[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. [/box]
4
“మాష్టారూ! మా చెల్లెలు మెట్రిక్ పరీక్ష పాసయింది. దానికన్నా ముందరే నేను మీకు ధన్యవాదాలు – కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంది సరస్వతి సంతోషంతో. ఆ సమయంలో సారధి నూతిగట్టు మీద బట్టలకి సబ్బు పెడుతున్నాడు.
“నాకు ముందరే తెలుసు, మీ చెల్లెలు పాసవుతుందని” నవ్వుతూ అన్నాడు సారధి.
“అదంతా మీ చలవే! మీ శ్రమే – మీ దయే” అతడ్ని పొగుడుతూ అంది ఆమె.
ఆ పొగడ్తలు తనకి నచ్చవని సూచిస్తూ “దీన్లో నా దయ ఏముంది? ఆమె కష్టపడి చదివింది. పాసయింది” అన్నాడు.
“అలా అనకండి, మీరు అంత శ్రమ తీసుకుని చదువు చెప్పబట్టే మా చెల్లెలు పాసయింది.”
“చాలా కష్టపడి చదివి పాసయింది మీ చెల్లెలు. మొదట మనం ఆమె కృషిని ప్రశంసించాలి, ఆ….. ! ఆ విషయాన్ని అలా వదిలి పెట్టండి, తరువాత ఏ చేయదల్చుకున్నారు మీ చెల్లెలు”
“ఏ చిన్న ఉద్యోగం వచ్చినా దాన్లో చేరుతుంది మాష్టారూ! నేను నా ఒక్కదాని సంపాదనతో కుటుంబ నావను ఈడ్చలేక చస్తున్నాను. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడయినట్టు అది ఏదో చిన్న పని అదే చిన్న ఉద్యోగమేనా చేసి సంపాదిస్తే మా కుటుంబానికి అది చాలు” సరస్వతి అంది సారధివేపు చూస్తూ.
“మా సుమతికి సంబంధం కుదిరింది. మాఘ మాసంలో పెళ్ళి.”
“విన్నాను, సుమతి చెప్పింది, చాలా అదృష్టవంతురాలు”,
“పెళ్ళి అవడం అదృష్టమేనా? ఆడదానికయినా – మగవాడి కయినా ముందో – వెనకో పెళ్ళవడం స్వాభావికం కదా!”
“అందరి విషయంలోనూ అది సాధ్యం అయ్యే పనికాదు మాష్టారూ! కొంతమంది జీవితాల్లో ఈ పెళ్ళి అనే ద్వారాలు పరిస్థితుల ప్రభావం వలన శాశ్వతంగా మూసుకుపోతాయి. మోడులా ఏ ఉనికి – అస్తిత్వం లేకుండా వారి జీవితాలు గడిచిపోవల్సిందే, అలాంటి జీవితాల్లో నాదీ ఓ జీవితం” గాఢంగా నిట్టూర్పుల మధ్య అంది సరస్వతి.
“మీరు అసాధ్యమనుకున్నది మీ జీవితంలో సాధ్యపడితే?”
“అదే జరిగితే నావంటి అదృష్టవంతురాలు ఉండదని నా ప్రగాఢ విశ్వాసం. అయితే …! అలా సాధ్యపడదనే నా నమ్మకం.”
“అది సాధ్యపడేటట్లు చేస్తాను సరస్వతీ! నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను సరస్వతీ! జీవితాంతం ఒకరి అండలో మరొకరు నిల్చిపోదాం. నేను నిన్ను ఇష్టపడుతున్నాను” ఆవేశంగా – దృఢంగా వినిపిస్తోంది సారధి కంఠస్వరం.
అతని మాటల సారాంశం అవగతమయింది సరస్వతికి. అయితే ఇతను తనని పెళ్ళి చేసుకుంటాడన్న మాట. ఇలా అనుకుంటున్న ఆమె అతని వంక విస్మయంగా చూసింది.
“నిజం సరస్వతీ, నామాట నమ్ము” అభ్యర్థిస్తున్నట్లు అన్నాడు అతను.
