Site icon Sanchika

ఎండమావులు-10

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 10వ భాగం. [/box]

22

[dropcap]మ[/dropcap]నుష్యులు చాలా విచిత్రమైన స్వభావం గలవారు. తమకి ఎదురయిన ఫలితాల గురించి దాని వలన వచ్చే పర్యవసానాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అతి జాగ్రత్తగా ఉండానికి ప్రయత్నిస్తారు. పరిచయం అయిన వ్యక్తితో కూడా సన్నిహితంగా ఉండడానికి జంకుతారు. తమ చుట్టూరా కంచెలు కట్టుకుంటారు. గోడలు నిర్మించుకుంటారు ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు.

తమ లోకంలోకి ఇతరులను అనుమతించరు. తమ అంతరంగాన్ని ఇతరులముందు విప్పుకోడానికి ప్రయత్నించరు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, తమ స్థాయి ఇలా రకరకాల ఇగో అనే కంచె వెనుక దాక్కుంటారు. అందుకే తమ ఆత్మీయుల దగ్గర కూడా అపరిచితులు గానే మిగిలిపోతారు. ఎదుటి వాళ్ళ దగ్గర తమ సమస్యలు, బాధలు చెప్పుకుంటే ఫలితం లేకపోతే మనస్సు గాయపడుతుందేమో అని అనుకుంటారు.

సౌందర్య పరిస్థితి అంతే, ఇన్నాళ్ళ వరకూ తన బాధలు-ఆవేదన, సమస్యలు చెప్పుకుందికి నా వాళ్ళు అనే వాళ్ళు లభించలేదు. తన ఆవేదనని తన మనస్సులోనే గూడు కట్టుకుని అలాగే ఉండిపోయింది. ఇన్నాళ్ళకి సుధాకర్‌ని చూడగానే ఆమె హృదయం తన సమస్యను, జీవితాన్ని జీవన బాటలో పయనిస్తున్నప్పుడు తను ఎంతగా అలిసి పోయిందో తెలపాలన్న భావోద్వేగం కలిగింది. ఆమెకి అంతలోనే అతని మాటలు ఆమెను గాయపరిచాయి. అతనికి తన మనస్సులోని బాధలు చెప్పకూడదు. అలా చెప్పుకుంటే అతని దృష్టిలో తన స్థాయి, విలువ తగ్గిపోతాయి.

ఓదార్పుకి బదులు తిరస్కారం, బాధను చవిచూడవల్సివస్తుందని ఆ పని చేయలేదు. ఆమెకి అక్కడ అలా చేయడానికి ఆమె ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అడ్డు వచ్చాయి. అయితే తను తన ఆత్మాభిమానం ఆత్మగౌరవానికి ఏనాడో తిలోదకాలు ఇచ్చింది. ఇప్పుడా సెంటిమెంటు ఎందుకు? అని అనుకుంది కాని ఏదో తెలియని బలహీనత ఆమె చుట్టూరా గిరిగీసుకుంది.

“అమ్మా! మీరు ఎందరికో దానాలు చేశారు. ఆర్థికంగా ఎందరినో ఆదుకున్నారు. ఈ అబ్బాయిని దత్తత తీసుకుని చదివించవచ్చుకదా! అలా చేస్తే ఓ మంచి పని చేశారన్న తృప్తి ఉంటుంది. మీ జీవితం కూడా ఓ మంచి పని చేసినందుకు సార్థకం అవుతుంది” వంట మనిషి సౌందర్యతో అంది.

వంట మనిషి మాటలకి ఏఁ జవాబియ్యలేదు సౌందర్య. ఆమె గంభీరంగా ముఖం పెట్టి ఆలోచిస్తోంది. ‘దత్తత తీసుకుని చదివించే కర్మేంటి? అవసరం వచ్చినప్పుడు నా ఆస్తినంతా వ్రాసి ఇచ్చేస్తాను’ అని అనుకుంది మనసులో.

