Site icon Sanchika

ఎండమావులు-21

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 21వ, ఆఖరి భాగం. [/box]

43

[dropcap]సి[/dropcap]నిమా నటి, అందులోనూ మహానటి రమణమ్మ కంపెనీలో ఉందంటే ఆ కంపెనీకి ఎంత డిమాండ్? వయస్సు కూడా చూడకుండా నూనూగు మీసాలున్న స్టూడెంట్సు నుండి కాటేకి కాళ్ళు జాచుకున్న ముసలాళ్ళ వరకూ; అందరికీ అందులోనూ రకరకాల మనస్తత్వం గల వాళ్ళకి రాక్షసరతంటే పడిచచ్చే వాళ్ళకి శాడిజం మనస్తత్వం గల వాళ్ళకీ; వాళ్ళకీ వీళ్ళకేంటి? అందరికీ తనకి ఇష్టం లేకపోయినా తన శరీరాన్ని అప్పగించింది సౌందర్య. సాలెగూడులో చిక్కుకున్న ఈగలా బయట పడే మార్గం అగుపించక గిజగిజలాడింది. ఆ సాలెగూడుకే అంకితమయిపోయింది ఆ మహానటి.

మరో సంవత్సరానికి ఆమె శరీరంలో జవసత్వాలు ఉడిగిపోయాయి. అందగత్తెయిన ఆ సౌందర్యే నా ఈ సౌందర్య అన్నంతగా ఆమె రూపురేఖలు మారిపోయాయి. సుఖవ్యాధులకి గురయింది ఆమె శరీరం.

అతి భయంకరమైన సిఫిలిన్ వ్యాధికి గురయింది. భరింపరానంత బాధతో గిలగిల్లాడుతోంది. విటులు దగ్గర డబ్బులు గుంజి సౌందర్య దగ్గరకి వాళ్ళని పంపిన రమణమ్మ ఇప్పుడు సౌందర్యను ఇంటి నుండి గెంటి వేయడానికి మార్గం ఆలోచిస్తోంది.

సౌందర్య రమణమ్మను బ్రతిమాలింది. కాళ్ళు పట్టుకుంది. తను ఎక్కువ రోజులు బ్రతకనని, ఉన్నన్నాళ్ళేనా తనని అక్కడే ఉండనీయని ఎన్నో విధాల ప్రాధేయపడింది. కాని రమణమ్మ ఆమె మాట వినలేదు. “పైసా సంపాదన లేని ఈ రోగిష్టిది మనకెందుకు? తిండి దండుగ. దీన్ని వీధిలోకి గెంటేయండి” అని రౌడీలకి ఆజ్ఞాపించింది. వారు సౌందర్యను బయటకు గెంటేసేరు.

ఒకానొక్క సమయంలో కొన్ని కోట్లు లక్షలకి అధికారిణి ఆమె. మహానటి. ఈనాడు తిండిలేక అలమటిస్తూ రోగాలతో శరీరం కుళ్ళిపోయి వాడివడిలి పోయిన గడ్డిపువ్వులా విసరివేయబడింది సౌందర్య.

బయటకు ఈడ్చివేయబడిన సౌందర్య బాధగా మూల్గింది. మరో పర్యాయం సారధి ఆమె మదిలో మెదిలాడు. చేతులెత్తి అతడిని తల్చుకుంటూ నమస్కరించింది. తను చేసిన పాపపు పనులకి తనకి ఈ శిక్ష తగినదే అని గొణక్కుంది. ఈ పరిస్థితిలో తనని ఆదరించేవారు ఒక్క తన రక్తం పంచుకునే తన కొడుకు తప్ప మరెవరూ లేరనుకుంది. అందుకే సుధాకర్ దగ్గరికి వచ్చింది.

***

సరస్వతి జీవిత కథను సుధాకర్ చదవడం పూర్తి చేసాడు. సంధ్య కూడా చదివింది. ఇద్దరి కళ్ళూ చమర్చాయి. ఇద్దరిలో అంతు లేని భావ మనోవికారాలైన భక్తి, వెనువెంటనే శ్రద్ధ కలిగాయి. భక్తి ఎక్కడుంటుందో అక్కడ శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ వలన ఓ ప్రాణిని ఆదుకోవాలన్న భావన కలుగుతుంది. అసహ్య భావన పటాపంచలవుతుంది. క్షమించే తత్వం కలుగుతుంది.

