Site icon Sanchika

ఎండమావులు-6

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఆరవ భాగం. [/box]

14

[dropcap]రా[/dropcap]త్రి పదిగంటల సమయం. అసలే వెన్నెల రాత్రి. వెన్నెల వసుధనంతా పరచుకుని ఉంది. ఆ వీధి చివర కారు ఆపుజేసాడు మొహన్. వడలిపోయి వాడిపోయిన గులాబీలా ఆ పదిగంటల రాత్రి సమయంలో ఇంటివేపు అడుగులేస్తోంది సరస్వతి. తను మామూలుగా ఉండడానికి తిరిగి మేకప్ చేసుకుని, ఎవ్వరూ పసిగట్టకుండా ఉండాలని ఆమె ప్రయత్నం చేసినా ఇట్టే పసిగట్టెయ్యవచ్చు. ఆమె ఎటువంటి పరిస్థితిలో ఇంటికి వచ్చిందో.

పువ్వులోని మకరందాన్ని పీల్చి, పీల్చీ ఎగిరిపోయిన తుమ్మెదలా మొహన్ కారులో తిరుగు ముఖం పట్టాడు. ఇల్లు సమీపిస్తున్న కొలదీ సరస్వతీలో పిరికితనం -బెరుకుతనం, జంకు స్థానంలో ఓ విధమైన మొండి ధైర్యం చోటు చేసుకుంది.

“ఆఁ…. తాను చెడిపోవడమేంటీ? భవిష్యత్తులో ఇలాంటివి ఈ ఫీల్డులో తప్పవు అని తను వింది. ఆ చెడిపోయిందేదో చెంబుడు నీళ్ళతో ప్రక్షాళన చేసుకుంటే తీరిపోతుంది. అసలు విషయం తను ఉన్నత స్థాయికి చేరుకోవాలి. నరకకూపంలాంటి ఈ ఇంటిలో తను ఇమడలేకపోతుంది. ప్రొద్దున్న లేచినది మొదలు పొద్దస్తమానం సమస్యలూ, – సమస్యలూ…. అన్నీ సమస్యలే! సంఘర్షణ జీవితం. అశాంతి వాతావరణం. ఇలాంటి పరిసరాల నుండి తను బయటపడాలి.

మిక్కిలి దాహంగా ఉన్న వాడికి ఆ దాహం తీర్చుకోడానికి నీళ్ళు కావాలి. అలాగే జీవితంలో ఎవ్వరూ ఊహించని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన దాహం అదే దప్పిక. దాన్ని తీర్చడానికి మోహన్ నీళ్ళలా కనిపించాడు. అతని సహకారంతో తన ఆశల దాహాన్ని తీర్చుకోవాలి.

తను చేస్తున పని లోకం దృష్టిలో చెడు అవచ్చు. అయితే తన దృష్టిలో తను చేస్తున్న పని సబబే. “మంచి చెడు అని అనుకుంటూ పోతే జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఉన్నత శిఖరాల్ని చేరుకోలేం” ఇలా ఆలోచిస్తూ ఇంటివేపు అడుగులేస్తోంది సరస్వతి.

వీధి తలుపు తీసే ఉంది. వాలుకుర్చీలో నడుం వాల్చి ఇంటిపై కప్పు వేపు చూస్తూ గంభీరంగా ఆలోచిస్తున్నాడు సారధి. సకిలించింది సరస్వతి. తన రాకను తెలియజేస్తూ. తప్పుజేసినా ఆ తప్పును ఒప్పుగా భావిస్తున్న ఆమెలో టెంపరితనం- తెగువ అతడ్ని నివ్వెరపరిచింది.

పెళ్ళికి ముందు ఆమె తనతో అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. తను ఆమెకు భానిసగా ఇంట్లో పెడి ఉండమని చెప్పలేదు. ఆమెకి తను స్వేచ్ఛ ఇచ్చాడు. అలా ఇచ్చిన స్వేచ్ఛని ఆమె సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తోంది. ఇది ఆమె మనస్తత్వంలో ఉన్న లోపం. ఇలాంటి వాళ్ళకి ఆంక్షలు పెత్తే మరింత మొండికేసి పెంకిగా ప్రవర్తిస్తారు. మొండిగా తెగిస్తారు.

ఇలాంటి స్వభావం గలవాళ్ళకి జీవితంలో తృప్తి అనేది ఉండదు. ఉన్నత శిఖరాలు చేరుకోడానికి ఎంతకైనా తెగిస్తారు. అయితే తను సరస్వతికి ఏ లోటు చేశాడు? కొన్ని తన అవసరాలు కూడా మానుకుని ఆమె అవసరాలు-సరదాలు తీరుస్తున్నాడు. అయినా ఆమె స్వభావంలోనూ మనస్తత్వంలోనూ మార్పులేదు.