“దత్తత తీసుకుని మనం ఆ అబ్బాయిని చదివాస్తాం, బాగానే ఉంది. అయితే డబ్బు సంపాదించడంలో ఎంత కష్టముందో, ఆ కష్టం విలువ, డబ్బు విలువ ఆ అబ్బాయికి తెలుస్తాయా? ఎప్పటికీ తెలియపు. అదే లోను తీసుకుని చదివాడనుకో ఒక విధంగా లోను తీసుకుని చదవడం అంటే అప్పు చేసి చదవడమే. నేను అప్పు చేసి చదువుతున్నాను. నేను సంపాదనాపరుడ్ని అయిన తరువాత అప్పు వడ్డీతో సహా తీర్చాలి అన్న హెచ్చరిక ఆ అబ్బాయికి ఉంటుంది. అంతే కాదు, బాధ్యత కూడా తెలుస్తుంది. అప్పనంగా వచ్చిన డబ్బుతో చదువుతే చదువు విలువ తెలియదు, డబ్బు విలువ కూడా తెలియదు” అంది వంట మనిషితో సౌందర్య.

“మీరు చెప్పింది నిజమేనమ్మా!” వంట మనిషి అంది.

సౌందర్య సుధాకర్‌కి బ్యాంకులోను శాంక్షను అవడానికి తన పరపతిని ఉపయోగించి సఫలీకృతురాలైంది. కాలేజీ ఫీజు కట్టించింది సుధాకర్ చేత. అతనికి ఓ సినీ నటి బాధ్యత వహిస్తూ ఉంటే పనులు ఎందుకు తొందరగా అవవు? అదే ఎవరైనా అనామకుడు, సామాన్యుడు అయితే అది వేరే సంగతి.

సుధాకర్ వెళ్తున్న సమయంలో కొంత డబ్బు ఇవ్వజూచింది. అయితే దాన్ని అతడు తీసుకోడానికి అంగీకరించలేదు. అతని ఆత్మాభిమానానికి చాలా సంతోషించింది. అది ఆమెకు నచ్చింది కూడా.

“కుటుంబ సభ్యుల్లో సఖ్యతగా ఉండు. వాళ్ళ మనసుల గాయపరచకు, వారి త్యాగం, వారి సేవలు గుర్తించుకుని మనలుకో!” అని హితబోధ చేద్దామనుకుంది సౌందర్య. అలా సుధాకర్‌కి తను హితబోధ చేస్తే అతను ఇప్పటి వరకు తన మీద చూపిస్తున్న తన విలువ తగ్గచ్చు, తన మీద చిరాకుపడచ్చు. తన మీదున్న సదభిప్రాయం సడలిపోవచ్చు. అన్ని సమస్యలకూ కాలమే పరిష్కారం చూపిస్తోంది అని తను ఊరుకుంది.

ఇవి ఇప్పటి వరకూ జరిగిన విషయాలు. ఆ తరువాత తను ఇంటికి వెళ్ళి తన సామాన్లు తీసుకొని హాస్టలోకి వచ్చేసేడు. హాస్టలికి వస్తున్న సమయంలో తండ్రి డబ్బు ఇచ్చినప్పుడు తను “అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను” అని అన్నాడు. తన ఆ మాటలకి అతని మనస్సు గాయపడి ఉంటుంది. అయితే ఆ సమయంలో తను ఇవేవీ గమనించే స్థితిలో లేడు. తను మాత్రం తన పంతం సడలించలేదు.

ఇల్లు వదిలి వచ్చేసి మూడు సంవత్సరాలు దాటిపోయింది పంతం కొద్దీ తల్లి మాత్రం తనని చూడ్డానికి రాలేదు. తండ్రి మాత్రం రెండు మూడు సార్లు వచ్చాడు. ఆ తరువాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

రెండేళ్ళ వరకూ సౌందర్య ఆంటీతో తనకి టచ్ ఉండేది. ఫోన్లలో మాట్లాడేది. తను వెళ్ళి చూసివచ్చేవాడు. ఆమెకి సినిమాలో నటించడానికి అవకాశాలు తగ్గిపోయాయని ఆ మధ్య తను వెళ్ళినప్పుడు బాధపడింది. తను ధైర్యం చెప్పాడు. ఓదార్చాడు. సంవత్సరం బట్టి ఆమె విషయాలే తెలియలేదు. ఈ మధ్య తను వెళ్ళి వాకబు చేస్తే ఆవిడ అప్పుల పాలైంది, తనుంటున్న బంగళా తప్ప కారు మిగతా విలువైన వస్తువులన్నీ అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో సరిగ్గా ఎవరూ చెప్పలేదు.

