Site icon Sanchika

ఏకలవ్యుడి కథలో ధర్మసూక్ష్మం

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారి ‘ఏకలవ్యుడి కథలో ధర్మసూక్ష్మం’ అనే రచనని అందిస్తున్నాము.]

ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి ఏమీ నేర్పకపోయినా, బొటనవేలు గురుదక్షిణగా కోరి ఎదగనీయకుండా చేశాడనీ, లేకపోతే ఏకలవ్యుడు అర్జునుడిని మించిన వీరుడని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆచార్య ద్రోణుల వారి హృదయం అర్థం చేసుకున్న వారెవరూ అలా మాట్లాడరు. అసలు జరిగిన కథ ఏమిటో, అందులో ధర్మసూక్ష్మం ఏమిటో చూద్దాం.

ఒకసారి కౌరవపాండవులు బాల్యంలో ఉన్నప్పుడు బంతాట ఆడుకుంటూ ఉంటే బంగారుబంతి ఎగిరి బావిలో పడిపోతుంది. దాన్ని బయటకు ఎలా తీయటమో అర్థంకాక చూస్తూ ఉంటే, ఇంతలో ద్రోణాచార్యుడు వస్తూ కనిపించాడు. ద్రోణుడు ఒక బాణం దానికి గుచ్చుకునేటట్లు వేశాడు. దాని వెనక ఇంకొకటి, ఇలా ఒకదాని వెనక ఇంకొకటి బాణాలు వేసి, తాడులాగ తయారు చేసి బంతిని బయటకుతీసాడు. అంతేకాదు, తన చేతి ఉంగరాన్ని బావిలో వేసి, దాన్ని కూడా అలాగే తీసాడు.

కౌరవపాండవులు ఆశ్చర్యపడి ఈ విషయం తాతగారైన భీష్ముడికి తెలియజేశారు. అయన ఎవరో సామాన్యుడు కాడని గ్రహించి, రాజధానికి సగౌరవంగా ఆహ్వానించి, తన మనవలకు విద్యాభ్యాసం నేర్పమని కోరాడు భీష్ముడు. సరే నని అంగీకరించాడు ద్రోణుడు. కౌరవపాండవులతో పాటు ద్రోణుడి కుమారుడు అశ్వత్దామ, కర్ణుడు కూడా విలువిద్య నేర్చుకునేవారు. ఇంకా యదు వంశీయులు, ఇతర రాజకుమారులు కూడా విద్య నేర్చుకోవటానికి వచ్చేవారు. వారందరికీ గుర్రాల మీద, ఏనుగుల మీద, రథంమీద నిలబడి యుద్ధం చేయటం, కత్తి తిప్పటం, తోమరం, శక్తి మొదలైన ఆయుధాలు తిప్పటం, ద్వందయుద్ధం వంటి అన్ని యుద్ధవిద్యలలో శిక్షణ ఇచ్చాడు ద్రోణాచార్యుడు.

ఒకరోజు ద్రోణాచార్యుడికి శిష్యులను పరీక్షించాలనిపించింది. అందరికీ సన్నమూతి గల కమండలం వంటి పాత్రలు ఇచ్చి, తన కొడుకుకి మాత్రం వెడల్పుమూతి గల కుండ వంటి పాత్రనిచ్చి, వీటిలో నీరు నింపుకుని త్వరగా రమ్మని చెప్పాడు. అర్జునుడు పాత్రతో నీరు నింపుకుని అందరికన్నా ముందు వచ్చాడు. ఇంత త్వరగా ఎలా వచ్చావని అడిగితే “వారందరూ నీరు నింపటానికి నదికి వెళ్ళారు. నేను మాత్రం వారుణాస్త్రంతో నీరు నింపి తీసుకువచ్చాను” అని చెప్పాడు అర్జునుడు. అతడి బుద్ధికుశలతకు మెచ్చుకున్నాడు ద్రోణాచార్యుడు.