సరస్వతిని పెళ్ళి చేసుకుని తనేఁ సుఖపడ్డాడు? తన కుటుంబంతో పాటు ఆమె కుటుంబ మంచి చెడ్డల చూసే బాధ్యత తనపై పడింది. దీనికి తన కుటుంబం వారు తనని నిందించారు. నిష్ఠూరాలు ఆడారు. అన్నీ తను భరిస్తున్నాడు.

సరస్వతిని చూసి సారది ఏఁ మాట్లాడలేదు. భోజనం చేయకుండా పడుకుంది. సారది కూడా భోజనం చేయకుండా పడుకున్నాడు. ఒకవేపు ఆకలివేస్తున్నా అతను భోజనం చేయలేదు.

“సారధీ! నీ భార్య ఎక్కడో మెక్కి ఉంటుంది. నీవు పస్తులు ఏడుకోవడం ఏంటిరా?” సారది తల్లి కొడుకుని నిలదీసింది. అతను ఏఁ మాట్లాడలేదు.

“బాగుంది మీ వాలకం. ఇదంతా నీ మెతకతనం వల్లనే!” సాగదీసింది

“అమ్మా! దయ చేసి నన్ను విసిగించకు” అన్నాడు సారది తల్లితో.

“మీకు మీకు ఇష్టమైనప్పుడు నాకెందుకు నాయనా? ఉండబట్టలేక వెదవబుద్ధి సహించలేక అంటున్నాను” రుసరుసలాడుతూ ఆవిడ అక్కడ నుండి వెళ్ళిపోయింది.

రాత్రి భోజనం చేయకపోవడం వల్ల బాధించిన ఆకలి కంటే సరస్వతి ప్రవర్తన అతనికి మరింత భాదను కలిగిస్తోంది.

ఉదయం లేచిన తరువాత స్కూలుకి వెళ్ళడానికి గబగబా తయరవుతున్నాడు సారధి. సరస్వతిని ఏవీఁ అనలేదు. ఏఁ మాట్లాడలేదు.

“బాగుంది వరస, సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది” తల్లి సణగుతూనే ఉంది. సారధి మౌనంగా ఉన్నాడు.

“రాత్రి ఓ స్నేహితురాలితో అనుకోకుండా పార్టీకి వెళ్ళవల్సి వచ్చింది” సరస్వతి సారధితో అంది ఉదయం.

“నాకు తెలియని స్నేహితురాళ్ళు నీకెవరున్నారు చెప్మా!” సారధి అన్నాడు. అతని మాటల్లో కరుకుతనం లేదు. సామ్యతే ఉంది. అయితే సరస్వతికి మాత్రం అతని మాటల్లో వ్యంగ్యం అగుపించింది. అతని మాటలు ఆమె మనస్సుకి చురుక్కమని తగిలాయి.

“నన్ను అనుమానిస్తున్నారు-అవమానిస్తున్నారు” సరస్వతి కంఠంలో తీక్షణత తొంగి చూసింది.

“హోటల్ అజంతా దగ్గర నిన్ను చూశాను.”

“చెప్పాను కదా! మా స్నేహితురాలు ఆ హోటల్లోనే పార్టీ ఇచ్చింది.”

రాత్రినుంచి భోజనం చేయని ఆకలికంటే ఆమె చెప్పిన అబద్దం అతడికి మరింత బాధ కలిగించింది. “స్నేహితురాలు కాదు, స్నేహితుడు మోహన్ కదా!” అన్నాడు. అతని మాటలకి తృళ్ళిపడింది సరస్వతి. అన్ని విషయాలూ బట్టబయలు అయిన తరువాత అబద్ధం ఆడినా అతికినట్టుండదు. చూసేనా ఉండాలి ఎవరేనా చెప్పేనా ఉండాలి. ఇంత వరకూ పరిస్థితి వచ్చిన తరువాత తనెందుకు జంకాలి? తనకి వ్యక్తిత్వం లేదా? ఇలాంటి నిఘాలంటే తనకి అసహ్యం. ఇలాంటి గూఢచారి చర్యకు పాల్పడిన మగవాడంటే తనకి గౌరవం లేదు. సద్భావం అంత కన్నాలేదు. తన వ్యక్తిత్వాన్ని కించబర్చే చర్యను తను సమర్థించలేదు. తను ఆ మోహనుకి లొంగిపోదామన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళలేదు. యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది. అందరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. తన పని సమర్థించుకోజూసింది సరస్వతి.

“నాకు తెలిసిపోయిందని బాధపడ్తున్నావా?

