[శ్రీ మల్లాది లక్ష్మణ శాస్త్రి రచించిన ‘ఏకం సత్’ అనే రచనని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]“ఈ [/dropcap]బ్రాహ్మలు దేశాన్ని సర్వనాశనం చేశారు. జనాభాలో అయిదు శాతం కూడా లేని ఈ డొల్ల శరీరాలు గత మూడువేల సంవత్సరాలుగా మిగతా తొంభై ఐదుశాతం ప్రజల్ని భారతావనిలో తమ జాత్యాధిక్యతా నిరూపణకోసం బానిసల్ని చేశారు. నాలుగు మాటలు మనకి, మనకే, జన్మతః వచ్చుకదా, అవి లిఖితరూపేణా భద్రపరచటం మనమే చేయగలం కదా అనే కండకావరంతో, అవే కాలక్రమేణా వేదశాస్త్రాలవుతాయికదా అని తెలిసి విర్రవీగే వీరు అవాకులు చవాకులు ప్రేలుతూనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్నాళ్ళుగా ఏలి, దేశాన్ని అధోగతిపాలు చేశారు. వేదం ప్రమాణమన్నారు, మనుధర్మ శాస్త్రం ప్రమాణమన్నారు. ‘తొంభై అయిదుశాతం ఉన్న మీరందరూ మాకు తిండి పండించండి, మేం తినగా మిగిలింది మీరు తినండి. బతికినవాళ్ళే మిగలండి. మాకు సొంపైన ఇళ్ళు కట్టండి. మీకు గుడిసెలు చాలు. మాకు బట్టలు నేసేవాళ్ళకి సాలెలని నామకరణం చేశాం. అలాగే కమ్మర్లు, కుమ్మర్లు, మేదర్లు, చాకళ్ళు, గొల్లలు, కోమట్లు, బెస్తలు, కాపులు, మంగళ్ళు, కంసాళ్ళు.. నానా జాతుల్ని సృష్టించాం. మాకు స్వామిసేవ చేయటమే మీ జీవితపరమావధి. ఎన్నో జన్మలుగా మీరు చేసిన అకృత్యాల ఫలితంగా మీకీ హీన జన్మలు భగవంతుడిచ్చాడు. కర్మననుభవించక తప్పదు. అనుభవించండి. నాలుగైదు జన్మల తరువాత, మీ కర్మఫలం గణనీయంగా మెరుగైతే మేము స్పృశించతగిన మెరుగుస్థాయి జన్మని మీకు భగవంతుడు ప్రసాదిస్తాడు..
విన్నారా బాపలూ, మేమూ నేర్చాం విద్వద్భాష. మీరు ఎన్ని సహస్రాబ్దాలుగా మమ్మల్ని దమనకాండకి గురిచేసినా, నిరక్షరాస్యులుగా మిగిలిపొమ్మని కుట్రలు చేసినా.”
“బాబూ, మీరు చెప్పినవన్నీ రాసుకుని నలుగురికి అర్ధం అయే జనామోద భాషలో పత్రికలో ప్రచురించాలనే ఉద్దేశంతో కదా మీ ముందున్నాను. నిష్పక్షపాత వైఖరితో, ప్రచురణా యోగ్యమైన పదజాలంతో ఒక విజ్ఞుడుగా మీ అభిప్రాయాలు చెప్పండి. రాసుకుంటాను.”
“సరే రాసుకో. నీ పేరూ వాలకం చూస్తే బ్రామ్మడనిపిస్తోంది. మీ వాళ్ళు ఇంకో చాణక్యం చేశారు. ఈ విషయంలో ఎంతో మనోవైజ్ఞానికం ఉంది. ‘మేమూ ఎంతో కొంత గొప్పే’ అని ప్రతి మూర్ఖుడూ సంతృప్తి పడాలిగా అని దీర్ఘాలోచన చేసి, అంచెలంచెలుగా చిన్నజాతి, ఇంకొంచెం పెద్ద జాతి, ఇంకా పెద్ద జాతి, అంటూ సమాజాన్ని విభజించారు. అత్యత్తమంగా ప్రజలందరినీ పరిపాలించవలసిన ఉత్తమ జాతి అంటూ ఒకదానిని రూపకల్పన చేసి దానికి క్షత్రియజాతని నామధేయం చేశారు. ఎంత ఉన్నతోన్నత జాతయినా మీకిందే ఉండాలి కదా! మీ తర్వాతే క్షత్రియులు. ఈ క్షత్రియ జాతివారు నిమ్నజాతి వారిలానే జంతు సంహారం చేసి మాంసభక్షణ చేయవచ్చనీ తీర్మానం చేశారు. యుద్ధం చేయటం క్షత్రియధర్మం అని సిద్ధాంతాలు రాశారు. ఎందుకని? మనిషికి ప్రాథమిక అవసరాలు తీరాక కాంక్షాప్రవృత్తి వేరే మార్గాలు అన్వేషించుకుంటుందని మీరు ముందే గుర్తించారు. మానసిక, అంతర్గత మార్గాలు మీరు మీకే దాచుకుని భౌతిక ఆక్రమణలు మీరు చేసుకోండని క్షత్రియులకి పురమాయించారు. పక్క రాజుని, వాడి సైనికులనీ చంపు. అది ధర్మం. చేయగలిగావా, ఆ రాజ్యం నీదే. నీకు దమ్మున్నంత కాలం రాజ్యాన్ని విస్తరించుకుంటూ పో.”
“అయ్యా, ఈ ధర్మం జంతువుల్లోనూ ఉందిగా?”
“అదే కదా మీ తెలివి? మీ జాతి తప్ప మీ క్రింద జాతులెవరికీ జంతున్యాయాన్ని దాటగలిగే మానసిక పరిణతి లేదని నిర్ణయించి తదనుసారంగా ధర్మశాస్త్రాలు సమాజం మీద రుద్దారు.
ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారిని చంపుకుంటూ పోగా, చంపటం చేతకాని వారిప్రాంతం చంపటంలో సిద్ధహస్తులైన వారి స్వంతమే అని కూడా తీర్మానించారు. కండబలిసిన రాజులు కండతక్కువ రాజుల్ని చంపినా, రాజభక్తి పేరుతో వారికి దాస్యం చేసే సైనికులు ప్రాణాలు విడిచినా అదే చరమధర్మం అని శాస్త్రాలు రాశారు. ప్రపంచం అంతా సహస్రాబ్దులుగా క్షత్రియులు ఒకరినొకరు పొడుచుకు చంపుకుంటున్నారు. వారికి నియమనిబంధనలు మీరే నిర్ణయించారు. తెరముందు క్షత్రియులు. తెరవెనక బాపలు. రాజ్యాన్ని శాసించేది రాజులు, రాజుల్ని శాసించేది బాపలు. ‘దేశం కోసం’ అని నినాదాలు చేసుకుంటూ చచ్చేది క్షత్రియులు, వారి తొత్తులైన మూఢసైనికులు. ప్రభుసేవలో ప్రాణాలర్పించడం వీరమరణం అనబడుతుందనీ, యుద్ధంలో మరణించిన వారు సరాసరి స్వర్గం చేరుకుంటారనీ శాస్త్రాలు రాశారు. చోద్యం చూసి, కవిత్వాలు చెప్పి సంగీతాలు కూర్చేది మీరు. పైగా ఈ చంపుకోవడాలకి యుద్ధం అని పేరుపెట్టి దానికీ నియమనిబంధనలు మీకు తోచినట్లు రాశారు. ‘ధర్మ యుద్ధం, అధర్మ యుద్ధం’ అని రెండు రకాలట! కారణం లేకుండా ఒకరి గొంతు మరొకరు కోసుకోవచ్చు, కాని మీరు నిర్దేశించిన ధర్మానికనుగుణంగా! ఒక రాజు తనకున్న లక్షమంది సైనికులతో లక్షమంది సైనికులున్న పక్కరాజు మీద దండెత్తవచ్చు. అది ధర్మం. నీ సైనికులు యాభైవేలమంది చచ్చినా పర్వాలేదు, పక్కరాజు సైనికులు అరవైవేలమంది చావాలి. అప్పుడు నువ్వు గెలిచినట్లు. వాడి రాజ్యం, సంపద, సైనికులు, స్త్రీ జనం నువ్వు న్యాయసమ్మతంగా అనుభవించవచ్చు.”
