[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘ఏకాంతం కావాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]న[/dropcap]న్ను నేను చూసుకుని ఎన్నాళ్ళయ్యిందో
నాతో నేను మాటాడుకుని ఎన్నేళ్ళయ్యిందో
వేణువును పెదాలతో మెత్తగా ముద్దాడి
దాని వెన్నుపై వేళ్ళ కదలికల కథాకళి ఆడిస్తూ
గాలి ఊపిరులు సన్నసన్నగా ఊదుతూ
రమ్యమైనరాగాలు పలికించింది ఎన్నాళ్ళక్రితమో
కాగితాల కమ్మల దొంతరల్లో
కబురులు ఎన్నెన్నో గుట్టుగా దాచిన పుస్తకాలను
వేళ్ళ కొసలతో పలకరించింది ఎన్నేళ్ళక్రితమో
తెల్లటి కాన్వాసును
కుంచెతో రంగుల అభ్యంగన స్నానం చేయించి
ఊహల ఉత్సవాలను, ఉత్పాతాలను
చిత్రాలుగా చక్కదిద్ది ఎన్ని ఏళ్ళు గడిచిపోయాయో
వెల్లువెత్తిన ప్రకృతి అందాలను
కళ్ళతో తాగేస్తూ మనసులోకి ఇంకింపజేస్తూ
పరవశించి మైమరచి ఎన్ని నాళ్ళు నడిచిపోయాయో
నాకు కావాలి ఏకాంతం
మరింత మరింత ఇంకొంత ఏకాంతం
నా నేనును వెతికి పట్టుకునేందుకు
నాలోని ఆ నేనును బతికించుకునేందుకు
జరుగుబాటు చౌరస్తాలో
అనుక్షణపు పలకరింపులనుండి
వేరుగా అయ్యేందుకు, దూరంగా జరిగేందుకు
ఎన్ని పరదాలు నా చుట్టు దింపుకోవాలో
ఎన్ని కందకాలు నిలువునా తవ్వుకోవాలో
ఎంత ఎత్తైన ఒంటి స్తంభపు మేడ కట్టుకోవాలో
మరి, నాకు కావాలిగా ఏకాంతం