Site icon Sanchika

ఎండమావులు-19

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 19వ భాగం. [/box]

39

[dropcap]మె[/dropcap]లికలు, తిరిగిన తారు రోడ్డు మీద చవర్లేటు కారు సర్రున రాకెట్టు కన్నా స్పీడుగా ముందుకు సాగిపోతోంది. కారును డ్రైవ్ చేస్తున్న సౌందర్య కనుదోయి ఆ రోడ్డు మీదున్నా ఆమె మది నిండా రకరకాల ఆలోచన్లు, పది సంవత్సరాలు తను తిరుగులేని కథానాయికగా వెండితెరమీద ఓ వెలుగు వెలిగింది.

తను అనుకున్నట్టే అందర్నీ ముఖ్యంగా అధికారం – ధనం వల్ల కళ్ళు మూసుకుపోయి అహంకారంతో విర్రవీగిన వాళ్ళనందర్నీ తన చుట్టూరా పిచ్చికుక్కల్లా త్రిప్పుకుంది. అయితే తనకి రోజు రోజుకి వయస్సు పైబడుతోంది. క్రొత్త నీరు వస్తే పాత నీరు దాని తాకిడికి కొట్టుకు పోతున్నట్టు క్రొత్త క్రొత్త హీరోయిన్లు సినిమా రంగంలోకి అడుగు పెడ్తూ ఉంటే కుర్రకారుల మనస్సు అటువైపు మొగ్గుతోంది.

సౌందర్య కళ్ళముందు సుందరం, సుభద్ర, సుధాకర్, సంధ్య, సుమిత్ర, సారధి మెదిలారు. మిగతా పిల్లలు తనకి తెలియదు.

సుందరం బావగారు సుందరాన్ని తప్పించి తన వ్యాపార లావాదేవీలు అనే చూసుకోడం ఆరంభించాడు. తను సుభద్రతో సుందరం గురించి అన్న విషయం నిజమయింది. నడి సముద్రంలో చిక్కుకున్న నావలా తయారయిన ఆ కుటుంబాన్ని సుందరం తెలివితేటలు-రెక్కల కష్టం తోడయి సుందరం జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. కొన్ని సంవత్సరాల వరకు సుభద్ర ద్వారా సారధి కుటుంబ విషయాలు సౌందర్యకి తెలుస్తూనే ఉన్నాయి. ఆ తరువాత తెలియటం లేదు. తను వైభవోపేతమైన జీవితం గడుపూతూ ఉంటే తన కొడుకు ఆర్థికంగా వడిదుడుకులు ఎదుర్కొని ఉండచ్చు. ఆ మధ్యతరగతి కుటుంబంలో తన కొడుకు ఎలాగో జీవితం ఏదో విధంగా జీవితం గడిపేస్తూ ఉండచ్చు ఆ మధ్యతరగతి మనిషి సారధికి తన కొడుకుని బాగా చూసుకొని చదువు చెప్పించడమంటే చాలా కష్టమే. అలాంటి వాతావరణంలో పెరుగుతున్న కొడుకుమీది మనస్సులో ఏదో తెలియని అసంతృప్తి.

డైనింగు టేబులు చుట్టూ వివిధ రకాల తినుబండరాలు చూడగానే కొడుకు గుర్తుకు వచ్చేవాడు. మనస్సు కలత చెందేది. గుండెలు బరువెక్కేవి. చెప్పలేనంత గుబులు గుండెల్లో గూడు కట్టుకునేది. సారధికి ఆర్ధికంగా సహాయం చేద్దామంటే ఆత్మాభిమానం మెండుగా గల అతను తన సహాయం తిరస్కరించడమే కాకుండా కటువుగా మాట్లాడుతే తను బాధపడే పరిస్థితి వస్తుంది.

సున్నితంగా పరిష్కారమవవల్సిన సమస్య మరింత జటిలమవడానికి అవకాశమవుతుంది. అందుకే తను ఆ ప్రయత్నం విరమించుకుంది. అయితే తన కొడుకు ప్రయోజకుడవడం ఎలా? తనకి ఇంత సంపద ఉంటే లాభమేఁటి? ఆ సంపద తన వాళ్ళ అవసరాలకి వినియోగపడనప్పుడు?.

