ఎన్నని విడిసేవు..

0
3

[శ్రీ ఇక్బాల్ పాషా రచించిన ‘ఎన్నని విడిసేవు..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఎ[/dropcap]క్కడ జూసినా
ఇదే ధర్మం
ఎవరేమనుకున్నా
ఎగరేసుకుపోవడం..

కడుపులమీద
కాలెట్టి
కంటికింపైనదల్లా
కాజేయడం..

అంజనమేసి
ఔననిపించుకోవడం..
గెలుపు
తమదనిపించుకోవడం..

ఎక్కడని పోతావ్..

వానగురిసే
వాసన పసిగట్టి
మురిసి ముసిరే
ఉసిళ్ల గుంపోలె..

ఏ వేదిక జూసినా
నయా దుడ్ల మూకలే..
కొంపను కొల్లేరుజేసే
రాజ్యేతర మందలే..

ఎన్నని విడిసేవు
ఎంతని సూసేవు..
యాడజూడూ
అవే అయినప్పుడు..

గమ్ము గుండడం
తెలివికి గుర్తిక్కడ..
మనోళ్లే గదా అనుకోవడం
మేధావితనమిక్కడ..

అర్థం కాలేదా
బేవకూఫ్ ఆగమైతవ్..
దీపముండంగనే
ఇల్లు సర్దుకోవడం నేర్చుకో..

నా సోంచు నాది
నా ఇష్టమంటే..
భుగతలు బాగేవుంటరు
నాశన మైతవ్రో నాలాయక్..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here