Site icon Sanchika

ఎండమావులు-14

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 14వ భాగం. [/box]

30

కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది. ఆ కాలచక్రాన్ని ఆపగలిగే శక్తి, సత్తా ఎవ్వరికీ లేదు. ఆ కాలంతో పాటే ఋతువులు మారుతూ ఉంటాయి. ఋతువులన్నిటికీ రాజయిన వసంతఋతువు ఆగమనమవుతుంది. ప్రకృతి సుందరి తన వింతవింత శోభల్తో అందర్నీ మైమరిపిస్తుంది. ఎక్కడ చూసినా అక్కడ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి విచ్చుకున్న వివిధ రకాల పూల సౌందర్యం – సూర్యకాంతికి తళ తళ మెరుస్తున్న వృక్షాల పైన లేలేత చిగుళ్ళు – కోయిలల కుహు కుహూలతో, ప్రకృతంతా చాలా మనోహరంగా ఉంటుంది.

ఆ తరువాత వచ్చేది గ్రీష్మ ఋతువు. భానుడు తన ప్రచండమైన వేడిగాడ్పులో – గాలుల్తో, మరో ప్రక్క ఉక్కపోతతో జనాల్ని కకావికల్ని చేస్తాడు. ఉష్ణతాపానికి – వడగాడ్పులతో ఆ తరువాత వర్షఋతువు ఆగమనం అవుతుంది. ప్రకృతిని భూమాతని తన చల్లని అనృత ధారలో అభిషేకించి – ఉష్ణతాపం నుండి రక్షిస్తుంది.

ప్రకృతిని, సమస్త జీవకోటిని తన చల్లని – తెల్లని వెన్నెలతో అభిషేకిస్తూ అందరికీ ఆహ్లాదపరుస్తూ శరదఋతువు ఆగమనం జరుగుతుంది. ఆ తరువాత వాతావరణాన్ని తన చల్లని గాలుల్తో వణికిస్తూ, మంచు కురిపిస్తూ హేమంత ఋతువు రాక, మానవ జీవితం కష్ట సుఖాల సమ్మేళనం. ఏదీ శాశ్వతంగా ఉండిపోదు. జీవితంలో కష్టం, సుఖం, సంతోషం, దుఃఖం, విచారం అన్నీ కలబోసి ఉన్న నాడే అదే మానవజీవితం. కష్టాలు వచ్చినా అవి తాత్కాలికమేనని, తిరిగి సంతోషం, మంచి రోజులు వస్తాయని సందేశం ఇస్తూ శిశిర ఋతువు ఆగమనం ఉంటుంది. ఆ సమయంలో చెట్ల నున్న ఆకులన్నీ పండిపోయి, ఎండిపోయి రాలిపోతాయి. ఒక విధంగా చూస్తే వృక్షాలకి అది కష్టకాలం. అయినా ఆ వృక్షాలకి తిరిగి లేలేత చిగుళ్ళు వస్తాయి. ఆకు పచ్చని జీవితం తమకి తిరిగి వస్తుంది. తమకి మంచి రోజులు వస్తాయన్న ఆశతో స్థిరంగా నిలిచి ఉంటాయి వృక్షాలు. శిశిరం జీర్ణమైన వాటిని విడిచి పెడ్తూ క్రొత్త వాటి కోసం ఎదురుచూస్తుంది. తిరిగి వసంత ఋతువు ఆగమన అవుతుంది. ఇదే కాలచక్రం, ఋతుభ్రమణం.

వసంత ఋతువులో ఓ ఆదివారం రోజున ఆహ్లాదకరమైన ఉదయ కాలాన్న సుధాకర్ తన కుటుంబ సభ్యుల్తో కలసి అల్పాహారం తీసుకుంటున్నాడు. కుటుంబ సభ్యుల ప్లేట్లలో దోసెలు, చెట్నీ వేసి, కొసరి కొసరి వడ్డిస్తోంది సుమిత్ర.

“అమ్మగారూ! ఎవరో ఒకాయన వచ్చారు.” సుమిత్రతో అంది పనమ్మాయి. ‘ఎవరు చెప్మా’ అని అనుకుంటూ బయటకు వచ్చింది సుమిత్ర.

“డాక్టర్ సుధాకరం గారు ఉన్నారమ్మా!” అమెను వచ్చిన యువకుడు అడిగాడు.