‘ఇతనికేఁ పిచ్చి పట్టిందా? ఇలా మాట్లాడుతున్నాడు? కన్నవారింట్లో తన కలలు సఫలం కాలేదు. కలల్లో జీవితం గడుపుతోంది తను. రేపొద్దున్న కట్టుకున్న వాడి దగ్గరేనా తన కలలు సఫలమవుతాయేమోనన్న తలంపుతో ఆశాజీవిగా జీవిస్తోంది. ఇతని జీవితం కూడా ఇంచుమించు తనలాంటి జీవితమే! బాధ్యతలూ – బాధ్యతలూ…! ఇతడ్ని కట్టుకుని తనేఁ సుఖపడగలదు?’ ఇలా సాగిపోతున్నాయి సరస్వతి ఆలోచన్లు.
“ఏఁటా ఆ ఆలోచన్లు?” అతని కంఠంలో ఆత్రుత తొంగి చూసింది.
“మీరు అనుకున్నంత సులభంగా పరిష్కారమయ్యే సమస్య కాదది మాష్టారు!”
“ఎందుచేత?”
“మీకూ బాధ్యతలున్నాయి, నాకూ బాధ్యతలున్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో మనిద్దరం దంపతులమయితే ఏఁ సుఖపడగలం?”
“అలా అనకు సరస్వతీ! బాధ్యతలు ఎల్లకాలం అలాగే ఉండిపోవు, సుమతికి పెళ్లయిపోతుంది, మా తమ్ముడి చదువు అయిపోతుంది. ఇక నా బాధ్యతలు సగం తీరినట్టే..”
“మీ బాధ్యతలు తీరిపోతే నా బాధ్యతలు తీరినట్టేనా?”
“అదే చెప్తున్నాను. నా బాధ్యతలు తీరిపోతే నీ బాధ్యతల్ని నా బాధ్యతలుగా – కర్తవ్యంగా భావిస్తాను. నన్ను నమ్ము సరస్వతీ! ప్రామిస్ కూడా చేస్తున్నాను” నిజాయితీగా చెప్తున్న అతని మాటల్లో దృఢత్వం ప్రతిధ్వనిస్తోంది.
“మీ మాటల్లో ఉన్న ధృడత్వాన్ని నిజాయితీని గుర్తించాను కాని మనం అనుకున్నంత సులువైనవి కావు మన ఆలోచన్లు. మొదట ఇలాగే మాట్లాడుతారు, ప్రామిస్ చేస్తారు, అయితే పెళ్ళి అయిన తరువాత మీ ప్రవర్తనలో మార్పు రావచ్చు, మీ ఆలోచన్లలో మార్పు రావచ్చు. అప్పుడు మీకు అనిపిస్తుంది, నాకు ఒకదాని తరువాత ఒకటి ఎప్పుడూ బాధ్యతలేనా? అని మీకు ఒక్కొక్క సారి అనిపించవచ్చు. మా వాళ్ల బాధ్యతలు తీరిపోతే రేపొద్దున్న మనకి పిల్లలు పుడతారు. పుట్టిన పిల్లల బాధ్యత నెరవేర్చవల్సి వస్తుంది. ఈ బాధ్యతలతో మీ జీవితంలోనే కాకుండా నా జీవితంలోనూ విసుగు జనించి శాంతి సౌఖ్యాలు కరువవచ్చు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటే మనిద్దరం దంపతుల మవడం అంత మంచిది కాదేమో, అలా అవకుండా ఉంటేనే మంచిదనిపిస్తోంది.”
“ఈ బరువు బాధ్యతలకి తలవొంచి పిరికిగా పారిపోదామన్న ఆలోచన ఉన్నంత వరకూ అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. వాటిచెంత మనం భానిసలం అవకుండా వాటిని మన గులాములుగా చేసుకోవాలి” సారధి కంఠం స్థిరంగా పలికింది.
“లాభం లేదు మాష్టారూ! మనిద్దరి జీవితాలూ ఉత్తరదృవం-దక్షణదృవం, మీ భావాలు-అభిరుచులు వేరు. నా భావాలూ-అభిరుచులు వేరు. మనిద్దరి మనోభావాలూ-అభిరుచులు-ఆలోచన్లు ఎప్పుడూ కల్సుకోని, కల్సుకోడానికి వీలు సాధ్యపడని సమాంతర రేఖలు. నా మనస్సు భావాలు నిలకడ లేనివి. చంచలమయినవి. ఈ రోజు మీరు నా దృష్టిలో ఉన్నతులుగా – ఉత్తములుగా అగుపడచ్చు. మీకన్నా ఉన్నతుడు అగుపించిన నాడు నా మనస్సు చలించవచ్చు. అది నా బలహీనత అనుకోండి. నా చపల చిత్తమనుకోండి. ఏది ఎలా అనుకున్నా అదే నా స్వభావం.