మరోసారి అర్జునుడు భోజనం చేసే సమయంలో గాలి గట్టిగా వీచటం వలన దీపం ఆరిపోయింది. చీకటిలో కూడా చేయి తడుముకోకుండా నోటి దగ్గరకు వెళ్ళటం గమనించిన అర్జునుడు గురి తప్పకుండా ఉండటానికి వెలుతురు అవసరం లేదని, అభ్యాసం ఉంటే చాలని గ్రహించాడు. ఆనాటి నుంచీ చీకటిలో విలువిద్య అభ్యాసం చేయటం నేర్చుకున్నాడు. రాత్రిపూట ధనుష్టంకారం విని చూడటానికి వచ్చిన ద్రోణుడు అబ్బురపడి, ఆర్జునుడిని కౌగలించుకుని “నాయనా! ఈలోకంలో నిన్ను మించిన ధనుర్ధరుడు ఎవరూ లేకుండా ఉండేలా నిన్ను తయారుచేస్తాను” అన్నాడు. అర్జునుడు గురువుకి పాదాభివందనం చేశాడు.

ఇలాఉండగా ఒకరోజు ఏకలవ్యుడు అనే నిషాదరాజు (అడవిలో జంతువులను, పిట్టలను వేటాడేవాడు) కొడుకు ధనుర్విద్య నేర్పమని ద్రోణాచార్యుడిని అడిగాడు. “రాచబిడ్డలకు తప్ప నిషాదులకు ధనుర్వేదం ఉపదేశింపరాదు” అని తిరస్కరించాడు ద్రోణుడు. ఏకలవ్యుడు తిరిగి వెళ్ళిపోయాడు. అడవిలో ద్రోణాచార్యుడి మట్టివిగ్రహం తయారుచేసి అందులోనే ఆచార్యుని భావించుకుని శ్రద్ధతో, వినయంతో అభ్యాసం చేయసాగాడు. త్వరలోనే అందులో నైపుణ్యం సంపాదించాడు.

రాజకుమారులందరూ గురువుగారి అనుమతి తీసుకుని అడవిలోకి వేటకు వెళ్ళారు ఓసారి. వారి సామగ్రిని, వేటకుక్కలను తీసుకుని ఒక అనుచరుడు కూడా వారివెంట వెళ్ళాడు. ఆ కుక్క తిరుగుతూ, తిరుగుతూ ఏకలవ్యుడు సాధన చేసే చోటికి వచ్చింది. అపరిచితుడుగా ఉన్న అతడిని చూసి కుక్క మొరగసాగింది. ఏకలవ్యుడు ఏడు బాణాలతో దాని నోటిమీద కొట్టాడు. దాని నోరు నిండిపోయింది గానీ, గాయం కాలేదు. అది వెనుదిరిగి రాకుమారుల దగ్గరకు వచ్చింది. దానిని చూసిన పాండవులందరూ ఆశ్చర్యపడి “ఈ బాణాలు వేసిన వాడెవరో శబ్దాన్ని బట్టి బాణాలు వేగంగా వేయటంలో నిష్ణాతుడిలా ఉన్నాడు” అనుకుంటూ వెతుక్కుంటూ వచ్చారు.

అక్కడ మాసినబట్టలతో, జింకచర్మంతో ఉన్న నిషాదుడు కనిపించాడు. “ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నీకీ బాణవిద్య ఎవరు నేర్పారు?” అని అడిగారు పాండవులు.

“నేను నిషాదరాజు హిరణ్యధన్వుడి కుమారుడిని. నా పేరు ఏకలవ్యుడు. ద్రోణాచార్యుల వారే నా గురువు” అని చెప్పాడు.

అర్జునుడు గురువు దగ్గరకి వెళ్లి ఈ విషయం చెప్పి “ధనుర్విద్యలో నన్ను మించినవాడు లేకుండా చేస్తానని అన్నారు. మీ శిష్యులలో నన్ను మించినవాడు ఈ అడవిలోనే ఉన్నాడు” అని చెప్పాడు. ద్రోణాచార్యుడు శిష్యులతో కలసి ఏకలవ్యుడు దగ్గరకి వెళ్ళాడు. ఏకలవ్యుడు గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి, చేతులు జోడించి నిలబడ్డాడు. “నువ్వు నిజంగా నా శిష్యుడవే అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు” అన్నాడు ద్రోణాచార్యుడు.