“ఆఁ ఉన్నారు రండి కూర్చోండి” అంది సుమిత్ర హాలులో కుర్చీ చూపిస్తూ, ఆ యువకుడు లోనికి వచ్చి కూర్చుకున్నాడు. తల్లి చెప్పిన విషయం విని ‘నాకోసం ఎవరు వచ్చారు చెప్మా!’ అని అనుకున్నాడు సుధాకర్. పలహారం తినడం పూర్తి చేసి టవల్తో చేతులు తుడుచుకుని హాలులోకి వచ్చాడు. సుధాకర్‌ని చూసి ఆ యువకుడు అతనికి విష్ చేస్తూ లేచి నిలబడ్డాడు. “నా పేరు సమీర్ కుమార్. న్యాయాలయంలో న్యాయం కోసం ఆరాటపడ్తూ దోషుల్ని శిక్షించే వృత్తి నాది” అని అన్నాడు నవ్వుతూ

“చాలా తమాషాగా మాట్లాడుతున్నారే, అంటే మీరు లాయరన్నమాట” అన్నాడు సుధాకర్ నవ్వుతూ…

“అన్న మాటేంటి! ఉన్న మాటే”

“అయితే మీరు న్యాయం కోసం వాదిస్తున్నారు. అనేకంటే న్యాయం కోసం న్యాయస్థానంలో పోట్లాడుతున్నానంటే బాగుంటుందేమో!” సుధాకర్ తిరిగి నువ్వుతూ అన్నాడు. సమీరు కూడా నవ్వాడు. ఇంతలో సారధి కూడా అక్కడికి వచ్చాడు. తండ్రిని సమీర్‌కి పరిచయం చేశాడు సుధాకర్.

సారధి పాదాలకి నమస్కరించాడు సమీర్. “ఆయుష్మానుభవ” అన్నాడు సారధి.

“సుధాకర్ గారూ! నేను న్యాయవాదినే కాని నేటి సమాజంలోనే కాకుండా న్యాయస్థానంలో కూడా న్యాయం చచ్చిపోయిందండి. మా న్యాయవాదుల్లో కూడా నిజాయితీపరులు లేరు. చాలామంది అసత్యాలకి కొమ్ము కాసిన వాళ్ళే. నిజాన్ని అబద్దంగా అబద్దాన్ని నిజంగా నిరూపించి డబ్బు దండుకోడమే వృత్తిగా గల వాళ్ళు చాలా మంది” సమీర్ మాటల్లో నిరాశ వ్యక్తమయింది.

“మరి ఈ వృత్తినే ఎందుకు ఎంచుకున్నారు?”

“వృత్తిలో దిగుతే కాని దాని లోనున్న లోటు పాట్లు తెలియలేదు.”

“మరి మా డాక్టర్లు గురించి అడగరేఁ? అవినీతిపరులు అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. అవినీతి మార్గంలో డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు మా డాక్టర్లలోనూ ఉన్నారు. అన్ని వృత్తుల్లోనూ, నీతి, నిజాయితీ పరులూ ఉన్నారు. వక్రమార్గంలో డబ్బు సంపాదించిన వాళ్ళూ ఉన్నారు” అన్నాడు సుధాకర్.

“మా వాడు చెప్పింది నిజం” అన్నాడు సారధి.

“అన్ని వృత్తుల్లో చాలా పవిత్రమైన వృత్తి మీది మాష్టారూ!” అన్నాడు సమీర్ సారధితో

“ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళలో కూడా అక్రమార్కులు లేరనుకుంటున్నావా? నేడు అన్ని వృత్తుల్లోనూ, అన్ని రంగాల్లోను కొంతమంది స్వార్థపరులూ, చీడపురులులూ ఉంటూనే ఉంటారు.”

“కాఫీ త్రాగుతారా లేక టీనా?” సుధాకర్ సమీర్ని అడిగాడు.

“ఆ ఫార్మాల్టీ ఏం అక్కర్లేదు కాని సుధాకర్ గారూ! మీతో నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను.”

‘ఇతనితో తనకి పరిచయం లేదు. ముఖ్యవిషయం చెప్తానంటున్నాడేంటి? ఏంటి చెప్మా, ఆ ముఖ్య విషయం’ ఆలోచిస్తున్నాడు సుధాకర్,

“చెప్పండి.”

“సినీయాక్టరు సౌందర్య గారి పేరు మీరు వినే ఉంటారు.”