నేను ఆశాజీవిని. నాకు కావల్సిన దల్లా సమస్యలు లేని ముఖ్యమైన జీవితం. ఆ జీవితం కోసం ఎంత విషమ పరిస్థితి నయినా ఎదుర్కోడానికి సిద్దంగా ఉంటాను” అంది.
ఆమె మాటలకి ఆలోచన్లలో పడ్డాడు సారధి.
ఇంత చంచల స్వభావురాలితో తాను జీవితం గడపగలడా? ఆమె భావాలూ – తన భావాలూ ఆమె చెప్పినట్టు సమాంతర రేఖలు. ఎన్నడూ కలవ్వు. పొంతనే ఉండదు. నిక్కచ్చిగా కుండ బద్దలు కొడ్తున్నట్టు చెప్తోంది సరస్వతి. ఆమెనే పెళ్ళి చేసుకొని జీవితం అశాంతిమయం చేసుకునే కన్నా ఇప్పుడున్నట్లే పరిచయస్తులుగా మిగిలిపోతే మంచిదేమో! అయితే ఆమె అందానికి తాను దాసుడయ్యాడు. ఆమె అందం దగ్గర తను తలవొంచాడు. ఆమెను చూసిన మొదటిమారే ఈ అమ్మాయి తన భార్య అయితే ఎంత బాగుండునూ? అనే తలంపు మనస్సులో కలిగింది. పెళ్ళి అయిన తరువాత తను ఆమె ఆలోచన్లని-భావాల్ని తను మార్చలేడా? ఆమెలో మార్పు తేలేడా? ఇలా ఆలోచిస్తున్నాడు సారధి..
“ఏఁటి ఆలోచిస్తున్నారు మాష్టారు! ఇలాంటి ఆడదాన్ని భార్యగా పొందడం గొప్ప న్యూసెన్సు, తలనొప్పి వ్యవహారం అని భావిస్తున్నారు కదూ! మీరే కాదు -నా భావాలు విన్న ప్రతీ మగవాడు ఇలాగే ఆలోచిస్తాడు. నాకు తెలుసు అయితే ఇక్కడ తీరని కోరికలు అక్కడ తీర్చుకోవాలని అనుకోవడం అనుచితమా?”
“మీ ఆలోచన్లు సబబే! నేను మీ గురించి చెడుగా – మరో విధంగా ఆలోచించడం లేదు. అయితే ఒక విధంగా మీ కోరికలు నెరవేరనందుకు జాలిపడుచున్నాను.”
“అందుకే మీతో నాకు సరిపడదు అని నిక్కచ్చిగా చెప్తున్నాను. తెల్లవారితే నిత్యజీవితంలో అన్నీ లోటే! ఇలాంటి జీవితంతో విసిగిపోయాను. నా మాటలు మీకు కఠోరంగా ఉండచ్చు. మీకు బాధించవచ్చు. కాని ఇది పచ్చినిజం. ఆశ-నిరాశ మిశ్రితమైన ఈ జీవితంలో ఆశను పెంపొందించుకుని నిరాశను పారద్రోలాలని నా తపన. ఏనాడో పాపం చేసి ఉంటాను. కాబట్టే ఈ లేమిలో జీవితం సాగిస్తున్నాను మాష్టారు! నామీద జాలి పడేవాళ్ళని నేను సహించలేను. నన్ను నా భావాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి నాకు.”
“మీ జీవితానికి ఎటువంటి లోటూ రానీయను. జీవితంలో మీరుకన్న కలలు నెరవేరినట్ల సాధ్యమైనంత వరకూ ప్రయత్నిస్తాను. అన్ని విధాలా తృప్తికరమైన జీవితం అందిస్తాను. అసంతృప్తిని తొలిగించి-నిరాశను దూరం చేసి నవజీవితాన్ని మీకు అందిస్తాను” ఇలా అంటూ చటుక్కున ఆమె చేతిని తన చేతిలోకి చనువుగా తీసుకుని దృఢంగా అన్నాడతను.
నిర్మలమైన అతని ముఖ మండలం వేపు ఓమారు చూసిందామె. అతని కళ్ళల్లో కదలాడుతున్న నిశ్చలమైన, దృడమైన నిర్ణయాన్ని తెలియజేసే భావాలు కదలాడాయి. నాలుగు కళ్ళు కలుసుకున్నాయి, ఆ కళ్ళు సంబాషించుకున్నాయి. ఆమె సున్నితంగా చేయి విడిపించుకుంది.
