ఏకవాక్య కథలు-1

0
3

[dropcap]గం[/dropcap]గానదిలో, భార్య సరోజిని అస్థులను కలిపిన తరువాత,
మురారి కుమార్తె కల్యాణితో, కుమారుడైన మోహనవంశితో
ఒడ్డు చేరుకొని తన దుఃఖాన్ని దిగమింగుకొని,
పిల్లల భుజాలపై చేతులుంచి మెల్లమెల్లగా మెట్లను ఎక్కుతున్నప్పుడు,
తన పక్కన ఇరవై ఐదేళ్లకు ముందు చూచిన కల్యాణి
ఆమె పక్కన నడుస్తూ ఉండే పిల్లపైన చేతులను ఉంచి,
కళ్ల నీళ్లను కొంగుతో తుడుచుకొంటుండగా చూచినప్పుడు,
వాళ్ల కన్నులు కలిసికొనగా,
గతకాలపు నాటి స్మృతులెన్నో ఇద్దరి మానససరోవరాల అగాధాలనుండి ఉపరితలము చేరడానికి ప్రయత్నిస్తున్నప్పుడు,
“నువ్వా” అని కల్యాణి మురారిని అడిగినప్పుడు,
“నేనే, నా భార్య ఈ మధ్య …” అంటుండగా,
“వారు కూడ …” అని కల్యాణి అన్నప్పుడు,
“ఇన్నేళ్లయినా కొంచెము కూడ మారలేదీ కల్యాణి” అని మురారి  అనుకొంటూండగా,
అంత దుఃఖములో కూడ చిన్న నవ్వును తెచ్చుకొంటూ “నువ్వు చాల మారావ్” అని
తాను ఇంతకు ముందు చూడని  ఖర్వాటుడైన మురారిని అడుగగా,
“తలలో ఏమీ లేదు, తలపైన ఏమీ లే” దని మురారి చెప్పగా,
ఆమె పిల్ల, మురారి పిల్లల పక్కకు వచ్చినప్పుడు,
మురారి “కల్యాణీ, ఇది మా అమ్మాయి కల్యాణి, వీడు మోహన్, పూర్తి పేరు మోహనవంశీ,” అని పరిచయము చేయాగా,
“ఇది మా పిల్ల అన్నపూర్ణ” (మురారి అమ్మ పేరు కూడ అన్నపూర్ణే) అని కల్యాణి కలపగా,
మురారి కూతురు కల్యాణి “నాన్నా, నాకు ఆమె పేరు పెట్టావా” అంటే,
“నాన్నమ్మ పేరు ఆ అమ్మాయికి ఎలా” అని మోహన్ అడగ్గా,
“ఆమె తరచు మా యింటికి వచ్చేవారు కనుక, మా అమ్మకి బాగా తెలుసు” అని చెప్పగా,
“నేను కూడ నా పేరు అన్నపూర్ణగా మార్చుకొంటాను” అని కల్యాణి చెబితే,
“నీ పేరు నచ్చలేదా” అని మురారి అడగ్గా,
“బంధువులు కాని ఆమే నాన్నమ్మ పేరును తన కూతురికి ఉంచుకోగా నేనెందుకు పెట్టుకోరాదు” అని కల్యాణి చెప్పగా,
“చూద్దాంలే” అని మురారి కొట్టిపడేస్తుండగా,
తనకు తెలుసు నాన్నదబద్ధమని,
నాన్న ఆమెను ఒకప్పుడు ప్రేమించాడాని,
ఆమె జ్ఞాపకార్థము తనకా పేరుంచాడని,
ఇన్నాళ్లు నాన్న అమ్మను మోసము చేశాడని,
అందుకే ఆ పేరు తనకక్కరలేదని
మురారి కూతురు కల్యాణి తలబోస్తుండగా,
మురారి తానామెను ప్రేమించినది వాస్తవమైనా,
పెళ్లైన తరువాత సరోజినినిని తప్ప మరెవ్వరిని కన్నెత్తి కూడ చూడలేదని,
పాత రోజులకోసం, తన కూతురికి కల్యాణి పేరు పెట్టాడని సరిపుచ్చుకొంటుండగా,
భర్తృహీన కల్యాణి తన పెళ్లైన తరువాత భర్త రాయడే ప్రపంచమని భావించి
ఏదో ఆకాలపు మధుర స్మృతులకై తన దత్తపుత్రికి
మురారి తల్లి అన్నపూర్ణ పేరు నుంచుకొన్నదని నెమరువేసుకొంటుండగా,
విధి చేసే వక్రోక్తులకు తనకు నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో తానుంటుందని,
ఇలాటి ఒకే వాక్యపు ఎన్ని ప్రేమ కథలను విన్నానో చూచానో అని తలబోస్తూ
వీళ్ల జీవితాలలో ఈ సంఘటన ఇంకా ఎలాటి మార్పులను తీసికొని రావడానికి
ఏ అదృశ్య గీతలను ఆ బ్రహ్మదేవుడు వ్రాసాడో  అని ఊహించుకొంటూ
గంగాదేవి కెరటాల సడులతో సుదూర సాగరతీరమును చేరుకోవాలనే తహతహతో సాగిపోతూ ఉన్నది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here