తాగేవాళ్ళు ఎప్పుడూ ఒక్క ఫ్లేవర్ టీనే తాగరు. జలుబు ఉంటే అల్లం టీ, ఉత్సాహం కోసం ఏలక్కాయ టీ, చలికాలం అయితే మసాలా టీ ఇలా రక రకాల టీలు తాగుతుంటారు. ఇప్పుడైతే మరిన్ని రకాలు వచ్చాయి. గ్రీన్ టీ, పువ్వుల రేకులు ఎండబెట్టి పెట్టిన టీ ఇలా ఎన్నో. అయితే ఎవరి రుచి కి తగ్గట్టు వారు ఏ టీ తాగాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవలసిందే కదా. లోకో భిన్న రుచి.
ఈ వారం చూసిన లఘు చిత్రం పేరు “ఇలాయ్‌చీ” అంటే ఏలక్కాయ. ఆ ఇంట్లో నలుగురు ఉంటున్నారు. పద్దు (నిమ్రత్ కౌర్ — ఈమె The Lunchbox చిత్రం తో వెలుగులోకొచ్చింది), భర్త సమర్ (దివ్యేందు శర్మ), వంట మనిషి బిందు(విభా చిబ్బర్) లు. అయితే ముగ్గురిలో సమర్ మాత్రం బ్రతికున్న మనిషి కాదు. కేవలం పద్దు కి మాత్రం కనబడే ఆమె భర్త. ప్రాణం పోయినా భార్యను వదల లేక అనుక్షణం ఆమెను అంటిపెట్టుకునే వుంటాడు. భర్త పోయాడు అన్న విషయాన్ని జీర్ణించుకుని తిరిగి ఈ లోకం లో పడాల్సిన ఆమెకు మాత్రం ఆ అవకాశమూ రాదు, అవసరమైన ఏకాంతమూ దొరకదు. బాత్‌రూం లోకెళ్ళినా అక్కడా ప్రత్యక్షం. విసుగెత్తి వెళ్ళి పొమ్మంటుంది. కానీ అతను బలహీనుడు. ఆత్మహత్య చేసుకుందామనుకుని ట్రేన్ కింద పడటం, బహుళ అంతస్తుల భవనం పైనుంచి దూకడం లాంటివి చేస్తాడు. కానీ చనిపోయినతనికి మళ్ళీ మరణం ఎక్కడిది? గతిలేక మరలా భార్య వెంట పడి ఆమె మాటలు పడతాడు.
నువ్వు నన్ను నాకు ఏకాంతం కూడా లేకుండా చేస్తున్నావని ఫిర్యాదు చేస్తుంది. నువ్వూ ఏకాకివి, నేనూ ఏకాకిని; నీకు కనీసం స్పర్శా జ్ఞానం ఉంది, నాకదీ లేదంటాడు. ఆమె శరీరం లో బలవంతంగా ప్రవేశిస్తాడు. ఇప్పుడూ ఇద్దరమూ ఒంటరి కాము అంటాడు. కాని ఆమె కసురుకోవడంతో ఆమెను వదిలి పెడతాడు. ఆమె అంటే అతనికి అంత అటాచ్మెంట్. ప్రాణం పోయాక కూడా వదలలేనంత. కానీ అది అటాచ్మెంట్ ఏనా? అంతా ప్రేమేనా? అపరిమిత అధికార ప్రకటన కాదా? ఏమో.
సమర్ మాటిమాటికీ ఆమె ముందు రావడం, ఆమె అతనితో వాదించడం ఇదంతా చూస్తున్న బిందుకి వింతగా ఉంటుంది. ఎందుకంటే తను కేవలం ఆమెను మాత్రమే చూడగలుగుతోంది. ఆమె ప్రవర్తన వింతగా అనిపించక ఏం చేస్తుంది?
ఒకసారి ఆమె చెవిలో ఊదుతాడు : బిందు కూడా నాలాంటిదేనేమో, ఎందుకంటే ఆమెను నువ్వు ఒక్కదానివే చూడగలుగుతున్నావు మరి. ఆమెకు కూడా అనుమానం వస్తుంది. ఉల్లిపాయ ముక్క తీసుకునే నెపంతో కాలుతున్న సిగరెట్టును ఆమె చేతికి తాకేలా చేస్తుంది. చేయి చురుక్కుమన్న బిందు ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. ఆ తర్వాత సంబాళించుకుని టీ ఏమన్నా కావాలా అని అడుగుతుంది. పెట్టమంటుంది పద్దు. రెండు గాజు సీసాలు పట్టుకుని అల్లం టీనా, ఏలక్కాయ టీనా అని అడుగుతుంది. సమర్ చెవిలో పోరుతుంటాడు ఆ ఇలాఇచీ వాసన బాగుండదు, అల్లం టీ పెట్టమని. దీన్నే నస అంటారు. ఒక క్షణం ఆగి చాలా స్పష్టంగా చెబుతుంది ఇలాయిచీ టీ పెట్టమని చెప్పు.