“శాంతి శాంతి మహాశయా! మీ అమూల్యాభిప్రాయాలు ఇంకా తెలుసుకుని సామాన్యప్రజలకి చేరవేసే ముందు ఒక చిన్న సందేహం..”
“నువ్వు మనువాదివా, నీతో మాట్లాడాల్సిన అగత్యం నాకు లేదు. నువ్వు బ్రాహ్మణుడివైతే అసలు మాట్లాడను. నేను తర్కంలోంచి వితర్కం తీయగలిగిన వారితో వాదించను. తర్కంలో తల పండిపోయి, గెలవలేని సందర్భాల్లో కుతర్కం ప్రయోగించి తిమ్మిని బమ్మిగా నిరూపించ ప్రయత్నించే మీతో అసలు వాదించను.”
“పాపము శమించుగాక. ఏ రకంగా నిర్వచించినా సరే, బ్రాహ్మణత్వం నాలో ఏకోశానా లేదు, మా తాతయ్య నాకు పెట్టిన పేరులో తప్ప. వేషభాషలు, ఆహారపుటలవాట్లు, జీవన విధానం, అన్నీ మీలానే ఉన్నాయి. వాగ్ధాటిలోనూ స్ఫురద్రూపంలోను ఎలాగూ మీకు సరితూగలేను. ఇప్పుడు నా సందేహం అడగవచ్చనుకుంటాను. సంగీత సాహిత్యాలలోనూ, చప్పన్న దేశాలలోనూ బ్రాహ్మణులకి దీటుగా బ్రాహ్మణేతరులు రాణించటం మొదలయి కనీసం మూడునాలుగు శతాబ్దాలయింది. ఈ రోజులలో అయితే అన్ని రంగాలలోనూ పుట్టుబ్రాహ్మలకంటే కృషిబ్రాహ్మలలోనే ‘బ్రాహ్మణత్వం’ గోచరమౌతోంది; తమరు బ్రాహ్మణత్వానికి ఏనిర్వచనమిచ్చినా సరే. ఒకనాడు ప్రాభవం ఉండి ఉండవచ్చుగాక, ఈనాడు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారి స్థితిగతులు చట్టం గుర్తించిన ‘వెనుకబడినవారి’ కంటే గొప్పగా ఏమీ లేవు. ఏ పొట్టకూటి వృత్తిలో ఉన్నా ‘చేతకాని పంతులు’ అనే సంబోధింపబడుతున్నారు. నలిగిపోయిన ఒక శుష్కబృందం మీద ఇంత విద్వేషం పెంచుకుని ఆ విద్వేషాన్ని వాగ్ధాటితో ప్రజ్వలింపజేసి ప్రచారం చేయటం మీవంటి ప్రాజ్ఞులకి పాడి కాదు. పైగా వారేమన్నా కలిసికట్టుగా ఉన్నారా అంటే అదీ లేదు. శాఖలు, ఉపశాఖలు సృష్టించుకుని కీచులాడుకున్నారు.”
“నువ్వు చెప్పేదానిలో కొంత నిజం ఉంది. బ్రాహ్మలు నలిగిపోయారంటే ఎందుకు పోరు? శతాబ్దాలుగా నొక్కివేయబడ్డ ఇతరజాతులవారి ఆక్రోశం ఊరికే పోతుందా? శాసనసభల్లో, లోక్‌సభలో మీకు అయిదు శాతం మించి టికెట్లు, సీట్లు కేటాయించరు. పౌరోహిత్యం, ఆలయ పూజారిత్వం, సంస్కృత బోధనం, వేద పఠనం వంటి సంప్రదాయ వృత్తులని నమ్ముకున్న బ్రాహ్మలకి పొట్టగడవదు, పెళ్ళిళ్ళు కావు. మా నాన్న వైపు ముత్తాత సంస్కృతాంధ్రాల్లో కావ్యాలు రాశాడు, అమ్మవైపు ముత్తాత నాట్యాచారి అని గొప్పలు చెప్పుకోవడం తప్ప మీకు మిగిలిందేమీలేదు. అగ్రహారాలన్నీ నేతులు తాగడంతోనూ దానాలివ్వడంతోనూ ఏనాడో హరించుకు పోయాయి కదా! మీ జాతి..”
“బాబూ, జాతుల్ని, వర్ణాల్ని నిర్మాణం చేసింది బ్రాహ్మలని మీ సిద్ధాంతం కదా, వారు జాతుల వారీగా సమాజాన్ని విభజించటమే సకల రుగ్మతలకి మూలకారణం అంటున్నారు కదా, మరి మీరే జాతి వ్యవస్థని ఒప్పుకుంటున్నట్లుగా మీ జాతి, మా జాతి అంటారేమిటి?”
“తప్పులు బానే పడతావు, ఎంతచెడ్డా బ్రాహ్మడివి కదా. సరే, బ్రాహ్మలనబడే మీ పూర్వీకులు సమాజాన్ని ఎంత విధ్వంసం చేశారో విను. ఎక్కడలేనీ తెలివి ఉపయోగించి ఇన్నేసి కులాల్లో మనుషుల్ని విభజించారు కదా..”
“ఆ విభజన సహజసిద్దంగా వారివారి వృత్తినైపుణ్యాల ఆధారంగా జరిగి ఉండవచ్చు కదా. ఈనాటి భాషలో ఒకరు సాఫ్ట్‌వేర్, ఒకరు హార్డ్‌వేర్, ఒకరు ఫాషన్ డిజైనర్.. ఈ మూడు వృత్తులు, ఏ సమయాన్నైనా కొంత పరిశ్రమతో ఒక నైపుణ్యం వారు ఇంకో నైపుణ్యం అలవరచుకుని వృత్తి మార్చుకోవచ్చు. మార్చుకుంటున్నారు కూడా. వృత్తికి కులం అని పేరు పెట్టి మీ కులం ఫలానా, తరతరాలు మీరు ఈ కులంలోనే ఉండండి అని బ్రాహ్మలు శాసించారనీ, శతాబ్దాలుగా వృత్తి నిపుణులందరూ స్వచ్ఛందంగానో, మన కర్మ అనుకునో తమకి కేటాయించబడ్డ కులాన్ని అంటి పెట్టుకొని ఉన్నారనీ మీరు సిద్ధాంతం చేశారు, బాగానే ఉంది. మూడు నాలుగు వేల సంవత్సరాలుగా అల్ప సంఖ్యాకులు, శారీరకంగా నిర్బలులు, అహింసా వాదులైన బ్రాహ్మలనబడే వారు ఫలానా వృత్తివారిని ‘మీరు మీ వృత్తివారితోనే పెళ్ళిళ్ళు చేసుకోండి, ఇంకొక వృత్తివారితో సంబంధాలు పెట్టుకోరాదు’ అని ఆంక్షలు పెట్టి దేశంలో కులవ్యవస్థని ఛేదింతలేనంతగా పటిష్టం చేశారని నిందిస్తున్నారా?”
