ఏం మాయరోగాలో?????

    1
    5

    [box type=’note’ fontsize=’16’] టీవీల్లో, రేడియోల్లో, పేపర్లలో వచ్చే అనారోగ్యపు జాగ్రత్తల వార్తలతో ఏది తినిచచ్చేది అని చావలేక బ్రతుకుతూ, బ్రతుకుతూ చచ్చే మధ్యతరగతి మనస్తత్వాలకు హాస్య దర్పణం పెయ్యేటి శ్రీదేవి కథ ఏం మాయరోగాలో????[/box] 

    .[dropcap]సుం[/dropcap]దరం ఆఫీసు అవగానే బైటికొచ్చి స్కూటరు స్టార్ట్ చేసాడు. స్కూటరు స్టార్టవలేదు గాని, ఒక్కసారిగా కాలు కలుక్కుమని విపరీతంగా నెప్పి చేసి ఇంక స్కూటరు స్టార్ట్ చెయ్యలేక, కాలు నెప్పి ఎక్కువై,ఆటోలో ఆస్పత్రికి వెళ్ళాడు. మందులు రాసిచ్చారు. కాని తగ్గలేదు. బి.పి. చెక్ చేసారు. సుగర్ టెస్ట్ చేయించమన్నారు. మర్నాడు రిపోర్టులు తీసికెళ్ళాడు. బి.పి., సుగర్ ఎక్కువగా వున్నాయంటూ, మందులు రాసిచ్చాడు. ఖచ్చితంగా ఆహారనియమాలు పాటించమని చెప్పాడు. స్వీట్లు తినకూడదని, అన్నం తక్కువగా ఒక పూటే తినమని, రెండోపూట పుల్కాలు రెండు తినమని, ఆకలేస్తే కీరాముక్కలు, మేరీగోల్డ్ బిస్కట్లు, ఓట్సు తినమన్నాడు. ఉప్పు, కారాలు తగ్గించమన్నాడు. ఊరగాయలు, పచ్చళ్ళు అస్సలు తినవద్దన్నాడు. ఈ మందులు వాడి నెల తర్వాత సుగర్ టెస్టు చేయించుకుని రమ్మన్నాడు.

    అసలే స్వీట్లంటే చాలా ఇష్టం సుందరానికి. రోజూ భోజనంలో ఆవకాయ, మాగాయ, ఏ పచ్చళ్ళో లేందే ముద్ద దిగదు. చక్కగా ఎండుమిరపకాయలు, ఇంగువ, రెండు వెల్లుల్లిరేకలు వేసి చేసిన గోంగూర పచ్చడంటే పిచ్చపిచ్చగా తింటాడు. కొత్తావకాయ బిరుసుగా వండిన అన్నంలో కలుపుకుని, గడ్డపెరుగు, మీగడ వేసుకుని తింటే, అబ్బ, ప్రపంచంలో ఏ రుచులూ సాటి రావు, స్వర్గమే! ఇక మాగాయైతే మరీను. ఇంగువతో ఘుమఘుమలాడే మాగాయ కలుపుకుని తింటే…. ఇహ చెప్పడం కష్టం, అంత బాగుంటుంది. బామ్మ చేసే కొరివికారం అంటే మరీమరీ ఇష్టం. చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు, ఇప్పటి రోజుల్లోలాగ అప్పుడు ఇంగ్లీషు బ్రేక్‌ఫాస్ట్‌లు లేవు. పొద్దున్నే చద్దన్నంలో ఇంత ఆవకాయో, మాగాయో కలుపుకుని, తరవాత పెరుగన్నంలో ఆవకాయ పెచ్చో, మాగాయ టెంకో చీకి చీకి, ఇంక ఏమీ లేదని తెలిసాక, భోజనం పూర్తి చేసి స్కూలుకెడితే, ఆ తిన్న చద్దన్నం మత్తుకి, స్కూల్లో మేష్టర్లు పాఠాలు చెబుతూంటే, ఆవులింతలు వచ్చి, నిద్ర వచ్చేసేది.
    ‘ఏం నాయనా, నా పాఠం నీకు జోలపాటలా వుందా?’అంటూ గట్టిగా బెత్తంతో రెండు దెబ్బలేసి బెంచి మీద నుంచోపెట్టేవారు. అసలే ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే ఆ సోషల్ స్టడీస్ మేస్టారంటే చచ్చేంత భయం అందరికి. అందుకే ఎక్కడ ఆవులింతలొచ్చి, పాఠం చెప్పేటప్పుడు నిద్ర వస్తుందోనని, తన బాధ, కోపం ఇంటో బామ్మ మీద చూపించేవాడు. ఎందుకంటే ఇంట్లో అమ్మ పెత్తనం లేదు. అంతా బామ్మ పెత్తనమే. అమ్మ, నాన్న ఉద్యోగాల మీద ప్రతి రెండేళ్ళకి ఊళ్ళు మారుతుంటే, ‘నాకేం వాడు బరువా? వాడు నా మనవడు. ఇక్కడే వుండి చదువుకుంటాడు. వాడిది తాతగారి పేరు సుందరాచార్యులు. హన్నీ తాతగారి పోలికలే పుణికి పుచ్చుకున్నాడు. వాడికీ నేనంటే ప్రేమ. తాతగారు గుడిలో అర్చకత్వం చేసి అలిసిపోయొస్తారు, తాతగారికి సాయంగా వుంటాడు ఒళ్ళు పడుతూ. ఇహ చంటిది శ్రావ్యంటే చంటిపిల్ల కాబట్టి మీదగ్గరే వుంచుకుంటే మంచిది. తల్లికి దూరంగా వుండలేని వయసు. నాకోపికుండి, బతికి బాగుంటే దాన్ని కూడా ఇక్కడే పెట్టి చదివిస్తాను.’ అంది. అందుకే బామ్మ అధీనంలో వుండాల్సి వచ్చింది. బాబాయికింకా పెళ్ళి కాలేదు. కాబట్టి అక్కడే వుంటాడు. లాయరు ప్రేక్టీసు మొదలెట్టి ఆరునెలలయింది.