“విని ఉండడం ఏంటి? ఆవిడ నటించిన సినిమాలు నా చిన్నప్పుడు చూసేవాడిని. అంతేకాదు మరో విషయం ఆవిడ చాలా మంచిది. ఈనాడు నేను డాక్టరు హోదాలో ఉన్నానంటే దానికి కారణం ఆవిడ ప్రోత్సాహం, సహకారం. ఇది ఆవిడ పెట్టిన భిక్షే. మానసిక సైర్యాన్ని కూడా ఆవిడ నాకు కలిగించారు. అయితే ప్చ్….! ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారో? ఎలా ఉన్నారో తెలియటం లేదు” విచార వదనంలో అన్నాడు సుధాకర్.

“ప్లీజ్ సమీర్! ఆవిడ ఎక్కడున్నదీ తెలిస్తే చెప్తారా?” సుధాకర్ తిరిగి అన్నాడు. వారి సంభాషణ ఆసక్తిగా వింటున్నాడు సారధి.

‘సుధాకర్ గారూ! ఆవిడ మీ ఒక్కరికే కాదు. నాక్కూడా తన సహాయం అందచేసిన మహానుభావురాలు. మంచి మనిషి. ఆమె నాకు చేసిన ఈ ఉపకారానికి ఆవిడకి జీవితాంతం నేను ఋణపడి ఉంటాను. నేను ఈనాడు న్యాయవాదిగా సమాజం ఎదుట తిరుగుతున్నానంటే దానికి కారణం ఆవిడ పెట్టిన భిక్షే. ఇంతమంది చేత మంచి అనిపించుకున్న ఆమె ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకుందో?’ ఇలా ఆలోచిస్తున్నాడు సారధి.

“ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. మూడు సంవత్సరాల క్రితం ఆవిడ నన్ను తన దగ్గరకి రమ్మనమని కబురు పంపారు. నేను వెళ్ళాను. ఆవిడ ముఖం పాలిపోయి ఉంది. ఉత్సాహం అగుపించడం లేదు. ఏదో పోగొట్టుకున్న దానిలా అలా కూర్చుని ఉన్నారు. ఆమె వదనంలో అలసట, దానితో పోటీ పడుతూ నిరాశ. ఆవిడకి సినీ చాన్సులు తగ్గిపోయాయి అందుకే అలా ఉన్నారనుకున్నాను. నేను ఆమెతో ‘ఏంటి జరిగిందమ్మా!’ అని అడిగాను, కారణం తెలుసుకుని ఆమెకి మానసిక సైర్యాన్ని ఇవ్వాలనుకున్నాను. నా మాటలకి ఆవిడ చిన్నగా నవ్వారు. ఆ నవ్వులో జీవం లేదు. కారణం చెప్పలేదు, కాని ఆవిడ నాతో “సమీర్! నీకు నేను ఓ బాధ్యత అప్పజెప్తాను. నెరవేరుస్తావా?” అని అడిగారు.

“అమ్మా! మీరు నాకు బాధ్యత నెరవేర్చమని అడగటం కాదు, ఆజ్ఞాపించండి. నేను ఏం చేసినా మీ ఋణం తీర్చుకోలేను” అని అన్నాను. ఆరోజే ఆవిడ ఇంటిలో తనకి అవసరమైన సామాన్లు తీసుకుని ఎక్కడికో బయలుదేరబోతున్నారు అని నాకనిపించింది.

“సమీర్! జీవితంలో ఇది నా చివర మజిలి. ఎక్కడికి వెళ్తానో? ఎప్పుడొస్తానో? అసలు వస్తానో, రానో అన్న విషయం కూడా చెప్పలేని పరిస్థితి నాది. నీకు ఈ బంగ్లా తాళాలు ఇస్తున్నాను. అప్పుడప్పుడు వచ్చి ఈ బంగ్లా శుభ్రం చేయిస్తూ ఉండు. ఈ డబ్బు నీకు ఇస్తున్నాను. నీ అకౌంట్లో జమ చేసి ఈ బంగ్లా తాళాలూ, ఈ డబ్బు సుధాకర్‌కి అందచేయాలి. ఇలా చేయమని నిన్ను నేను ఆజ్ఞాపించటం లేదు. కోరుతున్నాను.”

“అదేఁటమ్మా! అలా అంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండమ్మా!” కన్నీళ్ళ పర్యంతం అవుతూ అన్నాను.