“ప్రత్యక్షంగా కాకపోవచ్చు. పరోక్షంగా అవశ్యం చేశారు. ఒకరకంగా హిప్నాటిజం, ఇంకోదృష్టిలో స్లోపాయిజనింగ్ చేశారు. ప్రతి కులంవారు వాళ్ళకి కేటాయించబడిన కుర్చీతో మమేకం అయిపోయి, కుర్చీని ప్రేమించడం, సంరక్షించుకోవటమేకాక ఆ కులమనే ముద్ర తమ ఉనికికి గుర్తింపు అనుకునేంత మౌఢ్యంలో ఉండిపోయారు. దిశానిర్దేశం బ్రాహ్మలే చేశారు. వారు గీసిన గీతలమీదే తరతరాలుగా మిగతా ప్రజలు నడిచారు, వారు సంకల్పించిన రీతిలోనే ప్రజా చేతస్సు రూపుదిద్దుకుంది.”
“మీ వాదనలో ఆనేక లొసుగులున్నాయి. చరిత్రలో ప్రతి కాలంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ మేధావులుద్భవించారు, ఉద్భవిస్తూనే ఉన్నారు. వారిని మీరు దార్శనికులనండి, తత్వవేత్తలనండి, ఋషులనండి, మహాపురుషులనండి. వారు సత్సమాజాన్ని ఆశించి కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించినమాట నిజమే. అనేక శతాబ్దాలలో అనేకమంది మహనీయుల సమిష్టి మేధామధన పర్యవసానం వర్తమానం. ఈనాటి సమాజం ఏ ఒక్క మనిషో, ఏ ఒక్క సముదాయమో వేసిన బ్లూప్రింట్ కాదు. వందలమంది ఉన్నత ప్రమాణాలున్న దార్శనికులని మనకి ప్రసాదించిన మన దేశపు చరిత్రని అవగాహన చేసుకుంటే, ఏ ప్రపంచ నాగరికతలోనూ మన స్థాయి దార్శనికులు, ఒకవేళ ఉంటే, చాలా అరుదుగా పుట్టారన్నది విశదమవుతుంది. ఏకాలంలో రచింపబడ్డాయో కచ్చితంగా తెలియదు కానీ చరిత్రకందని వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇతిహాసాలు, వందలాది శాస్త్రాలు, ప్రమాణ గ్రంధాల సమిష్టిరూపమే నేటి భారతం. ఎన్ని వేల మానసిక దురాక్రమణలు జరిగినా చెక్కు చెదరని, అంతర్గతంగా నిరంతర స్వయంప్రక్షాళన చేసుకుంటున్న, యావత్ప్రపంచానికి ఈనాటికీ మార్గదర్శకంగా నిలుస్తున్న సభ్యసమాజం మనది. ఈజిప్ట్, గ్రీక్, అరబ్, యూరోప్, నిన్నమొన్నటి అమెరికా తత్వవేత్తల ఆలోచనలు చదవండి, వారి పురాణాలు చదవండి; ఉపనిషత్తులు వాటితో పోల్చలేనంత అగాధ జ్ఞానసముద్రాలని మీకే అవగతమౌతుంది.
మీకు తెలిసే ఉంటుంది, ఉపనిషత్తులు మనకి ప్రసాదించిన దైవసమానులు వారి పేరు, సమయం కూడా భావితరాలవారికి తెలియనివ్వలేదు. ఉపనిషత్సారం తెలియగోరేవారు తెలియవలసిన మొదటి సత్యం అదే.
ఆ మహనీయులకి కులంలేదు, జాతి లేదు, అస్తిత్వం కూడా లేదు.
వారిని, క్రీస్తు తర్వాత జన్మించి శాస్త్రాలు రచించిన, ఎన్నో శతాబ్దాల తరువాత పుట్టిన అనేక మేధావులని ‘మీరంతా బ్రాహ్మలు; స్వార్ధంతో, కుతంత్రాపూర్వకంగా ఈ రచనలన్నీ చేసి సమాజాన్ని నొక్కి పడేశారు’ అనటం సబబా?
మీరింకా మౌనంగా ఉన్నారుకదా, ఇంకో మాట చెపుతాను. మన ఋషులు – వారిని మీరు బ్రాహ్మలంటున్నారు, అది పొరపాటని గ్రహించండి. కేవలం సమాజ సమానత్వం కోరి బ్రహ్మతత్వాన్ని, వారు దర్శించిన పరమసత్యాన్ని మనకి అందించాలనే ప్రేమాభిమానంతో వారా రచనలు చేశారు. వారిదో ప్రత్యేక వర్గం అని వారెప్పుడూ తలపోయలేదు.
బ్రహ్మనందినవాడు బ్రాహ్మణుడు. ఈ నానుడి సుపరిచితమైన తరువాత కాలాల్లో బ్రాహ్మణుడు అన్న పదం ఒక నిబద్ధత సంతరించుకుంది.”
“నీ మాటలు నాకు విన్నాక నా ఆలోచన సరళి కొంత మార్చుకోవాల్సి ఉన్నదని ఒప్పుకుంటాను. అవసరమైనప్పుడు నువ్వూ మార్చుకుంటావని నాకు నమ్మకం ఉంది. మన దేశ సంస్కృతి, నాగరికత అత్యంత పురాతనమైనవే కాక అత్యంత బలీయమైనవి అని నువ్వు నేనూ ఏకీభవిస్తున్నాము. మన సంవాదం మొదలవని ముందు నా ఆలోచన ఎట్లా ఉన్నదీ విను.
భారతీయ సంస్కృతి సహస్రాబ్దులుగా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. అగ్ర తరగతి నిమ్న తరగతి అన్న విభజన మొదటగా మన సమాజంలోనే జరిగింది. క్రమేపీ ఈ జాడ్యం ప్రపంచమంతా పాకింది. ప్రపంచమంతా మానసికంగా కుళ్ళిపోసాగారు. ఈ ఉచ్చ నీచ తారతమ్యం అనే విష బీజం యావత్ భూమండలాన్ని అంగుళం చోటు మిగల్చకుండా విషవృక్షాలతో కమ్మేసింది. పరస్పర విద్వేష వాతావరణానికి లోభ మాత్సర్యాలు, అభద్రతా భావం తోడై చరిత్ర చూసిన సకల మారణ హోమాలకి కారణ భూతమయనాయి. శతాబ్దాలుగా జరిగిన లక్షల యుద్ధాలు, యుద్ధాల్లో అసువులు బాసిన కోట్ల మంది అమాయకులు, మానభంగాలు, బానిస వ్యవస్థ, జాత్యహంకారాలు, మత కలహాలు – సర్వఛీద్రాలకి పునాది ‘ఉచ్చ నీచ విభజన’. మనిషి చేసిన ఇంత నిర్విరామ విచ్ఛిన్నం భూదేవి తట్టుకుని, ఇంకా మనిషికి తిండి పెడుతూనే ఉండటం మహదాశ్చర్యం.
ప్రపంచానికి సంభవించిన ఈ ఉపద్రవానికి భారతదేశపు బ్రాహ్మలే బాధ్యులు అన్న నా సిద్ధాంతం పొంగించిన ఆవేశంలో సంప్రదాయంగా, మన దార్శనికులు ప్రపంచానికి పంచిన జ్ఞానసంపదని విస్మరించాను. ప్రపంచం ఈ మాత్రం సవ్యంగా ఉండటానికి కారణం మన బ్రాహ్మలేనేమో, పొరపాటు.. మన తాత్వికులేనేమో!”
