Site icon Sanchika

మేధా దోపిడీపై మేలైన నవల!

[dropcap]వృ[/dropcap]త్తిరీత్యా సైన్స్ రంగంలో ఉన్నా ప్రవృత్తి రీత్యా సాహిత్య రంగంలో కృషి చేస్తూ రాణిస్తున్న వారిలో డా. శ్రీసత్య గౌతమి ఒకరు. తెలుగు నేలకు దూరంగా అమెరికాలో ఉన్నా, అచ్చ తెనుగులో వివిధ ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. తాజాగా ఆమె ‘ఎగిసే కెరటం’ పేరిట ఓ నవలను వెలువరించారు. ఇది ఓ ప్రముఖ అంతర్జాల మాస పత్రికలో ధారావాహికగా వెలువడింది. ప్రధానంగా ప్రస్తావించుకోవలసింది, కథాంశం గురించి. పరిశోధనా రంగం అనగానే నిరంతరం ప్రయోగాలలో, పరిశోధనలలో నిమగ్నమయ్యే మేధో సంపన్న శాస్త్రవేత్తలు (సైంటిస్టులు) మాత్రమే మన కళ్ల ముందు మెదులుతారు. కానీ పరిశోధనా రంగంలోని చీకటి కోణం మన దృష్టికి రాదు. డా. సత్య గౌతమి దీన్నే తన తొలి నవలా రచనకు కథా వస్తువుగా ఎంచుకుని, పరిశోధనా రంగంలో పరుచుకున్న అవినీతి, అక్రమాలు, అసూయలు, ద్వేషాలు, హద్దు మీరిన స్వార్థాలు ఎలా ఉంటాయో, దుర్మార్గుల కుతంత్రాలకు నిజమైన మేధావులు, అసలైన పనిమంతులు ఎలా బలయిపోతారో తేటతెల్లం చేస్తూ వైవిధ్య భరిత నవలగా రూపొందించారు.

ఇందులో ప్రధాన పాత్ర ప్రతినాయక సింధియా. ఆశలు అందరికీ ఉంటాయి. కానీ సింధియాకు ఉన్నవి దురాశలు. తనకు తానుగా ఏమాత్రం కష్టపడకుండా సునాయాసంగా సిద్ధింపజేసుకోవాలనుకుంటుంది. అందుకు ఎదుటి వారిని తొక్కేయడానికి ఏమాత్రం వెనుకాడదు. బాస్ ఛటర్జీ అండదండలు పుష్కలంగా లభించడంతో ఆమె దుర్నీతికి అడ్డు, అదుపు లేకపోయింది. సైన్సే లోకంగా ఉంటూ బిశ్వా మూడేళ్లపాటు పరిశ్రమించి సాధించుకున్న డేటాను అన్యాయంగా సొంతం చేసుకుని అక్రమంగా పిహెచ్.డి. పొందుతుంది. కేవలం అమెరికాకు ఎగిరిపోవడానికే రాకేష్‌ను పెళ్లి చేసుకుంటుంది. అమెరికాలో కౌశిక్ ఇప్పించిన ఉద్యోగాన్ని తన నిర్లక్ష్యంతో కోల్పోతుంది. భర్త రాకేష్ దగ్గర ఎక్కడలేని ఆధిక్యత ప్రదర్శించి, వివాదాలకు దిగి, చివరకు అతడు విడాకులు కోరితే ఆమోదిస్తుంది. ఆమెకు ముందునుంచే కుటుంబ అనుబంధాలు, ఆత్మీయతల పొడ గిట్టదు. కల్లబొల్లి మాటలతో కౌశిక్‌ను పడగొట్టి అతడి ల్యాబ్ లోనే ఉద్యోగాన్ని సాధించుకుంటుంది. అక్కడ కూడా తనదే పెత్తనం కావాలన్న స్వార్థంతో, సీనియర్ అయిన లహరిని వేధింపులకు గురిచేసి, చివరకు లహరి తాగే కాఫీలో డ్రగ్ కలిపి ఆమెను ఆసుపత్రి పాలు చేస్తుంది.

అయితే సింధియా ఇల్లలకగానే పండుగ కాలేదు. చివరకు నిజం నిగ్గుదేలి సింధియా జైలు పాలైతే, లహరి విజయం సాధిస్తుంది.

నవలలోని పాత్రల స్వభావాలను, తీరుతెన్నులను రచయిత్రి ఎంతో నేర్పుగా చిత్రీకరించారు. ఛటర్జీ, కౌశిక్ పాత్రలను పరిశోధనా రంగంలో మేధో దోపిడీ చేస్తూ, నీతి నియమాల్లేకుండా ప్రవర్తిస్తూ పెద్దరికం చలాయించే బాస్‌లకు ప్రతీకలుగా చక్కగా మలిచారు. లహరి పై విష ప్రయోగంలో కౌశిక్ పాత్ర ఉందనే విషయం చివరగా చెప్పి మంచి జెర్క్ ఇచ్చారు.

మేధో దోపిడీకి గురయిన బిశ్వా, లహరి పాత్రలను సమున్నతంగా తీర్చిదిద్దారు. బిశ్వా నిరాశా నిస్పృహలతో ఛటర్జీ, సింధియాల దుర్మార్గాన్ని తట్టుకోలేక, మనోవ్యధకు లోనయి ల్యాబ్‌నే విడిచిపెట్టి, భవిష్యత్తునే కోల్పోతే, లహరి విష ప్రయోగానికి గురి అయినా, ధైర్యంగా న్యాయ పోరాటం చేసి నెగ్గింది.

అర్హత లేకున్నా, అది సాధించే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా అక్రమ మార్గాలలో అందలం ఎక్కాలనుకునే సింధియా లాంటి వారు చివరకు తగిన మూల్యం చెల్లించక తప్పదని రచయిత్రి మంచి సందేశం ఇచ్చారు. సత్య గౌతమి సైంటిస్ట్ కావడంతో పరిశోధనా రంగం లోతుపాతులు బాగా తెలిసిన వ్యక్తిగా నవలా వస్తువును సమర్థవంతంగా డీల్ చేశారనిపిస్తుంది. చిన్న నవల అయినా చిక్కటి కథనంతో చక్కని నవలగా మలచిన డా. శ్రీసత్యగౌతమి జె అభినందనీయురాలు.

***

ఎగిసే కెరటం (నవల)
రచన: డా. శ్రీసత్య గౌతమి
ప్రచురణ: జెవి పబ్లికేషన్స్,
పేజీలు: 100
వెల: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
జ్యోతి వలబోజు – 80963 10140

Exit mobile version