Site icon Sanchika

ఏం మాయ చేశావే

[dropcap]”ఓ[/dropcap]రేయ్ వరం, వరప్రసాదు, ఏమిటా కలవరింతలు. బారెడు పొద్దెక్కింది లే ఇంక” అంటూ బామ్మ లేపడంతో స్వప్నలోకం నుండి వాస్తవంలోకి వచ్చాను. రెండు నెలల క్రితం పెళ్ళి చూపుల్లో విశాలిని చూసినప్పటి నుండి రకరకాల కలలు వస్తున్నాయి నాకు. నల్లగా నిగ నిగలాడుతూ బారెడు జడ. ఆమె నడుస్తుంటే వెనక లయబద్ధంగా కదులుతూ నన్ను కవ్విస్తోంది. పెద్ద జడ ఉన్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. అందమైన పొడవాటి జడ, చెంపకు చారడేసి కళ్ళతో, సన్నజాజి సౌకుమార్యం, చామంతి సొగసు కలగలిసి అచ్చు దేవకన్యలా, బాపు బొమ్మలా ఉన్న విశాలి నాకు చాలా నచ్చింది. ఒక అందమైన తోటలో ఒకరి అడుగులో ఒకరు అడుగేస్తూ నడుస్తున్నట్లు, ఇద్దరం కలిసి రెక్కలు కట్టుకుని చందమామను తాకినట్లు, నేను నక్షత్రాలను ఒక్కటొక్కటిగా ఏరి ఆమె అందమైన జడలో తురిమినట్లు, ఓ అందమైన సాయంత్రం మా ఇంటి డాబా గుడి గంటల గణగణతో పాటు జంటకోయిలల ‘కుహు కుహు’లు వింటున్నట్లు ఇలా రకరకాల కలలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే పెళ్ళంటు చేసుకుంటే విశాలినే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. విశాలి నాకే కాదు, మా ఇంటిల్లిపాదికి నచ్చేసింది. ఈ మధ్య చాలా సంబంధాలు చూశాను. నాకు ఎవరు నచ్చలేదు. “ఏదో ఒకటి సర్దుకోవాలిరా వరం” అన్నాడు నాన్న. అమ్మ మాత్రం నాకు వంత పాడింది. “వాడికి నచ్చందే ఎలా చేసుకుంటాడండీ?” అనేది. “నువ్వంతా మీ తాత పోలికరా వరం, ఆయన కూడా నీలేగే అందంగా ఉండేవారు” అంటుంది బామ్మ. “వాడికే మండీ, ఏ బరువు, బాధ్యతలు లేవు. మంచి ఉద్యోగం” అంటుంది అమ్మ. ఇవన్నీ చిన్నప్పటి నుండి వినీ, వినీ నేను పెళ్ళి మీద గొప్ప, గొప్ప ఆశలు పెంచుకున్నాను. నా మనసులోనే నా ఊహాసుందరిని ముద్రించుకున్నాను. విశాలిని ఒక్కసారిగా పెళ్ళి చూపుల్లో చూడగానే, నా కళ్ళు గిర్రున తిరిగాయి. ఆమె నా కలలరాణి. నా హృదయేశ్వరి. నాతో జీవితం పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ‘అసలు అమ్మాయిలకు పెద్ద జడ చాలా అందంగా ఉంటుంది. అందుకే దేవతలంతా చాలా అందంగా ఉంటారు. విశాలి వాళ్ళకే మాత్రం తీసిపోదు’ అనుకుంటు మరోసారి ముసుగుతన్నాను.

***

“ఇదిగో కామేశ్వరీ, ఓసారి ఇలా రా, వరాన్ని కూడా పిలువు” అంటూ హడావుడిగా పిలిచాడు నాన్న. “ఇంతకీ సంబంధం విషయం ఏం ఆలోచించారు? వాళ్ళకు ఏదో ఓ మాట చెప్పాలిగా. మధ్యవర్తి ఫోన్ చేశాడు, ‘ఏమనుకుంటున్నారని?’” అన్నాడు నాన్న. “అంత పల్లెటూరు పిల్లను చేసుకుని వాడేం సుఖపడతాడు. మరో సంబంధం చూద్దాంలెండి” అంది అమ్మ. “అది కాదే కామేశ్వరి అమ్మాయి అందంగా ఉండాలన్నావు. అలాగే ఉంది కదా! ఇంకెందుకు వద్దంటున్నావు. ఆ అమ్మాయి మనింటికి వస్తుంది. వాళ్ళది పల్లెటూరయితే మనకేంటి? నువ్విలా వంకలు పెడితే మన వరానికిక పెళ్ళి కాదు” అంది బామ్మ. “అదికాదత్తయ్యా, మరీ అంత పల్లెటూరి పిల్లను కోడలిగా ఎలా తెచ్చుకుంటాం, మీరే చెప్పండి” అంది అమ్మ. “ఆ ఊరితో మనకేంటి? అమ్మాయి చాలా సాంప్రదాయబద్ధంగా ఉంది. ఎంత మర్యాద చేశారు ఏం కద. అబ్బో పెళ్ళి చూపులే ఇంత గొప్పగా చేస్తే,  పెళ్ళెంత ఘనంగా చేస్తారో? ఒరేయ్ అబ్బాయ్ నాకు మాత్రం ఈ సంబంధం చాలా నచ్చిందిరా” అంది బామ్మ. “ఇంతకీ వరం ఏమంటాడో కనుక్కోండి” అన్నాడు నాన్న.