సరస్వతి తనని నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లి. ఆమె ఎలాంటిదవచ్చు, ఎంత బలహీన మనస్కురాలవచ్చు, ఎంత చపల చిత్తురాలవచ్చు. ఆమె తన కన్న తల్లి. ఆమె బలహీనతకు అర్థం చేసుకుని జాలి చూపించాలేని అసహ్యించుకోడానికి ఆస్కారం ఈయకూడదు.

కొవ్వొత్తి తను మండిపోతూ బాధను అనుభవిస్తూ తన చుట్టూ ఉన్న పరిసరాలకి వెలుతురు ఇస్తుంది. అలాగే సరస్వతి కూడా తన సంపాదన పరోపకారానికి ఖర్చు పెట్టింది. ఇలా ఆలోచిస్తున్న సుధాకర్ సరస్వతి చివరిలో తన గురించి వ్రాసుకున్న అభిప్రాయంపై దృష్టినిలిపాడు.

‘చంచలమైనదాన్ని, చపలచిత్తురాల్ని. దొరికిన దాన్తో తృప్తి పడకుండా దూరపు కొండల నునుపు అన్న భ్రమతో జీవన బాటలో పరుగుతీసి ఎండమావుల్లో విహరించి యథార్థ స్థితిని తెలుసుకుని నిరాశ నిస్పృహ చెంది రెక్కలు విరిగిన పక్షిలా నేలపై పడిపోయి గిల గిల తన్నుకుంటున్న అభాగ్యురాల్ని నేను. నేను చేసిన ఈ పాపపు పన్లకి, నా వాళ్ళను క్షోభకి గురిచేసినందుకు ఆ భగవంతుడు ఈ జన్మలోనే ఈ లోకంలోనే నన్ను శిక్షకి గురి చేశాడు. అది చాలు ఈ జీవితానికి. నాలా ఎవ్వరూ ఎండమావుల్లో వివారించవద్దు. భ్రమలో బ్రతకవద్దు అని కోరుతున్నాను’.

సుధాకర్‌లో అంతవరకూ నిగ్రహించుకున్న దుఃఖం వానాకాలం వరదలా కొట్టుకొచ్చింది. ఆత్మీయత అనే అలౌకిక భావంతో ఉద్విగ్నుడవుతున్నాడు. గుండెల్లో బాధ. “అమ్మా” అంటూ ఏడుస్తూ ఆమె గదిలోకి వెళ్ళి సరస్వతి రెండు పాదాల మీద తల ఆన్చి ఏడుస్తున్నాడు.

“నిన్ను నేను అసహించుకోనమ్మా, నీ బలహీనతలు – భావాలు అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాను. నీ జీవితంలో పతనం అవడానికి ఆ బలహీనతలు ఎలా దారితీసాయో అని ఆలోచిస్తూ జాలిపడున్నాను.  విచారిస్తున్నాను. నేను నీ కొడుకునని చెప్పుకోడానికి గర్వపడ్తానే కాని అవమానంగా భావించను. పశ్చాత్తాపాగ్నిలో దహించుకుపోతున్న నీవు శుద్ధిపర్చిన బంగారంలా, పాప పంకిలమైన నీ జీవితం పవిత్రత సంతరించుకుంది. నీవు చేసిన తప్పును ఒప్పుకున్న నీవు చాలా గొప్పదానివి” సన్నగా రోదిస్తూ సరస్వతి తల పట్టుకున్నాడు సుధాకర్.

సున్నితమైన రెండు హస్తాలు అతని భుజంపై పడ్డాయి. తల పైకెత్తి చూశాడు. ఎదురుగా సంధ్య. ఆమె కళ్ళల్లో కూడా కన్నీరు.

“సుధాకర్ ఆవేశపడద్దు, బాధపడద్దు” అంది సంధ్య.

“సంధ్యా!”

“ఊఁ!!!”

“ఈమె నా తల్లి సంధ్యా! నాకు జన్మనిచ్చిన తల్లి. పతిత – కులట, చరిత్ర హీనురాలయినా ఈమెను నా తల్లిగా చెప్పుకోడంలో సిగ్గుపడను. ఈమె రక్తం నాలో ప్రవహిస్తోంది. ఆమె ప్రేగు తెంచుకుని పుట్టిన బిడ్డను” ఆవేశంగా అంటున్నాడు ఆ కొడుకు భావోద్వేగంతో.

