ఎండమావులు-8

0
2

18

[dropcap]సు[/dropcap]ధాకర్ ఇంటర్ బైపిసి గ్రూప్ తీసుకున్నాడు తండ్రి కోరికకి వ్యతిరేకంగా. సారధి కొడుకు ఎం.పి.సి. గ్రూప్ తీసుకుంటే బాగుండును అని అనుకున్నాడు. పోనీ చదివేవాడు వాడే, సుదాకర్‌కి ఏ గ్రూపు ఇష్టమో అదే తీసుకోనీ అని తన మనస్సుకి సర్దిచెప్పుకున్నాడు.

ఇంటర్ అయిన తరువాత సారధి ఎమ్.సెట్ కోచింగు ఇప్పించాడు కొడుక్కి. ఎమ్.సెట్లో నుంచి ర్యాంకు కూడా వచ్చింది. తను కష్టపడి చదివాడు అందుకే ర్యాంకు వచ్చింది అని మురిసిపోయేడు సుధాకర్ కాని, తనకి ర్యాంకు రావడం వెనుక తన తల్లి తండ్రుల సహకారం, ప్రోత్సాహం కూడా ఉన్నాయన్న విషయం విస్మరించాడు. తండ్రి ఫీజులు కట్టి చదివించకపోతే చదివి ఉండేవాడా? సుమిత్ర వేళకి తిండి సదుపాయం కలిగించి మిగతా అవసరాలు తీర్చకపోతే విజయం సాధించేవాడా? తన విజయం వెనుక వాళ్ళ సహకారం కూడా తోడయింది అని అనుకోలేదు.

అందువల్లనే తనకి ర్యాంకు వచ్చిన విషయం ఇంట్లో చెప్పలేదు. అలా చెప్పాలన్న ఆలోచన అతనికి రాక కాదు, చెప్పడం ఇష్టం లేక అలా చేశాడు. ఈ విషయం బయట వ్యక్తుల ద్వారా తెలుసుకున్న సుమిత్రా సారధి చాలా బాధపడ్డారు.

“మీకు తెలియక పోవడమేంటి? మీ అబ్బాయే మా చేత స్వీట్లు కూడా తినిపించాడు” అని బయట వాళ్ళు చెప్తూ ఉంటే ఆ దంపతులకి తల తీసేసినట్టయింది. అయినా ఆ భావం కనిపించనీయకుండా “భలేవారే మాకు తెలియకపోవడం ఏమిటి? మాకు మొదటే ఈ విషయం చెప్పి మా చేత స్వీట్లు తినిపించాడు” అని అన్నాడు సారధి. నమ్మిన వాళ్ళు నమ్మారు. సుధాకర్ గురించి తెలిసిన వాళ్ళు తల్లి తండ్రుల మీద సానుభూతి చూపించారు.

“నాన్న గారికి నీకు సీటు వచ్చినట్టు చెప్పలేదేఁటి?” సుమిత్ర కొడుకుని అడిగింది.

“చెప్పాలనిపించలేదు, అందుకే చెప్పలేదు”

“ఎందుకు అనిపించలేదు. అతను చేసిన నేరమేమిటి? బయట వాళ్ళకి చెప్పి వాళ్ళకి స్వీట్లు తినిపించి సంతోషం పంచుకున్నావు. కన్న తండ్రి బయటివాళ్ళ పాటి చేయలేడా??” నిలదీసింది సుమిత్ర సుధాకర్‌ని.

“ఎందుకు చెప్పాలి?”

“ఎందుకు చెప్పాలో నా నోటితో చెప్పాలా? అది నీ విజ్ఞతకే వదిలి పెడ్తున్నాను.”

“కేవలం నా చదువుకి ఆర్థికంగా సహాయం చేయడమే తప్ప ఓ కొడుకు యడల తండ్రిగా అతను నా కోరికలు ఏం తీర్చారు? మా మధ్య ఉన్నది కేవలం ఆర్థిక సంబంధాలేనా? నా హైస్కూలు జీవితంలో ఎన్ని అవమానాలకి గురయ్యానో తెలుసా?

అందరూ నాతో ఎప్పుడు ఈ బట్టలే ధరిస్తావు మరోరకమైన బట్టలు లేవా? అని అడిగేవారు. మీ నాన్నగారు పాకెట్ మనీ ఇయ్యరా అని మరొకరు అడిగేవారు. నా క్లాసుమేట్స్ వాళ్ళు టూర్లకి, పిక్నిక్‌లకు వెళ్తుంటే, నన్ను మీరు ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. డబ్బుకి ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది అనేవారు.

