[box type=’note’ fontsize=’16’] ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం నేపథ్యాన్నీ, ఈ పండుగ రమజాన్ పండుగ అని ఎందుకు పిలవబడుతోందో తెలుపుతూ, ఈ పండుగ సమాజంలో ఒక చక్కని సుహృద్భావపూర్వకమైన, ప్రేమపూరితమైన, సామరస్య కుసుమాలను వికసింపజేస్తుందంటున్నారు యండి. ఉస్మాన్ ఖాన్. [/box]
[dropcap]ఈ[/dropcap]దుల్ ఫిత్ర్ ఒక మహత్తర పర్వదినం. దీన్నిసాధారణంగా రమజాన్ పండుగ అని వ్యవహరిస్తారు. రమజాన్ పేరు వినగానే మనసు, తనువు తన్మయత్వంతో పులకించి పోతుంది. భక్తిభావంతో శిరస్సు వినమ్రంగా వంగిపోతుంది. గుండె నిండా ఆనందం ఉప్పొంగుతుంది. మనసు ఆనందంగా ఉంటే దేహంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆనందం ఆయుష్షును పెంచితే, భక్తి ముక్తిని ప్రసాదిస్తుంది.
జీవితంలో మనిషి ఆనందించే సమయ సందర్భాలు అనేకం ఉంటాయి. వాటిలో పండుగలు ప్రధానమైనవి. ప్రాచీనకాలం నుండీ ప్రతి జాతిలో, ప్రతి దేశంలో పండుగలు చలామణిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మానవులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తిగతంగానో, సామూహికంగానో ఏదైనా మేలు జరిగినప్పుడు వారి అంతరంగాల్లోంచి ఆనందం తన్నుకురావడం సహజం. అలాంటి మానవ సహజ భావోద్రేకాల ప్రత్యక్ష ప్రతిస్ఫందనల ప్రతిరూపమే పండుగలు, పబ్బాలు.
జ్ఞానజ్యోతి అవతరించినవేళ…
ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం కూడా అలాంటిదే. నిజానికి ఈ పండుగ సంబంధం రమజాన్ మాసంతో ముడిపడి ఉంది. అందుకే ఇది రమజాన్ పండుగగా ప్రసిధ్ధి గాంచింది. అసలు రమజాన్ అన్నది ఒక నెల పేరు. సంవత్సరంలోని పన్నెండునెలల్లో ఇది తొమ్మిదవది. దీనికింతటి ప్రత్యేకత ప్రాప్తం కావడానికి కొన్నికారణాలున్నాయి. ఒకటి, సర్వమానవాళకి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి వెలుగును, జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్వజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగా దీనికింతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. రెండవ కారణం ఏమిటంటే, మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాసవ్రతం) అనే గొప్పఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే విధిగా నిర్ణయించాడు. ఇది మానవహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి మంచి మంచి గుణాలు అలవడతాయి. స్ధితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలిబాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈవిధంగా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసేలా ఏర్పాటుచేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన పండుగ జరుపుకుంటారు.
ఇకపోతే మరో కారణం, వెయ్యి నెలల కంటే విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా ఈ నెలలోనే ఉంది. అందుకని శక్తివంచన లేకుండా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరిస్తారు. దానధర్మాలు చేస్తారు. రమజాన్ మాసాంతంలో ఫిత్రాలు చెల్లిస్తారు.
ప్రభూ!కరుణించు…
ఈవిధంగా నెల్లాళ్ళ పాటు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతా స్థోత్రాలు చెల్లిస్తూ పండుగ చేసుకుంటారు. పండుగ రోఙు ముస్లిం సోదరీ, సోదరులంతా వేకువ ఝామునే నిద్రలేస్తారు. స్నాన పానాదులు ముగించుకొని ప్రాతః కాల ఫజర్ నమాజు ఆచరిస్తారు. ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించి, అత్తరు పన్నీరు లాంటి సుగంధద్రవ్యాలు వినియోగిస్తారు. అందరూ ఈద్‌గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేస్తారు.తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దువా చేస్తారు. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శతృవు బారినుండి, కరువుకాటకాల నుండి, దారిద్ర్యంనుండి తమను, తమ దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, కాపాడమని కడు దీనంగా విశ్వప్రభువును వేడుకుంటారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు, పరిచితులు, అపరిచితులందరితో తమ ఆనందాన్ని పంచుకుంటారు. ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతారు. కరచాలనాలు, ఆత్మీయ ఆలింగనాలతో అనుబంధాన్ని చాటుకుంటారు. సేమియా పాయసాన్నిఅందరికీ తినిపించి ఆనందిస్తారు.
ఈవిధంగా ఈదుల్ ఫిత్ర్ పండుగ సమాజంలో ఒక చక్కని సుహృద్భావపూర్వకమైన, ప్రేమపూరితమైన, సామరస్య కుసుమాలను వికసింపజేస్తుంది. దైవభక్తిని, దైవభీతిని, బాధ్యతాభావాన్ని, జవాబుదారీతనాన్ని, ఇంకా అనేక సుగుణాలను జనింపజేస్తుంది. మానవులను ఉత్తములుగా, ఉన్నత మానవీయ గుణసంపన్నులుగా, మానవతా మూర్తులుగా తీర్చిదిద్దుతుంది. కనుక పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. భావిజీవితాలు సుఖసంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. అవినీతి, అక్రమాలు, దోపిడీ, పీడన, దారిద్ర్యం, వివక్ష, అణచివేత, అసమానతలు లేని ఒక చక్కని సుందర సమాజం ఆవిష్కృతమవుతుంది. పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరిశ్వాస వరకూ గుబాళించాలని మనసారా కోరుకుందాం.