తను చాలా విచారించాడు. దీన్నే అంటారు ఓడలు బండ్లు అవడమని. తను వాకబు చేస్తూనే ఉన్నాడు కాని క్లూ దొకరలేదు. ఆ విషయం అలా ఉంటే ఈ రోజు సంధ్య తన తల్లిదండ్రుల్ని పొగుడుతూ, తల్లిదండ్రుల విలువ తెలియజేస్తూ అన్న మాటలు తన మనస్సును కదిలించాయి. తనని కలవరపాటుకి గురిచేశాయి.

జీవితంలో తను ఏం తప్పు చేశాడో, తన వాళ్ళని ఎంత బాధకి గురిచేశాడో తనకు తెలిసింది. జరిగిన సంఘటనలు ఒక్కసారి తన కళ్ళ ఎదుట కదలాడాయి. పశ్చాత్తాపంతో కుమిలి పోతున్నాడు. తన వాళ్ళని కలవాలి. తన తప్పును క్షమించమని ప్రాధేయపడాలి. తన కన్నీళ్ళతో వాళ్ళ పాదాలు అభిషేకించాలి. ఇలా అనుకుంటూ బాధపడ్తున్నాడు సుధాకర్. తన వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరితే కాని తన మనస్సుకి శాంతిలేదు.

23

సుధాకర్ తల్లిదండ్రుల్ని చూడ్డానికి బస్సులో బయలుదేరాడు. బస్సు బయలుదేరింది. అది ముందుకు దూసుకుపోతోంది. బస్సుతో అతని ఆలోచన్లు పోటీపడున్నాయి.

ఒక్క విషయం మనిషి తప్పు చేస్తాడు. చేసిన ఆ తప్పును బాహటంగా ఒప్పుకున్న వాళ్ళు కొందరయితే, అలా అంగీకరించని వాళ్ళు మరికొందరు. తమ తప్పు అంగీకరించడానికి ఇగో అడ్డు వస్తుంది. అయితే దాన్ని లెక్కచేయకుండా కొంతమంది తమ తప్పును అంగీకరిస్తారు, పశ్చాత్తాపపడ్తారు. బాధపడ్తారు. క్షమాపణ కోరడానికేనా వెనకాడరు.

సుధాకర్ పరిస్థితీ అంతే, సంధ్య మాటలు విన్న తరువాత అతనిలో ఉన్న మానవత్వం, వివేకం మేల్కొన్నాయి. తాను ఇన్నాళ్ళు ఓ శాడిస్టులా, మూర్ఖుడిలా, తన తల్లిదండ్రుల యడల ప్రవర్తించిన తీరు, పైశాచిక ఆనందాన్ని పొందిన విధానం తలచుకుంటూ ఉంటే తను ఎంత తప్పు చేశాడో అంతర్మథనం ఆరంభమయింది.

తను తన తల్లిదండ్రుల దగ్గరకి వెంటనే వెళ్ళాలి. తను చేసిన పొరపాట్లు, తప్పులు క్షమించమని ప్రాదేయపడాలి. బ్రతిమాలాలి. తనలో ఉన్న నెగిటివ్ థింకింగ్‌కి స్వస్తి చెప్పి పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. అలా చేస్తేనే తనకి శాంతి కలుగుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళకి శాంతి మిగులుతుంది.