“ఒక్క షరతు మాష్టారు!”
“ఏంటదిఁ?”
“మన వైవాహిక జీవితంలో నేనాశించిన తృప్తి-సుఖం కనిపించయపోయినా, నేను కన్న కలలు నెరవేరకపోయినా, నేను తట్టుకోలేను. వాటిని వెతుక్కుంటూ మీ జీవితం నుండి తప్పుకోడానికి ప్రయత్నిస్తాను. ఏ స్త్రీ అలా చేయదు కాని నా స్వభావమే వేరు. సహనగుణం నాలో లేస మాత్రం లేదు.”
“అటువంటి పరిస్థితులు రానీయను సరస్వతీ!” సారధి అన్నాడు. అమె ఆలోచనలో పడింది అతని మాటల్లో నిజాయితీ ఆమెకి నచ్చింది. అతడ్ని పెళ్ళి చేసుకోడానికి ఎంతమందో కన్నెపిల్లలు క్యూలో నిలబడ్డారు. అయితే తన మీద ఉన్న ప్రేమను అతడ్ని అలా మాట్లాడిస్తోంది.
“ఏంటి ఆలోచిస్తున్నారు?”
“అబ్బే! ఏంలేదు నాకు ఆలోచించు కోడానికి అవకాశం ఇయ్యండి” నేల మీద చూపులు నిల్పి అంది సరస్వతి. ఆమెలో వస్తున్న మార్పుకి తృప్తిగా ఊపిరి వదిలాడు సారధి.
“అలాగే బాగా ఆలోచించుకుని నిర్ణయం తెలియజేయండి. ఇది మనిద్దరి జీవిత సమస్య. తొందర పనికి రాదు. దాన్లో బలవంతం అంతకన్నాలేదు.”
“అలాగే!”
ఉతికిన బట్టలు జాడించి హేంగర్సుకి తగిలించి ఎండబెడున్నాడు. అతను చేస్తున్న పనిని నిశితంగా పరిశీలిస్తోంది ఆమె.
పచ్చని ఎండ వసుధనంతా పరుచుకుని ఉంది. అతను ప్రేమిస్తున్నట్టుగా తను అతడ్ని ప్రేమించగలదా? ఒక వేళ ప్రేమిస్తే అతని చేతిలో ఉన్న ఆ బట్టలు తీసుకుని ఆరబెట్టి అతనికి సహాయ పడలేక పోయింది. ఇక పైనేనా ప్రేమించడం నేర్చుకోలేకపోయినా ప్రేమిస్తున్నట్లు నటించడం నేర్చుకోవాలి. ఇలా ఆలోచిస్తోంది సరస్వతి..
‘తను చేస్తున్న పన్లు అలా చూస్తోందే కాని తనకి సహాయపడడానికి ముందుకు రాలేదు. ఈమెను కట్టుకుని తనేం సుఖపడగలడు?’ అని అనుకున్న అతను తిరిగి ‘తన దగ్గర అంత చనువు లేదు కదా! ఒక్కసారిగా సహాయపడ లేదు’ అని తన మనస్సుకు సర్దిచెప్పుకున్నాడు సారధి.
5
సారధి-సరస్వతుల వివాహం అతి నిరాడంబరంగా జరగడం సరస్వతికి ఇష్టం లేదు. ఆకాశమంత పందిరి, భూమంత కళ్యాణ మండపం, విశాలమైన పందిరి వేసి వైభవోపేతంగా పెళ్ళి జరగకపోయినా వేడుకగా పెళ్ళి జరిగితే బాగుండును అని అనుకుంది సరస్వతి. అయితే పరిస్థితుల్లో రాజీపడి తలవొంచాలి అని తన మనస్సుకి నచ్చజెప్పుకుంది.
సరస్వతిని శాయశక్తులా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు సారధి.
సారధి ఇలా భార్యను అపురూపంగా చూసుకోవడం అతని తల్లిదండ్రులకి ఇష్టం లేదు! వాళ్ళకి అలా ఉంటే; “మా సరస్వతి అదృష్టవంతురాలు. ఆమెను కళ్ళల్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకునే భర్త దొరికాడు” అని మురిసిపోతున్నారు సరస్వతి తల్లిదండ్రులు.