“దివ్యంగా చెప్పారు. బ్రాహ్మణులు అన్న పదం మీరు ఉచ్చరించటంతోనే మీరు సైతం విభజన హోమానికి ఇంకో సమిధ వేసి ప్రజ్వలింపచేస్తున్నారని గమనించారా? ఒకడు బ్రాహ్మణుడు అయితే ఇంకొకడు అబ్రాహ్మణుడవాలి కదా, విభజన జరిగి పోయింది. ఉదాహరణకి ‘నాది కమ్మ కులం, మనం కమ్మ వాళ్ళం, కమ్మోళ్ళు మనోళ్ళు’ అని తన మనసులో ఏ మూల ఉన్నా ఆ వ్యక్తి సమాజమనే వృక్షాన్ని గొడ్డలితో ముక్కలు చేస్తున్నాడనే అర్థం. విభజన విద్వేషానికి పర్యాయపదం. ఇప్పుడు సమాజంలో ఉన్న, జరుగుతున్న కులపరమైన వివక్షలు రూపుమాపే మీ సదుద్దేశాన్ని ఒక కులం పేరు ఉచ్చరించి మీరే నీరు కారుస్తున్నారు. సమాజంలో సమానత్వాన్ని కోరుకున్న వ్యక్తి తనకి కులం లేదని సమూలాగ్రంగా విశ్వసించాలి. కులాలని సూచించే అన్ని పదాలని ప్రథమంగా తన నిఘంటువులోనించి తుడిచి వేయాలి.”
“సమాజం కులాలవారీగా చీలి భ్రష్టు పట్టడానికి కారణం సమాజం కాదు, వ్యక్తి అంటావు?”
“అక్షరలక్షల వాక్యం చెప్పారు. ఇరవైశతాబ్దం మొదటివరకూ కులం అనే పదం ఒక పరస్పర గౌరవంతో వాడుకునే వారు. కులం అన్న పదానికి కొంత సామాజిక ప్రయోజనం ఉండేది. ఒక వృత్తి సవ్యంగా నేర్చుకోవటానికి సంవత్సరాలు పట్టేది. తండ్రి దగ్గర మెళకువలు నేర్చుకుని తండ్రివలె నిష్ణాతుడయి కొడుకు ఆ కళని, ఆ వృత్తిని తన కుటుంబం వారికో, బంధువులకో, ఒక నిర్ణీత ప్రాంతం వారికో నేర్పి సజీవంగా ఉంచేవాడు. సమాజంలో నిరక్షరాస్యత ఉన్నప్పటికీ ఒకరకమైన సమతుల్యత ఉండేది. క్రమేపీ విద్యావిధానాలు, విద్యా ప్రమాణాలు, ప్రయాణ సదుపాయాలు, పట్టణీకరణ పెరుగుతూ వచ్చాయి. కులవృత్తులు కొన్ని కుటుంబాలకో, కొన్ని ప్రాంతాలకో పరిమితమవటంలేదు.”
“కులవృత్తి అనే పదంలో ‘కుల’ అనే విశేషణం ఎగిరిపోయి వృత్తి మాత్రం మిగిలింది. వందకి పైగా వృత్తులు, వాటిని సూచించే కులాలు మటుమాయమై పోయాయి. పోవాలికూడా. గత ఏభై సంవత్సరాలుగా ఫలానా వృత్తి, ఫలానా చాకచక్యం ఒక వర్గానికి మాత్రమే పరిమితమైందని చెప్పడానికి ఏమీ మిగలలేదు. బుట్టలల్లడం, బట్టలు నేయడం, బట్టలు కుట్టడం, బట్టలుతకడం, కుండలు చేయడం, చేపలు పట్టడం, పశువులు పెంచడం, బొమ్మలు చేయడం, ఇళ్ళు కట్టడం, ఆభరణాలు చేయడం, దేవాలయాల్లో నాట్యాలు చేయడం, కేశఖండన చేయడం, కల్లు తయారు చేయడం, పాదరక్షలు తయారు చేయడం, సుగంధ ద్రవ్యాలు తయారు చేయడం, శిల్పాలు చెక్కడం, శిశు జన్మలో తల్లికి సహకరించడం, మాంసం కోసం పశువుల్ని వధించడం, ఊరూరా తిరిగి నృత్య గానాలతో ప్రజలని అలరించడం, భవిష్యవాణి చెప్పడం, జాతకాలు చూడడం, వేద పారాయణ చేయడం, గ్రంథాలు రచించడం, గారడీలు చేయడం, వాహనాలు నడపడం, వ్యాపారాలు చేయడం, పడవలు నడపడం, వ్యవసాయం చేయడం, కాయకష్టం చేయడం – ఈ పనులలో సగానికి పైగా నేడు వృత్తులుగా పరిగణించబడటం లేదు. ఆ పనుల అవసరం నేటి సమాజానికి లేదు. మిగతా వృతులు ఎవరికి నచ్చినవి వాళ్ళు చేసుకోవచ్చు, చాకచక్యం సంపాదించుకోవచ్చు. తండ్రి తాతల నుంచి నేర్చుకోవాలని లేదు, వారు చేసింది మనమూ చేయాలని లేదు. మా తాత వేద పాఠశాల నడిపి ఉండవచ్చు. నేను నేటి గిరాకీకి, నా అభిరుచికి అనుగుణంగా కేశ ఖండనలో చాకచక్యం నేర్చుకుని, నా స్వంత తెలివితేటలతోనో, మేనేజ్‌మెంట్ పాఠాలు జోడించో, దేశవ్యాప్తంగా బ్యూటీఫ్రాంచైజీలు తెరిచి ఐదు సంవత్సరాల్లో కోట్లకి పడగెత్తవచ్చు, నాకు నచ్చిన వృత్తిలో రాణించాననే సంతృప్తిలో బతకవచ్చు. అలాగే మా తండ్రి తాతలు చేపలు పట్టడంలో సిద్ధహస్తులై ఉండవచ్చు, ఆ లైన్‌లో మల్టీనేషనల్ అవకాశాలు నాకు కనిపిస్తున్నా కాదనుకుని నాకు అభిరుచి ఉన్న సాహిత్యంలో కృషి చేసి, ఈరోజు సమాజం హర్షించే అవధానాలు చేస్తూ, రచనా వ్యాసంగం చేస్తూ ధన్యుడనవవచ్చు, గుర్తింపబడవచ్చు.
సాంకేతికత అపారం. ఉరవళ్ళులా విస్తరిస్తున్న సమాచార స్రవంతి. నిజాయితీగల విద్యార్థికి క్షణక్షణం అందుబాటులో ఉన్న ఎల్లలు లేని విజ్ఞానం. ఆకాశమే హద్దుగా అవకాశాలు.”
“అయినా మనిషి మారలేదు, కుల పిచ్చి వదలలేదు.”
“అంతుబట్టని సంగతి ఏమిటంటే జీవన ప్రమాణాలు, అక్షరాస్యత, విజ్ఞానం, ప్రజల ఆలోచన స్థాయి గత శతాబ్దంతో పోలిస్తే ఎంతగానో మెరుగు పడిన ఈనాడు, కులప్రసక్తి ప్రజల మనస్సులోనూ, వ్యవహారాలలోనూ, నిత్యజీవితంలోనూ పూర్తిగా సమసిపోయి ఉండవలసిన ఈనాడు, రోత పుట్టి వికారం వచ్చేటంతగా వేళ్ళూనుకుంది. దేశమంతటా ఎంతోకొంత ఉన్నా, తెలుగునాట మరీ విజృంభించిన కులపిచ్చి ‘నేను తెలుగువాడిని’ అని తలెత్తుకుని చెప్పుకోలేనంత అసహ్యంగా ఉంది.”