మొదట సుధాకర్ కుటుంబం గురించి తెలుసుకున్న తను అవాక్కయింది. చాలా బాధపడింది. సుధాకర్ తన కొడుకే అని తెలియగానే ఏదో తెలియని అలౌకికమైన ఉద్వేగం-ఆనందం ఒక్కసారి కలిగాయి. వెను వెంటనే నిరాశ బాధ-నిర్లిప్తత చోటు చేసుకున్నాయి. తనకి సుధాకర్ తన కొడుకని తెలుసు కాని, సుధాకర్‌కి తను తల్లి అని తెలియదు.

అదీ ఒక విధంగా మంచిదే. తను తన తల్లి అని తెలిస్తే చీత్కరించుకుంటాడు. అసహ్యించుకుంటాడు. అలా చేస్తే తను సహించలేదు. అందుకు తను ఎవరో సుధాకర్‌కి తెలియకుండా ఉండడం మంచిది.

తన కొడుకు కష్టపడి చదువుతూ ఇలా ఉన్నతంగా ఎదగడం ఆమెకి చాలా సంతోషం కలిగించింది.

సంధ్యని సుధాకర్‌ని చూసుంటే ఆమె మదిలో అనేక ఆలోచన్లు. వాళ్ళిద్దరూ ఒకర్ని మరొకరు ఇష్టపడున్నారు అని తెలిసిననాడు సౌందర్య చాలా పొంగిపోయింది. సంధ్య సుభద్ర కూతురని తెలిసిననాడు ఆమెకి చాలా ఆనందం కలిగింది. సుభద్రా తనూ స్నేహితురాళ్ళు ఇప్పుడు వియ్యపురాళ్ళయితే ఎంత థ్రిల్‌గా ఉంటుంది? అంతకన్నా అదృష్టమైన సంఘటన ఇంకేమైనా ఉందా? అనుకునేది.

సుధాకర్ కూడా ‘ఆంటీ…. ఆంటీ….’ అని పిలుస్తుంటే నేను ఆంటీని కాదు అమ్మను అని గట్టిగా చెప్పాలనిపించేది. అయితే తనున్న పరిస్థితులు. తన స్థితి తలపుకి రాగానే మౌనంగా ఉండిపోయేది.

సౌందర్య నాలుగు పదుల వయస్సులో అడుగు పెట్టబోతోంది. అయితే ఆమె పాతిక సంవత్సరాల పడుచుపిల్లలా ఉంటుంది. ఆమె తీసుకుంటున్న సౌందర్య పోషణ వల్ల సౌందర్యం విషయంలో ఆమె అంత శ్రద్ధ తీసుకోబట్టి ఇది సాధ్యమయింది. పది సంవత్సరాలు ఆమె తిరుగులేని కథానాయికగా సినీ ప్రపంచంలో వెండితెర మీద తన వెలుగులు విరజిమ్మింది. పేరు ప్రఖ్యాతులు గడించింది. హీరో సుకుమార్ ఆమె మెళ్ళో తాళి కట్టలేదన్న మాటేదన్న మాటేకాని అంతకన్నా ఎక్కువుగా సుఖపెట్టాడు ఆమెను.

వాళ్ళిద్దరి వ్యవహారం కోదండపాణికి నచ్చలేదు. మనోవైజ్ఞానికంగా చూసినా, మానవ సంబంధాలు ప్రకారం చూసుకున్నా ఇది సహజమే అని అనిపిస్తుంది. మనది అనుకున్న వస్తువు కాని మనిషి కాని పరాయి సొత్తు అవుతూ ఉంటే ఇలాంటి బాధ ఉండడం సహజమే కదా.

‘తనవల్ల సౌందర్యకి సుఖంలేదు. చాల్లేదు అంటే సబువుగా ఉంటుంది. అందుకే ఆ సుఖాన్ని వెతుక్కుంటోంది. సుకుమార్‌తో తిరుగుతోంది’ అని తనని తాను ఓదార్చుకోడానికి, సమర్థించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.

