ని విడిచి వెడుతూ ఉంది.’ (పేజీ నెం.39)
జీవాత్మా, పరమాత్మా నిజ నిర్ధారణకు నిలబడదని ముందుమాట మొదటి వాక్యంలో రాసిన రచయిత, 39వ పేజీ దగ్గరకు వచ్చేసరికి ‘ఏదో తెలియని జీవశక్తి’ అంటున్నారు. మరి తెలియకపోతే తెలియనట్టుండాలి కానీ అన్నీ తెలిసినట్టు ఉత్తర కుమారుడిలా ‘జీవాత్మా, పరమాత్మలు’ నిజ నిర్ధారణకు నిలబడవని డంబాలు పోవడం ఎందుకు? ఎవరిని మభ్యపెట్టాలని ఈ అనవసరమైన ప్రేలాపనలు? ఎవరిని మెప్పించాలో, వారిని మెప్పించేశారు. అవార్డు వచ్చేసింది. ఇది చదివి అయోమయాలకు లోనయి సందిగ్ధాల సుడిగుండాలలో పాఠకులు చిక్కుకుని కొట్టుమిట్టాడడం ఎవరికీ ఏమీ పట్టిలేదు. భారతీయ ధర్మాన్ని పనికిరాదని ప్రకటించేశారు. వైజ్ఞానిక వివరణ అంటూ అసందర్భ ఉదాహరణలిచ్చేసారు. చివరికి ఏమీ తెలియదని ఒప్పుకున్నారు. ఓ చోట ‘మెదడే మనిషి’ అన్న రచయిత మరో చోట ఏదో ‘జీవశక్తి’ అనటంలో అర్థమేదయినా ఉందా? మెదడును చైతన్యవంతం చేసేదాని గురించిన అలోచన ముందుమాటలు, మెదడు మాటలు రాసినప్పుడు రాలేదా? అప్పుడు లేని ‘జీవశక్తి’ ఆలోచన మృత్యువు గురించిన ఆలోచన రాగానే వచ్చిందా? భగవద్గీత వేదాంతం పనికిరాదన్న రచయితకు తెలియని జీవశక్తి ఎలా పనికి వస్తుంది? అంటే, ఏం రాస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో చూడకుండా – రాసిన దానిలో వైరుధ్యాలు ఉన్నాయా, తేడాలు ఉన్నాయా అని కూడా చూసుకోకుండా, భారతీయ తత్త్వం ‘పనికిరాదనేశాం’, చాలు ఇక ఏం రాసినా ‘చల్తాహై’ అనుకున్నారా? అలా రాసేసిన దాన్ని మనం ఉత్తమ బాల సాహిత్యంగా ఎంచి అవార్డులిచ్చి మన గొప్పతనాన్ని ఇతర భాషాలలో వారికి గర్వంగా ప్రదర్శిస్తున్నామన్న మాట. అందుకే భారతీయ తత్త్వం ‘బుద్ధి సర్వం అనుకునేవాడు బుద్ధు’ అంటుంది. ఆ ‘బుద్ధు’తనాన్నే గొప్ప అనుకుని ప్రపంచం మీద రుద్ది ప్రపంచాన్ని బుద్ధుగా మలచాలన్న ప్రయత్నం, కనీసం నిజాయితీగా కూడా లేని ప్రయత్నం ఈ పుస్తకం.
