[box type=’note’ fontsize=’16’] మన దేశంలో జరిగే ఎన్నికల గురించి, ఎన్నికల నియమావళి గురించి, అభ్యర్థుల అర్హతలు అనర్హతల గురించి, ఎన్నికల ప్రక్రియ గురించి సరళంగా వివరిస్తున్నారు శ్రీధర్ చౌడారపు. [/box]
[dropcap]“తా[/dropcap]తయ్యొచ్చాడు … తాతయ్యొచ్చాడు” పిల్లల అరుపులకు వంటింట్లోంచి చేతుల తడిని కొంగుకు తుడుచుకుంటూ బయటకు వచ్చింది సరస్వతి. గేటు తీసుకుని లోపలికి వస్తోన్న పరంధామయ్యగారికి తలోవైపునా నడుస్తూ గంతులేస్తున్న రమణీ, రాజేశ్లను అదిలించి మామగారిచేతిలోంచి సంచీని ఎయిర్ బ్యాగును తీసేసుకుంది. మనవడూ మనవరాలిని చెరోవంక చేతుల్లో చేయికలిపి ఇంట్లో అడుగుపెట్టి హాల్లో సోఫాలో కూచుని ఉస్సురంటున్న మామగారికి ఫ్రిజ్జులోని బాటిల్ నీళ్ళు అందిస్తూ.
‘అందరూ.. అదే అత్తయ్యా వాళ్ళు కులాసానా మామగారూ! ‘అంది
‘ఆ… అందరూ కులాసాయే లేమ్మా. చాలా రోజులయ్యింది ఇటురాక మిమ్మల్ని చూడక. మనసుపుట్టి అలా బయల్దేరి వచ్చేసాను’ అన్నాడు పరంధామయ్య.
‘అత్తయ్యను కూడా తీసుకరాలేకపోయారా’ అంది సరస్వతి
‘ఎక్కడమ్మా… ఇప్పుడు చేలోని పత్తి ఏరుతున్నారు. జీతగాళ్ళను పనివాళ్ళను వెంటపడి పని చేయిస్తేనే గాని మంచి ధరలో పత్తి అమ్ముకోగలం కదా. అందుకే తను రాలేకపోయింది. నా ఆరాటం చూసి ప్రస్తుతానికి మీరెళ్ళి రండి. తరువాత ఇద్దరం కలిసి మరోసారి వెళదాం అంటే ఇలా ఒక్కణ్ణే వచ్చాను’.
‘సరేగాని మీరు ముగ్గురే కనిపిస్తున్నారు. సెలవురోజున నీవున్నావు ఇంట్లో… ఇంతకీ ఏడీ నా సుపుత్రుడు, అదే మీ ఆయన….’ చిన్నగా నవ్వుతూ అన్నాడు.
“ఎలక్షన్లు కదా మామయ్యా. ఏవో పనులు ఉన్నాయి అని ఆఫీసుకు వెళ్ళారు. ఈ పనికిమాలిన ఎన్నికల తంతు ఏమిటోగానీ పిచ్చెక్కిపోతోందంటే నమ్మండి. ఆఫీసుల్లో పనులు జరగటంలేదు. ఏదన్నా అంటే ఎలక్షన్లండీ. అందరం అదే బిజీ. కౌటింగ్ పూర్తయ్యేదాకా మీ పనులు అంతే… అంటున్నారు ఆఫీసు సిబ్బంది. ఇక ప్రచారాలు మొదలయ్యాయంటే మీటింగులు వాటివద్ద పెద్దపెద్ద శబ్బంతో స్పీచులు. ఊరంతా బుర్రు బుర్రుమంటూ తిరుగుతూ ‘మాకే మీ ఓటు. మా అభ్యర్థికే మీ ఓటు’ అంటూ రాత్రింబవళ్ళు ప్రచారరథాల రొదలు. ఇక మనఃశాంతి కరువే మామయ్యా… ” అంది సరస్వతి
“తప్పదమ్మా… ఇది ప్రజాస్వామ్య దేవతకు మనందరం చేస్తున్న పూజ. మనం అంటే జనం, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని, తమను తాము పరిపాలించుకోవడానికి ప్రతినిధులను ఎన్నుకోవాలంటే ఈ తతంగం తప్పదు కదమ్మా” అన్నాడు పరంధామయ్య.