జీవితంలో బాల్యావస్థ మధరమైన మరుపురాని అవస్థ, జీవితంలో తిరిగిరాని అవస్థ అది. డబ్బు ఇవాళ కాకపోతే రేపేనా సంపాదిస్తాం కాని. మధురమైన బాల్యావస్థని తిరిగి తీసుకురాగలమా? జీవితంలో ఏ సుఖం, సంతోషం లేకుండా ఎప్పుడు చదువు… చదువు…. చదువు… ఇదేనా జీవితం? ఇదేనా జీవిత లక్ష్యం? నా హైస్కూలు జీవితంలో ఏ ఎంజాయ్‌మెంటుకీ నేను నోచుకోలేకపోయాను.

బాల్యావస్థలో నిజమైన ఆనందం అనుభవించలేకపోయాను. నేను ఆనందానికి అనుభూతులకి వంచించబడ్డాను. నాన్నగారు తన అన్నదమ్ముల బాధ్యత ఎందుకు నెత్తిమీద పెట్టుకోవాలి? అతనికి గొప్పలు కావాలి. వాటి కోసం కన్న కొడుకు ఆనందాన్ని, సంతోషాన్ని బలిపెట్టారు. అందుకే నాకు అసహ్యం, జగుప్స, కోపం. మీ ఉనికి అంటేనే నాకు గిట్టదు” ఇలా వయస్సుకి మించిన పదజాలంతో తల్లిదండ్రుల్ని తను ఎందుకు ఏవగించుకుంటున్నాడో ప్రవాహంలా సుధాకర్ వాగ్దాటి సాగిపోతోంది.

సుమిత్రకి కొడుకు మాటలు ఆగ్రహం కలగచేశాయి. “అంత మంచి మనిషిని నీవు అర్థం చేసుకోలేవురా స్వార్ధపరుడా!” ఆవేదనతో, ఆవేశముతో ఊగిపోతూ కొడుకు చెంప చెళ్ళు మనిపించింది.

“నీవు నా కన్న తల్లివి కావు కాబట్టే నన్ను ఇలా కొట్టేవు. అదే నా కన్న తల్లి అయితే ఇలా చేసి ఉండేది కాదు” అంటూ బుగ్గ తడుపుకుంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుధాకర్.

కొడుకు మాటలకి సుమిత్ర కొయ్యబారిపోయింది, నిశ్చష్టురాలైంది. అలా కూలబడి పోయింది. ఆమె కొడుకు నుండి ఇటువంటి ధిక్కార స్వరం వినవల్సివస్తుందని అనుకోలేదు. ఈ హఠాత్పరిణామాన్ని ఆమె తట్టుకోలేక పోయింది.

సుమిత్ర అలా కూలబడి పోయింది. ఈ సంఘటన తట్టుకోలేక పోయింది. తను ఊరుకుంటే డిప్రెషనులోకి వెళ్తుంది అని అనుకున్న సారధి ఆమె భుజం తట్టి “సుమిత్రా!” అన్నాడు. ఒక్కసారి తృళ్ళిపడి బాహ్యస్థితికి వచ్చింది. ఆమె షాక్ నుండి తేరుకుంది. ఆమెకి దుఃఖం ఆగటం లేదు. భావోద్వేగంతో బోరున సారధి హృదయంమీద తలవుంచి బావురుమంది.

“విన్నారా మన వాడి మాటలూ! నేను కన్న తల్లిని కాదు పెంచిన తల్లినని వేరు చేసి మాట్లాడాడు. సుధాను నేను అలా చూశానా? మీరే చెప్పండి నాకు పిల్లలు పుడితే సుధా మీద ప్రేమను చూపించలేనేమోనని నేను ఏం చేశానో తెలియదా మన వాడికి.”

“సుధాకి తెలిసినా తెలియకపోయినా నాకు బాగా తెలుసు.. సుమిత్రా! ఏ ఆడదీ చేయడానికి ఒప్పుకోని త్యాగం చేశావు నీవు అలా నీవు చేయకుండా ఉంటే బాగుండునేమో, నీ రక్తం పంచుకుని పుట్టిన పిల్లలేనా నీకుండేవారు” తన మనస్సులో అనుకున్నాడు సారధి.

