[box type=’note’ fontsize=’16’] పిల్లలన్నా, వారితో సావాసం చేయటమన్నా నాకెంతో ఇష్టం. తరగతి గదిలో, ఆటస్థలంలో, ఇంట్లో, ఎక్కడైనా సరే పిల్లల ఆటపాటలు ఉంటే సందడే సందడి. ఆ సందడి నాకెంతో ఇష్టం. ఉమయవన్ తమిళంలో రాసిన ‘పరక్కుమ్ యానై’ కథలు చదివిన తరువాత అవి బాగా నచ్చి వాటిని మన తెలుగు పిల్లలకు దగ్గరచేయాలనే ఉద్దేశ్యంతో తెలుగులోకి అనువదించాను. అందులోని కథలే మీరిప్పుడు చదువుతున్నది! – రచయిత్రి (అనువాదకురాలు)
~ ~
పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఈ పది కథలూ చాలా సరదాగా అనిపిస్తాయి. వీటిలో కల్పన ఉన్నా, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల బాధ్యత అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి నీతిని బోధించే కథలు కావు. గంభీరంగా ఉండవు. కాని, చిన్న చిన్న అంశాలతోనే ఎంతో పెద్ద విషయాన్ని పిల్లలకు అర్థమయేట్లుగా, వారు పాటించేటట్లుగా బోధపరుస్తాయి. అదే వీటి విలక్షణత. [/box]
[dropcap]ఆ[/dropcap]షిక ఒక చిన్న అమ్మాయి. ఆమెకు వాళ్ల మామయ్య చెప్పే కథలంటే ఎంతో ఇష్టం. ప్రతి రాత్రి ఆ అమ్మాయికి వాళ్ళ మామయ్య చెప్పే కథ విన్న తరువాత మాత్రమే నిద్రపోయే అలవాటు అయ్యింది. అదొక నిత్యకృత్యం అయిందన్న మాట! మనం కథ చెప్పుకుంటున్న ఈ రోజున మాత్రం రోజూ కంటే కొంత భిన్నంగా జరిగింది. ఏమైందంటే – వాళ్ళ మామయ్య రోజూ లాగానే కథ చెప్పటం మొదలు పెట్టబోతూ ఉంటే ఆషిక “మామయ్యా నాకు ఈ పాత కథలు వద్దు. ఈరోజు ఒక క్రొత్త కథ చెప్పవలసిందే” అని చాలా పట్టుదలగా అడిగింది. మామయ్య ఆషికను ఎలాగో ఒకలాగా సముదాయించాలని ప్రయత్నించాడు. కాని ఆషిక ఎంత మాత్రం తన పట్టు వదలలేదు. ససేమిరా ఒప్పుకోలేదు. “ఏదేమైనా నువ్వు నాకు క్రొత్త కథ చెప్పవలసిందే” అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆమె కళ్ళనుండి కన్నీరు ఆగకుండా జాలువారుతూ ఉన్నది.
ఇంతలో ఉన్నట్లుండి ఇంటి బయట ఒక గొర్రె పిల్ల అరుస్తున్నట్లు వినిపించింది. అదేమిటో చూడాలని మంచం పైనుండి దూకి చూసింది. గొర్రె పిల్లలు అంటే ఆషికకు చాలా ఇష్టం. ఇంకేం! ఏం చేస్తున్నది గమనించలేని స్థితిలో ఆ గొర్రె పిల్లను వెంటాడుతూ దాని వెనుకే వెళ్ళసాగింది. ఆ గొర్రె పిల్ల గెంతుతూ దూకుతూ పోతున్నది. దాని వెనుకనే పరుగు తీస్తున్న ఆషికకు తాను ఎక్కడికి పోతున్నదో తెలిసే లోపుగా వాళ్ళిద్దరూ ఒక వింత ప్రదేశానికి చేరుకున్నారు.