“కుల ప్రాతిపదికన ముక్కలు ముక్కలయిన వార్తాపత్రికలు, టీవీ చానెళ్ళు, రాజకీయ పార్టీలు, వ్యాపార సంస్థలు. ఈ దరిద్రం ప్రపంచానికి తెలిసి భారతదేశాన్ని ‘కాస్టిస్ట్’గా ముద్రవేసింది.”
“ఎందుకు వేయదూ, దేశగౌరవాన్ని ఇనుమడింపచేయవలసినది పోయి, యూరోప్ లోనూ, అమెరికా లోనూ, ఆస్ట్రేలియా లోనూ స్థిరపడిన ప్రవాసాంధ్రుల్లో కూడా అధికభాగం కులం కండువాలు వేసుకుని తిరుగుతున్నారట. కులానికో తెలుగు సంఘం పెట్టుకుని కుమ్ములాడు కుంటున్నారట. సిగ్గు సిగ్గు. నేను విన్న చోద్యం నీకొకటి చెపుతా విను. అమెరికాలో స్థిరపడిన పిచ్చి పంతులొకడు ఇండియాలో ఉన్న తల్లితండ్రులని తనకి సంబంధాలు చూడమని పురమాయించాడట. వాడికి నియోగుల సంబంధాలే చూడాలట. మిగతా శాఖలవారు వద్దుట! నా కులం, నా శాఖ కుంచితత్వం పులుముకుని కుళ్ళిపోయాడు కాని, బుద్ధి కొంచెమయినా వికసించి ఉంటే తనకి ఏం కావాలో ఎవరు కావాలో ఎందుకు కావాలో తెలుసుకుని తల్లితండ్రులని సుఖపెట్టేవాడు.”
“మన దేశం మాటకొస్తే రాజకీయ పార్టీలు కులం పేరుతో సమాజాన్ని చీల్చి, కులవిద్వేషాలని రెచ్చగొట్టి వ్యూహాలు రచించి సీట్లు గెలుచుకుంటున్నారు. ‘పోల్ స్ట్రాటజిస్ట్స్’ అనే కొత్తవృత్తి మొదలయింది. వీరి వ్యూహమల్లా కులమత గణాంకాలని తమకనుకూలంగా మలుచుకోవడం. దేశం భ్రష్టు పట్టినా సరే. ఈ వ్యూహాలని పొందికగా, నిస్సిగ్గుగా చర్చలపేరుతో ప్రముఖ చానెళ్ళలో ప్రసారం చేస్తారు. కొన్నేళ్ళక్రితం ఒక పెద్దమనిషి ‘కులం’ అన్న పదం అనాగరికంగా ఉందని గమనించి, ‘ఒక సామాజికవర్గం’ వారు తమకన్యాయం జరిగిందని ప్రభుత్వం పట్ల గుర్రుగా ఉన్నారు అన్నాడట. ఆ తరువాత ప్రసారమాధ్యమాల చర్చల్లో ఒకరిమీద ఒకరు అరుచుకుంటూ బురదజల్లుకునే ప్రబుద్ధులు కులం అనడం స్వచ్ఛందంగా మానేసి, ‘రెడ్డి సామాజిక వర్గం, కాపు సామాజికవర్గం, వెలమ సామాజిక వర్గం.. వంటి నాగరికపదాలు విశృంఖలంగా వాడుతున్నారు!”
“ఉపన్యాసాలు ఇచ్చీ, పుస్తకాలు రాసీ, నాకు కొంత పేరు వచ్చినమాట నిజమే. నా అక్కసు మిగతా కులాలవారిమీద వెళ్ళగక్కీ, మా కులంవారిని పోగుచేసి సభలు పెట్టి ఉద్రేకపరచటం, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేశాను. ఆలోచించి చూస్తే ఎంత తప్పిదం చేశానో అవగతమౌతోంది. సమాజ సమానత్వసాధన ముసుగులో సమాజ విచ్ఛిన్నానికి తోడ్పడ్డానేమో!
నేను ఒకకులానికి చెందిన వాడిని అనుకోవటం ప్రథమతప్పు. ఆ తరువాత ఆ కులం వారు తవ్వుకున్న మురికి కూపంలో మఠం వేసి మిగతా అవివేకులతో చేతులుకలిపి చిందులేయడం రెండో తప్పు. పక్కవాడి కూపంకంటే నా కూపంలో దుర్గంధం ఎక్కువ ఉంది కాబట్టి సెంటుసీసాలు కుమ్మరించుకుందాం, ఎక్కువమందిని చేర్చుకుని మన కూపం పక్కకూపం కంటే పెద్దది చేద్దాం, మన కూపంలో ఎంతమురికి ఉందో, మనం మిగతా కూపాలవారితో పోలిస్తే ఎంత తక్కువలో ఉన్నామో ఫోటోలు తీసి పేపర్లలో వేసి పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెల్దాం, అనే అల్ప మానసిక స్థితిని అలవరుచుకుని చుట్టుపక్కలవారిని కలుషితం చేశాను.
ఒక్క గెంతులో కూపంనుంచి బయటకి వచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవచ్చుకదా! ఏ కూపంలోనూ ఇరకనివాడికి బయట ఉన్న సుందరప్రపంచం, దాని విశాలత అంతా స్వంతమే కదా.
అసలు ఏసామాజిక ప్రయోజనం లేదుకదా, ఈ కులమూర్ఖత్వం ఇన్నిమానసిక ఛీద్రాలకి దారితీస్తోందని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ రెండు దశకాలు దాటిన మూడవ సహస్రాబ్దిలోకూడా కులం మనిషిని జలగలా పట్టుకుని ఎందుకు వదలటం లేదు?”
“20 శతాబ్దం మొదటి వరకు మనం అనుకున్నట్లు కులం ఒక వృత్తిని సూచించేది. వృత్తికి సామాజిక ప్రయోజనం ఎలాగూ ఉంది. ఆ తర్వాతే కొందరు కులం అనే మాటని అపభ్రంశం చేశారు. కులాన్ని అహంభావ ప్రదర్శనకి వాడుకున్నారు. నిరక్షరాస్యత, బీదరికం, ప్రయాణ సౌకర్యాల లేమి, అవగాహనా రాహిత్యం, బ్రిటిష్ వారికింద దాస్య ప్రభావం ప్రబలంగా ఉన్న 19వ శతాబ్దాంతం వరకు ప్రజలు తమ గ్రామాలని అంటిపెట్టుకుని ఉండేవారు. కులవృత్తులు చేసుకునే వారు తమ ఆర్థిక స్తోమతకి అనుగుణంగా ఎరిగి ఉన్న తమ సమీప బంధువులనించే సంబంధాలు వెతుక్కుని పెళ్లిళ్లు చేసుకునేవారు. కొన్ని తరాలు ఇలా గడిచాక, కొన్ని ఆహారపు అలవాట్లు, మాట తీరులు, వేష భాషలు, ఆ సముదాయానికే పరిమితమవుతూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ అలవాటు వలన వారి వృత్తి విద్యలు సమర్థవంతంగా సామూహికంగా చేసుకునే నేర్పు అలవడింది. కానీ ఆ సముదాయానికే పరిమితమయిన కొన్ని మూఢాచారాలు, సమీపరక్త సంబంధీకులతో కొన్ని తరాలపాటు అంతర్వివాహాలు చేసుకోవటం వలన బలహీనమైన, అనారోగ్యమైన సంతతి పుట్టడం వంటి అవాంఛనీయ పరిణామాలు కూడా సహజంగా చోటుచేసుకున్నాయి. మా కులం మాకు రక్షణ, మా కులం మా గుర్తింపు అన్న అపోహ గట్టిపడింది.