సరస్వతి పరిస్థితి మాత్రం సెగలో నుండి పొగలోకి వచ్చినట్లయింది. పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు-సమస్యలూ ఒక విధంగా ఉంటే తను కాలు మోపిన మెట్టినింట్లో ఆ సమస్యలు మరో రూపంలో ప్రత్యక్షమయ్యాయి.
బాధ్యతలు……. బాధ్యతలూ, సమస్యలూ…….. సమస్యలూ. ఈ బాధ్యతల నుండి సమస్యల నుండి బయటపడ్డానికి పరిష్కార మార్గం లేదా? ఇలా ఆలోచించేది సరస్వతి. అక్కడ లేని సుఖం ఇక్కడ దొరకుతుందని ప్రయత్నం చేసిన తన ఆశలు ఇలా అణగారి పోవడమేనా? వీల్లేదు. తను ఇటువంటి జీవితం ఇక పై గడపలేదు. పరిస్థితుల్ని ఎదురించి నిలబడాలి, పరిస్థితులపై తిరుగుబాటు చేయాలి. విప్లవ ధోరణిలో ఆలోచించేది సరస్వతి.
ఇటు తన వారికి – అటు అత్తవారికి తన సంపాదన ఖర్చు చేయడం వలన సరస్వతి కోరికలు తీర్చలేకపోయాడు సారధి. తన వారికే కదా సాయం చేస్తున్నాడు భర్త తను సర్దుకుపోవాలి అనుకోని సరస్వతి అసంతృప్తికరమైన జీవితానికి విసిగిపోయి దూరంగా స్వేచ్ఛని-సుఖాన్ని వెతుక్కుంటూ పారిపోవాలని అనుకునేది.
ఒక్కొక్క పర్యాయం ఇవతల కన్నవారు ఇది కావాలి – అది కావాలి అని అడిగేవారు. సారధి తన నిస్సహాయతను తెలియజేస్తే “అవును రెండు కుటుంబాల భారం వహించాలి. స్స్….! నీవేం చేయగలవులే!” అనే వారు. కుటుంబ సభ్యులు వ్యంగ్యంగా అంటున్న వారి మాటలు సారధిని మానసిక క్షోభకి గురిచేసేవి.
పెళ్ళికి ముందర సరస్వతి చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చి కలవరపడేవాడు సారధి. అలా జరక్కూడదు….. అలా జరక్కూడదు. ఆమెను తనకి సాధ్యమైనంత వరకు సుఖంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు అని అనుకునేవాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆమెకి తన అవసరాలు-సుఖాలు-సరదాల వేపు దృష్టి మరల్చకుండా ఆమె కోరికలు తీర్చాలని అనుకునేవాడు.
“ఈ గానుగెద్దు లాంటి జీవితం ఎందుకు?” అని ఎదురు ప్రశ్నవేసుకునేది సరస్వతి. ఒక్కొక్కసారి సుమతి పెళ్ళికి లోను తీసుకోవల్సివచ్చింది సారధికి. తమ్ముడు చదువు పూర్తయి ఓ చిరు ఉద్యోగంలో జాయనయి డబ్బు సంపాదించడం ఆరంభించాక అమ్మయ్య! అని అనుకున్నాడు.
అన్నయ్య కుటుంబానికి సహాయపడ్డాడన్న ఆశ సారధికి ఏనాడూ లేదు. తమ్ముడేనా కుటుంబానికి సహాయ పడితే అదే చాలు అని అనుకున్నాడు.
సరస్వతిలో పేరుకు పోతున్న అసంతృప్తిని తొలిగించే పరిష్కారమార్గం ఆలోచిస్తోంది సారధి మెదడు.
***
“సరూ! నేనేం తెచ్చానో చెప్పుకో!” చిన్న పిల్లాడిలా – లాలనగా, మురిపెంగా అన్నాడు.
“అబ్బో! ఈయనికీ సరసమంటే తెలుసే, ఏం తెస్తారు? మీ చేతిలో ఏముంటుంది కనుక? స్కూల్లో బోర్డు మీద వ్రాయగా మిగిలిన చిన్నచిన్న సుద్దముక్కల్ని పరధ్యానంగా చేత్తో పట్టుకుని వచ్చేసి ఉంటారు. అంత కన్నా ఏం ఉంటుంది మీ దగ్గర” ఆమె మాటల్లో వ్యంగ్యం అతనికి బాధ కలిగించింది. అయితే ఆ బాధను తనలోనే దాచుకుని-సంభాళించుకుని. తన భావాల్ని తన చింతని పైకి కనబడకుండా “అబ్బా! చెప్పమన్నానా” నవ్వుతూ గోముగా అడిగాడు.
