Site icon Sanchika

ఈ తరం యుద్ధ కవిత (1971-’80) – పుస్తక పరిచయం

[dropcap]’ఈ[/dropcap] తరం యుద్ధ కవిత’ (1971-’80) డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘తొలి దశాబ్ది కవితా సంకలనం’. రైటర్స్ సర్కిల్ తొలి ముద్రణ. ఇందులో 31 కవితలున్నాయి.

***

“రైటర్స్ సర్కిల్ నుంచి ఒక కవితా సంకలనం తేవాలని నిర్ణయించి పత్రికా ప్రకటన ఇచ్చినం. వందల కవితలు వచ్చినవి. చాలా కవితలు పసలేనివి. ఈ కవితలతో సంకలనం వేయడం వృధా అనిపించింది. అలాకాదు, 1971-80 దశాబ్దిలోని ఉత్తమ కవితల్ని ఏరి సంకలనం వేద్దామని ప్రతిపాదించిన. సభ్యులు సరే అన్నరు. మరి పది సంవత్సరాల అన్ని పత్రికల్ని చదివి కవితలు ఎవరు సేకరించాలె? ప్రతిపాదన నాది కాబట్టి ఆ బాధ్యత అనివార్యంగా నామీదే పడింది. యూనివర్సిటీ లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలకు వెళ్ళి – జిరాక్స్ లేని రోజులు కాబట్టి – ఉత్తమ కవితల్ని సెలెక్ట్ చేసి వందల పేజీలు రాసుకుని వచ్చిన. వాటిలోంచి ఫైనల్‌లో సెలెక్షన్ కోసం నేను, గుడిహాళం, లక్నారెడ్ది, ఏసుపాదం, చారి కూర్చున్నాం. ఆ దశాబ్దం విప్లవ కవిత్వం దశాబ్ది కాబట్టి కేవలం విప్లవ కవుల కవితలే ఉండాలని కొందరన్నరు. మనం రైటర్స్ సర్కిల్‍ను ఏర్పర్చుకున్నదే విశాల ప్రాతిపదికన, కాబట్టి కేవలం ఒకే దృక్పథానికి లోబడక, ప్రజాస్వామిక హృదయమున్న కవితలను తీసుకోవాలనే నిర్ణయానికొచ్చినం” అన్నారు డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తమ సంపాదకీయం ‘ఆనాటి ఉద్వేగ ప్రతిబింబం’లో.

***

“తెలుగులో వచ్చిన విప్లవ కవిత్వం అంతా ఈ సంపుటిలో లేదు. ఈ సంపుటిలో ఉన్న కవితా ఖండికలన్నింటినీ విప్లవ కవిత్వంగా అందరూ అంగీకరించకపోవచ్చు. కొన్ని కవితల్లో కనిపించే రాజకీయ ధోరణికి, ఇప్పటి దృష్టితో చూస్తే చారిత్రకమైన ప్రాముఖ్యం మాత్రమే ఉంది. అంటే ఆ రకపు రాజకీయ అవగాహనకు ప్రస్తుత పరిస్థితులలో కార్యాచరణ ప్రాముఖ్యం లేదు. ఒక పదేళ్ళ కాలంలో వచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలకు తెలుగు కవితా స్పందనలివి. రాజకీయ అవగాహనలో స్వల్పమైన బేధాలున్నా సాహిత్య దృక్పథంలో ఈ కవితల మధ్యన స్థూలమైన సామ్యం ఉంది.
~
విప్లవ భావాలు వచన కవిత్వాన్ని యెంత శక్తివంతమైన రూపాలుగా మలచగలవో ఈ సంపుటి రుజువు చేస్తుంది. అంటే వచన కవితా రూపం విప్లవ కవిత వస్తువుతో సాఫల్యం పొందింది. అంతేగాక పాటలన్నీ ఒకే రకం ఎట్లా కావో వచన కవిత్వం అంతా ఒకే మూస కాదనడానికి ఈ సంపుటి మంచి ఉదాహరణ.
~
ఒకే లక్ష్యంతో వస్తు వైవిధ్యంతో భిన్న రూప ప్రయోగంలో పదేళ్లలో వచ్చిన కవిత్వాన్ని ఒకచోట పేర్చిన ఈ సంకలనం ఇంతకుముందు సంకలనాల కన్నా విశిష్టమైనదని గుర్తించడం కష్టం కాదు. పాత సంకలనాల కన్న ఇందులో దృష్టి నైశిత్యం ఉంది. వస్తు విస్తృతి ఉంది. బలమైన ఆధునిక వ్యక్తీకరణ ఉంది. ఇది ఉత్తమ కవిత్వం సాధించే సామాజిక ప్రయోజనాన్ని సాధిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నాను” అన్నారు చేరా తమ ముందుమాట ‘కల్లోల దశాబ్దపు కవితా తరంగాలు’లో.

***

ఈ తరం యుద్ధ కవిత (1971-’80)
సంపాదకులు: డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
ప్రచురణ: తెలంగాణ ప్రచురణలు
పుటలు: 108,  వెల: ₹ 60/-
ప్రతులకు:

  1. తెలంగాణ ప్రచురణలు, ఇందిరా నివాస్, 3/97, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ 500010. ఫోన్: 9849220321
  2. అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
Exit mobile version