సుమిత్రను ఓదారించడంలో ఉన్న సారధి సుధాకర్ సూట్‌కేస్ పట్టుకుని తనకి చెప్పకుండానే బయటకి వెళ్తున్న విషయం గమనించలేదు. తాపీగా తెలుసుకున్న తరువాత తల్లడిల్లిపోయాడు. ఎప్పుడూ ఇలా జరగలేదు, తమని విడిచి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఎక్కడకి వెళ్లాడు? “తనకాళ్ళమీద తను నిలబడే శక్తి వాడికి రాలేదు. అలాంటి వాడు వెళ్ళి ఎలా బ్రతుకుతాడు?” ఇలా ఆలోచిస్తు కుమిలి పోతున్నాడు సారధి. పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు.

వారం రోజుల తరువాత వచ్చాడు సుధాకర్. అయితే తండ్రి కొడుకుల మధ్య ముక్తసరి మాటలే తప్ప ఆప్యాయతానురాగాలతో కూడిన సంభాషణలు లేవు. మాటామంతీ లేదు, సుమిత్ర దగ్గర కూడా సుధాకర్ ప్రవర్తన అలాగే ఉంది. టైముకి రావడం, భోజనం చేయడం, బయటకు వెళ్ళిపోవడం ఇదే సుధాకర్ దినచర్య.

సుధాకర్‌కి బ్యాంక్‌లో ఎడ్యుకేషన్ లోను లభించింది. లోను శాంక్షను అవాలంటే ఎవరో ఒకరి పూచీకత్తు ఉండాలి. అలా పూచికత్తు సంతకం ఎవరు చేశారో? మాటవరసకైనా ఈ విషయం ఇంటిలో చెప్పలేదన్న బాధ, సారధికి మరో వంక సంతోషం కూడా కలిగింది.

ఎందుకంటే కొడుక్కి కష్టంతో విలువ తెలుస్తోంది. బాధ్యత విలువ తెలుసుకుంటున్నాడు. ఎవ్వరి మీదా ఆధారపడకుండా బ్రతకడానికి సోపానం ఈ చర్య. పట్టుదలతో చదివి ర్యాంకు తెచ్చుకున్నాడు. ఆ పట్టుదలతోనే బ్యాంక్ లోను సంపాదించుకున్నాడు. అయితే తనకి మాట మాత్రమేనా చెప్పలేదు. సుధాకి తను అంత గిట్టని వాడినయిపోయానా? ఇదే సారధి ఆవేదన.

కొడుకు హాస్టలుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు “ఈ డబ్బు నీదగ్గర ఉంచు” అన్నాడు సారధి. “మీ దగ్గర డబ్బు తీసుకున్నా అప్పుగా మాత్రమే తీసుకుంటాను” అన్నాడు సుధాకర్ తండ్రీ కొడుకుల మధ్య ఇలా ఇచ్చిపుచ్చుకునే ప్రస్తావన, పరిస్థితి వస్తుందని సారధి అనుకోలేదు. అందుకే కొడుకు మాటలు అతనికి బాధ కలిగించాయి.

‘మన ఇద్దరి మధ్యా బంధం బాంధవ్యం లేదా? రక్తసంబంధం లేదా?’ ఇలా ఆలోచిస్తూ మరింత కలత చెందుతున్నాడు. కొడుకు వెళ్ళిన తరువాత ఆ దంపతులు కోలుకోలేకపోయారు. తట్టుకోలేకపోయారు. ఆ రాత్రి నిద్రపట్టలేదు సారధికి. కన్నీరు కార్చికార్చి మగతగా నిద్రలోకి జారుకుంది సుమిత్ర,

ఆ పాటి నిద్రకు కూడా నోచుకోలేదు సారధి. రాత్రంతా మనస్సులో మూగగా రోదించాడు. అయినా గుండెలు బాధతో బరువెక్కి ఉన్నాయి. కరువుతీరా ఏడ్చి గుండెల్లో గూడు కట్టుకున్న బాధనుండి విముక్తి పొందాలను కున్నాడు సరస్వతి కొడుకుని, తనని వదిలి వెళ్ళిపోయిన రోజున అయినా అంతగా బాధపడలేదు. ఈ రోజు తన ఎక్కువుగా బాధపడ్తున్నాడు.