“మీకు తెలిసిందన్న బాధకంటే మీరు చేస్తున్న చేయిస్తున్న గూఢచారి పనికి అసహ్యం వేస్తోంది. మొదట మోహన్‍తో లేచిపోదామన్న ఆలోచన లేదు కాని ఇప్పుడు మీ ప్రవర్తన వల్ల ఆ ఆలోచన కలుగుతోంది.”

“సరస్వతీ!!”

ఎన్నడూ కోపం ఎరగని అంత శాంతమూర్తి సారధి గర్జించాడు. ఆమె పెంకి సమాధానికి అతని అహం దెబ్బతింది. ఆత్మగౌరవం కకావికలమైంది. ఆమె నిర్లక్ష్య సమాధానికి అతని కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రబడ్డాయి. పెదవులు అదురుతున్నాయి. దవడ ఎముక కదలిక బట్టి ఆమె ప్రవర్తన వల్ల అతని కెంత ఆగ్రహం కలిగిందో తెలుస్తుంది అని అనిపిస్తోంది.

“మీ కోపానికి – అరుపులకి జడిసిపోతానా?” తన వాదనతో మాటలతో మరింత రెచ్చగొట్టింది సరస్వతి సారధిని. అంత శాంతమూర్తిలో మానవత్వం మరుగున పడుతోంది. దాని స్థానంలో రాక్షసత్వం చోటుచేసుకుంది. అతనిలో సహన గుణం చచ్చిపోయింది. వివేకం సమిసిపోయింది. ఉద్వేగం-భావోద్రేకం-ఆవేశం అధికమైన సమయంలో మంచి చెడులను మరిచిపోయిన మనిషి ఏ చేస్తాడో సారధి కూడా ఆ పనే చేశాడు.

అతను కొట్టిన చెంపదెబ్బకి ఆమె ఒక్కక్షణం దిగ్భ్రాంతికి గురైయింది. ఎర్రగా కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటున్న సరస్వతి కన్నుల్లో కన్నీరు చిప్పిల్లాడింది.

“నన్ను కొడ్తావా…..? “దెబ్బ తిన్న ఆడనాగులా బుసకొడూ ఆవేశంతో ఊగిపోతుంది. ఆమె ఏకవచన సంబోధన సారధి కోపాన్ని ద్విగృణీకృతం చేసింది.

“కొడ్తానా….. తిక్క తిక్కగా ప్రవర్తిస్తే చీరేస్తాను” అన్న అతని మాటల్లో మగవాడిని నేను ఏఁ చేసినా చెల్లుతుంది అన్నభావం కంటే ఓ భార్య ప్రవర్తించిన తీరేనా ఇది అన్న బాధతో వచ్చిన ఆవేశం తొంగిచూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా అతన్ని నిందిస్తూ ఉంటే సారధి మరింత మనస్తాపానికి గురి అయ్యాడు.

“మొట్టమొదట్నించి నీవు ఆ పిల్లని పెళ్ళి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. నీకు ఏదో పెళ్ళి అవనట్టు ఈ దిక్కు మాలిన సంబంధం చేసుకున్నావు. కర్మని ఎవ్వరూ తప్పించ లేరు. బ్రహ్మావ్రాతను ఎవరు మార్చగలరు గనుకా?” కర్మ సిద్ధాంతాన్ని వల్లె వేసారు సారధి తల్లిదండ్రులు.

సరస్వతి అంతకన్నా ఊరుకోలేదు. డీ అంటే డీ అన్నట్టుంది ఆమె వ్యవహారం. “మీ అబ్బాయిని నేనేఁ పట్టుకుని కూర్చోలేదు. నన్ను పెళ్ళి చేసుకోమని అంతకన్నా అడగలేదు. బలవంతం చేయలేదు. అతనే నన్ను పెళ్ళిచేసుకుంటానని అడిగి ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్నారు. ఈపాటి దిక్కుమాలిన సంబంధం మాకు రాకపోదు…… ” సరస్వతి ఆవేశంతో ఊగిపోతూ అంది.

“సరస్వతీ!!” ఆడ బెబ్బులిలా అరుస్తూ కూతురు చెంప చెళ్ళుమనిపించింది ఆమె తల్లి. అంతకు పూర్వ సారధి కొట్టిన దెబ్బకు ఆమె బాధపడూ ఉంటే తల్లి కొట్టిన దెబ్బకి ఆమె కళ్ళు బైర్లు కమ్మాయి.

“మా వాడు కోరుండి మీ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని అడిగి మీ అమ్మాయిని పెళ్ళి చేసుకుని, మీ కుటుంబ బాధ్యతల్ని కూడా తన నెత్తిమీద వేసుకున్నందువల్లే మా వాడు మీ అందరికి చులకన అయ్యాడు. మీ కూతురుకు అంత పొగరేంటి?” అని విసురుగా అని అచటినుండి గబగబా అడుగులేస్తూ సారధి తల్లి ముందుకు వెళ్తుంటే తండ్రి ఆమె వెనకాలే నడిచాడు.