సరస్వతి మూతి వంకరయింది. నోటి వెంబడి మాటలు రావడం లేదు, కన్నీరు కార్చడం తప్ప నోరు పెగల్చటం లేదు. మాట్లాడాలన్న తాపత్రయం, మాట్లాడలేకపోతున్నాను అనే ఆవేదన వల్ల వచ్చిన కన్నీరు కాలువలు కట్టి ఆమె చెంపల్ని తడుపుతున్నాయి. శరీరం అంతా పాలిపోయింది.

సుభద్రలో కూడా పశ్చాత్తాపం, బాధ కలిగాయి.

“సరస్వతీ! నన్ను క్షమించవూ? ఆత్మ విమర్శ చేసుకున్న తరువాత నా తప్పేమిటో నాకు తెల్సింది. స్నేహితురాలినై ఉండి నీ యడల అన్యాయంగా ప్రవర్తించాను. నిన్ను నానా మాటలు అన్నాను. నీవు నన్ను క్షమిస్తే కాని నాకు శాంతి లేదు. లేకపోతే నిన్ను పెట్టిన బాధలు మాకు శాపమవుతాయి” సరస్వతి రెండు చేతులూ పట్టుకుని సుభద్ర బాధ – పశ్చాత్తాపం వెల్లడిచేస్తూ అంది. ఆమె వెనుక సుందరం ఉన్నాడు. అతని కళ్ళల్లో కూడా బాధ గూడు కట్టుకుంది.

సరస్వతి సుభద్రను క్షమించిందన్న సూచనగా సుభద్ర రెండు చేతులూ పట్టుకుని కన్నీరు కారుస్తూ ఉండిపోయింది.

తన ప్రవర్తనకి సుధాకర్ దగ్గర సుభద్ర పశ్చాత్తాపం ప్రకటించింది. ఎవరు ఎన్ని విధాలా పశ్చాత్తాప పడినా లాభమేంటి? జరగవల్సింది ఎలాగూ జరిగిపోయింది.

తన తల్లి ఇక బ్రతకదు, ఆమె జీవిత కాలం రోజుల్లోనే ఉంది అని డాక్టరయిన సుధాకర్‌కి తెల్సింది. దుఃఖం వరదలా పొంగుకొస్తూ ఉంటే బలవంతాన్న ఆపుకుంటున్నాడు.

చివరిసారిగా ఆమె మనస్సులో ఉన్న కోరిక నెరవేర్చడం కొడుకుగా తన కర్తవ్యం. ఆమె చివరి కోరిక అదే తన తండ్రిని చూడాలని, క్షమాపణ కోరాలని ఊహించాడు.

బ్రతికి ఉన్న రోజుల్లో మనిషి విలువ తెలియక మనిషి చనిపోయిన తరువాత ఇంత మంచివాడు అంత మంచివాడు అని అంటాము. ఇది లోక సహజం. సరస్వతి విషయంలో కూడా అలాగే జరిగింది. బ్రతికున్న సమయంలో ఆమెను అసహ్యించుకున్న వాళ్ళు చీదరించుకున్న వాళ్ళు ఆమె అంతిమ సమయంలో ఆమె పరోపకారి బుద్ధిని చేసిన సహాయాన్ని తల్చుకుని సానుభూతి చూపిస్తున్నారు.

సరస్వతి కళ్ళలో నుండి కన్నీరు అలా ధారలు కట్టి ప్రవహిస్తూనే ఉంది. ఏదో చెప్పాలని ఆరాటం, చెప్పలేకపోతున్నాననే ఆవేదన. ఆమె కన్నీరుని బట్టి గ్రహించగలుగుతున్నారు ఆ కుటుంబ సభ్యులు.

కొడుకుని దగ్గరికి రమ్మనమని చేతులు జాచింది సరస్వతి. మోకాళ్ళ వద్ద కూర్చుని ఆమె రెండు చేతులూ పట్టుకున్నాడు సుధాకర్. రెండు చేతుల్తో కొడుకుని చుట్టేసింది. ఏదో చెప్పాలని అదే ఆరాటం. ఆమె ఆరాటం అర్ధం చేసుకుంటున్నాడు ఆ కొడుకు.