గత 120 సంవత్సరాల నించీ, మరీ ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, దేశకాల పరిస్థితులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. కులబంధం నించి బయటపడటానికి, ప్రతి భారతీయుడికి వందలాది అవకాశాలు వచ్చాయి. రాజ్యాంగం, చట్టం ప్రోత్సహించాయి. అనేకమంది సంఘసంస్కర్తలు ప్రబోధాలు చేశారు.”
“అయినా మన దురదృష్టం కొద్దీ ఇరవయ్యవ శతాబ్దాంతానికి సమూలంగా సమసిపోవలిసిన కులవ్యవస్థ వంద సంవత్సరాల క్రితం కంటే ఎంతో బలంగా నేడు కోరలు సాచింది. ఇంకా విషం చిమ్ముతూనే ఉంది, మరింత క్రూరంగా. కొన్ని వర్గాల వారిని అల్పులుగా ముద్రవేసేంత నైచ్యానికి దిగజారేంతగా.
ఈ సంకటం నుంచి బయటపడేందుకు విజ్ఞులు, సమాజహితం కోరేవారు యుద్ధప్రాతిపదికన తక్షణం నడుం కట్టాలి.”
“ఇప్పడికే కాలాతీతం అయిపోయింది. సమాజహితం అంటేనే వ్యక్తిగత హితం. నా కులం ఇది అని ముఖాన రాసుకున్న వ్యక్తికి హితం లేదు. ఈ క్షణం నుంచి నాకు కులం లేదు, లేదా అన్ని కులాలు నావే అని మనసా వాచా కర్మణా అని నమ్మినవాడికి సర్వహితాలు ఆ క్షణమే కలుగుతాయి. అంతర్గతం ప్రక్షాళన అయి ఎదుటబడిన ప్రతి వ్యక్తి స్నేహితుడిలా కనబడతాడు. సనాతన ధర్మం ప్రతిపాదించిన సకల భక్తిజ్ఞాన మార్గాలు సుగమమౌతాయి. అతని ముఖంలో సమభావన వెలిగించే వర్చస్సు అయస్కాంతంలా పనిచేసి పదిమందికి పాకుతుంది. దుర్గంధం ఎంత త్వరగా వ్యాపిస్తుందో అంతే త్వరగా సుగంధం వ్యాపిస్తుంది. రకరకాల కులపిచ్చి వ్యాపింపచేసే వందమంది వెదజల్లే సమిష్టి దుర్గంధం కంటే కులకూపం లోంచి బయటపడిన ఒక్క వ్యక్తి విరజిమ్మే సౌరభాలు ఎక్కువ బలీయమైనవి. ఒక చిన్న దీపం కొంతమేరకు అంధకారాన్ని నిర్మూలించటమేకాక మరికొన్ని దీపాలు వెలగటానికి తోడ్ఫడగలదు. అన్ని సంప్రదాయాలూ నావే అనుకునే వ్యక్తి సమాజంలోని వైవిధ్యమైన ఆటపాటలని, రుచులని, పండగలని, వస్త్ర విశేషాలని ఇవన్నీ నా సంస్కృతిలో భాగమే అని గుర్తించి అభిరుచికి తగ్గట్టు పాలుపంచుకోగలడు. విభిన్నఆచారాల మేలుకలయిక సుందరంగా రూపుదిద్దుకుని, కాలంచెల్లిన అనాచారాలనుంచి విముక్తి చూపించగలదు. ఎన్నో పదాలని, పదబంధాలని, జాతీయాలని, ఉచ్చారణాపద్ధతులని కలబోసుకుని దేశభాషలు, ముఖ్యంగా తెలుగు భాష, పటిష్టమవగలవు.”
“అన్నిటికంటే ముఖ్యంగా వధూవర నిర్ణయంలో ఉప్పెన వంటి మార్పు వస్తుంది. ఒక ఇరుకుసందులో సంబంధాలు చూసుకోవడం పోయి ఊరంతా వధూవరులు గోచరిస్తారు. నాచురల్ సెలెక్షన్ జరిగి వివాహాలు ఆనందమయంగా నిలబడడానికి, శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతమైన సంతతి జన్మించడానికి అవకాశాలు పెరుగుతాయి. త్వరలోనే రాజకీయాల్లోను ప్రభుత్వాలలోను మైండ్‌సెట్ మారి హర్షణీయమైన మార్పులు జరుగుతాయి. కులప్రాదిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వవలసిన అవసరం, అగత్యం క్రమేపీ సమసిపోతాయి. భారత్ మహాశక్తిగా ఎదగడానికి మార్గం సుగమమౌతుంది.
ఈ మాటలు చెవులకి సంగీతంలా వినబడుతున్నాయి, బానే వుంది. కానీ సంభవమంటావా?”
“నిస్సందేహంగా! అధిక శాతం కులపిచ్చితో కళ్ళకి కామెర్లు కప్పేసిన వారు ఉన్నమాట నిజమే, అదృష్టవశాత్తూ ఈ రోజుకీ కొద్దిశాతంమంది స్పష్టంగా చూడగలిగేవారు వృద్ధులలోను, మధ్యవయస్కుల్లోను మిగిలారు. తాము చేయలేకపోయింది ఎవరైనా చేస్తే బాగుండును అని ఆశించే మధ్యరకం వారూ ఉన్నారు. కానీ మన ఆశారేఖలు మన యువతరం. వారికి తోడుగా యుక్తవయసులోకి అడుగిడబోతున్న 15-17 సంవత్సరాల బాలబాలికలు. పెద్దల ఆలోచనాతీరు, వారి రాజకీయాలతో తల బొప్పికట్టి, ప్రస్తుతానికి నివురుకప్పిన నిప్పులా దాగి, సమయం చూసుకుని సమాజానికి అభ్యంగనం చేయటానికి చాలామంది యువత సిద్ధంగా ఉన్నారు.
ప్రణాళికలో మొదటి భాగం నుదుటిమీద తల్లిదండ్రులు కొట్టిన కులపుట్టుమచ్చని తుడిపేసుకోవటం. అని పేరులో కులాన్ని జొప్పించటం ఎంత అవివేకం? ఎంత విభజనాపూర్వకం? తెలుగునాట సగం పేర్లు కులసూచికలే! శెట్టి, యాదవ్, గౌడ్, రెడ్డి, శాస్త్రి, నాయుడు, పంతులు, చౌదరి, రాజు, ముదిరాజు, వర్మ, శర్మ, ఇంకా ఎన్నో.. పేర్లలో తమ కులం ప్రకటించుకోవడం అవసరమా? ఆ తోకలు సూచించే వృత్తులు, అలవాట్లు, వాటి తాలూకు గుర్తింపు ఏనాడో నిరర్ధకమైపోయింది. శాస్త్రాలలో ప్రావీణ్యం సంగతి పక్కన పెడదాం, అమరకోశం అనే పుస్తకం ఉందనికూడా తెలియనివాడు పేరు చివర ‘శాస్త్రి’ తగిలించుకుంటాడు. నాలుగు తెలుగు వాక్యాలు సరిగా పలకలేని వాడు ‘అవధాని’ అని పెట్టుకుంటాడు. ఇంకొకడు సోమయాజి. ఏ రాజ్యాలు లేవుకాని పేరుకి రాజు. కొన్ని కులసూచికలు పేరులో పెట్టుకుంటే, కొన్ని ఇంటిపేర్లలో బిగించబడి ఉంటాయి. కొంతమంది బల్లగుద్ది చెప్పుకోవాలన్నట్లు పేరులోనూ ఇంటిపేరులోనూ స్టాంపు వేయించుకుంటారు. ‘సింగంరెడ్డి వీరారెడ్డి’.