సరస్వతి తల్లి ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతోంది. ఆమె దృష్టిలో అల్లుడు ఉత్తముడు. అటువంటి వాడికి తగినది కాదు తన కూతురు అనుకుంది. అందుకు సరస్వతినే నిందించింది. తల్లి కూడా తనని నిందిస్తూ ఉంటే సహించలేకపోయింది సరస్వతి.

“మీరెవరూ నన్ను అర్థం చేసుకోడానికి ప్రయత్నించరేంటి?”

“ఇప్పుడు నీకొచ్చిన లోటేఁటి?

“చెప్పుకుంటే అన్నీ లోటే?”

“అవును నీలాంటి దానికి అన్నీ లోటే. నిన్ను భవనాల్లో ఉంచి ఏడు వారాల నగలతో అలంకరించి, కార్లలో నీ భర్త తిప్పలేదనే గదా నీ బాధ. నీ మనస్తత్వం చిన్నప్పటినుండి వేరుగానే ఉంది. అందరి ఆడపిల్లల్లాంటి దానివీ కాదు నువ్వు. అయితే ఒక్క విషయం. మనకున్న దాన్తో తృప్తిపడి జీవితం గడపడం నేర్చుకో మొట్టమొదట. గుప్పెడ మూసి ఉన్నంత వరకే ఆ దాచిన వస్తువుకి విలువ. తెరిచి చూపిస్తే ఆ వస్తువు మీద ఆపేక్ష తగ్గుతుంది. ఆడదాని విషయం అంతే. కుటుంబ గౌరవం ఈ గుప్పెట్లో పదిలంగా దాచి ఉంచినంత వరకే దాని విలువ. బట్టబయలయితే విలువే లేదు” సరస్వతి తల్లి కూతురికి హితబోధ చేసింది.

“ఊఁ….!” అంటూ అచటినుండి పొగరుగా తల విదిలించి విసురుగా కదిలిపోయింది సరస్వతి.

“దీని కెంత పొగరు? ఈ ఇంటికి ఏదో అరిష్టం పట్టుకుంది. లేకపోతే అక్క ఇలా ప్రవర్తించడం ఏంటి?” అని అనుకుంటున్న చెల్లెళ్ళకి అక్క ప్రవర్తన బాగులేదనిపించింది. కూతురు ప్రవర్తన మంచం మీద పడి ఉన్న ఆమె కన్న తండ్రికి మనస్తాపం కలిగించింది. అతను కుమిలిపోతున్నాడు.

***

ఆ రోజు ఎవ్వరికీ ఇంట్లో శాంతి లేకుండా మనస్తాపం. ఆశాంతితో గడిచిపోయింది. వియ్యాలవారింట్లో కలకలం విన్న సరస్వతి తల్లి అటువేపు అడుగులేసింది. ఏడుస్తున్న పిల్లవాడ్ని సముదాయించలేక నానా హైరానా పడ్తోంది సారధి తల్లి. ఒక్కొక్క పర్యాయం విసుక్కుంటోంది సరస్వతిని తిడుతోంది.

ఏడుస్తున్న పిల్లవాడ్ని సముదాయించలేక విసుక్కుంటున్నాడు సారధి కూడా. ఒకవంక అవమానం మరోవేపు క్షోభం రెండూ కలిపి అతని సహనాన్ని పరీక్షిస్తున్నాయి.

సరస్వతి ఇల్లు వదలి వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకుని తల్లడిల్లిపోయింది. ఆ కన్నతల్లి. “దీనికి ఏఁ పోయేకాలం వచ్చింది? దేవుడు లాంటి భర్తకి అన్యాయం చేసిపోయింది.” ఇలా తల్లిడిల్లుతున్న ఆ తల్లి గుండెల బాధతో బరువెక్కాయి. కళ్లల్లో కన్నీరు పైకుబుకుతోంది. సారధి చేతుల్లో ఉన్న పిల్లవాడ్ని చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుంది ఆమె.

బాధ అవమానంతో దహించుకుపోతున్న సారధి అత్తగారి వేపు ఓమారు చూశాడు. అతని మనస్సులోని మూగబాధను అర్థం చేసుకున్న అత్తగారు కన్నీరు కారుస్తూ తన ఆవేదన తెలియజేసింది. ఆ సమయంలో అల్లుడ్ని ఎలా ఓదార్చలో ఆమెకి అర్థం కావటం లేదు.

“వీడ్ని నేను తీసుకువెళ్తున్నాను” గొణుక్కుంటూ తన వాటా వేపు అడుగులేసింది ఆమె.