“ఏం ప్రతినిధులో ఏమో మామయ్యా. ప్రతి అడ్డమైన వ్యక్తి ఎన్నికల్లో నిలబడటం. నాకే ఓటేయండంటూ రావడం. అడగటం మొహమాటపెట్టడం. ఆ తలకుమాసిన వాళ్ళలో ఒకరు ఎన్నికై మనల్ని ఐదేళ్లు పరిపాలించడం. ఛఛ ఏమిటో ఇది. ఎన్నికల్లో ఎవరుపోటీ చేయాలో, ఎవరు చేయకూడదో …? ఒక పద్దతీ.. పాడూ లేదు…” అంది సరస్వతి
“అహహ… అలా అనకమ్మా. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ వ్యక్తికి ఎన్నో అర్హతలు ఉండాలి. అందులో మొదటిది. ఆ వ్యక్తి భారత పౌరసత్వం కలిగి ఉండాలి. కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన వయసు కలిగి ఉండాలి. అంతేకాదు భారతదేశ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలిగిఉండి దేశ సమగ్రతను కాపాడతానని, సార్వభౌమత్వాన్ని నిలబెడతానని ప్రమాణం కూడా చేయాలి.”
“ఆ..ఆ…ఇవేం అర్హతలు మామయ్యా. ఇవన్నీ ఈ దేశంలో ఉంటూ మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉన్న అర్హతలే కదా…” అంది కాఫీ గ్లాసు తెచ్చి మామగారి చేతికి అందిస్తూ సరస్వతి.
“నీ చేతి కాఫీ అద్భుతం సరస్వతీ. కాఫీ అంటే ఇలా ఉండాలి. కాస్తంత చేదు, కాస్తంత వగరూ, తగినంత తీపి… చిక్కగా, చక్కగా ఘుమఘుమ వాసనలతో…. నిజంగానే నీ చేతి కాఫీ అమృతం అనుకో!” అన్నాడు పరంధామయ్య ఒకో గుటక వేస్తూ.
ప్రశంసకు సిగ్గుతో మొహం కందిపోగా… “అంతా మీ అభిమానం మామయ్యా. అందరు ఎలా చేస్తారో నేనూ అలాగే చేశాను. కొత్తగా, గొప్పగా ఏమీ చేయలేదు…” అంది తలదించుకుంటూ సరస్వతి
“లేదమ్మా! కొంతమంది చేదు కషాయంలా చేస్తారు. మరికొంతమంది చక్కెరపానకంలా చేస్తారు. ఇంకొంతమంది చేస్తే నీళ్ళునీళ్ళుగా ఉంటుంది. నీలా అన్నీ తగు పాళ్ళలో కలిపి నురగ తేలేలా సువాసనతో కూడిన కాఫీ… అదీ ఫిల్టరు కాఫీ కలిపి ఇచ్చేవాళ్ళెంతమంది ఉన్నారమ్మా… ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేలా ఉంది….” అన్నాడు మెల్లగా కప్పు ఖాళీ చేస్తూ
“ఏదో నాకు చేతనయినట్లు చేస్తున్నాను. మీకు నచ్చింది… అదే పదివేలు. మీరడినన్నిసార్లు కావాలంటే అన్నిసార్లూ ఇస్తాను. సరేనా మామాయ్యా” అంది.
ఖాళీ అయిన కాఫీగ్లాసును తీసుకెళ్ళి వంటింటి సింకులో వేసి వచ్చి పిల్లల పక్కన కూచుంటూ… “మామయ్యా! ఎన్నికల్లో పోటీకి నిలబడుతున్నవాళ్ళలో ఎంతోమంది నేరాలు ఘోరాలు చేసినవారు కనిపిస్తున్నారు. పోలీసుల చేత అరెస్టు చేయబడి, కోర్టు కేసులు మెడనేసుకుని తిరిగేవారూ ఉన్నారు. వీళ్ళు ఇళ్ళల్లోకి వచ్చి మాకే మీ ఓటు, మమ్మల్ని గెలిపిస్తే మేమే మీ ప్రతినిధులమయి ప్రభుత్వాన్ని నడుపుతాం అంటే సిగ్గుతో తల వాలిపోతోంది… !” అంది సరస్వతి.
