Site icon Sanchika

ఏకాదశి – ఏకాణ!

[శ్రీ నల్ల భూమయ్య రచించిన ‘ఏకాదశి – ఏకాణ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]గ[/dropcap]ది ‘కానీక్’ బడి. గా బడిని ‘తెనుగు’ పంతులు నడిపెటోడు. గా పంతులు ‘గంగ’వుతల్నుంచి వచ్చి బతుకుటానికి గిక్కడ బడివెట్టిండు. మావూరు పెద్దకాలేరు. పెద్దపెద్ద కంపిన్లు వుండుటాన గిది పెద్ద కాలేరైంది. కాలేర్ల ఎక్కోమంది సదువునెటోళ్ళు వుంటరు, బడికి వస్తరు, గదీంతోటి బతకవచ్చు – పల్లెల్లల్ల ఎవ్వరు గంతగానం మంది జదువుకుంటరు? ఎట్ల బతుకస్తది? అని గీ తెనుగు పంతులు ‘గంగ’వుతల్నించి (గోదావరి ఆవలిగట్టు) వచ్చి గిక్కడ – ‘తాడిసెట్లగుడెం’ల తాటికమ్మల గుడిసెల బడివెట్టిండు. గావాడని తాడిసెట్ల గుడెం అనుటానికి కారుణం, గక్కడ అన్నీ తాడిసెట్లే వుంటయి. తాడిసెట్లు వున్నందున గక్కడ కల్లు బట్టి గూడ వున్నది. గా కల్లు బట్టిగూడ తాటికమ్మల గుడిసెనే. గా కల్లుబట్టి పక్కపొంటే సిన్న ఒర్రె పోరుతుంటది. పక్కనే ఒర్రె పారుతున్నందున కల్లు దాగెటోళ్ళకు ‘ఒంటేలికి’ గిట్ట ఒగ్గ సౌలతు!

తెనుగు పంతులు ‘కానీక్’ బడి తతంగమంత ఎట్లుండేటిదంటే – పొద్దుగాల – కంపిని – ఆరుగొట్టే సీటికన్న ముందుగాల్నే లేసి మొకాలు కడుగకుంటనే, పాసునోటితోటే బడికి వురుకాలె. ఎంట ఒగ గోనెసంచి కిందేసుకోని కూకునేటందుకు ఎవరిది ఆళ్ళు పొద్దుగాల పట్టుక పోవాలె, మాపటి బడి అయినంక మళ్ళ ఎంట దెచ్చుకోవాలె. వానకాలం తాటికమ్మలు వురిసి, గుడిసెల బూమి అంతగూడ పచ్చిపచ్చి, ఎండకాలం, సలికాలమేమో బూమి దుమ్ముదుమ్ము గందుకని గోనెసంచి లేంది నడువది కూకునుటానికి.

ఎండకాలం, వానకాలాల్ల గంత పొద్దుగాల బడికి పోవుటానికి ఏమనిపియ్యక పొయ్యేటిది – అంత ఎలుగెలుగే వుంటది గావట్టి. గని, సలికాలంల మట్టుకు సీకటి సీకటే వుండేటిది. గా సీకట్ల, బజాట్ల కుక్కల మంద. నేను గప్పుడు గక్కడ ఒంటిగాన్నే. కుక్కలు మొరిగినా, ఎంటవడ్డా, వురికెటోన్నిగాదు. వురుకుతె కరుస్తయని, నడ్సుకుంటనే పొయ్యెటోన్ని. గంతకుక్కల మందల నడిమినుంచి నేను రోజు ఒంటిగ పొయ్యినా గూడ, ఎప్పుడు కుక్క కాటుకు బలిగాలేదు – నసీబు మంతున్నేగదా!