ఆమె మనస్సు స్థిమితంగా లేదు. ‘సరస్వతిది బాటు తప్పిన బ్రతుకయింది. ఇంటిలో స్థానం పోగొట్టుకుంది. విలువ గౌరవం ప్రతిష్ఠ అన్నీ పొగొట్టుకుంది. మాతృమూర్తిగా తన పిల్లవాడిమీద మమత కూడా చంపుకుని ఈ పసిగుడ్డును అనాథగా చేసి తన దారి తాను చూసుకుంది. కన్నవాళ్ళ గుండెల్లో చిచ్చుపెట్టి, వాళ్ళ మనసులు క్షోభకి గురిచేసింది’ ఇలా అనుకుంటూ బాధపడుతోంది

తండ్రి బాధ మరీను. తనకి మగపిల్లలు లేరు. కూతురయినా కొడుకయినా అన్సీ తనకి సరస్వతే అని అనుకున్నాడు తను. కూతురు సంగీత పాఠాలు చెప్పి డబ్బు సంపాదించి ఇంటిని ఆదుకుంటూ ఉంటే తనెంతో పొంగిపోయాడు. చాలా గర్వించాడు. తనకి కొడుకులు పుట్టినందుకు చింతించలేదు. ఇక అల్లుడు సారధి విషయానికి వస్తే అతను చాలా ఉత్తముడు. తనకి కొడుకులు లేరన్న లోటు తీరుస్తున్నాడు. తన ఇంటిని ఆర్థికంగా ఆదుకుంటూ తన అవసరాలు కూడా మానుకుని సహాయపడుతున్నాడు. తన కుటుంబాన్ని, గొప్ప శాంతమూర్తి, సహనశీలి. “ఛీ..! తన కూతురు అంత మంచివాడికి ఎంత ద్రోహం చేసింది? కూతురు మీద తనకున్న నమ్మకాన్ని వమ్ముజేసింది?” బాధగా నుదురు కొట్టుకుంటూ బాధపెడున్నాడు ఆ తండ్రి.

15

కాలచక్రం ఎవ్వరినీ చూడకుండా ఎవ్వరి కోసం ఆగకుండా గిర్రున తిరుగుతోంది. ఆ కాలచక్ర గమన తీవ్రతకి తాకిడికి కొంతమంది వెనకబడ్తుంటే మరి కొంతమంది దాతోపాటే ముందుకు సాగుతున్నారు.

సమాజంలో మగాడు ఆడదాన్ని వదిలేసినా ఆ ఆడదాన్ని సమాజం అవహేళనలకి గురి చేస్తుంది. ఆడది మగవాడ్ని వదిలి వెళ్ళిపోయినా సమాజం అతడ్ని కూడా వదిలి పెట్టదు. “పాపం ఇతడ్ని భార్య వదిలి వెళ్ళిపోయింది” ఇలాంటి మాటలు తన వెనకనుండి వినిపిస్తూ తన గురించి సానుభూతి చూపిస్తూ అందరూ మాట్లాడుతుంటే సహించలేకపోయేవాడు. మొదట్లో బాధపడేవాడు సారధి. రాను రాను ఆ మాటలు అతనికి అలవాటుగా మారిపోయాయి. మనస్సు బండబారిపోయింది.

‘సమాజంలో కొంతమంది నైజమేమిటంటే ఒడ్డునుండి బెడ్డలు వేయడం వారి అలవాటు’ అని సరిపుచ్చుకుంటూ అవహేళనలు భరిస్తూ అలా జీవితం గడిపేస్తున్నాడు. యాంత్రికంగా స్కూలుకి వెళ్ళి వస్తున్నాడే కాని అతనిలో జీవకళ లేదు. జీవచ్ఛవంలా రోజులు గడిపేస్తున్నాడు. ఎవరైనా తన దగ్గర సరస్వతి ప్రస్తావన తేవడానికి ప్రయత్నించినా వారిస్తున్నాడు.

సంతోషం-విషాదం కేవలం మనస్సుకి సంబంధించిన విషయాలు కావు. శరీర ధర్మాలు కూడా. జీవన బాటలో పయనించే సమయంలో మనస్సు కృంగిపోయే పరిస్థితి వస్తే ఒక్కొక్క పర్యాయము కారణాలేవీ లేకుండా మనస్సు ఆవేదనతో నిండిపోతుంది. కాని, సారధి ఆవేదన వేరు. సరస్వతి అతని జీవితంలో రగిల్చి మిగిల్చిన అవమానాన్ని మరచిపోవడానికి కొంత సమయం పట్టింది.