    సరే, స్కూల్లో ఆవులింతలు ఆపుకోలేని పరిస్థితుల్లో, ‘బామ్మా! రేపట్నించి నాకు చద్దన్నం పెట్టకు. పొద్దున్నే వేడి వేడి ఇడ్లీలో, పూరీలో చెయ్యి. తిని వెడతాను. స్కూల్నించి మధ్యాన్నం ఇంటికొచ్చాక ఎలాగూ అన్నమే తింటాగా.’ అన్నాడు సుందరం.

    ‘ఏడిసావులే. పొద్దున్న చద్దన్నమే తిను. చద్దన్నంలో ఇంత గడ్డ పెరుగోసుకుని తింటే సాయంత్రం దాకా ఆకలెయ్యదు. చద్దన్నం తింటే బలంగా వుంటావు మీ తాతగారిలాగ. చద్దన్నం తింటే నిద్ర రావటమేమిటిరా బడుధ్ధాయి? కావలిస్తే కలికం తెస్తా. నిద్ర రాకుండా కంట్లో పెట్టుకో. ఐనా చదువు మీద శ్రధ్ధుంటే నిద్రెందుకొస్తుందిరా? ఎప్పుడన్నా ఆదివారాలప్పుడు ఇడ్లీ, పూరి చేస్తున్నాగా? రోజూ మడిలో వుంటా. ఇవన్నీ చెయ్యడం కుదురుతుందా? పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట.’ అని ఓ సామెత చెప్పి వూరుకోబెట్టేది.
    అవును. బామ్మ తెల్లారగట్లే లేచి, మడి గట్టుకుని, మడిగానే వంట చేస్తే, తాతయ్య పూజ చే్సి మహానైవేద్యం పెట్టేవారు. తర్వాత గుడికెళ్ళి అక్కడ అర్చకత్వం పూర్తయాక వచ్చి పన్నెండు గంటలకి భోంచేసేవారు. అప్పటిదాకా బామ్మ విష్ణుసహస్రాలు, లలితాసహస్రాలు, లక్ష్మీస్తోత్రాలు చదువుకునేది. తాతగారికి వెండికంచంలో భోజనం పెట్టి, ఆయన తిన్నాక ఆవిడ భోంచేసేది.