గోనెసంచిల సిలేటు పలుక, గట్టిసీస (ఇటికె పెళ్ళని దంచి, అస్త్రగాలంపట్టి సన్నపు పొడిజేసి, సీసల నింపుకునుడు) గా సీసల, మొన కొస్సగ జెక్కిన కట్టెపుల్ల. ‘క ఖ’ల గుణింతం ఏసుటానికి ‘బలుపం’ గిట్ట ఏం వుండేటియిగాదు. పలుకమీద గట్టిపొడిని పోసి నేర్పుకోవాలె, కట్టెపుల్లతోటి ‘కఖ’ల గుణింతం రాయాలె, రాసిందాన్ని సెయ్యితోటి నేర్పి మలుపాలె, నేర్పి మలిపిన దానిమీద మళ్ళ రాయాలె. గప్పుడు అరిగేటిది, కరిగేటిది ఏం వుంటది? కామధేనువు వారం, అక్షయపాత్రవారం, కల్ప వృక్షం వారం, ఎంత రాసుకున్నా తరిగేటిది గాదు, ఒడిసేటిది గాదు – అచ్చెలమ నీళ్ళు జల్లిన, విచ్చల విడి నూరునట్లు – వాగుల ఒడువని తరుగలవారం, పుట్టుడు, గిట్టుడు, మళ్ళ పుట్టుడు.. గిప్పటి మన కంప్యూటరు ‘సీడీ’ వారం ఎంతకంటె అంత ఎక్కిచ్చుకోవచ్చు, మలుపుకోవచ్చు, మళ్ళ ఎక్కిచ్చుకోవచ్చు.

ఒక గంటన్నర ‘క ఖ’ ల గుణింతం ఏసినంక గప్పుడు మోకాలు కడుగుకునుటానికి యింటికి పోకట. యింటికి పొయ్యి సలిబువ్వనో, రొట్టెనో తిని, చాయ్ తాగి, ఎనిమిది, ఎనిమిదిన్నరకు మళ్ళ బడికి.. ఓనుమాలు, ఒంట్లు, అరిటి – బాలశిక్ష మొదలుకొని ఐదోవాచికం దనుక ‘ఆల్ ఇన్ వన్’ ఒక్క తాటికమ్మల కప్పుకింద, ఒక్కపంతులు సేతులమీద.. పన్నెండున్నర దనుక పొద్దటిపూట బడి. గప్పుడు ‘అన్నాలకు’ పోకట.. అన్నాలు అయినంక పగటిపూట బడి. ఎక్కాలు, పెద్ద బాలశిక్ష, రామరామశతకం, కృష్ణ, నరసింహ, దాశరథి, వేమన, సుమతి, భాస్కర, గువ్వలచెన్నా! శతకాలు.. నాలుగున్నర దనుక బడి. నాలుగున్నర అయినంక పోరగండ్లం యిండ్లకు, బడికి పనుగడి వెట్టి పంతులు కల్లుబట్టికి. మాకు బడి, పంతులుకు యిల్లు గూడ గా తాటికమ్మల గుడిసే.

పంతులు గిక్కడ ఒంటిగాడే పాపం. పల్లెటూరు నుంచి వచ్చి, పెండ్లాం, పిల్లగండ్లను ఎంటవెట్టుకోని కాలేర్ల బతుకుడంటే మాటలా? దుబాయికి పెండ్లాం, పిల్ల గండ్లని ఎంటవెట్టుక పొయ్యి బతుక గలుగుతరా? గట్లనే, పంతులు గీ కాలేర్ల ఒంటరి బతుకే – పెండ్లాం, పిల్లగండ్లకు దూరంగ.  ఆలిలేని బాధ అంతింతగాదయా అన్నడు తత్త్వం జెప్పినోడు – గని, గా బాదల్ని ఓర్సు కునుడేమరి – బతుకుటానికి… ఇంటి యాలు విడిచి ఎట్లుండ వచ్చురా అన్నడు. గని, యిడ్సి వుండక తప్పది బతుకటానికి.. ధనములేని వాని తలపులు తీరునా? పెండ్లాం పిల్ల గండ్లతోటి బతుకాలనంటే అయితదా? పంతులు పెయ్యి తెల్లగ, ఆయిన దోతి, అంగి తెల్లగ, రుమాలు తెల్లగ.. తిలుకం, బొట్టు ఎరుపుదప్ప, ఎత్తు, బిలువుగిట్ట మామూలు మనిసే…