చెట్టు ఎంత అందంగా ఉన్నా, విశాలంగా వ్యాపించి కనిపించినా, అది తను వేళ్ళను మరిచిపోదు, అలాగే మనిషి కూడా, మనిషి ఎంత ఉన్నతుడుగా ఎదిగినా తన బాల్యాన్ని విస్మరించడు. బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అంటే మనిషి తనని తాను తెలుసుకోవటమే. బాల్యమే ఓ పాఠశాల, తన బాల్యం పది సంవత్సరాలు బంగారుమయమే. ఏ లోటుపాట్లు లేకుండా గడిచిపోయింది. ఆ తరువాతే తన బాబయ్య కొడుకు, పెత్తండ్రి కొడుకు చదువులకి రావడం, మంద ఎక్కువయితే మజ్జిగ పలచన అన్న చందాన ఆర్థిక ఇబ్బందులు వచ్చిచేరాయి.

తను కుటుంబంలో వచ్చిన ఆర్థిక ఇబ్బందుల్ని అర్థం చేసుకోకుండా తన తల్లిదండ్రులకి ఇబ్బంది కలగచేసేవాడు. ఓ శాడిస్టులా ప్రవర్తించేవాడు. వారు బాధపడుతూ ఉంటే కసిగా నవ్వుకునేవాడు. తనని ఎంతో ప్రేమ, ఆప్యాయతతో చూసుకునే అమ్మను ద్వేషించాడు. బాల్యంలో, చిన్నప్పుడు బాల్యం ఓ గుడి అయితే అమ్మ గురువు. బాల్యాన్ని ప్రేమించగలిగినవాడే అమ్మను గౌరవించగలడు. అమ్మను గౌరవించగలిగిన వాడే, ఉత్తమ మానవుడు కాగలడు. అయితే తను బాల్యాన్ని ప్రేమించాడు. అమ్మని, నాన్నని గౌరవించాడు. వాళ్ళ నుండి తను ఆశించినవి పొందగలిగాడు. బాల్యందాటి కౌమారంలోకి రాగానే తనో వింత ప్రవర్తన ఆరంభమయింది. ఆ ప్రవర్తన వికృత రూపం దాల్చింది. అదే ఇన్ని అనర్థాలకి కారణమయింది.

సంధ్య మాటలు తనలోని వివేకాన్ని తట్టి లేపాయి. తల్లిదండ్రులు మీద తనకున్న దురభిప్రాయాన్ని తొలగించాయి. తన తప్పేంటో తనకి తెలియజేసాయి. ఇలా సాగిపోతున్నాయి సుధాకర్ ఆలోచన్లు, అతని ఆలోచన్లతో సంబంధం లేనట్లు బస్సు దుమ్మురేపుతూ ముందుకు సాగుతోంది.

ఎదురుగా అగుపడుతున్న పంట పొలాల సమీపం నుండి బస్సు ముందుకు సాగుతోంది. పండిన దాన్యం కంకులు పచ్చగా మెరుస్తున్నాయి. వాటి మీద రాత్రి కురిసిన మంచుబిందువులు సూర్యకాంతిలో తళ తళమంటున్నాయి.

ఏదో చిన్న గ్రామం దగ్గర బస్సు ఆగింది. ఆ గ్రామంలో పెంకుటిళ్ళు డాబాలు, పూరిళ్ళు కూడా ఉన్నాయి. వాటి మద్య నుండి బస్సు ప్రయాణించసాగింది. ఇరుకుగా ఉన్న సందుల్లాంటి రోడ్ల మీద గుంపులు గుంపులుగా జనాలు నిలబడి నేటి రాజకీయాల గురించి చర్చించుకుంటున్న వారు కొందరయితే, తమ కష్ట సుఖాలు – జీవిత సమస్యల గురించి లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు మరికొందరు.

‘ఓనాడు గ్రామాలు సర్వతోముఖిగా ఉండేవి. జనాలు కూడా ఆప్యాయతానురాగాలతో మెలిగేవారు. కల్లాకపటం లేని నిర్మల మనస్తత్వం, నిస్వార్థం, సౌభ్రాతృత్వ భావంతో మెలిగేవారు. అందుకే దేశ ప్రగతికి గ్రామాలు పట్టుకొమ్మలు అని తను అందరూ అంటూ ఉంటే విన్నాడు. అయితే నేటి అదే గ్రామాల పరిస్థితో? కుళ్ళు రాజకీయాలు, స్వార్ధపు ఆలోచన్లు, కపట మనస్కులతో నిండిపోయాయి. హత్యలు, కోట్లాటలు, మోసాలు, మానభంగాలతో నేటి గ్రామాలు భ్రష్టు పట్టిపోయాయి.’ ఇలా అలోచనలు సాగిపోతూ ఉన్నాయి.