తరువాతి అధ్యాయం ‘ఆత్మ అంటే మరేదో కాదు, జీవశక్తే’ అనే పేరులోనే రచయిత, ‘జీవాత్మ, పరమాత్మ’ అన్నవి నిజ నిర్ధారణకు నిలబడవని అన్న మాట తప్పని ఖండించుకుని తన వేలితో తన కన్నే పొడుచుకున్నారు. నిజ నిర్ధారణకు నిలబడని ఆత్మ, జీవాత్మలు ‘జీవశక్తి’ అని ఎలా నిర్ధారిస్తున్నారు రచయిత? ఒకవేళ ఆత్మ, జీవాత్మ అయితే అది నిజ నిర్ధారణకు నిలబడదని ఎలా అన్నారు? ‘It is to please our masters’ అని ఓ ఆంగ్ల నవలలో బట్లర్ పాత్ర అన్నట్టు, రచయిత నిజ నిర్ధారణకు నిలబడవని తన మాస్టర్స్‌ని సంతృప్తిపరచటం కోసం అన్నారా? భగవద్గీత, వేదాంతం పనికిరాదని ముందు అధ్యాయంలో రాసిన రచయిత, ఈ అధ్యాయంలో ‘నైనం ఛిందంతి శస్త్రాణి’ అన్న శ్లోకాన్ని ఉదహరిస్తూ ‘ఏది ఏమైనా ఆత్మ అన్నా, జీవాత్మ అన్నా, ఏదో తెలియని జీవశక్తి అన్నా.. అన్నీ ఒకటే’ అన్న గొప్ప సత్యం తానే కనుగొన్నట్లు చెప్తారు. ఆత్మ శరీరంలో ఏ భాగంలో ఉందన్న ప్రశ్నకు సమాధానంగా ‘ఆత్మ గనుక ఉంటే అది జీవశక్తే! అది మెదడులోనే ఉండాలి’ అని మళ్ళీ అంటారు. ఆత్మ మెదడులో ఉందా? ఏ వైజ్ఞానిక ఆవిష్కరణ ఇది? జీవశక్తి మెదడులో ఉందన్న దానికి నిరూపణ ఏది?
డిసెంబరు 12, 2013 నాడు ఓక్‍లాండ్, కాలిఫోర్నియాలో డాక్టర్లు 13 ఏళ్ళ జహి మెక్‌మాత్ మరణించిందని ప్రకటించారు. కానీ ఆమె కుటుంబ సభ్యులు – మెదడు పనిచేయనంత మాత్రాన తమ కూతురు మరణించినట్లు కాదని, ఆమె గుండె కొట్టుకుంటున్నది, స్పర్శకు స్పందిస్తోంది కాబట్టి ఆమెకు చికిత్స చేయాలని కోర్టును ఆశ్రయించారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మెడడు మరణించినంత మాత్రాన, మనిషి సంపూర్ణంగా మరణించినట్లు కాదన్న అభిప్రాయం కలిగింది. మనిషి తేరుకోకపోవచ్చు కానీ మెదడు పని ఆపేసినా మనిషి మరణం సంపూర్ణం కాదని నిరూపించిన ఈ సంఘటనలో కాలిఫోర్నియాకు చెందిన Uniform Determination of Death Act ‘(a) an individual who has sustained either (1) irreversible cessation of circulatory and respiratory functions, or (2) irreversible cessation of all functions of the entire brain, including the brain stem, is dead.’ అని తీర్మానించింది. అంటే మెదడు పని ఆపినంత మాత్రాన మరణంగా నిర్ధారించే వీలు లేదన్న మాట. అలాంటప్పుడు జీవశక్తి మెదడులోనే ఉందని నిర్ధారణగా చెప్పగలమా? శాస్త్రవేత్తలు, పరిశోధనలు చేసినవాళ్ళే సరిగా నిర్ధారణకు రానప్పుడు రచయిత, వైజ్ఞానికి దృక్పథం గలవారు, ఎలా నిర్ధారణగా ‘జీవశక్తి మెదడు లోనే ఉండాలి’ అని నిర్ధారిస్తారు? పైగా ‘జీవశక్తి అంటే ప్రాణం ఉన్నట్టు! అది నశిస్తే ప్రాణం పోయినట్టు! జీవశాస్త్రం ప్రకారం ఈ విషయం ఇంతే!’ అంటారు. దాని కోసం ఇంత పుస్తకం రాయాలా? రాసినా దానికి అవార్డు లివ్వాలా?