అతని మనస్థితిని ఎరిగిన సహోపాధ్యాయులు మానుతున్న గాయాన్ని కెలకడం ఎందుకు అని ఊరుకుంటే మరి కొందరు అలా కెలికి అతను బాధపడ్తూ ఉంటే చూసి ఆనందిద్దామని అనుకున్న వాళ్ళు ఉన్నారు. మానవ నైజాలన్నీ సమాజంలో ఒకేలా ఉండవు కదా!

“ఆ దరిద్రపుగొట్టు దాన్తోనే ఆ కుటుంబంతో మనకి సంబంధం తెగిపోయింది. ఇంకా వాళ్ళకి డబ్బు సాయం చేయడం నాకు నచ్చలేదు” తల్లి అంది. ఆమె మాటలకి అతను చాలా బాధపడ్డాడు.

“నా కొడుకు సంరక్షణ వాళ్ళు చేస్తున్నారు. వాడి పోషణ కోసం నేను వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను. నీవు పెద్దదానివయ్యావు. పసిపిల్లవాడి సంరక్షణ నీకు భారం అవుతుంది. పిల్లవాడ్ని చూసుకోడానికి ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు” అని అన్నాడు సారధి తల్లితో.

అతని మాటలకి ఆమె మరేఁ మాట్లాడలేకపోయింది. అయిష్టంగా గొణుక్కుంది. తండ్రి సంగతి అంతే. అయితే వారు తమ అయిష్టత బాహాటంగా ప్రకటించలేకపోయారు. దానికి కారణం తమని కూడా సారధి పోషిస్తున్నాడు. పెద్ద కొడుకు ఆశ ఎలాగులేదు. మూడో కొడుకు సంపాదిస్తున్నాడంటే వాడి సంపాదన అంతంత మాత్రమే.

ఆర్థికంగా మానసికంగా దిగజారిపోతున్న అత్తవారి కుంటుంబాన్ని ఆదుకోవాలన్న తపన సారధిలో ఉంది. లేచిపోయిన కూతుర్ని తలచుకుంటూ కుమిలిపోతూ మృత్యువుకి మరింత సమీపానికి చేరుకుంటున్న మామగార్ని చూస్తే అతనికి చాలా బాధ వేస్తుంది. ఆ కుటుంబాన్ని ఎలాగో అలాగ ఆదుకోవాలన్న తలంపుతోనే కొడుకుని అత్తవారింటిలో ఉంచాడు.

సారధి ఈ చర్యకి తల్లి మొదట్లో గొణిగినా ఆ తరువాత మౌనం వహించింది. దానికి కారణం పెద్దకొడుకు వారిని ఆదరించడు. మూడో కొడుకు ఉన్నాడంటే వాడు చాలా కోపిష్ఠి. ఆ కొడుకుతో తమకి ఎలాగూ సరిపడదు. నెమ్మదస్తుడు రెండో కొడుకు సారధి ఒక్కడే. తమ జీవితాలు గట్టెక్కించేది సారధి మాత్రమే. అంతేకాదు ఈ ముసలివయస్సులో చిన్న పిల్లవాడి సంరక్షణ చేయడం చాలా కష్టం. ఇలా ఆలోచించి రాజీదోరణిలో ఆవిడ మౌనం వహించింది. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది.

***

“ఈ డబ్బు ఉంచండి.” అత్తగారి చేతిలో డబ్బు ఉంచబోతూ అన్నాడు సారధి. అయోమయంగా భర్తవేపు చూసింది ఆమె. మామగారు రోగంతో మంచం మీద పడి ఉన్నారు. అతడ్ని చూడగానే సారధి కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడింది.

“నీ ఋణం తీర్చుకోలేం బాబు! కన్నకొడుకులేనా చేయని సహాయం నీవు మాకు చేస్తున్నావు. చితికి పోయిన మా కుంటుబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నావు” మామగారి గొంతుక నీరసంగా పలికింది.

“సరస్వతి ఉన్నప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. నీ దగ్గర మేము ఎలా డబ్బు తీసుకోగలం? ఏ హక్కుతో తీసుకోగలం?” అత్తగారు గద్గద కంఠంతో అంటున్న మాటలు తనని వారు వేరు చేసి మాట్లాడుతున్నారనిపించింది సారదికి. వాళ్లకీ తనకీ ఇప్పుడు ఏ సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారనిపించింది. అతని గుండెలు బాధతో బరువెక్కాయి. అల్లుడు మానసిక స్థితిని గమనిస్తున్న అత్తగారు తొందరపాటుతనానికి చాలా నొచ్చుకుంది.

“నా కొడుకు అలానాపాలనా మీరు చూస్తున్నారు. వాడి ఖర్చులకైనా నన్ను ఈ డబ్బు ఈయనీయండి. దయచేసి ఎటువంటి అభ్యంతరం పెట్టవద్దు.”