    సరే, సుందరం రోజు ఇడ్లి, పూరి తినాలనే కోరికని జోకొట్టేసి, ఇవి కుదిరే పనులు కావులే అని, చద్దన్నంలో ఆవకాయ, మాగాయ, గడ్డపెరుగు వేసుకుని తినేదే అమృతమనుకుని, మళ్ళీ బామ్మతో ఆ ప్రస్తావన తేలేదు.
    ఇప్పుడు మెల్లగా స్కూలుపిల్లలు చద్దన్నాలు, పెరుగన్నంలో టెంక చీక్కు తినడాలు అంతరించిపోయి, బ్రేక్‌ఫాస్టులు, లంచ్‌లు, డిన్నర్‌లు, స్నాక్సు, పిజ్జాలు, బర్గర్లు, నూడుల్సు, ఐస్‌క్రీములు, ఇలా అడ్డమైనవీ ఎప్పుడు పడితే అప్పుడు బైట కొనుక్కుతిని, వాటిల్లో కల్తీలు కలిపితే తెలీక, గ్రహచారం కొద్దీ తప్పనిసరై అవే తిని, అనేక మాయరోగాల బారిన పడి, మందులకి, డాక్టర్లకి వృథాగా బోలెడు డబ్బులు ధారపోస్తున్నారు.
    ‘కొంపదీసి అలాంటి మాయరోగమేదైనా వచ్చిందా ఏమిటి?’సుందరం భయపడ్డాడు. క్రితం రోజు ఏం తిన్నాడో, ఈరోజు ఏం తిన్నాడో గుర్తు చేసుకున్నాడు. క్రితం రోజు ఏదో హోటల్లో ఎవరో డిన్నర్ కని పిలిస్తే వెళ్ళాడు. ఉదయం పనిమనిషి రానందువల్ల ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చెయ్యడం కుదరలేదు. హొటల్లో ఉప్మా, పెసరట్టు తిన్నాడు. ఫుడ్ వల్ల ఏమన్నా తేడా వచ్చిందా అనుకున్నాడు. ఐనా కాళ్ళనెప్పులు ఫుడ్ వల్ల ఎందుకొస్తాయి? అన్నట్లు నూనె సరుకులు తిన్నా కాళ్ళనెప్పులు వస్తాయట. టి.వి.ల్లో, పేపర్లలో ఊదరగొడుతున్నారు. నూనెలు జంతుచర్మాల నించి తీస్తున్నారట. వీధుల్లో, బళ్ళలో, హోటళ్ళలో అవే నూనెలు వాడుతున్నారట. ఇహ పాలపేకెట్లయితే మరీను. అందులోను ఏవో కలిపి తయారు చేస్తారు. అసలు పాల పాలు తక్కువ. మేమేం తీసిపోయామా అనుకుని కూరగాయలు, పళ్ళు కూడా అంతే. పళ్ళని మందులతో పండబెడతారు. పుచ్చకాయలు ఎర్రగా వుండడానికి ఏవో ఇంజక్షన్లు ఇస్తారు. ఏ సరుకైనా, మందులతో సహా అన్నీ పెట్టుబడి తక్కువ పెట్టి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. అవతలివాళ్ళ నించి మోసం చేసి, మాయ చేసి డబ్బు సంపాదించేవాళ్ళు ఎక్కువయారు. బామ్మ ఎప్పుడన్నా పెద్ద కేరేజి నిండా జంతికలు, సున్నండలు, అరిశలు, బిళ్ళకాజాలు చేసి పిల్లలందరికి ఒక్కసారే పెట్టి, అలమార్లో దాచేసి తాళం వేసేసేది. మళ్ళీ తినాలనిపించినా కుదిరేది కాదు. తాళాలు కనిపించకుండా ఎక్కడో దాచేసేది. ఇలా ప్రతిరోజు పెద్దవాళ్ళ అధీనంలో పిల్లలు చెప్పినట్లుండే వారు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం వుండేది కాదు. ఇప్పటి రోజుల్లోలా చాలా రకాల నూనెలు వుండేవి కావు. పప్పునూనె, పల్లీనూనె. అన్నింటిలోకి ఎక్కువ పప్పునూనె వాడేవారు. తిండికి తగ్గ పనులు చేసేవారు. అందుకే ఇప్పటివాళ్లలా కాళ్ళనెప్పులు, ఇంకా అనేక రకాల మాయరోగాలు లేవు. ఇన్ని రకాల తిళ్ళూ లేవు. ఆవకాయ, మాగాయ, పచ్చళ్ళు తినకూడదని డాక్టర్లు చెప్పేవారు కాదు.
    సుందరానికి ఆరోజులన్నీ గుర్తొచ్చి, ఇప్పుడు డాక్టరు ఊరగాయలు, పచ్చళ్ళు తినకూడదంటే బెంగ పట్టుకుంది. బైటి గుమ్మంలోనే అలా బెంగతో ఏదో ఆలోచిస్తూ, డాక్టర్లు రాసిచ్చిన మందుల చీటీలు పట్టుకుని దిగులుగా కూచున్నాడు. లోపల్నించి వేడి వేడి కాఫీ భర్త చేతికిస్తూ కామేశ్వరి అడిగింది, ‘ఏమిటండి, దిగులుగా వున్నారు? ఒంట్లో బాగాలేదా?’