తల్లి ఆరాటానికి కారణం తండ్రి, తండ్రిని చూడాలన్న ఆమె చివరి కోరిక, వెంటనే తండ్రిని , తల్లిని తెప్పించి కొడుకుగా ఆమె చివరి కోరిక తీర్చడం తన బాధ్యత అనుకున్నాడు సుధాకర్.

వెంటనే తన తల్లి సరస్వతి పరిస్థితి వివరిస్తూ తండ్రికి బయలుదేరి రమ్మనమని ఫోనుచేసాడు. దానికి ఫలితమే సారధి సుమిత్రను తీసుకుని బయలుదేరాడు రైల్వే స్టేషన్‌కి.

“నన్ను క్షమించండి, చిన్న వాడివయినా నన్ను క్షమించు” సుభద్ర అంది సుధాకర్‌తో.

“మానవ స్వభావమే అంత. మొదట అజ్ఞానంతో తొందర మాటలంటాము. ఆ తరువాత బాధపడ్తాము. అయినా ఇప్పుడు ఈ క్షమాపణలకన్నా ముఖ్యమైనది ఉంది. రోజుల్లో ఉన్న అమ్మ కోరిక నెరవేర్చాలి. ఇప్పుడు సమయం చాలా విలువైనది. ఒకర్ని మరొకరు క్షమించుకుంటూ కాలం గడిపేస్తే క్రొవ్వొత్తిలా కాలం కరిగిపోతుంది. అమ్మా, నాన్నగార్ని తీసుకు రావడానికి నేను స్టేషనుకి వెళ్తున్నాను. నేను వచ్చేవరకూ ఆమెను కనిపెట్టుకుని ఉండండి” అన్నాడు సుధాకర్ సంధ్యతోనూ సుభద్రతోనూ.

44

తల్లిదండ్రుల్ని రైల్వే స్టేషన్‌కి వెళ్ళి రిసీవు చేసుకున్నాడు సుధాకర్. పైకి గంభీరంగా అగుపడ్తున్నప్పటికి మనస్సులో బాధ గూడు కట్టుకుంది. ముఖంపై విషాదం ఆవేదన ఆరాటం భావాలు.

ఏ మాత్రం ఓదార్పు మాటలు విన్నా ఆ ఆవేదన కన్నీటి రూపంలో పైకుబుకుతుంది అన్నట్లు ఉంది అతని వాలకం.

“సరస్వతికి ఎలా ఉంది?” సారధి అడిగాడు కొడుకుని.

పరిస్థితి వివరించాడు సుధాకర్, విన్న సారధి ముఖం పాలిపోయింది. గుండెల్లో సన్నటి బాధ, ఇప్పటికి సుమిత్రలో ఏ మార్పులేదు. సరస్వతి పేరు చెప్తేనే అసహ్యించుకుంటోంది. అలాంటి ఛండాలురాలు – భ్రష్టురాల్ని తను క్షమించలేదు. అదే సుమిత్ర భావన.

అటువంటి పరిస్థితుల్లో ఏఁ చేయాలి? ఈ పరిస్థితి ఎలా చక్కదిద్దాలో అర్ధం కావటం లేదు సుధాకర్‌కి.

మోకాళ్ళలో బుర్ర పెట్టుకుని ఆవేదనగా కళ్ళు మూసుకున్నాడు సారధి. కొంత సేపయిన తరువాత తల పైకెత్తి కొడుకు వేపు చూసాడాయన. తండ్రి కళ్ళలో గూడు కట్టుకున్న అవేదన అర్థం చేసుకున్నాడు. ఆ కొడుకు, తల్లిమీద తండ్రికి ఆవేదన తప్ప అసహ్యం లేదు అనుకున్నాడు.

“నాన్నగారూ!”