“నా ధనం, పరివారం, తనువు, మనస్సు, ప్రాణాలలో మీకు ఏం కావాలో అడగండి. సంతోషంగా ఇస్తాను” అన్నాడు. “నీ కుడిచేతి బొటనవేలిని గురుదక్షిణగా ఇవ్వు” అన్నాడు ద్రోణుడు. బొటనవేలు లేకపోతే బాణాలు వేయలేనని తెలిసి కూడా, తండ్రి ఎంత వారించినా వినకుండా సంతోషంగా వేలిని కోసి గురువుగారి పాదాల ముందు ఉంచాడు ఏకలవ్యుడు.

ఇదీ జరిగిన సంఘటన! ఈ సంఘటనలో ద్రోణుడు కుటిలయుక్తితో ఏకలవ్యుడి అభివృద్ధిని అడ్డుకున్నాడు అని విమర్శిస్తూ ఉంటారు కొంతమంది. కానీ వాస్తవం ఆలోచిస్తే –

ఆనాడు దశరధమహారాజు తన ప్రాణంతో సమానమైన రాముడు దూరం అవుతున్నా, తన ప్రాణాలే పోతున్నా కైకకి రెండు వరాలు ఇస్తాననే అన్నాడు గానీ ఇవ్వనని చెప్పలేదు. ఎందుకు?.. సత్యం కోసం!

అంతకన్నా ముందు హరిశ్చంద్రుడు రాజ్యాన్ని, సంపదలని కోల్పోయి, అడవులపాలైనా, భార్యాభర్తలు ఇతరులకు బానిసత్వం చేయాల్సివచ్చినా, పాముకాటుతో కుమారుడు మరణించినా, చివరకు తన చేతితో భార్యను వధించాల్సిన పరిస్థితి వచ్చినా, విశ్వామిత్రుడు “ఈ ఋణం నీకు ఇవ్వాల్సింది కాదు అని ఒక్కమాట చెప్పు. నీ కుమారుడిని సజీవుడిని చేస్తాను, మీ ఇద్దరినీ దాస్య విముక్తులను చేస్తాను. మీ రాజ్యం మీకు తిరిగి ఇచ్చివేస్తాను” అని చెప్పినా హరిశ్చంద్రుడు అంగీకరించలేదు. ఎందుకు? ..సత్యం కోసం!.. సత్య వాక్పరిపాలన కోసం!

ఈనాడు ద్రోణాచార్యుడు కూడా అంతే! “నిన్ను మించిన ధనుర్దారుడు ఎవరూ లేకుండా చేస్తాను” అని అర్జునుడికి మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టు కోవాలి. సత్యం నిలబెట్టాలి. అందుకోసమే బొటనవేలు గురుదక్షిణగా అడిగాడు. ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుల వారే తన గురువు అన్నాడు. ఆ మాట అనకుండా ఉంటే గురుదక్షిణ అడగాల్సిన అవసరం ద్రోణుడికీ లేదు, ఇవ్వాల్సిన అవసరం ఏకలవ్యుడికీ లేదు. ఏకలవ్యుడు కూడా సత్యం కోసం నిలబడ్డాడు. తన మాట నిలబెట్టుకున్నాడు. నిషాదులలో పుట్టినా, అతడు కూడా సత్యసంధుడే!

అతడి సత్యసంధతకు మెచ్చుకుని తర్వాత ద్రోణుడు “తర్జని (చూపుడువేలు), మధ్యమాంగుళి (మధ్యవేలు) తో ధనుర్విద్య సాధన చెయ్యి” అని సలహా ఇచ్చాడు. ఇక్కడ కూడా తను నేర్పలేదు, సలహా మాత్రమే ఇచ్చాడు. ఎక్కడా ధర్మం అతిక్రమించలేదు ద్రోణుడు. ఏకలవ్యుడు సాధన చేసినా బాణప్రయోగంలో వెనుకటి లాఘవం లేకుండా పోయాయి.