    ‘ఏమిటోనే కామూ! జీవితం అంటే విరక్తి కలిగింది.’ ఇంకా ఏదో చెప్పేలోగా పక్క ఫ్లాటులో అద్దెకుండే దామోదరం వచ్చి సంతోషంగా పలకరించాడు.

    ‘సుగరు, బి.పి. వున్నాయి. డాక్టరు ఆహారనియమాలు పాటించమని చెప్పాడు. ఇంకెన్నాళ్ళు బతుకుతానో? ఇంకా అమ్మాయి, అబ్బాయి పెళ్ళిళ్ళు చెయ్యాలి.’

    దామోదరం ఫక్కున నవ్వి, ‘సుందరం! కాళ్ళు నెప్పులు, సుగరు, బి.పి. ఇప్పుడు కామనే. అందరికీ వుంటున్నాయి. నువ్వు జాగర్తలు పాటిస్తూ, టైముకి మందులు వేసుకుంటూ, బి.పి., సుగరు కంట్రోల్లో వుంచుకుంటే చాలు. ఈ జబ్బులతోనే డభ్భయి, ఎనభయి ఏళ్ళు బతికిన వాళ్ళున్నారు. అప్పుడప్పుడు తినచ్చు. కాని వాకింగ్ చెయ్యాలి. అన్నీ అవే సద్దుకుంటాయి. మా మామగారికి డభ్భయి అయిదేళ్ళు. సుగరు, బి.పి.వున్నాయి. ఐనా సంతోషంగా వుంటాడు. సుగరు, బి.పి. కంట్రోల్లో వుంటాయి. ఈ మాయరోగాలన్నీ మనుషులకి కాక మానులకొస్తాయా? ఏ రోగాలూ లేకపోతే మందులషాపుల వాళ్ళు, డాక్టర్లు బతకాలి కదా? ఇదుగో సుందరం! ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం, సహం బలానికి మించిన సంతోషం, బట్టతల లేని భాగ్యవంతుడు లేరనుకో.’ అంటూ సూక్తులు వల్లించి ధైర్యం చెప్పాడు.

    సుందరం తన దిగుల్ని పక్కనబెట్టి, ‘ఆగాగు. రెండూ అర్థమయ్యాయి గాని బట్టతల లేని భాగ్యవంతుడేమిటి?’