అతని మనస్సు నొప్పించడం ఇష్టం లేక అత్తగారు డబ్బు తీసుకుంది.

“బాబూ!” మామగారి పిలుపు విని సారధి అతని వేపు చూశాడు.

“ఇలా వచ్చి కూర్చో!”

అతని మాట కాదన లేక సారధి మామగారి మంచం దగ్గరకి కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు.

“ఆ దరిద్రపుగొట్టుది నీ జీవితం నాశనం చేసింది. నిన్ను నవ్వులు పాల్గేసింది. అశాంతిమయం చేసింది.”

“ప్లీజ్ ఆ విషయం మరిచిపోండి.”

“మరిచిపోదామన్నా మరిచిపోయే విషయమా అది?. నేను మరిచిపోలేకపోతున్నాను. నేను కూడా అట్టే రోజులు బ్రతకను. ఈ రోగానికి తోడు మానసికంగా చితికిపోయాను. మనోవ్యాధి నన్ను మృత్యువు సమీపానికి తీసుకెళ్తోంది.”

“అలా అనకండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది.”

“ఆ ఆశలేదు. అయినా బాగుపడినా నేను ఏఁ చేయగలను?” మామగారి గొంతుకలో విరక్తి భావం తొంగి చూసింది.

“మీ కుటుంబానికి ధైర్యం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసం – సుఖసంతోషాలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం బాగుపడుతుంది” అన్నాడు సారధి. కొంత సేపు అక్కడ మౌనం రాజ్యమేలింది.

“బాబూ సారధీ!”

“చెప్పండి.”

“చెప్పాలనే ఉంది, అయితే చెప్పలేకపోతున్నాను.”

“పరవాలేదు చెప్పండి.”

“మా చిన్నమ్మాయి నీకు తెలుసు కదూ!”

“సుమిత్ర గురించేనా? చాలా మంచమ్మాయి, నా దగ్గర మెట్రిక్ పరీక్షకి కోచింగు తీసుకుంది, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఆచితూచి మాట్లాడే మంచి మనస్తత్వం గల అమ్మాయి.”

“ఆఁ సుమిత్ర గురించే, దాన్ని నీవు అంత బాగా అర్థం చేసుకున్నావు, సరస్వతి స్వభావానికి పూర్తిగా వ్యతిరేకమైన మనస్తత్వం గలది. ఉన్నదాన్తోనే సంతృప్తి పడాలన్న మనస్తత్వం గలది. ఆడంబరాల జోలికి పోకుండా గుట్టుగా కాపురం చేసుకునే గుణం కలది.”

‘ఇదంతా నాకు వీళ్ళు ఎందుకు చెప్తున్నట్టు’ ఆలోచిస్తున్నాడు

“సుమిత్రను నీవు పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. నేను ఎలాగూ ఎక్కువ రోజులు బ్రతకను, నా కోరిక తీర్చవూ?” ప్రాధేయపూర్వకంగా అడుగుతున్న మామగారి వేపు అయోమయంగా చూశాడు సారధి. తనకి సుమిత్ర మీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఇలాంటి ప్రస్తావన వస్తుందని అతడు ఊహించలేదు. ఏఁ జవాబియ్యాలో అర్ధం కాలేదు సారధికి.

‘అల్లుడుకి తన మాటలు నచ్చలేదా? అలా మౌనంగా ఊరుకున్నాంటే ఇష్టతా లేక అయిష్టతా?’ అన్న విషయం అర్థం కావడం లేదు. మామగారు ఆలోచిస్తున్నారు.

“సరస్వతితో సుమిత్రను పోల్చకు బాబూ! గొప్పలు చెప్పుకోవడమే అవుతుంది కాని మా సుమిత్ర కడిగిన మంచి ముత్యంలాంటి అమ్మాయి. నా కోరికలో కూడా స్వార్థం ఉంది, ఈ సమాజంలో స్వార్థం లేనిది ఎవరికి, కాని స్వార్థం లేనిదే ఏ పనీ జరగదు. స్వార్థం ముందు నడుస్తే దాని వెనక మనం నడుస్తాం.”

‘ఇదంతా ఇతను తనకి ఎందుకు చెప్తున్నట్టు?’ ఆలోచిస్తున్నాడు సారధి.

“నీవు చిన్నవాడివి, ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగు పెడ్తున్నవాడివి. రేపో, నేడో మీ వాళ్ళు నిన్ను మరో పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తారు. వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోయే బదులు సుమిత్రని పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది. మాకు కూడా మరో అమ్మాయికి పెళ్ళి చేసామన్న తృప్తి కలుగుతుంది.  మా మనవడి జీవితం బాగుంటుంది” ఇలా అంటూ సారధి వేపు చూశారు మామగారు.