మిగతా పుస్తకం అంతా ఆయుర్వేదం ప్రాముఖ్యం తెలిపే రెండు చాప్టర్లు, ఆ తరువాత జాతి సమస్యలు, సామాజిక సమస్యలు ఇలాగే స్పష్టత లేకుండా, పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలతో ఉంటుంది. పుస్తకం అంతా చదివినా, ‘నేను’ అంటే ఏమిటో తెలియదు. అసలు విషయం వదిలి, రచయిత అనవసరమైన అనేక విషయాలు రాసి, పుస్తకం ముగించారు. ఈ పుస్తకం చదివేకన్నా ఏ ఉపనిషత్తో, దాని వ్యాఖ్యానమో చదువుకుంటే జీవితం అంటే ఓ అవగాహన, ఆలోచనలు వచ్చే వీలుంది. అవి చదువుతుంటే, ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. వ్యక్తి దృష్టి తెలుసుకోవాలన్న అన్వేషణ వైపు మళ్ళుతుంది. అందుకు భిన్నంగా ఈ పుస్తకం చదువుతుంటే జిజ్ఞాస, అవగాహనలు అటుంచి రచయిత అయోమయం, అవగాహానా రాహిత్యం అర్థమయి జాలి కలుగుతుంది. ఇంత వృథా ప్రయాస పడి భారతీయ తత్త్వాన్ని తక్కువ చేయాలని ప్రయత్నించి తన సమయాన్ని వ్యర్థం చేసుకుని, వేరే వారి సమయాన్ని వ్యర్థం చేసే బదులు భగవద్గీతను చదివితే కాస్త పరిజ్ఞానం లభించే వీలుంటుంది కదా అనిపిస్తుంది. ఇక ఈ పుస్తకానికి అవార్డు ఇచ్చిన వారిని చూస్తే జాలి కన్నా ఎక్కువ భావన ఉంటే అది కలుగుతుంది. బహశా వారు, ఈ పుస్తకం చదివి ఉండరు. రచయిత పేరు, పుస్తకం పేరు, ముందుమాట చదివి ‘ఆహా, భారతీయ తత్త్వాన్ని కూలద్రోసి, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచే పుస్తకం’ అని భ్రమ పడి ఉంటారు. వారి కన్నా, తెలుగు పాఠకులను చూసి ఇంకా ‘అయ్యో పాపం!’ అనిపిస్తుంది.
చివరగా తాత్త్వికతను తక్కువ చేసి, విజ్ఞానశాస్త్రానికి పెద్ద పీట వేయాలనుకునేవారు గమనించాల్సిందేమిటంటే, నీళ్ళల్లో ఉన్న చేపకు తానున్న చెరువు విస్తృతి తెలియదు. అది తెలియాలంటే నీటి బయటకు రావాలి. కానీ నీటి బయటకు వస్తే అది బ్రతకలేదు. భౌతికపరమైన విజ్ఞానం ఇలాంటిదే. భౌతిక శరీరానికి బద్ధుడైన మనిషి, ఆ భౌతిక పరిమితులకు లోబడి ఉండాల్సిందే. ఆ పరిధికి ఆవల ఉన్న విషయాలు తెలియాలంటే, ముందుగా తన పరిమితులను దాటాలి. పరిధిని విస్తృతం చేసుకోవాలి. విజ్ఞాన శాస్త్రాభివృద్ధి చీకటి గుహలో కాగడాతో ప్రయాణంలాంటిది. వెలుతురు ఎంత దూరం పడితే అంత దూరం కనిపిస్తుంది. ఆ కనిపించే విషయాల ఆధారంగా సిద్ధాంతాలు చేస్తారు. తీర్మానాలు జరుగుతాయి. మరో అడుగు వేసేసరికి కొత్త స్థలంలో వెలుతురు