    ‘ఒకప్పుడు నా జుట్టు ఆడపిల్ల జుట్టులా ఒత్తుగా, తుమ్మెదరెక్కల్లా నిగనిగలాడుతూ వుండేది. తరవాత్తరవాత దువ్వుతుంటే వెంట్రుకలు బాగా రాలిపోతుంటే, జుట్టు లేకపోతే అందం తగ్గిపోయి, అందరూ నవ్వుతారన్న బెంగతో అడ్డమైన హెయిరాయిల్సు వాడాను. దాంతో జుట్టు ఇంకా రాలిపోయింది. ఇహ పూర్తిగా బట్టతల వచ్చేసాక టి.వి.ఛానెళ్ళలో వచ్చే వ్యాపార ప్రకటనలు చూసి హెయిర్ ఇంప్లాంటేషన్ చేయించుకుంటే తలంతా మంటలు వచ్చినట్లుగా అయి, ఇహ బట్టతల మీద జుట్టు మొలిపించడం అసాధ్యమని తెలుసుకుని, ఆ కార్యక్రమానికి స్వస్తి పలికి, అసలు జుట్టు రాలుతోందన్న బెంగతోను, పనికిమాలిన ఆలోచనలతోను అనవసరంగా బట్టతల తెచ్చుకున్నానే అని గతం తల్చుకుని బాధ పడేకన్నా, ఆలోచించేవాడికి అన్నీ ఉపాయాలే అనుకుని, కోఠీ వెళ్ళి బోలెడు డబ్బులు తగలేసి విగ్గు కొని పెట్టుకున్నాను. ఎవరన్నా ఫ్రెండ్సు పెళ్ళిచూపులకి నన్నే తీసికెళ్ళేవారు. అసలు పెళ్ళికొడుకుని చూడ్డం మానేసి నన్నే చూసేవారు. అందుకు నేనే పెళ్ళికొడుకు అనుకునేవారు. ఆ విగ్గు తీసేయమని, లేకపోతే మేమే పెద్దవాళ్ళలా కనిపిస్తున్నామని అందరూ తిట్టారు. రానురాను విగ్గు పెట్టుకోవడం వల్ల తలంతా కురుపులు, పొక్కులు వచ్చాయి. డాక్టరు దగ్గిరకి వెడితే, ముక్కుకి జలుబు చేసినా సుగర్ టెస్ట్, బి.పి.టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఆ టెస్టులు, ఈ టెస్టులు చేసే ఈ రోజుల్లో నాక్కూడా అన్ని టెస్టులు రాసారు. మొన్ననే బి.పి., సుగర్ టెస్టులు చేసి, వేలకి వేలు దోచేసి, ‘అంతా నార్మలుగా వుంది అని, ముందరా విగ్గు తీసేయండి. కొబ్బరినూనెలో ముద్దార్తికర్పూరం కలిపి రాయండి.’ అంటూ ఆఖర్న ఇంటివైద్యం చెప్పాడు. ‘ఐనా బట్టతలుంటే మాత్రం ఏం కొంప మునిగిపోయింది చెప్పండి? నాది బట్టతల కాదా? నేనూ మీలాగే ఎన్నో హెయిరాయిల్స్ వాడాను. ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను. మీకింకో విషయం తెలుసా? బట్టతల వాళ్ళకి ఎప్పుడూ ముసలితనం కనిపించదు. ఎందుకంటే వాళ్ళ బుగ్గలు, బట్టతల ఎప్పుడూ నిగనిగలాడుతుంటాయి. మాజీ గవర్నరు రోశయ్యగారిని చూడండి. ఆయన బట్టతల ఎంత నిగనిగలాడుతూ వయసు దాచేస్తుందో? నా చిన్నప్పట్నించీ చూస్తున్నా. ఇప్పటికీ అలాగే వున్నారు. పైగా బట్టతలవాడు భాగ్యవంతుడని మన పెద్దలు ఊరికే అనలేదు. బోడిగుండంత సుఖమూ లేదు. నూనె ఖర్చుండదు. దువ్వెన కనబడలేదన్న బాధ లేదు. సమ్మరొస్తే సుఖంగా వుంటుంది. షాంపూ ఖర్చు లేదు. క్షవరం ఖర్చు లేదు.’అని ఉచితంగా ఓ సలహా కూడా పారేసాడు. అందుకని నువ్వేం వర్రీ అవకు. జాగర్తగా మందులు వాడు. అన్నీ అవే తగ్గిపోతాయి. ఆలోచనలతో వుంటే నీ జుట్టూ ఊడిపోతుంది.’ అంటూ తన వాటా లోకి వెళ్ళాడు.

    ‘అమ్మో! జుట్టూడితే ఎలా? బట్టతల భాగ్యం ఏమక్కర్లేదు లే’ అనుకుని సంతోషంతో సగం బలంగాను, ఆరోగ్యంతో భాగ్యవంతుడిగాను వుండాలనుకుంటూ లోపలికొస్తే భార్య కామేశ్వరి ఏడుస్తోంది.

    ‘ఏమైంది కామూ, ఎందుకేడుస్తున్నావు?’

