Site icon Sanchika

ఏకశిలాపురధామా రామా

[box type=’note’ fontsize=’16’] ఒంటిమిట్ట కోదండ రామ దేవస్థానం ప్రాచుర్యాన్ని తొమ్మిది పద్యాలతో వివరిస్తున్నారు కట్టా నరసింహులు “ఏకశిలాపురధామా రామా” అనే ఈ పద్యకవితలో. [/box]

ఏకశిలాపురధామా రామా
సీతాలక్ష్మణసమేత రామా
ధర్మము ధరపై సంస్థాపించగ
ఒంటిమిట్టలో వెలసిన రామా:
ఏకశిలాపురధామా రామా
సీతాలక్ష్మణసమేత రామా. (1)

అకార ఉకార మకారములతో
ముగ్గురు మూర్తుల మూలాత్మకమై
ఒకే శిల్పమున ఓంకారముగా
ప్రణవ మంత్రమై వెలసిన రామా: ఏకశిలాపుర (2)

కృతయుగమందున శృంగిశైలమున
తపమొనరించిన జాంబవంతునికి
దివ్యరూపమున దర్శనమిచ్చిన
తారకరామా దశరథరామా : ఏకశిలాపుర (3)

తండ్రి ఆజ్ఞను తలపై దాల్చి
తమ్ముడు ధరణిజ మిమ్ము గొలువ గా
జాంబవంతునికి దర్శన మిచ్చిన
గిరిపై కాపుర ముండిన రామా: ఏకశిలాపుర (4)

సీతామాతకు దప్పిక కాగా
బాణము విడిచి గంగను తెచ్చి
త్రేతా ద్వాపర కలియుగములుగా
రామతీర్థమును నిలిపిన రామా :ఏకశిలాపుర (5)

సీతామాతను అన్వేషించుచు
జాంబవంతుడు తొలినాడిచ్చట
నీపదరేణువు తలపై నిడుకొని
సాగెను ముందుకు జానకిరామా: ఏకశిలాపుర (6)

దుష్టుల దునుమగ ధర్మము నిలుపగ
కోదండము నీవెంట నుండగా
రఘునాయక విఖ్యాతనామమున
కొలువైనాడవు గుడిలో రామా : ఏకశిలాపుర (7)

వైకుంఠము మా స్వామి నివాసము
బంటునివాసము బయటే సుమ్మని
అంజలి ఘటించి హనుమంతుడిదే
సంజీవుడుగా నిలిచెను రామా:  ఏకశిలాపుర (8)

ఏకశిలాపురి రెండవ అయోధ్య
కలివైకుంఠము ఒంటిమిట్టయే
కొలిచినవారికి కొంగుపసిడియే
రామా రామా రాఘవరామా : ఏకశిలాపుర  (9)

Exit mobile version