Site icon Sanchika

ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-10

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“చా[/dropcap]లా సేపు అలాగే ఉండి మెల్లిగా ముందుకి కదిలాను. నువ్వు నా వెనకాలే వచ్చావు.

అప్పుడు నేనేమన్నానో నీకు గుర్తుందా, గుర్తు లేకపోతే చెప్తాను, ‘నీ గురి తప్పింది’ అని అన్నాను. అది విని కూడా నువ్వు ఒక్క మాట కూడా అనలేదు. నా మాటలు నీకు వినబడలేదని నేననుకోను. గురి తప్పింది అన్న మాటని, నీకు స్పష్టంగా వినపడేలాగా గట్టిగానే అన్నాను.

నువ్వు ఏం అనలేదు. గురి అన్న దానికి అర్థం తెలీదని నేననుకోను. అర్థం అయింది. కాని నీ మౌనం నా మాటలకి సమాధానం అనుకోవచ్చు.

మామూలుగా అయితే నేనన్న మాటకి ఎవరైనా ఏదో ఒకటి అంటారు. లేకపోతే సంజాయిషీ ఇచ్చుకుంటారు. ప్రతీ వేటగాడు తను చేసింది ఋజువు చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని నువ్వు ఏమీ అనలేదు. అంటే నీ పనిని నువ్వు సమర్థించుకున్నట్లే కదా! అంగీకరిస్తున్నట్లే కదా. అవును గురి తప్పింది లేకపోతే నిన్ను చంపేవాడిని కదా అన్న అర్థం నీ మౌనంలో వస్తుంది.

ఆ తరవాత ఏం జరిగిందో నీకు తెలిసిందే.

ఒక్కొక్క సారి మనం గతాన్ని వర్తమానానికి తెస్తుంటే కొన్ని క్రానాలాజికల్‌గా రావు. వెనకది ముందుకి ముందుది వెనకకి వెళ్ళచ్చు. ఇప్పుడు నా మాటలు కూడా అలాగే ఉంటాయి.

ఆ తరవాత తుపాకీ శబ్దాలతో ఆ ప్రదేశం అంతా ప్రతిధ్వనులతో మారు మోగింది.

మధ్యాహ్నం అయింది. భోజనం చేసే సమయం. చెట్ల కింద ఓ టేబుల్ మీద అన్ని అందంగా అరేంజ్ చేసారు.

నువ్వు అక్కడ కనిపించలేదు. నీకు షూటింగ్‌లో సాయపడ్డ హెల్పర్‌ని నీ గురించి అడిగాను. అప్పుడు అతను చెప్పాడు నువ్వు టౌన్‌కి వెళ్ళావని. నువ్వు వెళ్ళి పోయావన్నది నిజం కాదా! నువ్వు లంచ్ కూడా చేయకుండా వెళ్ళిపోయావు. ఎందుకని పైగా చెప్పకుండా వెళ్ళిపోయావు.” అంటూ బ్రహ్మాజీ ఆగాడు.

“మరొక్క విషయం, భోజనం అయ్యాక నాకు కావేరి కూడా కనిపించలేదు. పనివాడు చెప్తే తెలిసింది, ఆమె కూడా టౌన్‌కి వెళ్ళిందని. “

ఈ మాట అంటున్నప్పుడు బ్రహ్మాజీ కంఠంలో మార్పుని ఈజీగా గుర్తించచ్చు.

శివరాం సిగార్ కోసం చూసాడు. అది గమనించిన బ్రహ్మాజీ, ముందుకి సిగార్ డబ్బాని జరిపాడు. అందులోంచి ఒకటి తీసుకున్నాడు. అతని చేతులు వణకడం లేదు, తీసుకున్నాక, చివర కోసాడు.

బ్రహ్మాజీ కాండిల్‌ని శివరాంకి దగ్గరగా తీసుకెళ్ళాడు.

“థాంక్యూ.” అన్నాడు సిగార్‌ని నోటి దగ్గర పెట్టుకుంటూ.

“ఆ రోజున మధ్యాహ్నం వెళ్ళిన వాడివి, సాయంకాలం వరకూ రాలేదు. నువ్వు సాయంకాలం వేసుకునే డ్రెస్ వేసుకుని వచ్చావు.

ఇలాగే ఈ ఫైర్ ప్లేస్ ముందు, ఉన్నఈ పెద్ద లెదర్ కుర్చీల్లో మనం ముగ్గురం కూచున్నాం. టీ తాగాం. మనం ఏం జరగనట్లే, ఎప్పుటి లాగే మాట్లాడుకున్నాం. కాని అందులో ఏదో వెల్తి ఉంది. అది ఎందుకో, ఏమిటో మనిద్దరికీ తెలుసు.