“అలా అనకమ్మా. నేరం ఆరోపింపబడినా, ఇంకా నిరూపణ కాక శిక్ష పడని వాళ్ళు అర్హులే. కాని నేరస్తులకు మాత్రం పోటీ చేయడానికి అర్హత లేదమ్మా. అంటే కనీసం ఐదారేళ్ళు, వాళ్ళు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండాల్సిందే…” అన్నాడు పరంధామయ్య.
“అంటే…” అంది సరస్వతి.
“చూడమ్మా.. భారత ప్రజా ప్రతినిధుల చట్టం అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి….
కులము, మతము, జాతి, పుట్టిన స్థలం, నివాసము, భాష ఆధారంగా ప్రజలమధ్య శత్రుత్వాన్ని పెంచితే,
- లంచం తీసుకుంటే
- ఎన్నికల్లో ప్రజలపై ఒత్తిడి తెచ్చినా
- మానభంగం చేసినా, దానికి సహాయపడినా…
“అలాంటి దుర్మార్గుడు ఎన్నికల్లో నిలబడటం కూడానా…” కసిగా అంది సరస్వతి
“అంతే కాదమ్మా…
- గృహహింసలో నేరం ఋజువయిన భర్త లేక భర్త కుటుంబ సభ్యులు ఎవరయినా
- వివిధ వర్గాల మధ్య శత్రు భావాన్ని పెంచే statement ఇచ్చినా, ఆరాధ్య స్థలాలలో లేదా మత, దేవీ దేవతా సంబంధమైన కార్యక్రమాలకై గుమిగూడీన ప్రజల సమూహంలో ఇతరమత ఆరాధ్య వర్గాల పట్ల అలాంటి వైరభావాన్ని పెంచే ప్రసంగాలు చేసినా
“అవునా… ???” అంది సరస్వతి
“ఇంకా ఉందమ్మా!…
- అస్పృశ్యత ను పాటించినా
- నిషేధించబడిన వస్తువులను విదేశాల నుండి దిగుమతి చేసుకున్నా
- చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ నిషేధించబడిన సంస్థల యందు సభ్యత్వం కలిగి ఉంటేనూ
- విదేశీ మారక ద్రవ్యం విషయంలో నేరం చేసినా
- మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు తయారీ, దిగుమతి, కొనుగోలు, అమ్మకం, సరఫరా… లాంటి నేరాలు చేసినా
- ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టినా
“ఉగ్రవాదులు, మత్తు పదార్థాల వ్యక్తులూ ఎన్నికయి మనల్ని పరిపాలిస్తే మన గతిఅధోగతే కదా తాతయ్యా…” అంది రాగిణి
“అవును మనవరాలా..! నిజం చెప్పావు. అలాంటి దుర్మార్గులు ద్రోహులు మన పరిపాలనా చట్రంల.. ఇంకా
- మతసంస్థలను చట్ట వ్యతిరేక పనులకు వినియోగించినా
- ఎన్నికల సమయంలో వివిధ వర్గాల మధ్య గొడవలు లేవనెత్తినా, పోలింగ్ కేంద్రం నఉంచి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోయినా, బూత్ క్యాప్చరింగ్ చేసినా, రిటర్నింగ్ అధికారికి ఇతర అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను పాడుచేసినా, చించివేసినా
- ఆరాధ్యస్థలాలను ఇతర మత ఆరాధ్య స్థలంగా మార్పడి చేసినా
- భారత జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని అవమానించినా, జాతీయ గీతం పాడటాన్ని ఆటంకపరిచినా
- సతీసహగమనంను ప్రోత్సహించడం లాంటి నేరాలు చేస్తే, కోర్టులో నేరం నిరూపింపబడి శిక్ష పడితే ఆ వ్యక్తి ఎన్నికల పోటీ ప్రక్రియ నుండి కనీసం ఆరు సంవత్సరాలు దూరంగా ఉండాలి. కేవలం జరిమానా పడితే, జరిమానా చెల్లించిన నాటినుండి ఆరు సంవత్సరాలు…”
“మరి జైలు శిక్ష పడితేనో…” ఉత్సాహంగా సంభాషణను వింటున్న రాజేశ్ అడిగాడు.