గోంతమంది ఆడి పోరగండ్లు గూడ బడికచ్చెటోళ్ళు. ముచ్చట్లు వెట్టుకుంట ఏం సదువకుంట వుంటె పంతులు ఆళ్లని కొట్టుడు, తిట్టుడు గిట్ట ఏం జేసేటోడుగాదు, ఆళ్ళ అయ్యలని పిలువనంపి సెప్పెటోడు ముచ్చట్లు దప్ప సదువేం లేదని.

మొగ పోరగండ్లు పంతులు లేకపోకట జూసి తాటికమ్మలు లేసి పొయ్యెటట్టు సుడిగాలి దుందు లేపెటోళ్ళు. గని, గసుంటప్పుడు తెలువకుంటనే అచ్చిన పంతులు, ఎవని పెయ్యి మీదనన్న ఈత బరిగెల్ని ఆడిచ్చుడు మొదలువెట్టంగనే యిగ గప్పుడు గూడ తాటికమ్మలు ఎగురగొట్టెటోళ్ళే, గని గా రొండు దుందులల్ల పరకు వుండేటిది. గిప్పుడు వేమల పద్యాల్ని, సుమతి పద్యాల్ని, భాస్కర శతకాన్ని, బొండిగలు పగుల, గువ్వల చెన్న పద్యాల్ని సెవి గువ్వలు పగిలెటట్టుగ సదువుట్ల..

మా బళ్ళె ‘బీమన్న’ అందరికన్న ఈడుల పెద్దోడు. గని, సదువుల మట్టుకు తక్కో వాచికం. బడికి సీద రాకట లేదు. పోశమ్మ గుడికాడ బద్ది గోలీలు, పత్తాలు ఆడుడు – పైసలు వెట్టి. పంతులు సూసీ, సూసీ, ఒగ పోరన్ని పంపిండు భీమన్నను బడికి రమ్మని సెప్పుటానికి. బీమన్న గా పోరన్ని తిట్టి పంపిచ్చిండు. గదీంతోటి పంతులు పహిల్‍వాన్ అసుంటోళ్ళని, నలుగురు పోరగండ్లని పంపిండు. “బడికి రానంటే ఆన్ని మోసుక తేండ్రి” అని! పంతులు తమని పహిల్వాన్లుగ గుర్తిచ్చినందుకు గా పోరగండ్లు బగ్గ సంబురపడ్డరు. బీమన్నను బడికి తీసుకురావుటానికి దండెత్తి పొయ్యిండ్రు. బీమన్న గా నలుగుర్ని వహిల్వాన్లు అసుంటోళ్ళని గూడ ఒక్కడే ఎదురుకున్నడు. బీమన్న ఒక్కొక్కరికి ‘జీమూతుడైండు’. బీమన్నను పట్టుకునుటానికి పొయ్యి, దవుడలు వాయగొట్టి పిచ్చుకున్నరు. గప్పుడు నలుగురు ఏరుఏరుగనైతే కుదురని పని అని నలుగురు ఒక్కపారే బీమన్న మీద వడ్డరు – సైందవ మూక అభిమన్యుని మీద వడ్డట్టు. గప్పుడుగూడ బీమన్న ఆళ్లకు దొరుకకుంట వురుకుడు వెట్టిండు – బొందలు దిగుకుంట, ఒడ్లు ఎక్కుకుంట ఎంతన్నదూరం వురికినంక ఆకిరికి బీమన్నను ఆళ్ళు పట్టుకోని – మొసగొట్టుకుంట మోసుకోని తీసుకొచ్చి బీమన్నను పంతులుముందు ఆజిరిపర్సి – ఒక్కొకరు బీమన్న సేత తిన్న తన్నుల్ని, తేలిన దద్దుర్లని, వాసిన సెంపల్ని, కొట్టుకపొయ్యిన మోకాళ్లని, మోసేతుల్ని జూపుకున్నరు పంతులుకు. గప్పుడు పంతులుకు బీమన్నమీద మస్తుగ కోపమొచ్చింది. బళ్ళె కడుమోళ్ళందరు గూడ బీమన్న సూరత్తాన్ని, సుతారితనాన్ని మా మెచ్చుకున్నరు. గని, పంతులు బీమన్నను దొడ్డు దొడ్డు ఈత బరిగెలన్ని యిరుగంగ దూదేకినట్టుగ జోపు తాంటే బీమన్న ‘వావ్వో వాయ్యో’ అనుకుంట, సేతులడ్డం వెట్టుకుంట ఏడుస్తాంటే, మొత్తుకుంటాంటే ‘పాపం భీమన్న’ అనుకున్నరు. గప్పటికే బీమన్న మోకాలు మీది ఎండిపక్క గట్టిన పుండు, పక్కూడి నెత్తురు గారవట్టింది. బుద్దిజెప్పువాడు గుద్దిన నేమయా అన్నరు గని, గింతగానం గూ తెల్లకుంట, వూపిరందకుంట, తండ్లాడేటట్టు గుద్దుడా!