ఏంటన్నట్లు ఆ తండ్రి కొడుకు వేపు చూశాడు. తన మనస్సులో మాట చెబ్దామనుకున్నాడు. ‘నా తల్లి పతిత అవచ్చు. కులత అంతకన్నా అవచ్చు, చరిత్ర హీనురాలు – చపల చిత్తరాలు అవచ్చు. అయితే ఆమెను అసహ్యించుకునే బదులు ఆమె బలహీనతను అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయ్యండి, ఆమె మీ భార్య ఒకప్పుడు. మీ శరీరంలో సగభాం, అవసాన దశలో ఉన్న ఆమె మీద జాలి చూపించి ఆమెను ఆదరించి క్షమించిన నాడు, ఆమె బలహీనతల్ని అర్థం చేసుకున్ననాడు సమాజంలో మన విలువలు పెరుగుతాయి’ అని తండ్రితో తను అందామనుకున్నాడు. అయితే ఆ మాటలు పైకి పెగల్లేదు. సారధి తన చూపులోనే కొడుకు మనస్థితిని తెలుసుకున్నాడు.

“సరస్వతి గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియదు. కొన్నాళ్ళు ఆమెతో కలిసి మెలిసి కాపురం చేశాను. ఇంకో విషయంలో తెలుసా? మీ అమ్మను నేను ఇష్టపడే పెళ్ళి చేసుకున్నాను. ఆమె ప్రతీ కోరికా తీర్చడానికే ప్రయత్నించేను. నేను ఎంత కష్టపడినా సరస్వతి సుఖంగా ఉండాలని అనుకునే వాడిని. ఆచరణలో పెట్టేవాడిని కూడా, అయితే ఆమె చంచల స్వభావం దగ్గర తలవొంచవల్సి వచ్చింది. పెళ్ళికి ముందరే ఆమె తన స్వభావం చెప్పింది.

అలా చెప్పిన ఆమె నిజాయితీకి మెచ్చుకున్నాను. జీవితంలో ఎటువంటి అసంతృప్తి రానీయననని మాట ఇచ్చి మరీ ఆమెను పెళ్ళి చేసుకున్నాను. అయితే విధి చేతిలో చిత్తుగా ఓడిపోయాను. ఆ విధే మమ్మల్ని విడదీసింది.

సుధా! ఒక్కమాట, నీవు నా కళ్ళెదుట ఉంటూ ఉంటే సరస్వతే జ్ఞప్తికి వచ్చేది. మరిచిపోయినట్లు నటించేవాడినే కాని నీ తల్లిని నేను మరిచిపోలేకపోయాను. మీ అమ్మ జ్ఞాపకాలు నా మనస్సు అడుగు పొరల్లో అలా అజ్ఞాతంగా ఉండిపోయాయి. ఆ విధి ఇప్పుడు కూడా మమ్మల్ని ఆటబొమ్మలుగా చేసి ఆడిస్తోంది.”

మంచం మీద రోగంతో బాధపడూ పడి ఉన్న సరస్వతిని చూడగానే సారధి ఉద్విగ్నతకు లోనయ్యాడు. సుమిత్ర అసహ్యంగా ముఖం ప్రక్కకి తిప్పుకుంది.

ఈ స్థితిలో నున్న తనని ఇప్పుడు కూడా సుమిత్ర క్షమించలేకపోతోంది. తను అనుకున్నది వేరు అయినది వేరుగా ఉంది. సుమిత్ర తనని క్షమిస్తే తృప్తిగా కన్ను ముద్దామనుకుంది. అయినా తను చేసింది ఇలాంటి అలాంటి తప్పా? చాలా పెద్ద తప్పు చేసింది తను. సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసింది. మాతృత్వపు విలువల్ని మంటగల్పింది. మమకారాన్ని – వాత్సల్యాన్ని చంపుకుని పసివాడ్ని వదిలి వచ్చేసింది. అలాంటి తనని సుమిత్ర తనని క్షమించగలదా? క్షమించలేదు. అనుకుంటోంది సరస్వతి ఆవేదనగా.

“సరస్వతీ! నీవు ఏవేవో భ్రమలో ఏవో పొందాలన్న కాంక్షతో పరుగులు తీసావు. అయితే నీవు పరుగులు పెట్టిన ప్రదేశం ఎండమావి అని గుర్తించలేకపోయావు, సుఖాల్ని వెతుక్కుంటూ పోయిన నీవు నరకయాతన అనుభవించావు. హీనాతి హీనమైన జీవితం గడిపావు. పతనమైన నీ జీవితం మలినమయిపోయిన నీ శరీరం, ఇవన్నీ చూడ్డానికేనా మేము బ్రతికున్నాం. మాకు మరింత క్షోభకలుగుతోంది ఇప్పుడు.