“ఏమో బాబూ! చెప్పడానికి కూడా నాకు ఆలోచన రావడం లేదు. ఏం తెచ్చి వుంటారబ్బా!” కనుబొమ్మలు చిట్లించి పెదవుల మీద చూపుడు వేలు ఉంచుకుని ఆలోచిస్తోందామె.
“చప్పున కళ్ళు మూసుకో సరూ! నేను కళ్ళు తెరు అనే వరకూ కళ్ళు తెరవకూడదు….! తెలిసిందా!” చిలిపిగా నవ్వుతూ అన్నాడతను. అయిష్టంగానే కళ్ళు మూసుకుందామె. మెడ దగ్గర చక్కిలిగింతలు పెడ్తున్నట్లు అనిపించిందామెకి. ముడుచుకు పోతున్నట్లు ఫీలవుతూ అలాగే కళ్ళు మూసుకుని నిలబడిందామె.
“ఊ…! కళ్ళు తెరు!” అన్నాడు సారధి.
అతని కంఠంలో తృప్తిలాంటి భావం. ఆమె గమనించింది. తనమెడలో తళతళ మెరుస్తున్న పచ్చని పసిమి ఛాయతో మెరుస్తున్న బంగారు చంద్రహారం గొలుసు వేలాడుతూ అగుపించింది. దాని వైపు అయోమయంగా – ఆశ్చర్యంగా – సంతృప్తిగా చూసింది ఒక్క క్షణం.
“ఇదెక్కడిది?” కుతూహలాన్ని ఆపుకోలేక ప్రశ్నించింది. ఆమె తృప్తినే తన తృప్తిగా భావించిన సారధి కళ్ళల్లో కోటి దీపాల కాంతులు. ఆ దీపాల కాంతుల వెనుకనున్న క్రీనీడలను గమనించడానికి ఆమెకి అవకాశం ఇవ్వకుండా “దొంగతనం చేసాను” తమాషాగా అన్నాడు.
“ఊహూ…..! మీరు ఎన్నడూ అలాంటి పని చెయ్యరు. చేయలేరు. మీ స్వభావం నాకు బాగా తెల్సు” మందస్మిత వదనంతో అందామె.
“నీకు నా మీద ఏంటా నమ్మకం?”
“నాకు మీ మనస్తత్వం తెలుసు. మీ నిజాయితీ తెలుసు. అంతేకాదు ఇంకా చెప్తున్నాను వినండి. నాకు సంతృప్తి కలిగించడానికి నా సంతోషం కోసం, నా అసంతృప్తిని తొలగించడానికి అప్పు చేసి కొన్న వస్తువులా ఉంది ఈ గొలుసు” సారధి ముఖకవళికలు నిశితంగా పరికిస్తూ అంది సరస్వతి.
అతను గంభీర ముఖముద్రతో ఆలోచనలో పడ్డాడు. మొదట ఆమె మాటలు వినగానే ఒక్కక్షణం తెల్లబోయి తమాయించుకుని స్థిరంగా నిటారుగా నిలబడ్డాడు. అతని ముఖంతో మారుతున్న రంగుల్ని గమనిస్తూ నిలబడిందామె.
‘అవును, తను సరస్వతి సంతృప్తి పరచడానికి స్నేహితుడి దగ్గర అప్పుచేసి కొన్న బంగారు గొలుసు అది. ఆ అప్పు తీరే వరకూ తను తన స్వంత ఖర్చులు కొన్ని తగ్గించుకుందామనుకున్నాడు. అంతే కాని ఆమె మనస్సు అసంతృప్తికి గురిచేయడం మంచిదికాదు’ ఇలా సాగిపోతున్నాయి సారధి ఆలోచన్లు.
“ఏంటి ఆలోచిస్తున్నారు? నేను కనిపెట్టేసేనని బాధపడ్తున్నారా?”
“అబ్బే! ఏం లేదు” గంభీరంగా పలికింది అతని కంఠస్వరం, ఆమె తిరిగి మాట్లాడే లోపునే ఆ అవకాశం ఆమెకు ఇయ్యకుండా భారంగా అడుగులేస్తూ గంభీర ముఖాకృతితో అచటి నుండి కదిలిపోయాడు.
(ఇంకా ఉంది)