“నేనా…..? అదీ సుమిత్రను పెళ్ళి చేసుకోవడమా? నాకు ఎప్పుడూ అటువంటి ఉద్దేశం లేదండి. సుమిత్రకి మంచి సంబంధం చూసి పెళ్ళి చేద్దాం!” దృఢంగా అన్నాడు సారది.

“అంతకు పూర్వం ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అప్పుడు అటువంటి ఉద్దేశం లేకపోవచ్చు. ఇప్పుడు నీ మనస్సుని, నీ భావాల్ని మార్చుకో, ఇంతకీ సుమిత్రని పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టం లేదా?” మామగారి కంఠంలో నిరాశ తొంగి చూసింది.

సారధి ఆలోచనలో పడ్డాడు. ‘తన కుటుంబ సభ్యులు రేపో, నేడే మామగారు చెప్పినట్టు తన పెళ్ళి ప్రస్తావన తెస్తారు. తనకిష్టం లేకపోయినా పిల్లవాడి ఆలనా పాలనా కోసమేనా తను పెళ్ళి చేసుకోవాలి. ఇక్కడ కేవలం లైంగికానందమే ప్రాధాన్యం కాదు. బాధ్యతలు, సమస్యలు ప్రాధాన్యం’ ఇలా సాగిపోతున్నాయి సారధి ఆలోచన్లు.

“సుమిత్రను ముందు అడిగి చూశారా? ఆమె అభిప్రాయం కనుక్కున్నారా?

“సుమిత్రతో మాట్లాడిన తరువాతే ఈ ప్రస్తావన నీ దగ్గర తెస్తున్నాను.”

‘తను సుమిత్రను పెళ్ళి చేసుకుంటే అక్క కొడుకే కాబట్టి తన కొడుకు సుధాకర్ ఆలనాపాలనా సుమిత్ర జాగ్రత్తగా చూసుకుంటుంది. అదే వేరే అమ్మాయి అయితే అలా చూస్తుందన్న గ్యారంటీ లేదు. అలాంటప్పుడు తను మధ్య నలిగిపోవాలి’ ఇలా కూడా ఆలోచిస్తున్నాడు సారధి.

“సుమిత్ర అభిప్రాయం అడిగారా? లేకపోతే ఇది మీ ఆలోచనా?” తిరిగి రెట్టించి అడిగాడు మావగారిని.

“సుమిత్ర అభిప్రాయం కనుకున్న తరువాతే నీ దగ్గర ఈ ప్రస్తావన తెచ్చాను” మరో పర్యాయం అన్నారు. అతని మావగారు.

“మా వాళ్ళ దగ్గర ఈ ప్రస్తావన తెస్తే మంచిది.”

“మీ వాళ్ళు అంగీకరిస్తున్నారన్న నమ్మకం మాకు లేదు. సరస్వతి చేసిన పని వల్ల మా కుటుంబానికే చెడ్డ పేరు వచ్చింది” అత్తగారు అన్నాది.

“మొదట నీ అభిప్రాయం కనుకున్న తరువాత మీ వాళ్ళని అడుగుదాం అని అనుకుంటున్నాం.”

సారధిలోనూ సందేహాలే, సరస్వతిని పెళ్ళి చేసుకోవడమే తన వాళ్లకి ఇష్టం లేదు, సరస్వతి కుటుంబ గౌరవానికి మచ్చ తెచ్చింది. తిరిగి ఆ కుటుంబంలోని అమ్మాయిని కోడలిగా అంగీకరిస్తారా? అని అనుకుంటున్నాడు.

“నీవు కూడా మీ వాళ్ళకి నచ్చజెప్తే మీ వాళ్ళు అంగీకరించవచ్చు.”

“మా వాళ్ళు నా అభిప్రాయం అడుగుతే నేను తప్పక చెప్తాను”

సారధి తల్లిదండ్రులు మొదట సుమిత్రను కోడలిగా చేసుకోడానికి అంగీకరించలేదు. సరస్వతి నడత చూసిన వాళ్ళకి ‘ఆ అక్కకి చెల్లెలు కదా, ఆ బుద్ధులు రాకుండా ఉంటాయా’ అని అనుకున్నారు. అయితే సుమిత్ర నడవడిక కూడా చూస్తుండడం వల్ల మెత్తబడ్డారు.

పెద్దలు ఓ అంగీకారానికి వచ్చిన తరువాత ఓ శుభ ముహూర్తంలో ఎటువంటి ఆడంబంరం లేకుండా నిరాడంబరంగా సారధి – సుమిత్రల వివాహం జరిగింది..

(ఇంకా ఉంది)

Exit mobile version