అయితే ఇక్కడ పాఠకులకి చిన్న సందేహం వస్తుంది. గురుదక్షిణ కోరక పోతే ఏకలవ్యుడు నిజంగా అర్జునుడిని మించి పోయేవాడా! అనిపించవచ్చు. కాదు. అర్జునుడే నిస్సందేహంగా అతడిని మించిన ధనుర్దారుడు! పరమేశ్వరుడిని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించిన మహావీరుడు. “నువ్వు నాతో సమానమైన వీరుడవి” అని పరమేశ్వరుడే స్వయంగా ప్రశంసించాడు. అర్జునుడి ప్రతాపానికి సంతసించి ఇంద్రుడు అర్ధ సింహాసనం ఇచ్చి గౌరవించాడు. అయితే ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేవి. ప్రస్తుతం ద్రోణాచార్యుడి శిష్యులలో తనని మించినవాడు ఏకలవ్యుడు అని అనుకున్నాడు అర్జునుడు.

అంతేకాదు, ద్రోణాచార్యుల వారి ఔన్నత్యం తెలియజేసే మరో సంఘటన కూడా ఉంది. ద్రోణుడిని సంహరించగల కొడుకు, అర్జునుడికి భార్య కాగల కూతురు కోసం యజ్ఞం చేస్తాడు ద్రుపదుడు (ద్రోణుడిని సంహరించాలనే పగ అతడికెందుకు అని అడిగితే దానికి ఇంకో కథ ఉంది). యజ్ఞగుండంలో నుంచీ ద్రౌపది, దుష్టద్యుమ్నుడు పుడతారు. దుష్టద్యుమ్నుడు తనని చంపటం కోసమే పుట్టాడు అని తెలిసి కూడా అతడిని తన శిష్యుడిగా చేర్చుకుని ధనుర్వేదం నేర్పుతాడు ద్రోణాచార్యుడు. దుష్టద్యుమ్నుడు సుక్షత్రియుడు. నేర్పననటానికి తగిన కారణం లేదు. తన ప్రాణంకోసం శిష్యుడిగా అంగీకరించకపోతే గురుస్థానానికి కళంకం. కనుక ఇక్కడ కూడా ధర్మమే ఆలోచించాడు ద్రోణుడు.

కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు తన సైన్యాధిపతిగా చేసినప్పుడు “యుద్ధంలో అవకాశం వచ్చినా దుష్టద్యుమ్నుడిని నేను సంహరించను. అతడు నన్ను వధించటానికే జన్మించాడు. అది విధిలిఖితం” అని చెబుతాడు ద్రోణాచార్యుడు (మహాభారతం, ద్రోణపర్వంలో). చూశారా ఆయన ధర్మ నిర్ణయం! కనుక ఆయన మీద చేసిన విమర్శలు అన్నీ నిరాధారాలే! ధర్మతత్పరుడు, మహాజ్ఞాని, అస్త్రవిద్యా సంపన్నుడు, గురుపీఠానికి వన్నెతెచ్చిన వాడు ద్రోణాచార్యుల వారు!

కొసమెరుపు:-

ఏకలవ్యుడు గురువు విగ్రహాన్ని తయారు చేసి దానిపై ఆచార్యభావంతో, శ్రద్ధాసక్తులతో సాధన చేశాడు. విగ్రహాన్ని ఆరాధించాడు. ఇక్కడ గురువు సమక్షం కన్నా గురుభక్తే ప్రధానం. అందువల్లనే తను అనుకున్నది సాధించాడు. మనం శ్రీరాముడినో, శ్రీకృష్ణుడినో, శ్రీవేంకటేశ్వరుడినో విగ్రహరూపంలో పూజిస్తాము. విగ్రహంలో దేవుడు ఉంటాడా! అని నాస్తికులు వాదిస్తూ ఉంటారు. మనం ఎటువంటి భావంతో, శ్రద్ధా భక్తులతో విగ్రహారాధన చేస్తామో, అటువంటి ఫలమే పొందుతాము, ఇక్కడ శ్రద్ధ, భక్తే ప్రధానం అనటానికి ఏకలవ్యుడి కథే నిదర్శనం!

Image Source: Internet

Exit mobile version