ఈ అయిదు నిముషాల చిత్రం లో మనకు ఒక మంచి అనుభూతిని మిగులుస్తాడు దర్శకుడు. మరపు రాదు ఈ చిత్రం. మొట్ట మొదటి సీన్ లో దేవుని మందిరం లో వున్న రాధా కృష్ణుల పటానికి దీపారాధన చేస్తున్న పద్దు. రాధ కృష్ణులు వివాహం చేసుకోలేక పోయినా, మధ్య ఎడబాటు ఉన్నా ఒకే ఆత్మగా ఉంటారు. అంత మంది దేవుళ్ళని వదిలేసి ఈ పటం పెట్టడం కూడా ఒక మెరుపే. రెండు ఏక్సిడెంట్ల సీన్లు వున్నాయి. ట్రేన్ ముందు నిలబడటం, మీద నుంచి ట్రేన్ వెళ్ళిపోవడం; రెండోది ఎత్తైన బిల్డింగ్ నుంచి దూకడం. రెంటిలోనూ జిమ్మిక్కులు చేయకుండా మధ్య లో ఫేడ్ ఇన్ ఫేడ్ ఔట్ లు వాడుతూ ఆ ప్రభావాన్ని సమర్ నటన ద్వారా కలిగిస్తాడు. బాగా చేసాడు నబ్యేందు శర్మ. నిమ్రత్ కౌర్ కూడా బాగా చేసింది. ముఖ్యంగా అద్దం ముందు నిలుచున్నప్పుడు ఆమెలో సమర్ ప్రవేశించాక ఇద్దరి మధ్య సంభాషణా తనొక్కతే పలకాలి. అద్దంలో ప్రతిబింబం, ఎదుట తన నిజరూపం. అక్కడ ఆమె నటనా బాగుంది, దర్శకుడి ఆ కంపోజిషన్ కూడా తెలివిగా అర్థవంతంగా వుంది. విభా చిబ్బర్ నటన కూడా బాగుంది. మొదటి సారి ఇల్లు తడిగుడ్డతో తుడుస్తూ పద్దు వైపు వింతగా చూస్తుంది. ఆమె కళ్ళు మాత్రం చూపిస్తాడు దర్శకుడు. Very expressive eyes ఇక పూర్తి రూపం, సంభాషణా చివరి సీన్ లోనే. ఇక నాలుగో “పాత్ర” ఒక డోడో. అంటే ఇప్పుడు అంతరించిపోయిన ఒక జంతువు. దాని బొమ్మ ఆ ఇంటిలో ఒక అలంకార వస్తువులా అమర్చబడి వుంది. మధ్య మధ్యలో దాన్ని క్లోజప్ లో ముక్యంగా ఆ కళ్ళు చూపిస్తాడు. అవేమైనా చెబుతున్నాయా? లేక నిర్మమకారంగా అంతా చూస్తూ వున్నాయా? మొదటి సారి సమర్ పద్దు ఎదురెదురు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు సమర్ పక్కగా బల్ల మీద పెట్టబడి వున్నట్టు చూపిస్తారు ఆ డోడో ని. ఆ నాలుగో పాత్రను కూడా చక్కగా మలిచారు.
దర్శకుడు దేవాశిష్ మఖీజా సమర్థవంతుడు. అనురాగ్ కాశ్యప్, షాద్ అలీ లకు అసిస్టెంటుగా చేసాడు. ఇది కాక మరికొన్ని లఘు చిత్రాలు తీసాడు. ఇతని నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చ్చు. మంగేష్ ధాకడే సంగీతమూ, శబ్దగ్రహణమూ బాగుంది. నేపథ్య సంగీతాన్ని ఎడా పెడా కొట్టేయకుండా చివరిలో ఒక క్రెసెండో లా ఇచ్చి ప్రభావాన్ని పెంచాడు. అబిమన్యు డాంగే చాయాగ్రహణం బాగుంది. కథ అవసరాలను బట్టి ఎక్కువగా క్లోజప్ లు ఉన్నాయి. అవి ఒకరకమైన over the face ఫీలింగ్ కలిగించి ఊపిరాడకుండా చేస్తుంది.
యూట్యూబ్ లో వుంది, తప్పక చూడండి.
https://youtu.be/jysTI5cv2PM