గా తరువాత బీమన్న, సదువుకోకుంటె, సదువు రాకుంటె తట్టమోసి బతుకుత, గని, బడికి పోను అని బడి బందువెట్టిండు. బడి బందువెట్టి ఓటల్లల్ల సిప్పలు గడుగవట్టిండు.. పెరిగింది ఏదో మరోలోకం.. మాగిరాలిన పళ్ళు మరల చెట్టుకు పోవు అన్నట్టుగ బడి బందువెట్టిన బీమన్న మళ్ళ బడి మొకమే జూడలేదు.. పేదవాని బాధ పెనుభూతమైయుండు అన్నట్టుగ బీమన్నది సదువురాని బాధ. కొడుకు బడికిపోతే, సదువుకుంటే – గుంట పట్టు చెలమ కులముద్ధరించురా, సరిగముదిసి బ్రతుకు సంపదే సంపద అనుకున్న అయ్య, అవ్వల ఆసలు తీరనే లేదు. సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోవోయ్ అనుకోని బీమన్న గప్పటి సందే, కూలి, నాలి సేస్తే సేసుడు, లేకుంటే ఆరాం జేసుడు, తిరుగుడు.. గా తరువాత బీమన బతుకంత – కలతలకు లొంగి, కష్టములక్రుంగి అన్నట్టుగనే – ఇంగీతం లేని పంతుళ్ళు సదువంటే బడితె పూజే అన్నట్టుగ వుండెటోళ్ళు. గదీంతోటి – భయము జూపువెనుక బావి త్రోవే బోడు అన్నట్టుగ – పిల్లగండ్లు బడితోవ తప్పుకోని పొయ్యెటోళ్ళు. మొగ్గలనే, పిందెలనే మాడి పోకట, రాలిపోకట.. గింతంత సదువుకున్న పంతుళ్ళు.. చిన్న చదువులకు మిన్న జ్ఞానమురాదు అన్నట్టుగ పంతుళ్ళ అగ్యానం మూలంగ పిల్ల గండ్లు మర్రిచెట్ల వలె మర్రులవారం ఎదుగకపొయ్యిండా గని, గాళ్ళని మొక్కలనే తుంచేసె.. మంచినీరు పొయ్య మల్లె పూయును గాని.. గని, గా మల్లెతీగలకు సోడనీళ్ళు పోసిండ్రు పంతుళ్ళు.. శుద్దికి ప్రథమంబు సున్నమే గదయా అన్నట్టుగ – సదువంటే సింత బరిగెలు యిరుగుడే, ముంత పొగలు, కోలదండాలు, దంతెముళ్ళకంపలే అన్నట్టుగ పంతుళ్ళు.. ఉదకము లేకున్న వేరెట్లు దిగునయా అన్నట్టుగ తన్నులు లేకుంటె సదువెట్ల అబ్బుతది అనెటోళ్ళు పంతుళ్ళు.