“సమీర్! దయచేసి అవేవీ నన్ను అడగద్దు. నేను నాకు అప్పజెప్పిన పని మాత్రం చెయ్యి. సుధాకర్ డాక్టరు కోర్సు పూర్తి చేసుకుని వచ్చిన తరువాత ఈ బంగ్లాలో ఉండాలి. ఇక్కడే నర్సింగ్ హెమ్ ఏర్పాటు చేసుకోవాలి. అదే నా కోరిక సమీర్. మరో విషయం సుధాకర్‌తో నా మాటగా ఒక్క మాట చెప్పాలి.

“చెప్పండి.”

“సుధాకర్ తన కుటుంబ సభ్యుల మీద నెగిటివ్ భావం ఏర్పర్చుకున్నాడు. నెగిటివ్ భావాల్సి పాజిటివ్‌గా మార్చుకోవాలని నా సలహాగా అతనికి చెప్పు.”

“ఏ సుధాకర్ ఎవరమ్మా?” నేను అడిగాను.

“నాకు బాగా కావల్సిన వాడు.” ఇదే ఆవిడ చెప్పిన సమాధానం.

“ఇదీ జరిగింది సుధాకర్ గారూ! సౌందర్యగారు మీకు ఇమ్మన్న ఈ పది లక్షలు. బంగ్లా తాళాలు!” అంటూ సమీర్ సుధాకర్ ముందు డబ్బు, తాళాలు ఉంచాడు.

సమీర్ చెప్పిందంతా విన్న తరువాత సుధాకర్ మనస్సులో అలజడి – ఆవేదన కలిగాయి. బాధవల్ల కళ్ళలో కన్నీరు చిప్పిల్లాడింది. ఆవిడకీ తనకీ ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. లేకపోతే తన మనస్సు ఆవిడ యడల ఇలా స్పందించదు. తనకి అంత ఉపకారం చేసిన వ్యక్తిని తను రెండు మూడు సంవత్సరాలయింది చూసి. ‘వెళ్ళి వాకబు చేస్తే ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయిందన్నారు. ఆవిడ అడ్రస్సు కూడా ఎవరికీ తెలియదన్నారు’ బాధగా అనుకుంటున్నాడు సుధాకర్.

విషయం అంతా వింటున్న సారధి కళ్ళల్లో కూడా ఆవేదన తొంగి చూసింది.

“ఆవిడ ఎక్కడికి వెళ్ళిందీ ఆ తరువాత అయినా తెలిసిందా?” సుధాకర్ అడిగాడు.

“నాకు తెలియదు. ఆవిడ్ని అప్పుడు చూడ్డమే” అన్నాడు సమీర్ వెళ్ళడానికి ఉద్యక్తుడవుతూ.

‘అమ్మయ్య! సౌందర్య తనకి అప్పగించిన బాధ్యత నెరవేర్చి భారం దింపుకున్నాను’ అని అనుకున్నాడు సమీర్.

31

పెరట్లో పూలమొక్కల దగ్గర కుర్చీ వేసుకుని కూర్చున్న సారధి మెదడులో అనేక ఆలోచన్లు. తనకి పెళ్ళి కాకముందు కుటుంబ సభ్యుల మధ్య తన జీవితం ఎంత సాఫీగా సాగిపోయింది. పెళ్ళయి సరస్వతి తన జీవితంలో అడుగు పెట్టిన తరువాత జీవితంలో ఎన్ని మార్పులు, ఎన్నో సమస్యల ఎన్నో సంఘటనలు. వాటినన్నింటిని తను ఎంతో సహన గుణంతో ఎదుర్కున్నాడు. ఆ సహనమే తనలో లేకపోతే తను ఏఁ అయ్యేవాడో! తనలో వున్న ఆ సహన గుణానికి నీరు పోసి సజీవంగా ఉండేటట్టు చేసింది సుమిత్ర,

తిరిగి అతనిలో బావుకత చోటు చేసుకుంది. జీవితం అంటే పుట్టినప్పటి నుండి గిట్టేవరకూ సాగే ప్రయాణం. ఈ జీవితంలో సంతోషం, దుఃఖం, కష్టం, సుఖం ఇవన్నీ కూడా ఈ జీవన యానంలో భాగాలే. ఎప్పటికప్పుడు మనల్ని మనం తెలుసుకుంటూ దేశకాల పరిస్థితుల కనుగుణంగా మనల్ని మనం మలుచుకుంటూ అలా ముందుకు సాగిపోవడమే జీవితం. అయితే అందరి జీవితాలూ ఒకేలా ఉండవు.