అప్పటి వరకు నిద్ర నటిస్తున్న నేను చప్పున లేచి కూర్చున్నాను. “వరం వరప్రసాదు రారా నీ పెళ్ళి విషయం మాట్లాడాలిట.మీ నాన్న పిలుస్తున్నాడు” అంటూ బామ్మ పిలిచింది. ‘అమ్మో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయాలి లేకపోతే, అమ్మ ఏదో వంకతో కాన్సిల్ చేసేస్తుంది.’ అనుకున్నాను. నా స్వప్న సుందరికి కాసేపు టాటా చెప్పి అక్కడికి వెళ్ళాను. “మొన్న చూసిన పల్లెటూరు సంబధం గురించి ఏం ఆలోచించావు వరం. వాళ్ళకు ఏదో ఒకటి చెప్పెయ్యాలి” అన్నాడు నాన్న. “మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే నాన్నా” అన్నాను మొహమాటంగా. “వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇంక ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం” అన్నాడు నాన్న. “అలాగే నాన్న, మీ ఇష్టం” అన్నాను మనసులో తబ్బిబ్బవుతూ. నాకు పెళ్ళి కుదిరినందుకు ఇంటిల్లిపాది సంతోషించారు. విశాలి ఫోటోని అమ్మ ఫోన్ ద్వారా అందరికీ చూపించింది. “పెళ్ళి ఆ పల్లెటూళ్ళో ఏం బావుంటుందండి? అందరము ఆ పల్లెటూరు వెళ్ళి, రెండు రోజులన్నా ఉండాలి కదా! మనమంతా సిటీ వాళ్ళం. అక్కడ చాలా ఇబ్బంది పడతాము. పెళ్ళి దగ్గర్లో సిటీలో చేయ్యమని అడగండి” అంది అమ్మ నాన్నతో. కాని విశాలి వాళ్ళ నాన్న, అదే నాకాబోయే మామగారు దీనికి ఒప్పుకోలేదు. “లేదండీ, పెళ్ళి ఈ ఊళ్ళోనే మా ఇంట్లోనే జరగాలనేది మా పెద్దవాళ్ళ కోరిక. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించము. ఈ షరతుకి మాత్రం మీరు అంగీకరించాలి, తప్పదు” అన్నాడు. పెళ్ళికి ఒప్పుకున్నాం కనుక ఇక మేళం తప్పదు అనుకున్నామంతా.

పెళ్ళి రోజు దగ్గర పడింది. ఎంతో గ్రాండ్‌‌గా ఫంక్షన్ హాల్లో జిగేల్‌మనే లైట్ల వెలుగులో ఆర్భాటంగా పెళ్ళి జరగాలనే అమ్మ కోరిక మీద నీళ్ళు చల్లినట్లయింది. రెండు ఎ.సి. బస్సులు, రెండు కార్లలో అందరము బయలుదేరాము. వైశాఖ మాసం కావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఊరు రెండు కిలోమీటర్లు ఉండగా మొత్తం మట్టి రోడ్డు. రోడ్డుకు రెండు వైపులా మామిడి తోటలు, కొబ్బరి తోటలు. వాటిని ఆనుకుని మల్లె తోటలు. మల్లెపూల గుబాళింపు మమ్మల్నందరినీ మరో లోకాలకు తీసుకెళ్ళింది. రోడ్డు ప్రక్కనే పిల్లకాలువ. మాతో పాటు పెళ్ళి సంబరానికి వస్తున్నట్లుగా ఉంది. పెదనాన్న కూతురు సుజాతక్క వచ్చి నా ప్రక్కన కూర్చుంది. “నువ్వు చాలా అదృష్టవంతుడివి. అమ్మాయి అందంగా నాజుగ్గా ఉంది. చిదిమి దీపం పెట్టకోవచ్చు వరం” అంది. ఇంకా బాబాయి కూతురు రమ్య, పెద్దమ్మగారమ్మాయి కీర్తి, మామయ్య కొడుకు సుధీర్ అందరు నా చుట్టు చేరారు. పాటలు, డాన్సులు మొదలు పెట్టారు. బస్సంతా కోలాహలంగా మారింది. పిన్ని, అత్తయ్య, పెద్దమ్మ, అందరు అమ్మ చుట్టు చేరారు. అమ్మ, బామ్మ వాళ్ళందరితో ఒకేటి కబుర్లు, మధ్యలో బస్ ఆపారు. గుత్తులుగా వేలాడుతున్న మామిడికాయలను, మల్లెపూలను తాకి, సంతోషపడిపోయారు. కొబ్బరిబొండాలను ఎగిరెగిరి కోయాలని ప్రయత్నం చేశారు. పిల్లకాలువలోని నీళ్ళు దోసిళ్ళతో తాగారు. మరో ప్రక్క ఉన్న వరికంకులను చేత్తో తాకి పక పక నవ్వారు. పంజరంలోని పక్షికి రెక్కలొస్తే ఎలా ఎగురుతుందో, అలా అందరు చిన్న పిల్లలైపోయారు. పిల్ల, పెద్ద తేడా లేకుండా కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుగా అందరు ఆనందపడిపోయారు. ఈ యాంత్రిక జీవనంలో ఎవరికి వారే యమునాతీరేగా ఉన్న బంధాలు, బంధుత్వాలు ఇలా నా పెళ్ళి వల్ల మళ్ళీ ఒక దగ్గర చేరడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వీళ్ళలో చాలా మందిని నేను మొదటి సారి చూస్తున్నాను. అన్నయ్య అని కొందరు, తమ్ముడు అనీ, బావా అని నా ప్రక్కనే కూర్చుని రక పకాల కబుర్లు చెబుతుంటే నాకింత మంది ఆత్మీయులా అనిపించింది!