మనవడిని దగ్గరకు లాక్కుని బుగ్గలు పునుకుతూ… “జైలు శిక్ష పడితే, శిక్షాకాలం పూర్తి అయి, విడుదల అయిన నాటినుండి ఆరు సంవత్సరాలు దూరంగా ఉండాల్సిందే” చెప్పాడు.
“తాతయ్యా… నాదో సందేహం” అంది రాగిణి.
“ఏమిటమ్మా…” అన్నాడు పరంధామయ్య.
“నువ్వు చెప్పిన నేరాలు కొన్నే ఉన్నాయి. కానీ అవే కాకుండా ఇంకా ఎన్నో రకాల నేరాలు జరుగుతున్నాయి కదా. మరి అలాంటి నేరాలు చేసిన వారు… వారు ఎన్నికల్లో పోటీకి అర్హులేనా..?” ఆలోచనగా చూస్తూ అడిగింది రాగిణి.
“మంచి ప్రశ్న వేశావమ్మా. నేను చెప్పినవి ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ (ఎనిమిది)లోని సబ్ సెక్షన్ (ఒకటి) లో పేర్కొన్న నేరాలు తల్లీ. ఇంకా సబ్ సెక్షన్ (రెండు), సబ్ సెక్షన్ (మూడు)లో కూడా మరిన్ని నేరాలు పేర్కొన్నారు” చెప్పాడు.
“ఏమిటా నేరాలు తాతయ్యా…” అడిగాడు రాజేశ్ కల్పించుకుంటూ
“ఆగరా భడవా! చెబుతాగా… ఒక వ్యక్తి నిత్యావసర వస్తువులను ఇతర కొనుగోలు వస్తువులను దాచి, రహస్యంగా నిల్వచేసి, సరఫరానుంచి తొలగించి కృత్రిమ కొరతను సృష్టించి ధరను పెంచుకునే ప్రయత్నం చేయడం, ఆహారపదార్థాలు, తినుబండారాలు అలాగే ఆరోగ్యసంబంధమైన మందులూ, ఔషధాలను కల్తీ చేయడం; తన కుమారునికి లేదా తమ్ముడికీ లేదా మేనల్లుడికి లేదా మనవడికి ఇలా ఏ అబ్బాయికైనా ఆడపిల్ల తల్లిదండ్రులు ఇతర బంధువుల నుండి మగపెళ్ళివారం అనుకుంటూ కట్నం తీసుకోవడం…. లాంటి చేసిన నేరాలు నిరూపింపబడి కనీసం ఆరు నెలలకు తక్కువ కాకుండా శిక్ష పడితే వారి శిక్షాకాలం పూర్తి అయిన నాటి నుండి కనీసం ఆరు సంవత్సరాల కాలం ఆ వ్యక్తి లేదా వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులే.”
“అలాగా… మరి ఇవే కాక ఇంకెన్నో నేరాలు జరుగుతున్నాయి కదా. మరి వాటి సంగతేనూ…” సాలోచనగా అంది సరస్వతి.
“ఆ… ఆ… నువ్వు అడుగే సందేహం నిజమేనమ్మా. చట్టం ఆ నేరస్తులను కూడా వదల్లేదమ్మా. పైన పేర్కొన్న నేరాలు కాక ఇతర నేరాలు చేసి న్యాయస్థానం చేత కనీసం రెండు సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష విధించబడిన వారు శిక్షాకాలం పూర్తిచేసుకుని విడుదల అయిన తేదీనుండి ఆరు సంవత్సరాల కాలం వరకూ ఎన్నికల్లో పోటీకి అనర్హులే…” అన్నాడు పరంధామయ్య
“అలాగా… సరే మామయ్యా! న్యాయస్థానం తీర్పులిచ్చిన కేసుల్లో నేరస్తులయిన వారికి అనర్హతలు ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా కొన్నిసార్లు ప్రభుత్వ ఉద్యోగులపై చర్య తీసుకుంటుంది కదా ఏసీబీ కేసులూ అవీనూ… వాటి విషయంలో ఏమిటి” అంది సరస్వతి
“అలాంటి వాటి విషయంలో కూడా తగిన ఏర్పాట్లు ఉన్నాయమ్మా చట్టంలో… లంచారోపణ నిరూపితమైన వ్యక్తి, ఆ ఉత్తర్వులు వచ్చిన రోజు నుంచి ఆరు సంవత్సరాల కాలం, ఆ నేరం కింద ప్రభుత్వానకి విశ్వాసపాత్రత చూపించక ప్రభుత్వం చేత డిస్మిస్ చేయబడిన వ్యక్తి కనీసం ఐదు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.”