‘చౌదరి’ బిరుదా, కులసూచికా, చతుర్ధుడు అన్న అర్ధంతో వాడిన పదమా?
రాజ్యాంగం 29, 21,14 ఆర్టికల్స్ ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికీ తన పేరు, ఇంటిపేరుతో సహా మార్చుకునే ప్రాథమిక హక్కు ఇస్తోంది. కొద్దిపాటి ఖర్చు, కొంత సమయం పట్టే ఈ ప్రక్రియ త్వరలో ఇంకా చౌక, సరళతరం కానుంది.
సమాజహితం కోరే పెద్దమనుషులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు కులముద్ర చెరిపివేయటంకోసం పేరు మార్చుకోవటానికి ముందుకు వచ్చే యువతని ప్రోత్సహించి, అవసరమయితే కొంత ధనసహాయం చేసి కులరహిత నవసమాజ స్థాపనకి దోహద పడతారని ఆశిద్దాం.
ఎటువంటి విప్లవానికైనా పాతనీటినుంచి ప్రతిఘటన తప్పదు. కులతత్వాన్ని నరనరాల్లో జీర్ణించుకుని, కులవ్యవస్థని ఆసరాగా పెట్టుకుని, రాజకీయాలు, వ్యాపారాలు నడిపే అనేకులు రాబోయే సంస్కరణని ఎంతగానో అడ్డుకుంటారు. కానీ యువత సంకల్పబలం ధాటికి ఎముకలు కుళ్ళినవారి గతినిరోధకాలు వీగిపోవటం తథ్యం.”
***
“విభేదాలతో మొదలయిన మన సంభాషణ చివరికి ఏకతాటి మీద నడిచి ఉపయుక్తమైన ఏకాభిప్రాయానికి రావడం ఆనందంగా ఉంది.”
“ఇంకా మాట్లాడుకునే ముందు మనం ఒక విషయం స్మరించుకుంటే మంచిది అనుకుంటాను. సనాతన ధర్మంలో వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు పురాణాలు భగవద్గీత వంటి జగత్ప్రసిద్ధి చెందిన మహోన్నత స్మృతులు, దర్శనాలు, ఉల్లేఖాలే కాక ఈనాటి సామాన్య పాఠకుని మేధకి అందనంత నిగూఢత కలిగిన అనేక వాదాలు మనకి పిత్రార్జితంగా సంక్రమించాయి. పరస్పర విరుద్ధమైన అనేక వాదాలు మన సంస్కృతిలో ఉన్నాయి. ఈశ్వర వాదానికి దీటుగా నిరీశ్వర వాదం ఉంది. ఆస్తిక వాదమంత బలంగా నాస్తికవాదం ఉంది. అన్ని వాదాలని మన పూర్వీకులు ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. ఏ కోవకీ చెందని మేరు పర్వతంవంటి కపిల మహర్షి సాంఖ్యం ఎలాగూ ఉంది. అనాత్మవాదం, భౌతిక వాదం, అవైదిక వాదం, పతంజలి యోగం, తంత్రశాస్త్రం, బౌద్ధం, జైనం ఇవన్నీ క్రీస్తు పుట్టడానికి 500 సంవత్సరాల కంటే పురాతనమైనవి. ఒక దాని పర్యవసానంగా ఒకటి పుట్టింది, ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసింది. ఈనాటికీ మన రక్తంలో వీటి మేలు కలయిక అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. ఈ అంతర్వాహినిని మనం కృతజ్ఞతాపూర్వకంగా సనాతన ధర్మం అని పిలుచుకుంటాం.
సనాతన ధర్మం ఒక మతానికి ఒక కులానికి ఒక ప్రాంతానికి ఒక సమయానికి చెందినది కాదు. నిఘంటువులో పదాలు దొరక్క సనాతన ధర్మాన్ని ధర్మం అంటున్నాం కానీ, సనాతన ధర్మం ధర్మానికి అతీతం. సనాతన పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. పురాతన, సర్వజనాచరణీయమైన, సర్వసమ్మతమైన, నిత్య నూతనమైన నిగూడమైన, సజీవమైన, సర్వజన కళ్యాణకారకమైన..
ఈనాటి రాజకీయవేత్తలు పరస్పరం తిట్టుకోవడానికి సనాతన ధర్మం అన్న పదాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారని గమనిస్తే బాధగా ఉంది.
యాతావాతా, నువ్వు నేను పోట్లాడుకుంటూ మాట్లాడుకునే అల్ప విషయాలకీ, 3000 సంవత్సరాల కిందటి మహర్షుల మేధోస్థాయికి, హస్తి మశకాంతరం ఉందని మనం గమనిస్తే అంతే చాలు.”
“అయ్యా, బ్రహ్మజ్ఞానం గురించి క్లుప్తంగా బ్రహ్మాండంగా చెప్పారు. వస్తుతః మీరు బ్రాహ్మణులు! మీరు సంకల్పించి కొంత అభ్యాసం చేయాలే కానీ యాజ్ఞీకం, అర్చకత్వం, వేదపఠనం సశాస్త్రీయంగా, సార్ధకంగా, చేయగలరు, చేయించగలరు!”
“అభిలాష, అభిరుచి, కృషి, సంకల్పం, సమయం – సమపాళ్లలో ఉంటే ఏదైనా సాధ్యమే. నువ్వు ఇందాక ఏదో చెప్పబోతుంటే అడ్డుకున్నాను.”
“ఒక విశిష్టమైన మంచి వ్యక్తి గురించి మీకు చెబుదాం అనుకుంటున్నాను. అతను నాకు కొద్ది కాలంగా పరిచయం. ఆత్మ నిర్భరత, ఆలోచనలో పదును, పుష్కలంగా ఉన్న వ్యక్తి. ముస్లిం కుటుంబంలో పుట్టినా 15 సంవత్సరాలకే స్వతంత్ర భావాలు అలవరుచుకున్న మనిషి. ఇస్లాంతోపాటు ఇతర మతాల లోతుపాతులని అధ్యయనం చేసి, వివాహానికి ముందే ఇస్లాం నుంచి బయటకు వచ్చాడు. తదుపరి ఏ మతము స్వీకరించలేదు నాస్తికుడనే ముద్ర కూడా వేసుకోలేదు. అజ్ఞేయవాదం (agnosticism) కూడా అతన్ని ప్రభావితం చేయలేకపోయింది.
అతని పేరు గౌహర్. గౌహర్ పదానికి ఉన్న అర్థాల్లో ఆణిముత్యం, వెలుగు చూడని ప్రతిభ, వేడుకోలు -కూడా ఉన్నాయి. ఆ పేరు అతని తల్లిదండ్రులు పెట్టినదో, మతం వదిలేశాక అతనే పెట్టుకున్నదో నాకు తెలియదు.
శాస్త్రీయ సంగీతం వినడం, కవిత్వం చదవటం, తను స్వయంగా గజల్స్ రాసి పాడటం అతని కాలక్షేపాలు. ఏ కొద్దిమందితోనో తప్ప గౌహర్ మనసు విప్పి గంభీరమైన విషయాలు మాట్లాడడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి ఈయన ఆలోచనలు ఏనాడో జనజీవన స్రవంతిలో కలిసి ఉండవలసిందిగా అనిపిస్తుంది. వెనువెంటనే ప్రస్తుత సమాజానికి గౌహర్‌ని అర్థం చేసుకునే పరిపక్వత లేదేమో అనిపిస్తుంది. అతని ఆలోచనలు నా మాటల్లో క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
మనిషికి మతం అవసరమా? మూడు వేల సంవత్సరాలలో పదులకొద్దీ మతాలు పుట్టుకొచ్చాయి. ఈ మతాలు మానవాళికి చేసిన మంచి ఎంత, కీడు ఎంత?