    ‘అంతా విన్నాన్లెండి. దామోదరం అన్నయ్యగారూ, మీరూ మాట్లాడుకున్న మాటలు. మీకు సుగరు, బి.పి. వచ్చాయని అనడం, ఆయనేవో మాటలు చెప్పి మీకు ధైర్యం చెప్పడం. ఏం, నేనంత పరాయిదాన్నయి పోయానా? నాతో చెప్పకూడదా? మీకేమన్నా వస్తే నేను తట్టుకోగలనా? ఇకనించి ఆహారనియమాలు పాటించి, టైముకి మందులు వేసుకోండి.’ అంటూ మర్నాట్నించి భోజనంలో ఉప్పు, కారాలు, ఊరగాయలు, పచ్చళ్ళు అన్నీ బంద్. నో జంక్ ఫుడ్స్. నో స్వీట్స్, ఓట్సుతో ఉప్మాలు, రాగిజావలు, జొన్నరొట్టెలు, లేక రెండు పుల్కాలు. ఒక యాపిల్‌లో సగం ముక్క, మేరీగోల్డ్ బిస్కట్లు, కీరాముక్కలు, కాకరకాయ రసాలు, ఇవన్నీ ఇవ్వడం మొదలుపెట్టింది.
    ‘మరీ ఇంతలా మాడ్చేయకే. కళ్ళు తిరుగుతున్నాయి.’ అన్నాడు సుందరం.

    ‘ఏం కాదు. ఈ బొప్పాయి ముక్కలు, ఈ బిస్కట్లు తినండి. నీరసం వుండదు. రోజూ ఒక యాపిల్ ముక్క తింటే ఆరోగ్యం మన చేతుల్లోనే వుంచుకుని డాక్టర్‌కి దూరంగా వుండచ్చుట.’ అంటూ అతిజాగ్రత్తలు తీసుకోసాగింది భర్త విషయంలో కామేశ్వరి. రోజూ పేపర్లలో పడే హోమియోతో కాళ్ళనెప్పులకి చెక్, ఆయుర్వేదం వాడితే మధుమేహం మటుమాయం, ఆరువందలకే అన్ని టెస్టులు చేయబడును, మా మటుమాయం క్లినిక్‌కు రండి, రోజూ సలాడ్లు తినండి. ఆరోగ్యంగా వుండండి, ఇలా పేపర్లలో పడ్డవన్నీ చదివి, ఆ పేపర్లన్నీ దాయడం మొదలుపెట్టింది. టి.వి.లో వచ్చే నాటువైద్యాలు, నీటివైద్యాలు చూసి అన్నీ రాసుకుంటోంది.
    ఇలా అన్నీ కఠినంగా ఆచరిస్తుంటే ఆఫీసులో కళ్ళు తిరిగి పడిపోయాడు. సుందరాన్ని ఆటోలో ఆస్పత్రికి తీసికెళ్ళాడు ఆఫీసులో పనిచేసే వెంకట్.

    సుందరానికి ఇ.సి.జి., బి.పి.టెస్ట్, సుగర్ టెస్ట్ అన్నీ చేసి ‘ఏమయ్యా, నీకు సుగర్, బి.పి. వున్నాయని ఏ సన్నాసి చెప్పాడు? నీకే మాయరోగమూ లేదు. సుబ్బరంగా వున్నావు. సుగరు, బి.పి. వున్నవాళ్ళు పాటించే ఆహారనియమాలు మానెయ్. బాగా బలహీనంగా వున్నావు. అన్నీ సుబ్బరంగా తిను.’అంటూ నీరసానికి మందులు రాసాడు. అన్నిటికి అయిదువేలు వదుల్చుకుని, హోటల్లో సుబ్బరంగా కడుపారా టిఫిను తిని ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. టి.వి.ల్లో రియాల్టీ షోలోలా ఇంట్లోకి వస్తూ ఆనందంగా ‘అందమె ఆనందం, ఆనందమె జీవితమకరందం’అని పాట పాడుతూ, డాన్సు చేస్తూ వస్తుంటే కామేశ్వరి ‘ఏమైందబ్బా, ఈయనకి?’అనుకుంటూ వింతగా చూస్తోంది.

    ఈలోగా పక్కింటి దామోదరం వచ్చి మొర పెట్టుకున్నాడు. ‘సుందరం! కొంప ములిగింది. సుగరు, బి.పి. నీక్కాదు, నాకు వున్నాయి. ఆ రోజు ఇద్దరం ఒకే చోట టెస్టు చేయించుకున్నాం కదా? ఒకేసారి, ఒకేరోజు నువ్వెళ్ళాక నేను వెళ్ళాను. నీ రిపోర్టు నాకు, నా రిపోర్టు నీకు వచ్చాయి. మన పేర్లు సుందరం అని ఒక్కటే అయినందున ఇక్కడ మార్చుకున్నాం గాని, ఆస్పత్రిలో సుందరం అనే చెప్పాను.’