“నేరాలు చేసి శిక్షింపబడినవారేనా అనర్హులు. లేక మరింకేమైనా అనర్హతలు ఉన్నాయా తాతయ్యా…” అడిగింది రాగిణి
“లేకేం అమ్మా! ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారు అంటే ప్రభుత్వం చేత నియామకం చేయబడ్డవారూ, వేతనం పొందుతూన్నవారు, వారి తొలగింపుకు ప్రభుత్వానికి తగిన అధికారం కలిగిఉంటే ఆయా వ్యక్తులు అందరూ అనర్హులే. ఇంకా ప్రైవేటు కంపెనీలలో ప్రభుత్వ వాటా ఇరవైఐదు శాతానికి మించి ఉంటే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీలు పోటీకి అనర్హులు.”
“ఇంకా తాతయ్యా…” అన్నాడు రాజేశ్
“అలాగే ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ సంస్థలకు వస్తువులు/సరుకుల సరఫరా చేయటానికి లేదా నిర్మాణాలు తవ్వకాలు చేపట్టి పూర్తి చేయడం మొదలగు విషయంలో కాంట్రాక్టు లేదా ఒప్పందం కలిగి ఉన్నవారు ఆ ఒప్పందం పూర్తి అయి చేపట్టిన పని పూర్తి చేసేవరకూ కూడా అనర్హులే.”
“అలాగా…” అన్నారు పిల్లలిద్దరు
“అంతేనా… గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థి ఎన్నికల ఖర్చుల పద్దును ఎలక్షన్ కమిషన్‌కు తగిన సమయంలో సమర్పించకపోతే కూడా ఎలక్షన్ కమీషన్ ఆయా వ్యక్తుల వివరాలతో ఉత్తర్వులు జారీ చేస్తుంది. అట్టి ఉత్తర్వులు వచ్చిన తేదీనుండి మూడు సంవత్సరాలు ఆయా వ్యక్తులు అనర్హులే.”
“అమ్మో… అర్హతల కంటే అనర్హతల భాగమే ఎక్కువగా ఉన్నట్టుందిగా తాతయ్యా…” అన్నాడు రాజేశ్.
“అసలు కంటే కొసరే అధికం అన్నారు కదరా అన్నయ్యా…” అంటూ నవ్వింది రాగిణి.
“పిల్లలూ… ఇక ఇప్పటికి చాలు గానీ, తాతయ్యగారిని భోంచేయనీయండి…” అంటూ పిల్లలను అదిలించి, “కాళ్ళు చేతులు కడుక్కుని రండి మామాయ్యా, డైనింగ్ టేబుల్ మీద మీకు భోజనం వడ్డిస్తున్నాను. రాజేశ్ రాగిణీ మీరూ రండి తాతయ్యతో పాటు భోంచేద్దురుగానీ..” అంది సరస్వతి.
“అలాగేనమ్మా! అవునూ ఇంతకీ వాడేడమ్మా. తిండానికన్నా ఇంటికొస్తున్నాడా లేక అక్కడే, ఆ ఆఫీసులోనే తినేస్తున్నాడా….” అన్నాడు పరంధామయ్య.