ప్రపంచంలో మతం పేరుతో, మతంలోని ఉపమతాల పేరుతో విభజనలు, విద్వేషాలు, విధ్వంసాలు యుద్ధాలు, మారణహోమాలు, మానభంగాలు జరగని దేశం, జరగని కాలం ఉందా? మతస్థాపకుల ఆశయం ఇదా? 2500 సంవత్సరాల క్రింద ఒకరు, 2000 సంవత్సరం క్రితం ఒకరు, 1600 సంవత్సరాల క్రితం ఇంకొకరు, ఇటీవల 700 సంవత్సరాల క్రితం ఇంకొకరు కొన్ని మంచి మాటలు, నీతి వాక్యాలు, ప్రజలు సంతోషంగా ఉండడానికి తమకి తోచిన మార్గాలు ఆ సమయానికి అప్పటి ప్రజలకి తగినట్లుగా బోధించారు. వీరిలో ఏ ఒక్కరూ తమ మాటలు ఒక ‘మతం’ అని, అది ఎంతో గొప్పదనీ, శాశ్వతమని, తాము చెప్పిన మాటలు తప్ప ఎవరు ఎప్పుడు ఏమి చెప్పినా, భవిష్యత్తులో చెప్పబోయినా శుష్కాలనీ, వాటిని అణిచివేయాలని చెప్పలేదే! అటువంటి మనోస్థితి వారికి ఉండిఉంటే వారు మహనీయులు ఎట్లా అవుతారు!
ఎంతోమంది మహనీయులు పురాతన కాలం నుంచి నేటి వరకు ఉద్భవించారు. ఉద్భవిస్తూనే ఉంటారు. మానవ మేధస్సు పరిణామం చెందుతూ ఉంటుంది, పరిణతి పొందుతూ ఉంటుంది. ఆ పరిణతికే మరో పేరు సృష్టి. ఒక ప్రత్యేక విశిష్టమైన ఆలోచనా ప్రక్రియకి మీరు మతం అని పేరు పెట్టుకుంటారా, మీ ఇష్టం. కానీ కొన్ని వందల మతాలు పుట్టాయి. కొన్ని సమసి పోయాయి. ఇకముందూ కొన్ని వందలు పుడతాయి. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న మతం రెండుశతాబ్దాల తర్వాత కనుమరగైపొవచ్చు. శరీరం, మనిషిజాతి, భూగోళం, సౌర మండలం, పాలపుంత, ఇవేవీ శాశ్వతం కానప్పుడు ఒక ఆలోచన ఎలా శాశ్వతం అవుతుంది?
‘ఎన్ని సహస్రాబ్దులు గడిచినా మేము చెప్పిన నీతులు తప్ప ఇంకొక నీతిని స్వీకరించడానికి నీకు అధికారం లేదు. నీకు చట్రందాటి స్వతహాగా ఆలోచించడానికి అధికారం అంతకంటే లేదు’ అని ఎవరైనా అంటే, తలూపి దాస్యం చేసే మానసిక హైన్యతతో నా చేతస్సు నిర్మింపబడ లేదే!
ఏ ఒక్క మతం వేసే సంకెళ్ళు నాకువద్దు. ఉపనిషత్సారపు సౌరభం అంతఃకరణలో ప్రవేశించాక మాటలు మిగులుతాయా! ఇంకా ఒకటో రెండో తచ్చాడుతుంటే లావోట్సూ లాక్కెళ్ళి పోడా? బుద్ధుడు, క్రీస్తు మదిలో మెదిలితే ప్రపంచంలో ప్రేమరహిత వస్తువు వెతికినా కనబడదే!”
“మనం కులందగ్గరే ఆగిపోతే మీ గౌహర్ మతాన్ని కూడా దాటి పోయాడే! నిత్య జీవితానికొద్దాం. దేశాలు, చట్టాలు, కుటుంబాలు, అన్నీ ప్రస్తుతం మతాలు గీసిన కారాగృహాల్లోనే మూలుగుతున్నాయి కదా! ఎవరి సంకెళ్ళు వారికి ముద్దు. మీ స్నేహితుని చేతికి సంపూర్ణ అధికారం వస్తే అతను ‘ఫిలాసఫర్-కింగ్’ అవుతాడు కదా. సంకెళ్ళు వేసుకున్న ప్రజల మేలుకోసం, దేశంకోసం, వీలయితే ప్రపంచం కోసం ఆయన ఎటువంటి సంస్కరణలు చేపడతాడంటావ్?”
“గౌహర్ నాతో ఎప్పుడూ అనలేదు కానీ ఊహించగలను.
రాజ్యాంగపరంగా దేశంలోని యావత్ ప్రజానీకం కులమత రహితం. ఇంటి నాలుగు గోడల మధ్య ఎవరికి నచ్చిన ప్రార్థనా విధానాలు, కట్టుబాటులు, వేషధారణలు వారు నిరాటంకంగా పాటించవచ్చు – శబ్దకాలుష్యం లేకుండా. రోడ్లమీద, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో, విద్యాలయాల్లో, ప్రయాణాల్లో, సైన్యంలో, మతసంబంధిత కార్యక్రమాలు, వేషాలు, ప్రదర్శనలు నేరం. మతం పేరుతో ఊరేగింపులు, గుమికూడటాలు నిషేధం. పౌరులందరికీ ఒకటే చట్టం, సమాన హక్కులు. అన్ని ప్రార్థనాలయాల్లో అందరికి ప్రవేశం. పరిమితికి మించి శబ్దాలు వద్దు. మత కుల లింగ వివక్ష శిక్షించదగిన నేరం. ప్రసక్తి ప్రస్తావనలు కూడా నేరమే.”
“ఊహించుకుంటేనే ఆహ్లాదంగా ఉంది. ప్రజల శక్తియుక్తులు, సమిష్టి సంపద, అమూల్యమైన కాలం దేశ ప్రగతిమీదే కేంద్రీకృతమౌతుంది కదా!
ప్రజల మానసిక పరిణతి పెరిగేకొలది కులమతరాహిత్యం స్వచ్ఛందంగా జరిగి, పోలీసులకి, కోర్టులకి పని తగ్గిపోతుందేమో!
‘దేముడు’ ‘మతం’, ‘ప్రార్థన’ అనేవి హృదయానికి సంబంధించినవి. ఎంతమంది మనుషులున్నారో అంతమంది దేవుళ్ళుండవచ్చు. అసలు ఏ దేముడూ ఉండకపోవచ్చు. మౌనమూ ప్రార్థనే అవచ్చు.
నరనరాల కులంమతం జీర్ణించుకుపోయిన 75 సంవత్సరాల ‘సెక్యులర్’ దేశంలో, ‘వసుధైక కుటుంబకం’ అని వల్లించే పవిత్రభారతంలో ‘నో కాస్ట్ నో రెలిజియన్’ సర్టిఫికెట్ సంపాదించటానికి తమిళనారి స్నేహ ఎన్ని సంవత్సరాలు ఎంత పోరాడవలసి వచ్చిందో నీకు తెలిసే ఉంటుంది.
సొరంగం చివర వెలుతురు కనిపిస్తోంది. ఎంతోమంది స్నేహలు నిశ్శబ్దంగా సంకెళ్ళు తెంచుకుంటున్నారు!”
(సమాప్తం)