కొందరి జీవితాలు వడ్డించిన విస్తరయితే తినడమే తరువాయిగా వుంటుంది. వారి జీవితం పూలబాటలా సాగిపోతుంది. ఇంకా కులాసాగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. కొద్ది కొద్దిగా అపజయాలు ఎదురయినా, ఇబ్బందులు గురి చేస్తున్నా అటు ఇటు దొర్లిపోతున్నట్లు అనిపిస్తున్నా, భయపెడున్నా అప్పుడప్పుడు దిగులు ఆవరించినా చలించని మరికొందరికి జీవితంలో అడుగడుగునా ఎదురీతలే. మా జీవితాలు ఎందుకిలా అయ్యాయి అని ప్రశ్నించుకుంటూ నిరాశ నిస్పృహలతో కూరకుపోయి, ఏ రోజుకా రోజు, ఎప్పటికప్పుడు ఎందుకు వచ్చింది ఈ జీవితం, ఇలా బ్రతికే కంటే చావే నయం అని అనుకుంటూ జీవితం గడిపేస్తూ ఉంటారు.

సమాజంలో మరో రకమైన మనుష్యులలున్నారు. వారికి వీటి వేటితోనూ సంబంధం లేదు. భావోద్వేగాలు వారి దరిదాపులకి రావు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన్న మెలుగుతూ ఉంటారు. సమాజంలో తమ చుట్టూ ఉన్న సంఘటనలో వాళ్లకేఁ సంబంధం లేదు. స్వార్ధంతో వాళ్ళ బాగోగులేవో వాళ్ళే చూసుకుంటూ, అదే జీవితం అని అనుకుంటారు. నయాన్నో భయాన్నో వారికి కావల్సింది వారు సంతరించుకుంటూ బ్రతుకు ఈడ్చుకుపోతారు.

ఇలా జీవితానికి ఎన్నెన్నో రంగులు పూసి సాగించేయ్యడమే జీవితం. దీనికి అర్థం ఏదో విధంగా బ్రతికెయ్యడమే జీవితం. మనిషి జీవితంలో ఎదురయ్యే జయాలు చూసి పొంగిపోవడం, అపజయాల ఎదురయినప్పుడు కృంగిపోవడం వంటివి జీవితంలో మొలకెత్తే మొక్కలు, ఆ మొక్కలు పూల మొక్క, పళ్ళ మొక్కో అయితే పొంగిపోవడం అలా కాకుండా ఏదో పిచ్చి మొక్క అయితే నా దురదృష్టం అని అనుకోవడం మన నైజం. మానవ జన్మ ఎత్తిన మనం నిరాశగా ఏది అనుకోకూడదు.

‘ఈ మానవ జన్మలో ఎటువంటి పరిస్థితినయినా ఎదుర్కోవాలన్న సంకల్పబలం దృఢంగా ఉన్ననాడు ఎటువంటి సమస్యనయినా అతి సులువుగా ఎదుర్కోవచ్చు. దాల్లో ముళ్ళు గ్రుచ్చుకుంటాయని ఆ దారిలో నడవడం మానేస్తామా? ధీరులు అలాంటి దారిలో అడుగు ముందకు వేస్తారు. ఒడిదొడుకులు జీవితంలో వస్తే కృంగిపోయే కంటే ధైర్యంతో ఎదుర్కొంటారు. ఆత్మసైర్యం పెంపొందించుకుంటే ఏ సమస్యలూ మనల్ని ఏఁ చేయలేవు’ అని అనుకుంటాడు సారధి.

అయితే అలా అనుకోలేకపోతోంది. ఆచరించలేకపోతోంది సుమిత్ర. తనకి పెళ్ళయి వచ్చిన తరువాత సుధాకర్ చిన్నపిల్లాడు. తమిద్దర్నీ ఒక్కక్షణం వదిలి ఉండేవాడు కాదు. తను కూడా సుధాకర్‌ని ఎంతో అభిమానించింది. ప్రేమించింది. తన వాత్సల్యాన్ని పంచి ఇచ్చింది. పదేళ్ళ వయస్సు వరకూ చాలా బాగా మెలిగిన కొడుకులో వచ్చిన భయంకరమైన పరివర్తనకి తన మనస్సు విలవిల్లాడింది. తనకి సంతానం కలుగతే ఎక్కడ సుధాకర్‌ని సరిగా చూసుకోలేదో అని అనుకుని ఏ ఆడదీ చేయని త్యాగం తను చేసింది. తను జీవితంలో గర్భవతి అవ్వకుండా చేసుకుంది.

