[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]
[dropcap]చా[/dropcap]లారోజుల తర్వాత అభయాంబక్కయ్య ఫోన్ చేసింది. అభయాంబక్కయ్య మీకు గుర్తుంది కదా.. చిన్నప్పుడు నేనూ, మా చెల్లెళ్ళూ మడి తడీ లేకుండా తిరుగుతామని మా అమ్మగారికి ఫిర్యాదు చేసేదీ.. చాలా యేళ్ళ తర్వాత హైద్రాబాదులో మళ్ళీ కనిపించి, చిత్రగుప్తుడి నోము గురించి చెప్పిందీ.. ఆ అభయాంబక్కయ్య.
అక్కయ్య ఫోన్ చేసి చాలా నెలలై పోయిందని గుర్తు చేసుకుంటూ, “ఏంటక్కయ్యా విశేషాలూ!” అనడిగాను.
“ఏవిటో స్వర్ణా.. పొద్దున్నేమో తలనెప్పీ, పదింటికేమో చెయ్యి నెప్పీ, ఒంటిగంటకేమో కడుపునెప్పీ, సాయంత్రం నడుంనెప్పీ, రాత్రి కాళ్ళ నెప్పులూ..” అంది విచారంగా..
నాకు అర్థం కాలేదు.
“ఏంటక్కయ్యా.. ఒంట్లో బాగుండడంలేదా!”
“అహా.. కాదు.. మా అబ్బాయి దగ్గర కెళ్ళి మొన్ననే వచ్చాం, నేనూ మీ బావగారూనూ..” అని కాసేపాగింది నా రియాక్షన్ కోసం.
“మీ అబ్బాయి న్యూయార్క్‌లో ఉంటాడు కదా!.. ఎప్పుడెళ్ళేరూ.. ఎప్పుడొచ్చారూ!” అన్నాను నా మాటల్లో అక్కయ్యకి కుతూహలం వినిపించేలా..
“వెళ్ళి ఆర్నెల్లయింది.. వచ్చి పది రోజులైంది. వచ్చినప్పట్నించీ ఒకటే షాపింగ్ అనుకో..”
ఎవరైనా పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు షాపింగ్ చేస్తారు కానీ వచ్చేక చేస్తారా అనుకుంటూ “అహా.. ఏం కొన్నారు అక్కయ్యా” అనడిగాను.
“ఏవోనమ్మా.. అక్కడ గిన్నెలూ, బట్టలూ అన్నీ మిషన్లతో పని చెయ్యడం అలవాటయిందా! ఇక్కడి కొచ్చాక తెగ ఇబ్బంది పడ్డాననుకో..”
“ఏం.. పని చెయ్యడానికి ఎవరూ దొరకలేదా!”
“దొరక్కేం.. కానీ మిషన్లు చేసినంత శుభ్రంగా మనుషులు చెయ్యలేరు కదా.. అందుకే రాగానే వాషింగ్ మిషనూ, డిష్ వాషరూ, రోబో క్లినూ, రోబో కుక్కూ ఇలాంటి వన్నీ కొనిపడేసేరు మీ బావగారు.” అక్కయ్య గొంతులో గర్వం వద్దన్నా వినిపించింది నాకు.
“మరింకేం.. అన్నీ ఉంటే నీకు నెప్పు లెందుకు వస్తున్నాయీ!”
“అదేంటి స్వర్ణా అలాగంటావ్! ఆ కొన్న మిషన్లన్నీ వాడాలంటే ఎంత కష్టపడాలీ.. ఒక్కొక్క స్విచీ వెయ్యాలా.. టైమ్ అదీ సెట్ చెయ్యాలా.. వాటి నన్నింటినీ గుర్తు పెట్టుకోలేక అలారం పెట్టుకోవాలా! అన్నింటికీ మీటలు నొక్కడమే.. అలా మీటలు నొక్కి నొక్కి నాకు వేలినెప్పి కూడా వచ్చిందనుకో”
ఓర్నాయనో.. ఈ అభయాంబక్కయ్య సుకుమారానికి ఎల్లలు లేవా యేంటీ అనుకుంటూ,
“వేలినెప్పి కూడా వచ్చిందా! అయ్యో.. ఎందుకొచ్చినట్టో..!” అన్నాను వెటకారాన్ని బైట పడనివ్వకుండా..
“అదే నాకూ అర్థం కాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఓ డబ్బాడు మాత్రలిచ్చి ఆయనన్నాడూ.. రోజూ పొద్దున్నా, సాయంత్రం వాకింగ్ చెయ్యాలిట.. యోగా, మెడిటేషన్ చెయ్యాలిట.. నూనె వస్తువులేవీ తినకూడదుట. టైమ్ ప్రకారం తిని పడుకోవాలిట.. అవన్నీ నేనెక్కడ చెయ్యగలనూ!”
“అదేంటక్కయ్యా.. డాక్టర్ చెప్పాడంటే చెయ్యాలి కదా మరీ..”