నెమ్మదిగా తలుపు తీసుకుని వచ్చి మల్లెపందిరి దగ్గర కూర్చున్నాడు సారధి. ఆవేదనంతా ఒక్కసారి తన్నుకొచ్చింది. చిన్న పిల్లవాడిలా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు సారధి. అతని భుజం మీద ఓ హస్తం పడింది. ఉలిక్కిపడి కన్నీరు తుడుచుకని తల ప్రక్కకి త్రిప్పి తిరిగి చూశాడు. ఎదురుగా సుమిత్ర.

19

సాయంత్ర సమయం. ఆహ్లాదకరమైన వాతావరణం. నీరెండ ప్రకృతికి మరింత సోయగాన్ని ఇస్తోంది. అదే సముద్రపు ఒడ్డయితే మరింత మనోహరంగా ఉంటుంది. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు, నీలమణిలా మెరిసిపోతున్న సముద్ర జలాలు, పాలనురుగులా అగుపించే ఒడ్డుకి చేరిన సముద్రపు నీరు ఇవన్నీ వింత అనుభూతిని ప్రసాదిస్తాయి.

అటువంటి మనోహర వాతావరణంలో సముద్రం ఒడ్డున కూర్చుని సముద్రం పేపు అలల వేపు తదేకంగా చూస్తున్నాడు. మరోసారి దిక్కులు చూస్తున్నాడు అతని నిరీక్షణ ఎవరి కోసం అని ప్రశ్నవేస్తే తను తన హృదయంలో జాగ్రత్తగా పదిలపరుచుకున్న, తను అభిమానిస్తున్న సంధ్య కోసం అని ఇట్టే పసిగట్టేయవచ్చు. ‘నేను సంధ్యను ప్రేమిస్తున్నానా?’ అని అతను ప్రశ్న వేసుకుంటే ‘అవును’ అనే సమాధానం వస్తుంది.

మనం మానవులం ప్రేమతత్వం లేకుండా మనం బ్రతకలేం. ఈ ప్రేమతత్వం ఒక్క మానవుల్లోనే కాకుండా సకల జీవరాశుల్లోనూ అగుపడుతుంది. ‘ఈ ప్రేమ స్వార్గానికి దారి తీయకూడదు. ప్రేమలో నిర్మలత్వం ఉండాలి, నిస్వార్థం ఉండాలి. త్రికరణ శుద్ధిగా ఉండాలి’ సుధాకర్ అనుకుంటాడు. తను సంధ్యమీద చూపిస్తున్న ప్రేమ త్రికరణ శుద్ధిది అని అతని ఆలోచన.

దూరంగా ఏదో పాత పాట వినిపిస్తోంది. “యమునా తీరమున, సంధ్యా సమయాన్న వేయి కనులతో రాధా ఎదురు చూసినోయ్!” అంటూ. అది సంధ్య సమయమే వేయి కనులతో రాధ ఎదురు చూడ్డంకాదు. తను సంధ్య కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ పాటలో అక్కడ యమునా తీరమయితే. ఇక్కడ సముద్రం ఒడ్డు అంతే తేడా.

ఆలోచనలు – ఆలోచనలు. వాటికి అంతు అనేది ఉండనే ఉండదు. మనష్యులు ఖాళీగా ఉండలేరు. నిశ్శబ్ద మాధూర్యాన్ని రుచి చూడలేరు. ఒంటరిగా కూచుని మనస్సులో కదిలే ఆలోచనల్సకి లొంగిన అతని శరీరం కూడా అతని అదుపులో ఉండదు. ఆలోచనలకి. ఉద్వేగాలకి అతను భానిస అవుతాడు. అతని ఆలోచనలు, ఆందోళన బట్టి శరీరాంగాలు చలిస్తాయి. సుధాకర్ పరిస్థితి అదే.

సంధ్యతో తన పరిచయం చాలా తమాషాగా జరిగింది. కాలేజీలో జాయనయిన మొదట్లో సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగు చేశేవారు.

ఈ ర్యాగింగు ఎందుకు పుట్టింది అని చూస్తే జూనియర్స్‌లో బెరుకుతనాన్ని పోగొట్టి తమలో కలుపుకోవాలని. అయితే ఈనాడు ఈ ర్యాగింగ్ ప్రక్రియ హింసాత్మకంగా మారడం చాలా బాధాకరమైన విషయం.