కాలేర్ల, కంపిని జీతగాళ్ళ పిల్లగండ్లకు, సావుకార్లు అసుంటోళ్ల పిల్లగండ్లకు, గింతంత మంచిగ వున్న ఏ కొద్దిమంది పిల్లగండ్లకో మట్టుకే బడులు అందేటియి. కడుమ మందికి అంతగూడ బడులు తెలువది. కాపుదనపోళ్ళ పిల్లగండ్లకు బడులు గిట్ట ఏం వుండేటియి గాదు. గీ కాలేర్ల, పీనుగుమీద ముగ్గేసుటానికి కుండల జొన్నపిండి లేని కాపుదనపు యిండ్లు గూడ వుండేటియి. వూర్ల పక్క పొంటి పెద్దపెద్ద వాగులు పారుకుంట పోతున్నా గూడ, వూర్లు ఒడ్లమీద, వాగులనీళ్ళు ఒడ్లకింద.. అనువుగాని నీరమది ఏమి జేయను అన్నట్టుగ.. కంపిని జీతగాళ్ళు, సావుకార్లు, గింతంత పచ్చగ వున్న ఏ గోంత మందికో దప్ప, కడుమమందికి అంతగూడ పొద్దుంటే మాపుండది, మాపుంటే రేపుండది అన్నట్టుగనే గదీంతోటి గాళ్ళ పిల్లగండ్లకు బళ్ళే తెలువది అంటే, బళ్ళు తెల్సిన పిల్లగండ్లకు పంతుళ్ళ అగ్యానం మూలంగ సదువులు సందుట్లనే పొయ్యేటియి.. సింతబరిగెలు, ఈత బరిగెలు, ముంతపొగలు, కోలదండాలు, దంతెకంపలు దాటి, సందులు గొట్టక బట్ట గట్టెటోళ్ళు సాన తక్కోమందే… చినుకులోన బడ్డ చినుకు ముత్యంబయ్యె అన్నసుంటియి మా తక్కో.. నీరముతప్తలోహమున నిలిచియనామకమై నశించు అన్నసుంటియే బాగ ఎక్కో – పంతుళ్ళ అగ్యానం మూలంగ..

పంతులు ప్రతి నెల ఏకాదశి నాడు సరస్వతి పూజ జేసెటోడు. నెలకోపారి పోరగండ్లను ఏకాదశినాడు మనిషికి ‘ఏకాణ’ పైసలు పట్టుక రమ్మనెటోడు. గా పైసలతోటి సరస్వతి పూజ జేసుడు. ఒగ కొబ్బరికాయ, గిన్నన్ని అరిటిపండ్లు, గిన్నన్ని జిలేబీలు, పేడలు (‘పేడ’ అంటే ఆవు ‘పెండ’ అనుకునేలుగిట్ట! కాదు. ‘పేడ’ అన్నది తియ్యటి తినే వస్తువ.) పంతులు సరస్వతి పూజ జేసినంక పోరగండ్లకు తలా యింత జిలేబి, పేడ ముక్కని పెట్టుడు. గీ కర్సులకు పోంగ మిగిలే పైసలే ఎక్కో. గా పైసలతోటి పంతులు బడి అయిపొయ్యినంక మాపటికి కల్లు బట్లె పడుడు – తాటికళ్ళు, ఈతకల్లు, నల్లగల్లు అసుంటియి తాగుటానికి.. లొట్ట తాగియతడు లోకుల జెరచురా అన్నడు తత్త్వం జెప్పినోడు – గని, గీ పంతులు గూడ గట్లనే లోకుల్ని సెరిపిండు అనుటానికి లేదు. తెల్సి తెల్సి, సెరుపుదామని సెరిపింది గిట్ట ఏం లేదు. లొట్ట దాగని పంతుళ్ళు గూడ ఎందరో ఎంతన్న మంది పోరగండ్లని సెరుపుతనే వున్నరు…