ఒక పెద్ద చెట్టు క్రిందకు చేరుకున్న తరువాత గొర్రె పిల్ల ఆగింది. ఆషిక కూడా కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్నది. అలాగే ఆ చెట్టుక్రింద నిద్రపోయింది. నిద్ర మెలకువ వచ్చేసరికి ఏమైందో తెలియక చాలా గాభరా వేసింది ఆషికకు. కళ్ళు విప్పార్చుకుని పైకి చూసింది. కొన్ని వేల పూవులు చెట్టు పై నుండి ఆషిక వైపు ఆమెను తమ దగ్గరకు రమ్మన్నట్లుగా చూస్తూ నవ్వుతున్నాయి. ఆషికకు ఏమీ అర్థం కావడం లేదు. అయోమయంగా అటూ ఇటూ చూడసాగింది. నెమ్మదిగా ఆషిక ఆ చెట్టుతో మాట్లాడటం మొదలుపెట్టింది. “నాకీ చుట్టుప్రక్కల ఏమేమి ఉన్నాయో చూపిస్తావా?” అని అడిగింది. అయితే దీనికి ఆ చెట్టు కాకుండా పువ్వులు జవాబు చెప్పాయి – “చూడు! చెట్టు తానున్న చోటినుండి కదలలేదు కదా! అలాంటప్పుడు నీకు ఈ చుట్టుప్రక్కల ఏముందో చూపటం అన్నది చెట్టుకు అసాధ్యం. అర్థమైంది కదా?” అన్నాయి పువ్వులు.
సరిగ్గా అప్పుడే ఆ చెట్టు మీద నివసిస్తున్న చిలుకమ్మలు వాళ్ళ సంభాషణలో కలుగజేసుకుంటూ, “ఈ చుట్టు ప్రక్కల ఒక ఎగిరే ఏనుగు ఉన్నది. అది నువ్వు తప్పక చూసి తీరాలి సుమా!” అన్నాయి ఆషికతో.
ఆ చిలుకమ్మలు చెప్పిన విషయం విన్న ఆషికకు ఆశ్చర్యంతో నోటి వెంట మాట రాలేదు. అంటే, తాను ఇప్పుడు ఎగిరే ఏనుగును చూడబోతున్నదన్నమాట! ఎంతో ఆనందంతో తను సిద్ధమే అన్నట్లు గబగబా తలూపింది. ఎగిరే ఏనుగును స్వయంగా చూడటం కోసం ఆ చిలుకమ్మల వెంట బయలుదేరింది. ఆ చిలుకమ్మలు అడవిలో ఎటు తీసుకుపోతుంటే అటే వెళ్ళసాగింది. ఉన్నట్లుండి ఆ చిలుకమ్మలు ఒకచోట ఆగిపోయాయి. ఆషిక ముందు ఒక అద్భుతమైన ఎగిరే ఏనుగు నిలబడి ఉన్నది. ఆ ఏనుగమ్మకు చాల పెద్ద రెక్కలు ఉన్నాయి. తన ఆశ్చర్యాన్ని అదుపులో పెట్టుకోలేని ఆషిక ఆ ఏనుగు చుట్టూ అంతులేని ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొడుతూ గంతులు వేయసాగింది.
అంతలో ఆ ఏనుగు ఆషిక వైపు తిరిగి “అడవిలో అలా.. అలా… తిరిగి వద్దామా? లేక నువ్వు ఎక్కడికైనా ప్రత్యేకంగా వెళ్లాలని అనుకుంటున్నావా? ఏదైనా వింతలు, విశేషాలు చూడాలనుకుంటున్నావా?” అని అడిగింది. “నిన్ను ఎక్కడికైనా సరే, తిప్పి తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని కూడా చెప్పింది ఆ ఏనుగు. చిన్నారి ఆషిక ఎప్పటినుంచో చంద్రుడిని చూడాలన్న కోరికతో ఉన్నది. వెంటనే అదే మాట ఏనుగుతో చెప్పింది. ఏనుగు చిరునవ్వుతో ఆమె కోరికను అంగీకరించింది.
ఆషిక ఒక్క గంతు వేసి ఎగిరే ఏనుగు వీపు పై ఎక్కి కూర్చుంది. ఏనుగు, ఆషిక అలా గాలిలో తేలుతూ పోతూ ఉన్నారు. అలా ఎగురుతూ పోతున్న ఏనుగు ఒక కొండ దగ్గర ఆగి ఆషికను తన పైనుండి దింపింది. ఎందుకంటే, అప్పటికే అక్కడ ఆషికను చంద్రుడి దగ్గరకు తీసుకు వెళ్లేందుకు మేఘాలు ఎదురుచూస్తూ ఉన్నాయి. ఆషిక ఒక్క ఉదుటున ఒక మబ్బు పైకి ఎక్కి కూర్చుంది. ఆ మేఘం ఆషిక పడుకునే మెత్తని పరుపులా ఎంతో మృదువుగా ఉన్నది.
