Site icon Sanchika

ఉత్కంఠభరితం – ‘ఎగురుతున్న జెండా మనది’

[డా. ప్రభాకర్ జైనీ గారి ‘ఎగురుతున్న జెండా మనది’ అనే నవలని జి.ఎస్. లక్ష్మి గారు సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు.]

[dropcap]క[/dropcap]న్నతల్లినీ, జన్మభూమినీ గౌరవించి, పూజించాలని చెప్పే రచనలలో ఈమధ్య నేను చదివిన నవల డా. ప్రభాకర్ జైనీ గారు వ్రాసిన ‘ఎగురుతున్న జెండా మనది’ అనే నవల. ఈ నవల చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

వేల సంవత్సరాల నుంచీ మన దేశంలో ఉన్న ఆయుర్వేద వైద్య చికిత్సా విధానాలతో ప్రస్తుతం ప్రపంచానికే సవాలుగా నిలిచిన కేన్సర్ మహమ్మారికి చికిత్స చేస్తున్న ఒక ఆయుర్వేద వైద్యులు ముడుంబై శఠగోపాచారిగారు. నర్సాపురం దగ్గర్లో ఉన్న ‘చరక’ అనే గ్రామంలో ఉండే శఠగోపాచారిగారు ఉదయం గుళ్ళో శివునికి ఎంత భక్తితో అభిషేకం చేస్తారో అంతే శ్రధ్ధతో కాన్సర్‌కు ఆయుర్వేద మందులు వితరణ చేయడం వారి ఇంట వొస్తున్న ఆచారం.

నవ నాగరికతకు దూరంగా, ఆధునిక జీవన విధానం కల్పించిన అన్ని సౌకర్యాలూ, చారిగారి ‘చరక’ వైద్యాలయానికి అంత దూరంలోనే ఆగిపోతాయి. డెభ్భై ఏళ్ళుగా ఎటువంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా, తరతమభేదం లేకుండా వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు కల్పిస్తూ చారిగారు చేస్తున్న వైద్యం ఏ విధంగా వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్న బడాబాబులకు కంటకమైందో, వారిని తొలగించుకుందుకు ఆ బడాబాబులు ఎటువంటి కుట్రకు తలబడ్డారో చదువుతుంటే మనకు భయం వేస్తుంది.

అంతేకాకుండా ఆ కుట్రలో భాగంగా భారతదేశాన్ని కూడా అతలాకుతలం చేద్దామనే సంకల్పంతో పఠాన్‌కోట్‌లో ఉన్న ఏర్ బేస్ మీద దాడిని కూడా దీనితో కలిపి విదేశాల్లో కూర్చుని ఆ దుష్టులు పన్నాగాలు పన్నుతుంటారు. ఆ ఏర్ బేస్ లోనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లో ఉన్న నర్సింహ శఠగోపాచారిగారి కొడుకు కావడం కథలో మరింత పట్టును పెంచింది.

శఠగోపాచారి, వారి భార్య శార్వరిగారి పాత్రలను ఉదాత్తంగా చిత్రీకరిస్తూ, మిగిలిన పాత్రలలోని ప్రణయభావాలను కూడా సందర్భోచితంగా వ్రాస్తూ, పాఠకులలో, అడుగడుగునా ఉత్కంఠను పెంచుతూ సాగిన ఈ నవల డా. ప్రభాకర్ జైనీ గారి నవలలోని ప్రత్యేకతను ఎత్తి చూపించింది.

మన దేశం, మన సంస్కృతి, మన గొప్పదనం మనం నిలుపుకోవాలని తెలుపుతూ వ్రాసిన ఈ నూట ఎనభైయ్యారు పేజీల నవల చదువుతుంటే మనం కోల్పోయినదాన్ని మరలా తిరిగి తెచ్చుకోవాలన్న ఆవేశం కలుగుతుంది. ఇంత మంచి నవలను అందించిన ప్రభాకర్ జైనీ గారికి అభినందనలు.

***

ఎగురుతున్న జెండా మనది (నవల)
రచన: డా. ప్రభాకర్ జైనీ
పేజీలు: 186
వెల: ₹ 250/-
ప్రతులకు:
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత వద్ద:
Address:
Dr. Prabhakar Jaini, Flat No. 111,
‘C’ Block, Vishnu Residency,
Gandhinagar, Hyderabad – 500080
Cell: 7989825420

 

Exit mobile version