[dropcap]వా[/dropcap]డు
అర్ధాకలితో పస్తులుండి
ఆరుగాలం పడేకష్టం
నీ పంటి క్రింద మెతుకవుతుంది.
వాడు
తన ఎర్రటి నెత్తుటిని చెమట చుక్కగా మార్చి
పైరుకు సత్తువ అందిస్తేనే
కమ్మని రుచులతో
నీ బొజ్జ నిండుతుంది.
వాడు
అప్పుల భారాన్ని మోస్తూ
అంతులేని అవమానాల సుడిగుండంలో
చిక్కుకుంటేనే
నీ ఇంట్లో విస్తరి వేస్తుంది.
వాడు
ప్రతి నిత్యం
వరుణదేవుడి కోపానికి
కరవు రక్కసి శాపానికి మధ్య
నలిగితేనే
నీ ఇంట్లో గాదె నిండి
నీ ఆకలి మంట చల్లారుతుంది.
వాడు
ఉచ్వాస, నిచ్వాశాల్ని పోగులుగా మార్చి
అనుక్షణం మట్టిలో పురుగయితేనే
భూ మాత పచ్చని చీర కట్టుకుని మురిసిపోతుంది.
వాడు
నాగలి పట్టి సేద్యం చేసిన ప్రతీ సారి
పురుగు మందుల వ్యాపారి నిర్మించే
భవంతి కోసం పునాది రాయి అవుతాడు.
ఎరువులు విక్రయించే వాడు కట్టే
రంగుల సౌధంలో
ఇటుక రాయిగా అమరిపోతాడు.
నేతలెందరు మారినా
మారని తన తలరాతను
నిందించుకోని
వాడికి తన జీవితంలో
పైరును తడిపే వాన సంగతేమో గానీ
నాయకుల హామీల జడివానలో
అనుక్షణం నానుతూనే ఉన్నాడు.
అయిదేళ్లకోసారి జరిగే…
నా ప్రజాస్వామ్య భారత ఎన్నికల తంత్రంలో
ఖద్దరు నేతను అధికార గద్దెనెక్కించే
విలువైన ఓటుగా మారుతాడు.
తాను నమ్మిన భూమి
నిత్యం నట్టేట ముంచుతున్నా
పస్తులతో ప్రాణాలు కోల్పోతూ
వ్యవసాయ జూదం వదులుకోలేని
ధర్మరాజుగానే మిగిలి పోతూంటాడు.
బ్రతికి చావలేక
చచ్చీ బ్రతకలేని వాడికి
అప్పుడప్పుడూ
పురుగుమందుల డబ్బాపైనూ…
పొలం గట్టున ఎండిన చెట్టు మీదనూ
అంతులేని ఆప్యాయత కలిగిన ఘటన
రంగుల టెలివిజన్ లో
ఫ్లాష్ న్యూస్ గానో
దిన పత్రికల పతాక శీర్షిక గానో
వార్తగా తయారౌతోంది.
దేశపు వెన్నెముకగా
ఘనమైన కీర్తి భారాన్ని మోస్తూ
నడుం విరిగి దేహం ఒరిగిన
శతాబ్దాల శాపగ్రస్తుడైన
అన్నదాత బ్రతుకు మారేది ఎన్నాళ్ళకో?
ఇంకెన్నేళ్లకో?