“ఏమో చెప్పలేను మామయ్యా. వీలు కుదిరితే వస్తున్నారు. లేకపోతే పిల్లలకు పెట్టేసి కాసింత సేపు ఎదురు చూసి నేను తినేస్తున్నాను. ఆయన వస్తారో లేదో తెలియదు కానీ మీరు కానీయండి పిల్లతో పాటు” అంటూ అన్నం, పప్పు, మద్దవంకాయ కూర, ప్లేట్లో వడ్డించి చారు గిన్నెల్లో పోసి అన్నంలోకి నేయి వేసింది అందరికి సరస్వతి.
“నేను తెచ్చిన సంచీలో పండుమిరపకాయల పచ్చడి ఉందమ్మా. మీ కోసమని మొన్నే రుబ్బి తాళింపు పెట్టి పంపించింది మీ అత్తయ్య. అది తీసుకరామ్మా” అన్నాడు పరంధామయ్య.
“అలాగే మామయ్యా” అని వెళ్ళి జాగ్రత్తగా ప్యాక్ చేసిన పచ్చడి సీసాను తీసుకుని వచ్చి మామగారికీ, పిల్లలిద్దరికీ తలా కాస్త వడ్డించింది. ఆ పచ్చడిలో కూడా మరింత నెయ్యి వేసింది.
“ముద్దపప్పు, పండుమిరపపచ్చడీ, నెయ్యి… ఇంకా ముద్దపప్పు గుత్తివంకాయకూర ఈ రెండు కాంబినేషన్లు అద్భుతం అమ్మా. ఇప్పుడు ప్లేట్లో రెండూ ఉన్నాయి. ఈ రోజు విందు భోజనమే…” అన్నాడు పరంధామయ్య
“అమ్మా… చూడవే. అన్నయ్య, అన్నంలోకి ఒకేసారి పప్పు వంకాయ కూర పచ్చడి ఎలా పిచ్చిపిచ్చిగా కలుపుకుంటున్నాడో” అంది రాగిణి, రాజేశ్ వంక చూపిస్తూ
“రేయ్… నీకెన్నిసార్లు చెప్పాలి… అలా అన్నీ ఒకేసారి కలిపి తినకూడదు. వేరువేరుగా కలుపుకోవాలని…” గదమాయించింది సరస్వతి.
“అన్నట్టు పిల్లలూ… పిచ్చి అంటే గుర్తొచ్చింది. పిచ్చివాళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. అయితే వాళ్ళకు పిచ్చి ఉందని, వాళ్ళు పిచ్చివాళ్ళని కోర్టు ధృవీకరించి ఉండాలి” అన్నాడు పరంధామయ్య.
“ఇంకా… ఇంకా ఇలాంటి వాళ్ళెవరైనా, అదే అనర్హతకు గురి అయ్యేవారు ఉన్నారా తాతయ్యా” అడిగాడు రాజేశ్.
“అవును ఉన్నారు. అప్పులు చేసి ఆస్తిపాస్తులు అమ్ముకున్నా తీరకుండా, వాటిని చెల్లించలేక దివాళా తీసి కోర్టుద్వార దివాళా ఆర్డరు పొందిన వాళ్ళు కూడా అనర్హులే” అన్నాడు పరంధామయ్య.
“అంటే… మన వీథి చివరి రాజవర్ధన్ గారు వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు పెరిగిపోయి అప్పట్లో దివాళా తీసినట్టూ, కోర్టులో ఐ.పీ. పెట్టినట్లు పేపర్లో చదివానుగా మామయ్యా,. ఆయనకు యం.యల్.ఏ.గా పోటీ చేయాలని ఉందని అనుకునేవాళ్ళము కదా. మరిప్పుడు ఆయన పోటీకి అనర్హుడేనా” అంది సరస్వతి.
“సుబ్బరంగా అనర్హుడే అమ్మా. అయినా ఇప్పుడతనిదగ్గర ఏం మిగిలిందని ఎన్నికల ఖర్చులు భరించేందుకు” అన్నాడు పరంధామయ్య.
“అవును మామాయ్యా… ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయవచ్చు. దానికి ఏదైనా పరిమితి ఉందా..?”
“అవునమ్మా. ప్రస్తుత శాసనసభ ఎన్నికల అభ్యర్థులు ఇరవైఎనిమిది లక్షలకు మించకుండా ఖర్చు చేయవచ్చును. ఒకవేళ గెలిచిన అభ్యర్థి అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు తేలితే ఆ అభ్యర్థి ఎన్నిక రద్దు అవుతుంది. అతను లేదా ఆమె పోటీలో గెలిచినా యం.యల్.ఏ.గా కొనసాగడానికి వీలులేదు. ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి.”