పడుతుంది. ఇప్పుడు కనిపిస్తున్న వాటి ఆధారంగా పాత సిద్ధాంతాలను నిర్ధారించటమో వాటిని కాదని కొత్త తీర్మానాలు చేయటమో జరుగుతుంది. మరో అడుగుకు మళ్ళీ అన్నీ మారే వీలుంటుంది. ఈ సిద్ధాంతాలూ, తీర్మానాలూ కూడా వ్యక్తి పరిమితులు, పరిధుల ఆధరంగానే ఏర్పడతాయి. అంటే భౌతికత ఆధారంగా తెలిసే ఏ సత్యంకూడా సంపూర్ణ సత్యం అయ్యె వీలులేదన్నమాట. ఇది గ్రహించిన భారతీయ తాత్త్వికులు శారీరక పరిధిని అధిగిమించేందుకు పలు ప్రయోగాలు చేసి, భావి తరాలకు అందించిన ఫలితాలు భారతీయ తాత్త్విక దర్శనాలలో పొందుపరచారు. ఏ విషయాన్నీ కేవలం ఒకే కోణంలో, ఒకే డైమెన్షన్ లో చెప్పలేదు. ప్రతి దాన్నీ, వీలయినన్ని కోణల్లో పరిశోధించి, తర్కించారు. విశ్లేషించారు. అందుకే భూ, భువః, సువః అంటే భూమి, ఆకాశం, అంతరిక్షం అంటూ, ఇదంతా దాటి పెంజీకటి కవ్వలకావల దర్శించిన కంటితో చూడలేనిది, ఆలోచనతో తెలుసుకోలేనిది, మెదడుతో గ్రహించలేనిది అయిన సత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నించారు. అవి అర్థం చేసుకోవటం చేతకాకపోతే, అవి వదిలి వేరే పని చూసుకోవాలి కానీ రాళ్ళు విసిరే ప్రయత్నాలు, దాన్ని చులకన చేసి ఇతరులకు దూరం చేసే పనులు చేయడం కూడదు. ఎందుకంటే, ఎవరెంత ప్రయత్నించినా, ఎన్ని పాట్లు పడ్డా, మానవ మేధ ఎదిగే ఎత్తులు, దర్శించే లోతులూ సర్వం భారతీయ తాత్త్విక చింతన ప్రదర్శిస్తుంది. దాన్ని మించి ఎవరూ చేసేది ఏమీ లేదు. ఆత్మ, పరమాత్మ నిజ నిర్ధారణకు నిలబడవని ప్రకటించిన రచయిత చివరకు ‘ఆత్మ జీవాత్మ అని, జీవశక్తి మెదడులో ఉంటుందని’ తీర్మానించక తప్పలేదు. అది భారతీయ తాత్త్వికత గొప్పతనం. ఎలాగయితే ఎటు పోయినా మనిషి ఆకాశం దాటి పోడో, అలాగే విజ్ఞానశాస్త్రమే కాదు, వివేచన, ఆలోచన ఏం చేసినా అది భారతీయ తాత్త్విక పరిధి దాటి పోలేదు. కాబట్టి కన్ను చూడలేని, మెదడు గ్రహించలేని ‘పరమాత్మ’ భావనను కళ్ళతో చూడాలని, మెదడుతో అర్థం చేసుకోవాలన్న వ్యర్ధ ప్రయత్నాలు, దాన్ని చులకన చేయాలన్న భావనలు వదిలి – అర్థం చేసుకోవాలన్న ప్రయత్నాలు, సాటి మానవుడికి మంచి చేయాలన్న ఆలోచనలపై దృష్టి పెట్టడం శ్రేయస్కరం. అందుకే ఈ పుస్తకానికి సాహిత్య అకాడెమీ అవార్డు ఎలా ఇచ్చారన్న సందేహం వస్తుంది.
( వచ్చే వారం సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన మరో పుస్తకం విశ్లేషణ వుంటుంది. )