సుధాకర్‌కి ఎంత తొందరగా ఇల్లు చేరుకోవాలన్నదే ధ్యాస, ఆత్రుత కూడా, ఆలస్యం అవుతున్న కొలదీ అతనిలో అసహనం పెరిగిపోతోంది. విసుగ్గా పరిసరాలను చూస్తున్నాడు. డ్రైవరు టీ త్రాగి వచ్చి బస్సును డ్రైవ్ చేస్తున్నాడు. బస్సు తిరిగి బయలు దేరింది. తిరిగి అతనిలో భావుకత చోటుచేసుకుంది.

పిడికిలి వేళ్ళ సందుల్లోంచి ఇసుకలా జారిపోయింది. బాల్యం, అరచేతికి అంటిన మట్టి మరకలా అది ఇప్పుడు మిగిలి పోయింది. ఆ జ్ఞాపకాలు కలలా మిగిలి పోయాయి. జీవితంలో ఆ రోజులు తిరిగి రావు. తిరిగి వస్తే ఎంత బాగుండును? అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ముఖ్యంగా తనకి. తిరిగి అనుకుంటున్నాడు సుధాకర్.

ఎట్టకేలకు బస్సు గమ్యం చేరింది. సుధాకర్ సూటుకేస్ తీసుకుని క్రిందకు దిగాడు. ఆటో వాళ్ళు అతడ్ని చుట్టుముట్టారు. తను వెళ్ళవల్సిన ప్రదేశాన్ని చెప్పి ఆటోలో కూర్చున్నాడు. ఆటో బయలుదేరింది.

ఎన్ని సంవత్సరాలు తరువాత తను ఇంటికి వెళ్తున్నాడు? తన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏ మార్పు లేదు. అవే ఇళ్ళు, అవే పరిసరాలు. అతను గేటు తీసుకుని ఇంటిలోకి అడుగు వేస్తున్నాడు. వరండాలో వాలు కుర్చీలో కూర్చుని వార్తాపత్రిక చదువుతూ భార్య సుమిత్రకి వినిపిస్తున్నాడు సారధి. ఆమె తల వొంచుకుని వార్తలు వింటోంది. వాళ్ళకి కొద్ది దూరంలో నిలబడి చూస్తున్నాడు సుధాకర్.

తను తన వాళ్ళను చూసి చాలా రోజులయింది. రోజులేఁటి, సంవత్సరాలే అయింది. ఎలా అయిపోయారు? వయస్సుకి మించిన వృద్ధాప్యం దరిజేరినట్టుంది. నిజమే! ‘వీళ్ళకి మానసిక అశాంతి, చింత. ఇవే కారణాలు. చితి నిర్జీవ శరీరాన్ని దహించి వేస్తే చింత జీవించిన శరీరాన్నే దహించి వేస్తుందట.’ ఇలా ఆలోచిస్తున్న సుధాకర్ కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడింది.

ఒక్కసారి వార్తలు చదవడం ఆపుచేసి సారధి తన ఎదురుగా నిలబడ్డ కొడుకుని చూశాడు, తలవొంచుకుని వార్తలు వింటున్న సుమిత్ర భర్త గొంతుక వినబడక పోయేసరికి తల పైకెత్తి చూసింది. ఆమె మొదట కొడుకును పోల్చుకోలేకపోయింది. పోల్చుకున్న తరువాత అయిష్టంగా తల ప్రక్కకి త్రిప్పుకుంది.

భావోద్వేగంతో ఊగిపోతున్నాడు సుధాకర్. ఒక్కసారి తల్లిదండ్రుల చేతులు పట్టుకుని బోరున ఏడుస్తూ, “నేను తప్పు చేశాను…. తప్పు చేశాను” అంటూ ఏడుస్తున్నాడు. సారధి కొడుకు తల నిమురుతూ ఉండిపోయాడు.