వయస్సు పైబడుతున్నా పిన్నవయస్కురాల్లా కనబడట్టే క్రొత్తగా వస్తున్న కుర్ర హీరోయిన్లు కూడా ఆ సినిమా పోటీ ప్రపంచంలో సౌందర్య కన్నా వెనకబడ్డారు. సౌందర్య అవతల ప్రేక్షకుల్ని ఇవతల హీరోలని తన వైపు త్రిప్పుకుంది. ఆమె ఆకర్షణ నుండి హీరోలు తప్పుకోలేకపోతున్నారు. అందులోనూ నెంబరు వన్ స్థానంలో ఉన్న హీరో సుకుమార్ తను నటిస్తున్న అన్ని చిత్రాలోనూ సౌందర్య హీరోయిన్‌గా ఉండాలని పట్టుబట్టేవాడు. అందుకే సౌందర్యకి అంత కీర్తి.

కీర్తితో పాటు తను సంపాదించిన సంపదకి హక్కుదారునిగా సూచిస్తూ తన ఆస్తిపాస్తుల్లో సగం కొడుకు సుధాకర్ పేరున వీలునామా వ్రాసింది. తనకి నమ్మకస్థుడయిన లాయర్ సమీర్‌కి ఆ వీలునామా పత్రాలు ఇచ్చి అవసరమయినప్పుడు సుధాకర్‌కి అందచెయ్యమని చెప్పింది. మిగతా సగంలో తను కొద్దిగా ఆస్తిపాస్తులుంచుకుని మిగతాది అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చేసింది.

ఎదురుగా మేకల మందని చూడగానే సౌందర్య ఆలోచన్లకి అంతరాయం కలిగింది. కారును చూసి మేకలు చెల్లాచెదురయ్యాయి. ఒక్కసారి బ్రేకు వేసింది. మేకలు ప్రక్కకి తొలగిపోగా కారు ముందుకు పోనిచ్చింది. ఆలోచన్లు కూడా అంతవేగంగా ఆమెలో తిరిగి ప్రవేశిస్తున్నాయి.

తన కొడుకు పెళ్ళికి తను వెళ్లలేకపోయింది. తను ఆ పెళ్ళికి వెళ్తే అందరికీ నిజం తెలిసిపోతుంది. నిజం తెలియకముందు తనకి లభిస్తున్న గౌరవం నిజం తెలిసిన తరువాత లభించకపోవచ్చు. ఇప్పుడు నటిగా తనని అభిమానిస్తున్న వాళ్ళుండచ్చు. అయితే తన కుటుంబ సభ్యులు తనని అసహ్యించుకోవచ్చు. ముఖ్యంగా సారధి తనని క్షమించినా సుమిత్ర మాత్రం తనని క్షమించలేదు. తనని అసహ్యించుకుంటుంది. అందుకే పెళ్ళి చూడాలన్న తన కోరిక చంపుకుంది.

తను పెళ్ళికి రాలేదని సుధాకర్ బాధపడ్డాడు. సంధ్య కూడా నొచ్చుకుంది. “ఆంటీ మీరు ఇలా చేసారేంటి? మేము ఎంత అసంతృప్తి చెందామో తెలుసా?” ఇద్దరూ ఒక్కసారి అన్నారు. “షూటింగు ఉండడం వల్ల రాలేకపోయాను. నా ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి” అని తను తప్పించుకుంది.

ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ కోరడం అత్యాశే అవుతుంది. ఆ భగవంతుడు ఇలా జరగాలని వ్రాసి పెట్టి ఉంటాడు. అందుకే ఇలా జరిగింది. కొడుకు పెళ్ళి చేసి చూసే అదృష్టం తనకి ఉండద్దూ! ‘ఎంతైనా మనం నిమిత్త మాత్రులమే, చేసేవాడు, చేయించేవాడు వేరే ఉన్నాడు’ వేదాంత దోరణిలో అనుకుంది సౌంధర్య

కొడుకు చేత ‘అమ్మా!’ అని పిలిపించుకోవాలన్న కోరిక మనుస్సులోనే ఉండిపోయింది. ‘నేను నీ అమ్మను’ అని సుధాకర్‌కి చెప్పాలనుకొంది. కాని అలా చేయలేకపోయింది తను.