ఏదీ కూడా మన చేతుల్లో లేదు. ఇలా జరగాలని వ్రాసి పెట్టి ఉన్నప్పుడు ఎవ్వరూ దాన్ని తప్పించలేరు” సరస్వతిని చూసిన సారధి ఆవేధనగా అనుకుంటున్నాడు.

అతని వదనంలో ఆవేదన తను చూడగలుగుతోంది. ఆ కళ్ళలోనే ఆవేదనంతా గూడుకట్టుకుని ఉంది. ‘తను ఆ మంచి మనిషికి ఎంత క్షోభ కలగచేసింది. ఎంత మనస్తాపానికి గురి చేసింది. తన చంచల స్వభావమే తన పతనానికి దారి తీసింది. భ్రమలో బ్రతికింది.. భ్రమలోనే జీవితం గడిపింది. క్షణికమైన సుఖాల కోసం పరుగులు పెట్టింది. విధి చేతిలోని చిత్తుగా ఓడిపోయింది. తను ఎన్ని తప్పులు చేసినా తన తప్పులు క్షమించినట్టుగా సారధి ముఖం చూస్తూ ఉంటేనే తెలుస్తోంది. ఇటువంటి భర్తని – అతని సహచర్యని పొందిన సుమిత్ర ఎంత అదృష్టవంతురాలు’ సరస్వతి ఆలోచిస్తోంది.

‘ఇంటికి పెద్ద కూతురు సరస్వతి తండ్రి రోగంతో మంచంపై పడిఉంటే ఆ ఇంటిని సరస్వతి చక్కదిద్దుతూ ఇంటి బాధ్యతలన్నీ తనపై వేసుకుంటే తండ్రి ఎంత సంతోషించేవాడు. తాము జీవితంలో ఓ స్థాయికి రావడానికి కారకురాలు కూడా సరస్వతియే. ఈ విషయంలో సరస్వతిని మెచ్చుకోవాల్సిందే అయితే అన్ని మంచి గుణాలున్న ఆమెలో ఆ ఒక్క దుర్గుణం ఆ మంచి గుణాల్ని మసకబారిస్తోంది.

ఎన్ని మంచి గుణాలుంటే లాభమేంటి? ఆ చంచల స్వభావం ఆమె పతనానికి దారితీసింది. మహానటిగా పెరిగి చివరకు నికృష్టంగా పతనమై, చివరకి నికృష్ణ చావు చస్తోంది. అటువంటి దాన్ని చూసి అసహ్యించుకోవాలో జాలి పడాలో తెలియటం లేదు. ఇదంతా స్వయంకృతాపరాధమనిపిస్తోంది.

ఏది ఏమైన సరస్వతి తనకి తోబుట్టువు అంతే కాకుండా ఓ విధంగా తనకి సవతి కూడా, అలా అనుకోడానికి కూడా తన మనస్సు అంగీకరించటం లేదు. ఇలాంటి వాళ్ళ యడల జాలిపడాలని అంటారు కాని జాలిపడితే అవి నీతిని, పాపకార్యాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. అయితే మృత్యు ముఖంలో ఉన్న దానికి ఆత్మశాంతి కలగాలంటే జాలిపడినట్లు నటించాలే కాని మనస్ఫూర్తిగా జాలిపడలేదు’ ఇలా సాగిపోతున్నాయి సుమిత్ర ఆలోచన్లు.

“సరస్వతీ, సుమిత్రను గుర్తుపట్టావా?” సుభద్ర అంది సరస్వతితో. కన్నీరు కారుస్తోంది. ఆమె తన మనస్సులో ఆవేదన వెల్లడిచేస్తూ, క్రమంగా సుమిత్రలో మార్పు అగుపడ్తోంది. సరస్వతి స్థితి చూసి సుమిత్ర హృదయం దహించుకుపోతోంది. బాధతో గుండెల బరువెక్కాయి. అంతకు పూర్వం ఆమె పై తను ఏర్పర్చుకున్న హ్యేయభావం దూది పింజలా ఎగిరిపోయింది. దాని స్థానంలో జాలి – బాధ అనే భావం కలిగింది. వస్తున్న దుఃఖం ఆపుకోవడం సాధ్యం కావడం లేదు.