    ‘సరే, ఇప్పుడైనా నువు జాగర్తగా ఆహారనియమాలు పాటించి, నే వాడిన మందులన్నీ వాడు. మహాభాగ్యాన్ని మించిన ఆరోగ్యం లేదు. సహం బలానికి మించిన సంతోషం లేదు. బట్టతల లేనివాడు భాగ్యవంతుడే కాదు. అందుకే ఓ భాగ్యవంతుడూ! ఇంకా ఏం మాయరోగాలూ రాకుండా జాగర్త పడు. ఇదిగో, నీ బి.పి., సుగరు రిపోర్టు. నా రిపోర్టు నాకియ్యి. ఇక రాకుండా నేను జాగర్త పడతా.’అని దామోదరం ఉరఫ్ సుందరం అన్న మాటలు అతనికే అప్పజెప్పాడు కె.సుందరం.

    టి.సుందరానికి బదులు కె.సుందరం అని టైపు చేసారు.

    ఇంతలో దామోదరం భార్య రామలక్ష్మి, ‘ఇదిగో కామేశ్వరీ! అన్నయ్యగారికి గోంగూర పచ్చడి ఇష్టం కదా, నీకు గోంగూర పచ్చడి పడదు కదా, అందుకే అన్నయ్యగారికి వెల్లుల్లిపాయలు, దండిగా ఎండుమిరపకాయలు వేసి చేసాను. రాత్రి భోజనంలో ఈ గోంగూర పచ్చడి వేసిపెట్టు.’ అంటూ కామేశ్వరి కనబడక ‘కామేశ్వరీ! కామేశ్వరీ!’ అంటూ ఇల్లంతా చూస్తే ఓ గదిలో పేపర్లు గుట్టల్లో వుంది.

    ‘ఏమిటి, ఈ పేపర్లన్నీ ముందేసుకున్నావు?’

    ‘ఇవ్వన్నీ ఆరోగ్యసూత్రాలు, మధుమేహం, బి.పి., కాళ్ళ నెప్పులు తగ్గిస్తామంటూ డాక్టర్లు ప్రకటనలు వేసిన పేపర్లు. మీ అన్నగారికి సుగరు, బి.పి. వచ్చాయని ఇవన్నీ దాచాను. ఇప్పుడు ఇల్లంతా పేపర్లతో నిండిపోయి చెత్తగా వుందని పాతపేపర్లవాడికి అమ్మేస్తున్నాను. ఆ మాయదారి డాక్టరు బి.పి., సుగరు ఎవరికో వుంటే ఆ రిపోర్టు మీ అన్నయ్యగారికిచ్చాడు. దాంతో పాపం, పాపిష్టిదాన్ని, ఆయనని తిండి తిననీయకుండా చేసి, ఆయనకిష్టం లేకపోయినా ఓట్సు, రాగులు, కీరాలు బలవంతంగా తినిపించాను.’

    ‘అయ్యో, కామేశ్వరీ! మీ అన్నయ్యగారికి అలాగే బి.పి., సుగరు వుంటే, ఏం లేదని వేరేవాళ్ళ రిపోర్టిచ్చారు. అందువల్ల బి.పి,కి, సుగరుకి సరైన మందులు పడక, లేని మాయరోగాలన్నీ వచ్చి, బి.పి., సుగరు ఎక్కువయిపోయాయి. ఆ పేపర్లన్నీ నాకియ్యి. అందులో ఏమన్నా పనికొస్తే పాటిస్తాను. అంటే అన్నగారి రిపోర్టు మా ఆయనకి, ఆయన రిపోర్టు అన్నయ్యగారికి వచ్చాయన్న మాట. ఏం మాయరోగాలో! వాళ్ళు రిపోర్టులు ఇచ్చేటప్పుడు చూసుకోవద్దూ?’ అంటూ రామలక్ష్మి ఆరోగ్యసూత్రాలున్న పేపర్లన్నీ తీసుకుని ఇంటికెళ్ళింది.

    పెయ్యేటి శ్రీదేవి

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here