తన బంగళా చేరుకోగానే సౌందర్య ఆలోచన్లకి అంతరాయం కలిగింది. ఆమె పోర్టికోలో కారును పార్కు చేసింది.

40

డబ్బుకి మూలం ఇదం జగత్ అన్నట్టు ఈ ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు…… డబ్బు….. డబ్బు… అది లేనినాడు ఏ ఆప్యాయతలూ ఉండవు. ఏ అనురాగాలూ ఉండవు. వ్యక్తికి గౌరవ మర్యాదలన్నీ ఆ డబ్బుతోనే.

ఆ డబ్బే అనేక సమస్యల్ని సృష్టిస్తుంది. అనేక చికాకుల్ని కలిగిస్తుంది. మానవ సంబంధాల్ని దెబ్బతీస్తుంది. ఆ డబ్బు కోసమే కొట్లాటలు, హత్యలు, చంపడాలు-చంపుకోడాలు మారణకాండలు.

డబ్బున్నా బాధే అది లేకున్నా బాధే. డబ్బు లేనివాడిని గడ్డిపోచకన్నా హీనంగా చూస్తుంది లోకం. డబ్బున్న వాడిని అందలం ఎక్కిస్తుంది. ఇద్దరి మనుష్యుల మధ్య ఆప్యాయతను, అనురాగాన్ని దూరం చేసి మనస్పర్ధలు పెరగడానికి ఆ ఇద్దర్నీ విడదీయడానికి ఆ డబ్బే కారణం అవుతుంది.

“సౌందర్య! డార్లింగ్! నీకు ఇన్నాళ్ళూ అన్ని విధాల సహకరించాను. నీవు ఉన్నత శిఖరాలకి చేరుకోడానికి ఒక విధంగా కారకుడయ్యాను. ఆ విషయం నీక్కుడా తెలుసు. నీకు అన్ని విధాలా తృప్తికరమైన జీవితం ప్రసాదించి, అసంతృప్తి అన్నది ఎరక్కుండా చేశాను. ఇప్పుడు నాకు నీ సహకారం అవసరమవుతుంది. నా అవసరం తీరుస్తావా?” అన్నాడు సుకుమార్ ఆమెను తన బాహుబంధంలో ఇముడ్చుకుని.

సుకుమార్ మాటలు విన్న సౌందర్య మొదట చకితురాలయింది. అంతకు పూర్వం ఎప్పుడూ తన దగ్గర ఇటువంటి ప్రస్తావన తేలేదు. అందుకే ఆమెకి ఆశ్చర్యం. ఏంటి అడుగుతాడా అన్న సందేహం. రకరకాల భావాలు మదినిండా అల్లుకుపోయాయి.

“ఏంటి? నీ ప్రాపర్టీ ఏం చేశావు?”

అతని మాటలకి ఆమె ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా దెబ్బతిన్నాడని చూచాయగా తెలిసింది. ఆమెకి ఆమె మదిలో అనేక ప్రకంపనలు అతని మాటలు విన్న తరువాత. అనేక భావాలు.

అయితే ఇన్నాళ్ళూ తన మీద చూపిస్తున్న ప్రేమ తన ఆస్తిమీదా? ఇలా ఆలోచిస్తున్న ఆమెకి చిరు చెమటలు పడున్నాయి. ఆమె భావాలు, తత్తరబాటు గమనించిన సుకుమార్ తన కౌగిలి సడలించి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుకి మరో పర్యాయం అయితే మైమరిచిపోయేది కాని ఇప్పుడూ అలా అవలేదు.

“నీ ఆలోచన్లు నాకు తెలుసులే! ఈ సుకుమార్ నా ఆస్తి మీద కన్నేసాడు. నా ఆస్తి మీద ప్రేమ కాని, నా మీద కాదు అని అనుకుంటున్నావు కదూ……..!!!” సుకుమార్ ఆమె వేపు చూస్తూ అన్నాడు.

