[dropcap]”ఇం[/dropcap]త చెట్టు అంత మాను అవుతుంది. ఆకాశాన్ని అందుకోవాలని పెరిగి పెరిగి కడకి విరిగి మన్నుల చేరి మన్నుగా అయిపోతుంది. అట్లే చిన్నబిడ్డ పెద్దవాడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు కడకి ముసలోడై నిగురుకొంటాడు (చనిపోతాడు). ఏలిట్ల అయ్యేదినా?” అంటా కాశన్నని అడిగితిని.
అబుడుతానే నల్లకాసి పండ్లు నక్కి (తిని) ఎర్రకాసి పండ్లు నాకతా వుండిన అన్న ‘అలెలో బాల్గో’ అని కిరిసి వొళ్ళు వించుకొని “పుట్టి, పెరిగి, విరిగే” నియమము నింకారా అనె.
“ఓ అట్లనా?” అంట్ని.
“ఊరా” అంటా ఆవళిచ్చె.
“ఈ నియమము బూమ్మీదేనా? లేదా విశ్వములాను వుందానా?”
“అంతా వుందిరా విశ్వంలా మార్పు అనేది సహజంరా”
“అట్లయితే ఇట్ల మారిమారి మనిషి కూడా ఒగనాడు వేరే జీవిగా మారిపోతాడేమోనా?”
“మారిపోవచ్చు. అసలు మనిషి అనేవాడు ఈ బూమ్మీద లేకుండానే పోవచ్చు కూడా… కాని పుట్టి, పెరిగె, విరిగే నియమము మాత్రం వుంటుందిరా, తన పని తాను చేస్తా పోతుందిరా”
“పోనీ లేనా నేనూ నా పని చేస్తా, ఆ నియమములా నిక్షేపమై పోతా లేనా”.
***
ఏలిట్ల = ఎందువల్ల