మా బళ్ళె సావుకార్ల పోరగండ్లు వుండెటోళ్ళు. గా పోరగండ్లను మా పంతులు బగ్గ పావురంతోటి జూసెటోడు. మర్జాద జేసేటోడు. గాళ్ళు మంచిగ మత్తుగ సదువచ్చినోళ్లా అంటే కాదు – గణికి లొప్పియున్న గవ్వలు జెల్లవా అన్నట్టుగ.. ముద్రలో భద్రమైనది మూల విద్య.. సదువులేం వున్నా, లేకపోయినా అబ్బయున్న వాని కన్ని యున్నట్టులే అన్నట్టుగ.. కసవున్న  చోటెరిగి పసరంబు మేయును అన్నట్టుగ పంతుళ్ళు.. మొకాలు జూసి బొట్టు వెట్టాలె.. సావుకార్లు పంతులుకు గింజలకు పైసలకు ఆసరైతరు.. కటికోళ్ళ పిల్లగండ్లు గూడ మా బళ్ళెవుండె.. కటికోళ్ళు పంతులుకు కూరముక్కలు వెడుతరు.. కంపిని జీతగాళ్ళ పోరగండ్లు, కడుమోళ్ళ పోరగండ్లు అంటె పంతులుకు గాపాటే!…

పోయిన ఏకాదశికి పంతులు ఏకాణ పైసలు పట్టుక రావాలంటే – లేక, నేను కొంటవోలేదు. పంతులు మతివెట్టుక నన్ను ‘మర్సిపోకుంట ఏకాణపైసలు తేవాలె, తేకుంటే గాపూటకు బడికి రావద్దు, గీ ‘పుల్లుమామ’ని జూడుండ్రి – రూపాయంటే రూపాయి, రొండు రూపాలంటే రొండురూపాలు తెస్తడు. నువ్వేమో ఏకాణ పైసలు తేవుటానికి సస్తవు. పుల్లుమామ ఎంత పురుసాత్తో జూడుండ్రి.. పేడ, జిలేబి పెడ్తె మట్టుకు అద్దనకుంట మా మంచిగ తింటావు!” అన్నడు. పంతులు ‘పుల్లుమామ అని పావురంగ, మర్జాదగ పిల్సెటోని పేరు ‘పురుషోత్తం’ ఆడు సావుకారి కొడుకు. గందుకనే ఆడు పంతులు తెమ్మన్నంత తెస్తడు – పంతులుకు గానిమీద గంత బమలు. కడుమోల్ల మీద పంతులుకు గంత పగలు..