“అమ్మా… నాకు మజ్జిగ పులుసు వెయ్యి” అంది రాగిణి.
“అదేమిటి… అప్పుడే మజ్జిగ పులుసా. ముందు ఆ ముద్దపప్పు గుత్తివంకాయకూర కలుపుకుని తిను. మారు వడ్డించుకున్న తరువాతే మజ్జిగపులుసు” అంది సరస్వతి మందలిస్తున్నట్టుగా రాగిణిని.
“సరేనమ్మా… ఆ తాతయ్యా! నువ్వు చెప్పు ఎన్నికలు ఎలా మొదలవుతాయి. ఎవరు ఈ ఎన్నికలను నిర్వహించేది” అడిగింది రాగిణి.
“ఎన్నికలను నిర్వహించేది ఎన్నికల కమీషన్. ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఆ రాష్ట్రంలోని అధికార యంత్రాంగం అంతా ఎన్నికల కమీషన్ ఆధ్వర్యంలో, వాళ్ళ ఆదేశానుసారంగా పనిచేయాల్సిందే.”
“అంటే కలెక్టర్లు, యస్.పీ.లు, ఇంకా నాన్న లాంటి అమ్మ లాంటి ఉద్యోగులు అందరూనా” అన్నాడు రాజేశ్
“అవునురా రాజేశ్. శాసనసభ ఎన్నికలు అయితే ఆ రాష్ట్రంలోని ఉద్యోగులందరూ దేశంలోని లోకసభ ఎన్నికలయితే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులూ తాత్కాలికంగా ఎన్నికల కమీషన్ ఆధీనంలో పనిచేస్తారు.”
“సరే… సరే… ముందుగా ఎన్నికల కమీషన్ ఏం చేస్తుంది. ఏం చేయిస్తుంది మామయ్యా” అంది సరస్వతి.
“ముందుగా ఎన్నికల కమిషన్ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలో నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తుంది.”
“ఎన్నికల షెడ్యూలు అంటే ఏమిటి తాతయ్యా” అంది రాగిణి మారు వడ్డించుకున్న అన్నంలో మజ్జిగపులుసు కలుపుకుంటూ.
“అంటే పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయడం మొదలుకొని ఓట్ల లెక్కింపు పూర్తి అయి గెలిచిన అభ్యర్థులు ఎవరెవరు అనేదానిని సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటించేవరకు ఉండే వివిధ తేదీలు, సమయాలు కలిపి షెడ్యూలు అంటారు.”
“కాస్త వివరంగా చెప్పరాదా తాతయ్యా” అన్నాడు రాజేశ్
“రేయ్… ముందు భోజనం కానీయండి. అయింతర్వాత తీరికగా కూచుని అన్నీ వివరంగా విందురుగానీ. మామయ్యా, వాళ్ళు అలాగే అడుగుతూంటారు గానీ మీరు చారు వడ్డించుకోండి ముద్దపప్పులోకి” అంటూ వడ్డించింది సరస్వతి.
తరువాత మజ్జిగపులుసుతో భోజనాన్ని ముగించి చేతులు కడుక్కుని వచ్చి సోఫాలో విశ్రాంతిగా కూచున్నాడు పరంధామయ్య. కోడలు తెచ్చిచ్చిన వక్కపలుకులు నములుతూ రేడియోలో వస్తున్న పాటలు వింటూ కళ్ళు మూసుకుని ఏదో ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు.
అటు సరస్వతి డైనింగ్ టేబుల్ మీది కంచాలూ గిన్నెలు తీసేస్తుంటే తల్లికి సాయంగా వాటిని వంటింట్లోని సింకులో వేసేసింది రాగిణి. తరువాత తల్లి కూచుని తింటూంటే వడ్డన చేసి మిగిలిన పాత్రలన్నీ వంటింట్లో సర్దేసుకోవడానికి సాయపడింది.
(ఇంకా ఉంది)