ఆ రోజు ర్యాగింగు సమయంలో తన లాగే క్రొత్తగా మెడిసిన్‌లో జాయినయింది సంధ్య. “ఆమె పేరడిగి ఆమె తల్లో పువ్వు తీసుకురా!” అని ఆజ్ఞాపించారు సీనియర్స్. ఆమెతో తనకి పరిచయం లేదు. చూడ్డం కూడా

మొదటిసారి. అలాంటప్పుడు అంత చనువుగా తను ఆపని ఎలా చేయగలడు? తటపటాయిస్తున్నాడు.

“ఊఁ!! క్విక్” అన్నారు సీనియర్సు. తనకి వాళ్ళ ఆజ్ఞ శిరసావహించవల్సి వచ్చింది.

“మీ పేరు” ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగాడు తను. “సంధ్య” అందామె.

“భయపడకండి. మీ లాగే నేనూ జూనియర్‌‌నే. నన్ను వాళ్ళు ర్యాగింగు చేస్తున్నారు. దానిలో భాగంగా నన్ను వాళ్ళు మీ పేరు అడిగి, మీ తల్లో పువ్వు పట్టుకు రమ్మని ఆజ్ఞ జారీచేసారు. మనం ధైర్యంగా ఉండాలి. మనం భయపడ్తే మరింత అలుసవుతాం. మరింత ఆట పట్టిస్తారు” సుధాకర్ నెమ్మదిగా సంధ్యతో అన్నాడు.

మొదట్లో సుధాకర్ వేపు నిర్లక్ష్యంగా – చురుగ్గా చూసిన సంధ్య వదనంలో అనేక భావాలు. అయితే క్రమేపి ఆమె ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. సుధాకర్ ముఖంలో అగుపడుతున్న అమాయకత్వం, నిర్మలత్వం, నిజాయితీ, కళ్ళల్లో కదలాడుతున్న విజ్ఞానం, ముఖ్యంగా అతని మాట్లాడుతున్న మాటతీరు ఆమెకి బాగా నచ్చాయి. వెంటనే తన తల్లో ఉన్న గులాబీ పువ్వు తీసి అతనికిచ్చింది.

సుధాకర్ ఆ పువ్వుని తీసుకొచ్చి సీనియర్ కిచ్చాడు.

“గుడ్! మేము పెట్టిన పరీక్షల్లో నెగ్గావు రా బచ్చా! ఇవాళికి నీకు పెట్టిన పరీక్ష చాలు. రేపు మళ్ళీ చూసుకోవచ్చు” అంటూ సీనియర్స్ అక్కడి నుండి కదిలారు.

“అమ్మయ్య! అని అనుకుంటూ సుధాకర్ ఊపిరి పీల్చాడు. ఇలా జరిగింది సంధ్యతో తన తొలి పరిచయం. ఆ పరిచయం చిక్కబడి దట్టంగా అల్లుకుపోయింది. అది కాస్త ప్రేమ తత్వంగా మారిందని తను అనుకుంటాడు.

***

“మహాశయా! ఏంటా దీర్ఘాలోచన?” సంధ్య అతని భుజం మీద తట్టి అంది. ఒక్క సారి ఉలిక్కిపడి భాహ్య జగత్తులోకి అడుగు పెట్టాడు.

“నేను ఎంత సేపటి నుండి నిరీక్షిస్తున్నానో తెలుసా? నిరీక్షించి, నిరీక్షించి ఇలా ఆలోచన్లలోకి జారుకున్నాను. కాలం ఎంత విలువైనదో తెలుసా? గడిచిపోయిన కాలం తిరిగి రాదు. పోయిన డబ్బు నైనా సంపాదించవచ్చు కాని వెన్నపూసలా కరిగిపోయిన కాలం తిరిగిరాదు అంటాడు ఓ కవి.”