సుమిత్ర మాత్రం చేతులు విదిలించుకుంది. కొడుకు మానసిక స్థితి ఆ సమయంలో అలా ఉండేది. ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు. బాధపడుతున్నాడు. పిల్లలు చేసిన తప్పుల్ని తల్లిదండ్రులే క్షమించలేకపోతే ఎలా అని అనుకున్న సారధి కొడుకు తప్పుల్ని క్షమించగలగాడు కాని, సుమిత్ర అలా చేయలేకపోయింది.

“నన్ను క్షమించలేవా అమ్మా! నేను తప్పు చేయలేదనలేదు. ముమ్మాటికీ తప్పు చేశాను. క్షమించరాని తప్పు చేశాను. నేను చేసిన ఆ తప్పు అలాంటిది, ఇలాంటిది కాదు. మీ మనసుకి క్షోభ కలిగించినంత తప్పు. నా అపరాధం క్షమించలేకపోతే నన్ను కొట్టు, తిట్టు, శపించు. అంతేకాని అలా మౌనంగా ఉండడం నేను తట్టుకోలేక పోతున్నాను” అంటూ తల్లి పాదాల మీద తల వుంచి ఏడుస్తున్నాడు సుధాకర్. ఇన్ని సంవత్సరాల బట్టి తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధంతా వేడి తగలగానే కరిగి పోయిన మంచులా కరిగిపోయి కన్నీటి రూపంలో సుమిత్రకి పైకి ఉబుకుతోంది. ఇన్నాళ్ళ బట్టి ఉన్న బాధ ఒక్కసారి పైకి తన్నుకు వచ్చింది. కొడుకు చేతులు పట్టుకొని బోరున ఏడుస్తోంది.

ఆమె కన్నీళ్ళు తుడిచి ఆమె గుండెల్లో తల వుంచి కళ్ళు మూసుకున్నాడు సుధాకర్. “లే… ఎప్పుడని తిండి తిన్నావో, ఆకలి వేస్తూ వుండవచ్చు. భోజనం చేద్దువుకాని” అని కొడుకుని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళింది సుమిత్ర. అమె కొసరి కొసరి వడ్డించి కొడుకు చేత తినిపిస్తోంది. కొడుకు తృప్తిగా తింటూవుంటే అపురూపంగా కొడుకువైపు చూస్తుంది. వాళ్ళిద్దరివైపు ఏదో మనోహరమైన దృశ్యం చూస్తూ వున్నట్లు చూస్తున్నాడు సారధి.

“నేను వెళ్తున్న సమయంలో మీతో ఒక్క మాట చెప్పాలనుకున్నాను”

“ఏంటి?” సుమిత్ర, సారధి ఒక్కసారే అడిగాడు కొడుకిని.

“మీరు ఆ సౌందర్య పేరు చెపితేనే కసురుకుంటున్నారు కాని ఆవిడ నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంది. ఎంతో సహాయం చేసిందో తెలుసా నాకు?”

‘ఆ సౌందర్యతో వీడి ఎలా పరిచయం అయింది’ ఆలోచిస్తూ వుంది సుమిత్ర,

తను ఇల్లు వదిలి వెళ్ళిన తరువాత తను ఆమె దగ్గరికి వెళ్లడం, ఆమెతో తన పరిచయం, తనకి ఆవిడ చేసిన సహాయం, తల్లిదండ్రుల్తో సఖ్యంగా ఉండమని ఆవిడ చేసిన హితబోధ అన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.

కొడుకు చెప్పిన విషయాలు మౌనంగా వింటున్న సారధి ‘ఎంతేనా బంధం బంధమే!’ అని అనుకున్నాడు. సుమిత్ర మాత్రం అలా చేయలేకపోయింది. వినరాని విషయం విన్నట్లు ముఖం చిట్లించింది. ఆమె ఏదో అనబోయింది, సారధి కనుసైగ చేసి ఆమెను వారించాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version