“నేను అలా అనుకోవటం లేదు” ఆమె అలా అంది కాని ఆమెలో అపనమ్మకం తొంగి చూస్తోంది. సుకుమార్ పెళ్ళి చేసుకోబోతున్నాడు. పెళ్ళయిన తరువాత క్రొత్త భార్య మోజులో పడి తనని ఇతను లక్ష్యపెడ్తాడా? తన ఉన్న ఆస్తి అతనికి ఇస్తే తరువాత తన పరిస్థితి ఏంటి? అయినా ఇప్పుడు తన దగ్గర మిగిలిన ఆస్తి ఎంత? కొడుక్కి వీలునామా వ్రాసింది. అనాథ శరణాలయానికి విరాళం ఇయ్యగా కొద్దిపాటి ఆస్తే మిగిలింది.

“ఏంటి ఆలోచిస్తున్నావు సౌందర్యా? నేను అనవసర ఖర్చు కోసం నీ ఆస్తి అడగటం లేదు. బిజినెస్‌లో లాస్ వచ్చింది. నిలదొక్కుకోడానికి చేతికాపు కోసం అడుగుతున్నాను. నీవు పార్టనర్‌గా చేరుదువుగాని” సౌందర్య వంక నిశితంగా చూస్తూ అన్నాడు సుకుమార్.

“సారీ సుకుమార్!”

సౌందర్య మాటలు వినగానే సుకుమార్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అయిష్టంగా ముఖం చిట్లించాడు.

“అంటే?”

“నేను నా ఆస్తిని అనాథ శరణాలయానికి విరాళం ఇచ్చాను. కొద్దిపాటి ఆస్తినే ఉంచుకున్నాను” అంది సుధాకర్‌కి వీలునామా వ్రాసిన విషయం చెప్పలేదు.

“నాకు తెలియకుండా నిన్నా పని ఎవరు చేయమన్నారు?” అతని కంఠంలో కర్కశత్వంతో పాటు అహం-అధికారం-ఆజ్ఞ తొంగి చూస్తున్నాయి. అతని ఇగో దెబ్బతింది. ఏ భర్త కూడా భార్యను అలా శాసించి అడగడు. సుకుమార్ మాత్రం సౌందర్యని అలా శాసించి అడుగుతున్నాడు.

“అన్ని విషయాలు నీకు చెప్పే అవసరం లేదన్న భావంతోనే నేనా పని చేసాను. అయినా ఇది నా పెర్సనల్ మేటరు.”

సౌందర్య మాటలకి సుకుమార్ అహం దెబ్బతింది. “అయితే నీ విషయాల్లో నాకు ఆ మాత్రం అధికారం లేదా?”

“అధికారం ఉందా లేదా అన్న విషయం ప్రక్కన పెడితే నాకు కూడా కొన్ని ఆలోచన్లు ఉంటాయి. అవసరాలు ఉంటాయి, ఆచరణలు ఉంటాయి అని అర్థం చేసుకోవటం లేదు నీవని నా బాధ.”

“అయితే నీ దగ్గర నా స్థానం అంతేనన్నమాట.”

సుకుమార్ ధోరణి సౌందర్యకి చికాకు వేసింది.

“కొన్ని నా పర్సనల్ మేటర్పు ఉంటాయి. నీ పర్సనల్ మేటర్సులో నేను తలదూరుస్తున్నానా? అన్ని విషయాలూ నీతో చెప్పి నీ పర్మిషను తీసుకోడానికి నేను నీ పెళ్ళాన్నా?” చిరాకుగా అంది సౌందర్య.

“తాళి కట్టిన పెళ్ళానివి కాకపోయినా పెళ్ళాంలాంటి దానివి” సుకుమార్ కంఠంలో దర్ప-అహం తొంగిచూశాయి.

“నో… నో…. నో…” గట్టిగా అరిచిందామె.

“ఎందుకలా అరుస్తావు? మనిద్దరి సంబంధం అందరికీ తెలుసు. ఎవర్ని అడిగినా అందరూ ఇదే మాట అంటారు.”