“సారీ చెప్తున్నానా! ఒక్క విషయం సుధాకర్ గారూ! మనం ఒక్కసారి బాల్యాన్ని గుర్తు తెచ్చుకంటే ముందు మనస్సుని లాక్కుపోయేది అమ్మ గురించి స్మృతులే, ఆ తరువాత తండ్రిని గురించినవి. ఆ తరవాతే మిగిలినవి. అందరికీ బాల్యంలోని అన్ని కోణాలతోనూ ప్రేమతో పెనవేసుకుని ఉండేది అమ్మే. పేదవాళ్ళకి ధనికులకీ అందరికీ అమ్మ అమ్మే. పేదరికంతో బాధపడుతూ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ ఎవరికైనా ఆరాధ్య దేవతే, అతిథులు ఎవరైనా వస్తే తను పస్తులుండి తన భోజనం అతిథులకి తినిపిస్తుంది. ఆటలాడబోయి దెబ్బలు తగిలినప్పుడు తల్లడిల్లిపోయేది అమ్మయే. జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళేది అమ్మయే. అంతగా అక్షర జ్ఞానం లేకున్నా అంతకు మించిన సంస్కార జ్ఞానంతో పిల్లల్ని చదివించేది అమ్మయే. బ్రతికి ఉన్నంత కాలం తన సంతానం కోసం తల్లడిల్లేది అమ్మయే.

పేదరికంలో మగ్గినా, సుఖాలలో జీవించినా బాల్యంలో తల్లి పిల్లల కోసం చేసే త్యాగాలూ అందరికీ జ్ఞాపకముండి మనస్సుని కదిలిస్తూనే ఉంటాయి. బాల్యం అవచ్చు, యవ్వనం అవచ్చు అన్ని సమయాల్లో అమ్మకి ఉన్న అవినాభావ సంబధం అలాంటిది. అలాంటి అమ్మను ఆ తరువాత జీవితంలో బాధలు పెట్టే పిల్లలు ఏవిధంగా క్షమార్హులు కారు. మరి నాన్నో తన శ్రమని, డబ్బుగా మార్చి తన పిల్లల కోసం అహర్నిశలు ప్రయత్నిస్తూనే ఉంటాడు. పిల్లల కోసం తను తన సుఖం చూసుకోడు. కొన్ని సుఖాల్ని త్యాగం చేస్తాడు.”

సంధ్య మాటలు మొదట అర్ధం చేసుకోలేదు సుధాకర్. నెమ్మదిగా అర్థం చేసుకున్న తరువాత ఆ మాటలు తనకి చెంప పెట్టయ్యాయి. సంధ్యకి తల్లిదండ్రులంటే ఎంత ప్రేమ? ఎంత విశ్వాసం? ఎంత కృతజ్ఞత? మరి తనకో?

మరి ఆలోచించడానికే మనస్కరించలేదు. మూడీగా తయారయ్యాడు. ఒక్కసారి అతనిలో వచ్చిన మార్పుకి సంధ్య విస్తుపోయింది. ఎంత సంతోషంగా ఉన్నాడు. తను వచ్చినప్పుడు? తన మాటలకి ఇలా మూడీగా తయారయ్యాడు. దీనికి కారణం తనే అనుకున్న సంధ్య “సారీ! సుధాకర్! నిన్ను అప్‌సెట్ చేసాను.”

‘లేదు. సంధ్యా! నా కళ్ళు తెరిపించావు’ అని మనస్సులో అనుకున్నాడు. పైకి మాత్రం “లేదు సంధ్యా! ఏవో విషయాలు గుర్తుకు వచ్చాయి” అని అన్నాడు.

అతను ఎన్నో ఆశల్తో – కోరికలతో అక్కడికి వచ్చాడు. ఆమె కూడా తన మనస్సులో ఉన్న కోరిక తెలియ జేయడానికి వచ్చింది. అయితే వాళ్ళిద్దరూ తమతమ భావాలు ఒకరికి మరొకరికి తెలియ జేయలేకపోయారు.

“సంధ్యా మీరు మీ తల్లిదండ్రుల గురించి చెప్తుంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది. మీ లాగే నాకూ నా తల్లిదండ్రులు అంతే.”

అతని మాటలకి సంధ్య విస్తుపోయింది. “మీ తల్లిదండ్రుల గురించి ఎప్పుడూ నాకు చెప్పలేదే!”

“చెప్పే అవసరం – సందర్భం రాలేదు. అందుకే చెప్పలేదు. చెప్పవల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ప్లీజ్ మరేఁ నన్ను అడగద్దు. నాకు ఇప్పుడు ప్రశాంతత కావాలి” అంటూ అతను అక్కడ నుండి చకచకా నడిచుకుంటూ పోయాడు. విస్తుపోతూ అలా చూస్తూ నిల్చుండిపోయింది సంధ్య.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here