పంతులు గట్లనంగనే నాకు మస్తు సిన్నతనమనిపిచ్చింది. మా ‘నాన’ను ఏకాణ పైసలు యియ్యిమన్న. మా నాన లెవ్వు – పైసలు అన్నడు. “పైసలు గావాలె. లేకుంటే పంతులు తిడుతడు” అన్న. నువద్దిగనే మా నాన దగ్గరె ఏకాణ పైసలు లేవు. వుంటె మట్టుకు యిచ్చెటోడే. గని, గా సంగతి నాకు తెలుస్తదా? పైసలు మా వున్నయిగని, యిస్తలేడు అని నేను ఎంట వడ్డ. మా నాన కంపిని పనికి పోవుటానికి ఆకిరి ‘సీటి’ అయితంది. గందుకని జెల్ది జెల్ది కంపినికి పోవట్టిండు – నాకు పైసలు యియ్యకుంటనే – నడి ఎండకాలం, సూర్యుడు నడినెత్తి మీద వున్న ఏళ్ళ.. అతుకులేసిన యిరిగిన సెప్పు కాళ్ళ తోటి మానాన కాలిబాటల బిరబిర నడుస్తాంటే, మా ‘నాన’ ఎనుకవడి, సెప్పులు గిట్ట ఏం లేని కాళ్ళతోటి కాలిబాట పక్కల ఎండిన గడ్డి మీద నేను వురకవట్టిన గోంతదూరం, ఆనెంక పైసలియ్య నందుకు నేను ఏడ్సుకుంట ఎనుకకు మలిగిన.. గని, బడికి పోకట మట్టుకు బందువెట్టలేదు. బడికి పోకుంటవుంటె రేపు పంతులు “మా మంచిగ బడికి డుమ్మగొట్టి ఎగురుతావు!” అని అంటడు. పోతెనేమో ఏకాణ తేనందుకే గునుగుతడు.. గునుగుతె గునుగనియ్యి అని బడికి మట్టుకు డుమ్మగొట్టలేదు.. పంతులు గునిగిండు, గునుక్కుంటనే జిలేబి, పేడముక్కలు గూడ మా పెట్టిండు!..

తెనుగుపంతులు కానీక్ బడిల వున్నంతల నా సదువు అయిపొయ్యినంక కానీన్ బడి యిడ్సి నేను ‘సర్కారు’ బళ్ళె జేరిన.. ఏండ్ల కెండ్లు గడ్సి పొయ్యినంక సర్కారు బడిల వున్నకాడికంత సదువైపొయ్యింది. గా తరువాత – హైద్రబాదుల తప్ప కాలేజీలు లేనందున, గక్కడికి పొయ్యి సదువ పైసలులేనందున, ఉన్న కాలేర్ల కంపిన్లనే ఒగ ట్రేనింగుల జేరిన. గీ ట్రేనింగుల సదువుకు సదువు, గిన్నన్ని పైసలకు పైసలు.. గా తరువాత పట్నంల సర్కారు కొలువు ఏడాదికో, ఆరునెళ్ళకో నేను మా వూరికి పోతే మా నాన అనెటోడు – “గా నడుమ తెనుగు పంతులు కల్సిండు, నిన్ను యాది జేసిండు.. గప్పుడప్పుడు కలుస్తాంట కనిపిచ్చినప్పుడల్ల యిన్ని పైసలిస్తాంట” అనెటోడు.

నా కన్పిస్తాంటది.. పైసలుండి, పంతుళ్ళ మర్యాదలు గిట్ట గలిగినోళ్ళు ఎవ్వరుగూడ సదువులల్ల ఎదుగలేదు. బడి మొకాలే జూడలేని పొద్దుంటే మాపుండది, మాపుంటే రేపుండది అనే యిండ్లళ్ళ పిల్లగండ్లు ఎందరో, ఏకలవ్యుని అసుంటోళ్ళు ఎదుగకుంట, జాడ దెలియకుంటనే మూలకు వడ్డరు – గప్పుడు – పురాణకాలంల – ఎక్కోతక్కో వర్ణభేదాల కారుణంగ అయితే గిప్పుడేమో కులం ఎక్కో తక్కో పరకుల మూలంగ, పైసలు లేని పరకుల మూలంగ… రాళ్ళు మెరుస్తున్నయి, రత్నాలు బూమి అడుగుల నుంచి బైటపడలేకుంట వున్నయి… గప్పుడూ, గిప్పుడు, యింకగూడ.. పేరుకు ప్రజలది రాజ్యం, పెత్తందార్లనే భోజ్యం – నదుల జీవజలాలు, ఉప్పు సముద్రం పాలు.. యువకుల శక్తికి, భవితవ్యానికి లేనే లేదిట చోటు.

Exit mobile version