“అందరి సంగతి నాకు అనవసరం. నన్ను మాత్రం నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు సుకుమార్. నాకు నీవు ఆనందాన్ని ఇచ్చి ఉంటే నీ యడల నీకు నేనూ అలాంటి ఆనందాన్నే పంచి ఇచ్చాను. అంత వరకే మన సంబంధం. పరిమితి లేని హద్దు దాటినా-మితి మీరిన చనువు ప్రదర్శించినా నాకసహ్యం. ఏ విషయంలో నీవు నీ హద్దును అతిక్రమించకుండా ఉండడమే శ్రేయస్కరం” ఆమె కంఠంలో తిరస్కారభావం. ఆ భావానికి తట్టుకోలేకపోయాడు సుకుమార్. ఆమె మాటలు సూదిమొనల్లా గుచ్చుకుంటున్నాయి. మనస్సు భగ్గుమంటోంది. కారాలు మిరియాలు నూరుతున్నాడు. కోపంతో బుసలు కొడున్నాడు.

“నీకెంత పొగరు?”

“మర్యాదగా మాట్లాడు. మర్యాద అతిక్రమిస్తే దాని పరిణామం దారుణంగా ఉంటుంది.”

“ఏంచేస్తావు?” కళ్ళెర్రచేసి ఆమె మీదకి రాబోయాడు సుకుమార్.

“గెటవుట్” బయటకు చేయి చూపిస్తూ కఠినంగా అంది సౌందర్య.

“నన్ను గెటవుట్ అని అంటావు కదూ! నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. విషపునాగుతో ఆడుకోడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను తల్చుకుంటే నీ వెంత? నీ బ్రతుకెంత? నిన్ను ఈ సినీ ప్రపంచం నుండే గెటవుట్ చేస్తాను. కాళ్ళు అరిగిపోయినట్లు తిరిగినా నీ కెవరూ సినీమా చాన్సు ఇయ్యరు. ఒక వేళ ఇచ్చినా హీరోయిన్‌గా నిన్ను ఎవ్వరూ బుక్ చేసుకోకుండా చూస్తాను. చేసుకోరు కూడా. చివరికి కుళ్ళి కుళ్ళి పిచ్చి కుక్కలా చావాలి. నీ చంచల స్వభావానికి అదే తగిన శిక్ష. నీ ఆస్తి ఏ అనాథ శరణాలయానికి ఇచ్చి ఉండవు. నాకు గట్టి నమ్మకం ఉంది. అంత మంచిపని నీవు చేయవు. నా కన్నా మెరుగయినవాడు తగులుకొని ఉంటాడు. ఆ రంకు మొగుడికి సమర్పించి ఉంటావు నీ ఆస్తంతా” అలా అంటున్న సుకుమార్ బూటుకాలితో నేలను గట్టిగా తన్ని అచటి నుండి కదిలిపోయాడు.

సుకుమార్ హెచ్చరిక ఆమె గుండెల్లో అజ్ఞాతమైన భయాన్ని కలగజేసింది. గుండెల్లో గుబులు పేరుకుంది. అయితే ఆత్మాభిమానం పొడజూపింది. అతనికి తను లొంగి ఉండటం ఏంటి? తనపై అతనికి అధికారమేఁటి? ఎవరి బ్రతుకు వాళ్ళది. ఎవరి బాట వాళ్ళది. ఎవరి జీవితాలు వాళ్ళవి. అవసరాలు తీర్చుకోడానికే ఆ కొద్ది కాలం కలవడం విడిపోవడం సహజం. ఆ కొద్దికాల సంబంధాన్ని సాకుగా చూపి అధికారం చెలాయించే వాళ్ళంటే తనకసహ్యం. సహించలేదు కూడా.

ఆ కోదండపాణే నయం తన మీద అధికారం చూపించడానికి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఈ సుకుమార్ తన వల్లే తనకి పేరు ప్రతిష్ఠలు వచ్చేయనుకుంటున్నాడు. తను తన నటనతో ప్రేక్షకుల్ని ఆకర్షించి ముగ్ధుల్ని చేసిన నటన ప్రదర్శించబట్టి, తన అందం వాళ్ళని కట్టిబడేయబట్టే తను ఇన్నాళ్ళూ వెండి తెరమీద నటించగలిగింది. అంతేకాని ఏ ఒక్కరి వల్ల కాదు. ఈ సుకుమార్ కాకపోతే మిగతా హీరోలతో తను నటించలేదా? ఇలా సౌందర్య మనస్సుని సమాధానపర్చుకుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version