ఏకాంత యుద్ధం

0
58

ఇప్పుడు ఇంక
సమస్త పుడమిని సంరక్షించుకోవాల్సిందే
దేశ విదేశ రాజకీయాలు వద్దు
అగ్రవాదం.. ఉగ్రవాదం ….
అన్నీ తలొంచాల్సిందే
పండగలు.. పబ్బాలకన్నా ప్రాణాలే ముఖ్యం
తాళాలేసుకున్న ప్రేమపార్కులు
సినిమాహాళ్ళు.. మాల్స్.. పబ్ లు.. క్లబ్ లు
గుడి ,చర్చి.,మసీదులు
అన్నీ….. అందరదీ ఒకే స్వరం!!!

ప్రపంచం అంతా మోకాళ్ళ మీద కూర్చొని
ప్రకృతికి క్షమార్పణలు చెబుతోంది
ఎక్కడో కరోనా ఉంటే
ఇక్కడ కన్నీరు చెరువవుతోంది
తనంతవాడు లేడనుకునే మానవ అహానికి
అణుబాంబు కన్నా ఇది ప్రమాద పాఠం
భూమితల్లి అన్ని జీవరాసులదీ కదా!
మరి పిచ్చుకపిల్ల గూడుకు కూడా
ఒక్క చెట్టునైనా మిగల్చని మనిషితో
అదృశ్య శత్రువు చేస్తున్న యుద్థంలో
ఏ ఆయుధం వాడాలో కూడా తెలుస్తుందా
దేవుళ్ళే స్వీయనిర్బంధం విధించుకున్నప్పుడు
రేయింబవళ్ళు కరోనాను లొంగదీయాలనుకునే వైద్యులే
మాయదారి మహమ్మారికి బలవుతుంటే
నిందించుకోవాల్సింది
విధిని కాదు.. మన విధానాలనే
వీధుల్లో ఇళ్ళల్లో శవాలగుట్టల మధ్య
గడియ గడియకూ.. గుండెచప్పుళ్ళు
మూగపోతున్న. మరణసంధిలో
కంటికి కనిపించని రహస్య రోగాన్ని
సమైక్య సంకల్పంతో నిర్వీర్యం చేద్దాం
సందర్భ సంయమనంతో సవాలును జయిద్దాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here