“ఎక్కడ కుదురుతుంది స్వర్ణా.. కొన్ని హోటల్స్‌లో నేమో ఎక్కువ నూనె వాడతారు. కొన్నిచోట్ల అంత ఎక్కువ వాడరు కానీ ఆ వంటలు మీ బావగారికి నచ్చవు. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ రోజూ ఇడ్లీయే తినలేం కదా! ఓ రోజు పూరీ, ఇంకో రోజు వడా తెప్పించుకుంటాం కదా! మరి నూనె లేకుండా ఎలా ఉంటుందీ! రాత్రయితే సరే.. ఎలాగూ చపాతీలే ననుకో.. కానీ దానిలోకి గ్రేవీయే కావాలి.. మరి డాక్టర్ చెప్పినవి చెయ్యడం ఎక్కడ కుదుర్తుందీ!”
“అదేంటీ! రోబో కుక్ కొన్నానన్నావు కదా! మీ ఇద్దరికీ ఇంట్లో హాయిగా వంట చేసుకోవచ్చు కదా!”
“అలా కుదర్దులే స్వర్ణా.. ఇన్నాళ్ళూ వండీ వార్చీ అల్సిపోయేనని, ఇకముందు నన్ను వంటింటి ఛాయలకి వెళ్ళొద్దని మా అబ్బాయి నాతో గట్టిగా చెప్పాడు.. వాడన్నది కూడా కరెక్టే కదా! ఎన్నాళ్లని ఆ వంటింటిని పట్టుకుని వేళ్ళాడతాం. మనకి కూడా మన టైమూ, స్పేసూ ఉండాలి కదా.. అందుకే వచ్చినప్పట్నించీ అన్నీ బైటనుంచే తెప్పించేస్తున్నాను.”
ఇంట్లో మనిషికి శ్రమలేకుండా చేసే మిషన్లన్నీ కొనుక్కుని తినడానికి ఇలా బైట నించి తెప్పించుకోవడమేంటో నాకు అర్థం కాలేదు.
“మాట్లాడవేం స్వర్ణా..”
నాకు ఏం మాట్లాడాలో తోచలేదు.
“మరి.. నువ్వు పొద్దుట్నించీ ఏం చేస్తావూ..” అనడిగాను ఇంక ఏమడగాలో తోచక..
“అంటే.. పనీపాటా లేకుండా ఉన్నాననుకుంటున్నావా! పొద్దున్నే కాఫీ పెడతానా.. ఇద్దరం తాగుతామా.. స్నానం, చేసి పూజ చేసుకోవద్దూ!.. తొమ్మిదయిపోతుంటుంది.. సరే స్విగ్గీ నుంచి తెప్పించుకున్నవి తీసుకు తినాలా!.. మళ్ళీ రెండోసారి కాఫీ కాచాలా.” వదిన చెప్పుకుపోతోంది.
నా తల్లే.. నీ పొట్టకి నువ్వు తినకుండా ఏ మిషనైనా తినేసి, ఆ బలం నీకు వచ్చేలా ఉంటే బాగుండును అనుకున్నాను.
“స్వర్ణా, మాట్లాడవేం.. ఇప్పుడు నేనేం చెయ్యాలో కాస్త సలహా చెప్తావని ఫోన్ చేసేను.” అవతల్నించి అక్కయ్య గొంతు.
ఇలాంటి అక్కయ్యకి సలహా ఇచ్చేంతటి దాననా.. అనుకుంటూ..
“దేని గురించి నీకు సలహా కావాలీ!”
“అదేనోయ్..ఈ డాక్టర్ ఇచ్చిన్ కాప్స్యూల్స్ పెద్దగా ఉన్నాయి. గొంతు దిగడం కష్టంగా ఉంది. అందులోనూ ఓ మాత్రుంది చూడూ.. అది కాస్త నాలిక్కి తగిలిందటే చేదు విషం అనుకో.. అందుకే నీకు తెలిసిన హోమియో డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్తావనీ.. ఆ మాత్రలయితే ఎంచక్కా పంచదారలా చప్పరించెయ్యొచ్చు..”
‘నా తల్లే’ అనుకుని, “అలాగే అక్కయ్యా.. నాకు తెలిసినవాళ్లని కనుక్కుని చెప్తాను. ఈ లోపల నువ్వు జాగ్రత్తగా ఉండు..” అని ఫోన్ పెట్టేసేను.
ఫోనయితే పెట్టేసేను కానీ, కనుక్కున్నానా లేదా నని అక్కయ్య దగ్గర్నించి ఫోన్ ఎప్పుడు వస్తుందోనని భయంగానే ఉంది. అలా ఫోన్ వస్తే ఏం చెప్పాలి ఈ అభయాంబక్కయ్యకి.. ఆ జవాబేదో దొరికేదాకా అక్కయ్య ఫోన్ ఎత్తకూడదని నిర్ణయించేసుకున్నాను. హమ్మయ్య.. మనసు శాంతపడింది.