అలా మేఘం పై ఆషిక చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత దూరంగా చందమామ కనిపించాడు. తన కళ్ళను తానే నమ్మలేక పోతున్నది ఆ చిన్నారి ఆషిక. చందమామకు దగ్గరగా రాగానే మేఘం ఆగి ఆషికకు చందమామ పైకి ఎలా దిగాలో వివరంగా చెప్పి తన వీపు పై నుంచి ఆమెను క్రిందకు దింపింది. చందమామపై అడుగుపెట్టినదే ఆలస్యం, పరవశంతో ఆషిక చందమామకు ముద్దులు పెట్టింది. చందమామ తాను కూడా ఎంతో ఆనందపడుతూ ఆషికకు ముద్దులు పెట్టింది. “నీకిష్టమైనంత సేపు నా పైన ఆడుకో చిన్నారీ” అని ఆషికకు చందమామ ఎంతో ప్రేమతో చెప్పింది.
ఆషిక చందమామతో తన నానమ్మ జ్ఞాపకాలను నెమరు వేసుకోసాగింది. ఎలా అంటే – నానమ్మ తనకు అన్నం కలిపి పెడుతూ చందమామను గురించి చెప్పే కథలు, పాడే పాటలు ఇవన్నీ ఆమెకు గుర్తు వస్తున్నాయి. నానమ్మ చందమామ అందాల గురించి పాటలు పాడడం ఆమెకు గుర్తు వచ్చింది. చందమామతో ఆడుకుంటూ తన జ్ఞాపకాలలో తేలిపోసాగింది. కొంతసేపటి తరువాత ఆమె చందమామతో “మేఘాలను పిలవవా మామయ్యా, నేను ఇంటికి వెళతాను” అన్నది. చందమామ వెంటనే మేఘాన్ని పిలిచింది. చిన్నారి ఆషిక ఒక్క గంతులో వాన నీటితో బరువెక్కిన ఆ మేఘం పై ఎక్కి కూర్చుంది. మేఘం బయలుదేరబోతుండగా ఆషిక చందమామకు మనసారా తన కృతజ్ఞతలు తెలియజేసింది.
ఆ మేఘం ఆషికను ఓ నదీ తీరంలో దింపింది. అక్కడ ఒక డజనుకు పైగా జింకలు నీళ్లు తాగుతూ ఉండడం చూసింది ఆషిక. ఆ అందాల జింకలను చూసిన ఆ చిన్నారి పులకరించి పోయింది. వాటి పొడవాటి కొమ్ములను చూస్తూ అలాగే ఉండిపోయింది. ఒక జింక కొమ్ముల మధ్యలో పక్షి గూడు ఉంది. అందులో బుల్లి బుల్లి పక్షి పిల్లలు కూడా ఉండటం గమనించింది! పిట్టలతో, వాటి పిల్లలతో చాలాసేపు అక్కడే గడిపేసింది. తల్లి పక్షి కనబడకపోతే పిల్లల ఆతురత ఎంతో వింతగా అనిపించింది. పక్షి పిల్లలు తమ తల్లులను చూసి ఆపేక్షగా కిచకిచలాడుతుంటే ఆషికకు ఎంతో ముచ్చటేసింది.
అప్పుడు ఇక ఆషికకు వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది. అంతే! వెంటనే అక్కడి నుండి ఇంటి వైపు బయలుదేరింది. అమ్మను చూడాలని కళ్ళు తెరచిన చిన్నారికి తల్లి తన మామయ్యతో మాట్లాడుతూ కనిపించింది. ఇంతసేపూ తాను చూసినదంతా కల అని ఆషిక గ్రహించింది! ఒక్క ఉదుటున లేచి తల్లిని, మామయ్యను గట్టిగా కౌగిలించుకున్నది ఆషిక. తన ప్రియమైన తల్లి, మామయ్య ఇద్దరూ తన పక్కనే ఉన్నారని సంబరపడింది. ఆ ఆనంద క్షణాలలోనే ఆషిక తనకి ఇంత అందమైన అనుభవాలను పంచిన ఎగిరే ఏనుగుకు మనస్సులోనే తన కృతజ్ఞతలు తెలియజేసుకుంది.
మూలం: ఉమయవన్ రామసామి
తెలుగు: వల్లూరు లీలావతి