Site icon Sanchika

ఏం చెయ్యాలి?

[వి. నాగజ్యోతి గారు రచించిన ‘ఏం చెయ్యాలి?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వి[/dropcap]ద్యని అభ్యసించడానికి
వయోపరిమితి లేదంటారు
వెనకడుగు వేయరాదంటూనే
అర్థం కాకో, జ్ఞాపకం లేకో
మళ్ళీ అడిగితే నువ్వింకా
చిన్నపిల్లవా అని హేళన చేస్తారు

అన్నిటా ముందుండు అంటూనే
నచ్చిన పనులు చేయబోతే
నువ్వేంటి మాతో సమానంగా
అని అడ్డుచెపుతారు

అరవైలో ఇరవైలా ఉంటే
మంచిదన్న వారే
ఇంత వయసొచ్చినా
ఇంగిత జ్ఞానం లేదంటారు

ఆస్పత్రిలో డాక్టర్లు
అభ్యంతరం చెప్పకూన్నా
ఇష్టమైనవి కొనుక్కుని తింటే
కోరికలు ఇంకా చావలేదంటారు

మీ వయసులో మేమిలా లేమంటే
కాలం మారిందంటూ
బయట ప్రపంచం చూడమంటారు

సన్నిహితులతో కలిసి
సమయం గడిపితే
తిరుగుళ్ళు అవసరమా అంటూ
ఎద్దేవా చేస్తారు

ఎవరి మాట వినాలి
ఎలా ఉండాలి అనే మీమాంసలోనే
కాలం గడిచిపోతుంది
బాధ్యతలు నెరవేరుస్తూ
అదిమి పెట్టిన కోరికలతో
కట్టె కాటికి చేరుతుంది

Exit mobile version