‘సుధాకర్ ఏంటి ఇలా తయారయ్యాడు?’ అని తనే ఎక్కువ బాధపడింది. బొత్తిగా మనమంటే ఇష్టం లేనట్లు – మనం శత్రువులయినట్లు ప్రవర్తిస్తున్నాడు. వీడు మనకి పూర్వ జన్మలో శత్రువా? ఎందుకంటే శత్రువులే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి తల్లిదండ్రుల్ని హింసిస్తున్నారట. ఈ మాట సారధితో అనేది. “పూర్వ జన్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న నేను ఇలా చెప్తున్నాను. మనం పూర్వ జన్మలో చేసిన పాపం కూడా ఈ జన్మలో పిల్లలుగా పుట్టి బాధిస్తారట. తల్లిదండ్రుల్ని మాటలో చేతల్లో హింసించి – మానసికం – కృంగదీసి మనశ్శాంతి లేకుండా చేస్తారట. ఆ సమయంలో తల్లిదండ్రులు బాధపడ్తూ ఉంటే చూసి వినోదిస్తారట” ఇలా చెప్పుకుని వాపోయింది సుమిత్ర.

అయితే సారధికి పూర్వజన్మ సిద్ధాంతం మీద నమ్మకం లేకపోయినా భార్యని సంతృప్తి పరచడానికి ఆమెను సమర్థిస్తున్నట్లు మాట్లాడి ఓదార్చేడు. పూర్వ జన్మ సిద్ధాంతం మీద అంత నమ్మకం లేని సారధికి కూడా అప్పుడప్పుడు సుమిత్ర అన్నది నిజమేనేమోనన్న ఆలోచన వచ్చేది.

“ఎవరు ఎలా ఉన్నా ఎలా ప్రవర్తించినా జీవితాంతం నీకు నేను, నాకు నీవు తోడుగా ఉంటాం” అని భార్యను ఓదార్చేవాడు. ఆ తరువాత జీవితంలో ఎన్నో మలుపులు సుధాకర్ తన తప్పులు తెలుసుకుని తిరిగి రావడం, క్షమాపణ కోరడం, పశ్చాత్తాప పడడం ఆ దంపతులకి ఆనందాన్నిచ్చింది.

కొడుక్కి పెళ్ళి అయి కోడలు ఇంటికి వచ్చిన తరువాత మరో రకమైన సమస్యలు ఎదురయ్యాయి. అవి సుమిత్రను మనస్తాపానికి గురి చేశాయి. కోడలి అంతరంగం ఆమెకి అర్ధం కాలేదు. ముభావంగా ఉంటుంది. ఎప్పుడూ ఇంట్లో కలివిడిగా తిరగదు. అయిష్టంగా ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది.

అక్కడికీ సుమిత్ర తన మనస్సుకి సర్దిచెప్పుకుంది. అలవాటు లేని ప్రదేశాలు, అంతగా పరిచయం లేని మనుష్యుల మధ్య మెసలడానికి కొన్నాళ్ళ వరకూ ఇబ్బందిగానే ఉంటుంది. అని అనుకునేది.

కోడలి ప్రవర్తన గురించి భర్తతో అంటే “సుమిత్రా! అంతకు పూర్వం నీకు ఓ మారు చెప్పాను. ఇప్పుడు మరోమారు చెప్తున్నాను, విను. ఈనాడు సమాజంలో ఇది మన ఒక్కరి సమస్యే కాదు, సంధ్యలాంటి ఈనాటి అమ్మాయిలందరూ కోరుకునేది తనూ, తన భర్త, తన పిల్లలు, తన కుటుంబం. ఆ తరువాత కోరుకునేది తన వాళ్ళని. చివరికి కోరకునేది అత్తవారి తరపువాళ్ళని.

ప్రతిరోజు రుసరుసలాడుకుంటూ విసుక్కుంటూ ఎడమొగం, పెడమొగం పెట్టుకుని ఉండే కంటే సంధ్యకి ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే వాళ్ళిష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి ఉండనీ. దూరంగా ఉంటేనే ఒకళ్ళమీద మరొకళ్ళకి అభిమానాలు పెరుగుతాయి. నీవేఁ బాధపడవద్దు. చివరి వరకూ నీకు నేను, నాకు నీవు తోడు.” భార్యను ఓదారుస్తూ అనేవాడు సారధి. అతని ఓదార్పుతో తాత్కాలికంగా బాధను మర్చిపోయేది సుమిత్ర.

(ఇంకా ఉంది)

Exit mobile version