దార్లో పక్షుల కిలకిలారావాలు, పిల్ల కాలువల సవ్వడులు వింటూ, వాటి జ్ఞాపకాలను తమ చరవాణిలో దాచుకుని ఆ రెండు మైళ్ళు దాదాపు నడుచుకుంటు ఊరు చేరాము. ఇంక రావటానికి ఎంత సేపు పడుతుందంటూ పెళ్ళి వారి నుండి ఒకటే ఫోన్లు. “తొందరగా పదండర్రా” అంటూ బామ్మ హడావుడి చేసింది. విడిదిల్లు మామూలు ఇల్లులా లేదు. చాలా పెద్ద మండువా లోగిలి. ఇంటి ముందు పెద్ద ఖాళీ స్థలం. పెద్ద అరుగులు, ఒక ప్రక్క ధాన్యపు గది. ఒక మూలగా బావి. సినిమాలో తప్ప మరెక్కడా అలాంటి ఇల్లు మేమెవరము చూడలేదు.

మా కోసం అక్కడ నలుగురు పనివాళ్ళు బావిలోని నీళ్ళు గంగాళంలోకి తోడిపోస్తున్నారు. “రండి బావగారు, రండి వదినగారు” అంటు మా అత్తగారు, మామగారు స్వయంగా మాకందరికీ ఆహ్వనం పలికారు. పది నిముషాల్లో రకరకాల టిఫిన్లు విడిదింటికి వచ్చాయి. “నల, భీములేమన్నా వీళ్ళ బంధువులేమో” అన్నారందరు రుచులు ఆస్వాదిస్తూ. ఫైవ్ స్టార్ హోటల్‌కి తీసిపోని కాఫీ అద్భుతంగా ఉంది. ఖాళీ స్థలమంతా తాటాకుల పందిరి వేశారు. చుట్టు ప్రక్కల ఊళ్ళల్లో మా మామగారికి చాలా పలుకుబడి ఉందనుకుంటా.