సరస్వతి రెండు చేతులూ పట్టుకుని ఏడుస్తోంది. ఎంతైనా రక్త సంబంధం కదా! సరస్వతి సుమిత్ర కన్నీరు తుడిచింది. సుమిత్ర సరస్వతి కన్నీరు తుడిచింది.

మరుసటి రోజున సరస్వతి ఆరోగ్యం మరింత విషమయమయింది. అంత అనారోగ్య పరిస్థితిలో కూడా ఆమె వదనంలో అసంతృప్తి భావం అగుపించటం లేదు. ఎంతో తృప్తి లాంటి భావం. అదీ ఓ నిధి దొరికినంత తృప్తిలాంటి భావం.

జీవితాంతం నడిచి నడిచి అలిసిపోయిన బాటసారికి విశ్రాంతి తీసుకునే చోటు దొరికితే ఎంత సంతృప్తి కలుగుతుందో స్వాంతన లభిస్తుందో అలాంటి అలౌకిక భావం.

తన జీవితంలో తను ఏది ఆశించిందో ఏది కావాలనుకుందో తన అంతిమ సమయంలో నెరవేరింది. ఆ కోరిక నెరవేరిందన్న ఆత్మ సంతృప్తి, తన కుటుంబ సభ్యులు తనని క్షమించారు. తన బలహీనతల్ని క్షమించారు. సారధి, సుమిత్ర, సంధ్య, సుధాకర్, సుభద్ర అందరూ తనని క్షమించారనే భావం.

ఇక తన జీవితం ఏం అయిపోయినా పరవాలేదు. అయితే ఒక్క విషయం – సమాజంలో చాలా మంది తన లాంటి వాళ్ళ బ్రతుకులు మంచిగా లేవు. ఆడదాని తప్పుని క్షమించని సమాజం మగవాడి తప్పును క్షమిస్తోంది. ఇదేం న్యాయం? ఇదేఁ వివక్షత?

ఆడది విధి లేని పరిస్థితిలో తను పయనించిన తప్పుడు మార్గాన్నే జీవన బాటగా మలుచుకుని జీవనయాత్ర సాగిస్తోంది. ఆ యాత్రలో ఎన్నో అవమానాలు – ఎన్నో అవరోధాలు, ఎన్నో అత్యాచారాలు, వ్యథలు అన్నింటిని ఎదుర్కొని అనుభవించి చివరికి ఆమె బ్రతులు వాడిపోయిన పువ్వుగా మిగిలిపోయి నేల రాలిపోతోంది. తన భావాల్ని చెప్పాలనుకుంది సరస్వతి చెప్పడానికి మాట్లాడలేకపోయింది. ఆయాసపడుతోంది. మూగ వ్యథని మనస్సు అడుగు పొరల్లో పదిలంగా దాచుకుంది.

కొడుకుని దగ్గరికి పిలిచింది. కోడల్ని కూడా పిలిచింది. కోడలి చేతిలో కొడుకు చేయి ఉంచింది. ఓమారు సారధి సుమిత్ర వేపు చూసిన ఆమె చూపులు అలా స్థిరంగా ఉండిపోయాయి. శరీరం చల్లగా తగిలింది.

కళ్ళు అలా తెరుచుకునే ఉన్నాయి. సుధాకర్‌కి, సంధ్యకి ఆమె మరి ఈ లోకంలో లేదు, తమని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయింది అని తెలియడానికి అట్టే సమయం పట్టలేదు. తన తల్లి జీవన యాత్ర ముగిసిపోయింది. సుధాకర్ తల్లి మరణం తట్టుకోలేక రోదిస్తున్నాడు. సంధ్య భర్తని ఓదారుస్తోంది. సరస్వతి కనురెప్పల్సి సంధ్య మూసేసింది. సుమిత్రా, సారధి కూడా కొడుకుని ఓదారుస్తున్నారు.

‘ఎవరు ఎన్ని విధాల ఓదార్చడానికి ప్రయత్నం చేసినా సరస్వతిని తిరిగి తీసుకురాలేరు కదా! సరస్వతి జీవితం ఎండమావి అయిపోయింది’ అనుకుంటూ నిట్టూర్పు విడిచాడు సారధి.

(సమాప్తం)

Exit mobile version