“వీరాయ్, అందరికీ తాలా ఒక కొబ్బరిబోండం కొట్టి ఇవ్వు. అప్పన్నా గంగాళం నిండా నీళ్ళు తోడిపోయ్యి. ఒరేయ్ సుందరం గాడిపోయ్యి మీద వేడి నీళ్ళు కాగాయో, లేదో చూడు” అంటూ మా అత్తగారు పనులు పురమాయిస్తున్నారు. పెళ్ళి కూతురిని చూసొస్తామంటూ ఆడవాళ్ళంతా పెళ్ళి వారిటికి వెళ్ళారు. మగవాళ్ళంతా చతుర్ముఖ పారాయణం మొదలు పెట్టారు. గంట గంటకు టీ, కాఫీలు అడగకుండానే అందుతున్నాయి వాళ్ళకు. ఆడవాళ్ళంతా గాజులు వేయించుకోడంటూ గాజుల మలారం అతను వచ్చాడు. ఓ గంట గడిచిందో లేదో తాటాకుల గంపనిండా తాటి ముంజలు పంపించారు. పెళ్ళి ముహుర్తం దగ్గర పడుతోంది. చక్కటి సన్నాయి వాయిద్యంతో మమ్మల్నందరినీ పెంఢ్లి మండపం దగ్గరికి స్వాగతం పలికారు. స్వర్గం నుండి కాంతులు భూమి మీదకు జారినట్లుగా కళకళలాడుతోంది పెండ్లి మండపం. అక్కడంతా కొబ్బరాకులతో, మల్లెపూలదండలతో అలంకరించారు. ఓ ప్రక్క సన్నాయి వాద్యం, మరో ప్రక్క ఘుమఘుమలాడే పిండి వంటలు, ఇంకో ప్రక్క సీతాకోక చిలుకల్లా ఎగురుతూ అల్లరి చేస్తున్న చిన్నపిల్లలు. పట్టు పరికిణి, ఓణితో తుమ్మెదల్లా ఝుమ్మని తిరుగుతూ, “మా పెండ్లి కూడ ఇంత ఘనంగా జరుగుతుందా” అని సిగ్గుపడుతున్న అమ్మాయిలు, “ఒరేయ్ భోజనాల దగ్గర ఏర్పాట్లు కాస్త జాగ్రత్తగా చూడండర్రా, మగపెళ్ళి వాళ్ళ దగ్గర మాటొస్తుంది” అని హెచ్చరిస్తున్న తాతయ్యలు. “తలంబ్రాలు కలుపుదాం రండి వదినా” అని పిలుచుకెళ్తున్న ముత్తయిదువులు. “జీలకర్ర బెల్లం రెడీ చేసారా?” సిద్ధాంతిగారు కేకేశారు. మేమూ తొందరగా ఈ వేడుకలో భాగస్వామ్యం కావాలని తలంబ్రాలు తొందరపడతున్నాయి.

మా మామగారు నాకాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. పెద్దల ఆశీర్వచనాలతో అగ్నిసాక్షిగా నేను విశాలి చెయ్యందుకున్నాను. నా కల నెరవేరింది. సంతోషంతో తబ్బిబ్బయ్యాను. పెళ్ళికూతురిది పల్లెటూరట కదా! అని దీర్ఘం తీసిన వారంతా పెండ్లిలోని వంటకాల గురించి, మర్యాదల గురించి గొప్పగా చెప్పుకుంటూ తిరుగు ప్రయాణమయ్యారు. అందరము మా ఊరు చేరుకున్నాం. ఆ రోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. “వరం, నువ్వూ విశాలి త్వరగా స్నానాలు చెయ్యిండి. పూజ మెదలు పెట్టాలి” అని అమ్మ హడావుడి చేసింది. ఆ మాట ఆమెతో చెబుతామని గదిలోకెళ్ళాను. విశాలి జుట్టు వదిలేసి సరి చేసుకుంటోంది. చూడగానే ఆవాక్కయ్యాను. ఆమె జుట్టు జానెడు ఉంది. తెలియని శక్తి ఏదో నాలోని బలాన్నంతా లాగేసుకున్నట్లనిపించింది. ఒక్కసారిగా కోపం, ఆవేశం తన్నుకుని వచ్చాయి. మోకాళ్ళ వరకు పాములా ఆమెను అనుసరించిన ఆమె జడ ఏమైంది? అంటే అదంతా అసలు జడ కాదా? ఖంగుతిన్నాను. విపరీతమైన కోపంతో ఆమె జుట్టు పట్టుకుని “ఏంటిది? మోసం. సవరం పెట్టుకున్న విషయం ఎందుకు చెప్పలేదు?” అన్నాను ఆవేశంగా. “మీరు అడగలేదుకందండి. పెద్ద జడ అంటే నాకిష్టం. అందుకే వేసుకున్నాను” అంది అమాయకంగా. ఆ మాటతో నాలోని ఆవేశం మంచులా కలిగిపోయింది. నిజమే కదా! నేను అడగందే తను ఎలా చెబుతుంది. చిన్న విషయాన్ని నేనే పెద్దదిగా ఊహించుకున్నాను. జడ పొట్టిగా ఉన్నా పర్వాలేదు, గుణగణాలు, సంస్కారం పొట్టిగా ఉంటే జీవితం దుర్భరం అవుతుంది. విశాలి వాళ్ళ కుటుంబం అంతా చాలా సహృదయలు. జడ పొట్టైనా, పొడగైనా విశాలి అందగత్తె. అణుకువ గల అమ్మాయి. అది చాలు నాకు అనుకున్నాను. “ఐ యామ్ సారీ విశాలీ. నీ తప్పేం లేదు. బాధపడకు. నీకు ఇష్టమైతే సవరం కంటిన్యూ చెయ్యి” అన్నాను. అమ్మ కూడ అర్ధం చేసుకుంటుదనే నమ్మకంతో విశాలిని ఓదార్చాను. ఆమె జడ ఎలా పెద్దది చెయ్యాలా? అలోచనలో పడిపోయాను.

Exit mobile version