సీక్రెట్. ఓ రహస్యం మనిద్దరికి మాత్రమే తెలిసినది, మన మధ్య ఉంది. ఎప్పటి లాగే ఎంతో దగ్గరగా పక్కనే ఉండి మాట్లాడుకున్నాం. కాని అందులో ఇదివరకూ లాంటి దగ్గరతనం లేదు. వేట గురించి మాట్లాడుకున్నాం. అంతే తప్ప జింకని చంపడానికి చేసిన ప్రయత్నం లాంటి సంగతులు ఏం రాలేదు. ఆశ్చర్యం అనిపించింది. ఎంతో అందమైన జింకని చంపే అవకాశం చేజారిపోయినందుకు బాధపడక పోవడం, అసలు ఆ విషయాలు ఏవీ మాట్లాడక పోవడం ఆశ్చర్యంగానే అనిపించింది.

రాత్రి భోజన సమయానికి మళ్ళీ మనం పక్క పక్కనే కూచున్నాం. ఎప్పటిలాగా నువ్వు, నేను, కావేరి ముగ్గురం కలిసి భోంచేసాం. ఆ సమయంలో ఆ రోజు ఉదయం జరిగిన వేట, ఆ తరవాత మధ్యాహ్నం చెట్ల కింద భోజనం అన్నీ, నీ యాబ్సెన్స్ వీటన్నిటి గురించి ఆలోచించాను. నిజం ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పక పోతే ఈ రహస్యం ఇలాగే ఉండిపోతుంది అని అనిపించింది.

భోంచేస్తున్నప్పుడు నీవైపు చాలా సార్లు చూసాను. నిన్ను చూసినప్పుడల్లా అదే దృశ్యం గుర్తొస్తోంది. ఇక మీదట నీ మీద నిఘా ఉంచాలని. అది కూడా ఎవరికీ తెలీకూడదు. ఎవరికీ అనుమానం రాకూడదు.

కాని, అలా చెయ్యలేదు, అలాంటిదేం చెయ్య కుండా నా హుందాతనాన్ని నిలబెట్టుకున్నాను.

వేట రోజున, మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక కావేరి దగ్గరికి వెళ్ళి, ఆమె ముందు నుంచున్నాను. ఆ ఉదయం జరిగిన సంగతి అంతా ఆమెకి చెప్పాలనుకున్నాను. కాని, చెప్పలేదు. ఆమెకి చెప్పి నన్ను నేను తక్కువ చేసుకోదల్చుకోలేదు. పైగా ఆమె కనిపించలేదు. టౌన్‌కి వెళ్ళిందని తెలిసింది. మనసు ములిగింది. నేను పడ్డ బాధ, అవమానం, వేదన ఇవన్నీ నీకు అర్థం అవుతాయో లేదో నాకు తెలీదు.

ఈరోజున ఎలా కూచున్నామో, ఆ రోజున కూడా అలాగే కూచున్నాం. ఇదే టేబుల్. కావేరి మన ఇద్దరి మధ్య కూచుంది. ఆ రోజల్లో పవర్ కట్ చాలా ఉండేది. ఒకసారి కరెంట్ పోతే తొందరగా వచ్చేది కాదు. అందుకని సాధారణంగా చీకట్లోనే ఉండిపోయే వాళ్ళం.

ఆరోజున కూడా కరెంట్ లేదు. ఇలాగే కాండిల్స్ వెలుగుతున్నాయి. కావేరికి ఆ కొవ్వొత్తుల వెలుగులో నీడలు కదలాడుతూంటే భోంచేయడం ఇష్టం.

కరెంటు వచ్చాకా నువ్వు వెళ్ళిపోయావు.

నేను నా గదిలోకి వెళ్తూ కావేరి గదిపైపు చూసాను.

కావేరి గది తలుపులు తీసి ఉన్నాయి. వెంటనే లోపలికి చూసాను. మంచి సమయంలో అడగాలి.

కావేరీ నాకు నిజం కావాలి. నువ్వు ఎందుకు వెళ్ళి పోయావు, మామూలుగా అడుగుతున్నట్లుగా ఈ విషయం గురించి ఏదో క్యాజుయల్‌గా ఎంతో మామూలుగా అడిగినట్లుగా అడగాలని అనుకున్నాను. అందుకే కావేరి గదిలోకి వెళ్ళాను.

గది కాస్త వెచ్చగా ఉంది. టేబుల్ లైటు వెలుగులో కావేరి ఏదో పుస్తకం చదువుతోంది. దగ్గరికి వెళ్ళాను.

కార్పెట్ మీద నా మెత్తటి అడుగుల శబ్దం ఆమెకి వినపడలేదు. నా రాకని గమనించలేదు. పుస్తకం చదువుతూ ఉండిపోయింది. అది ఓ ఇంగ్లీషు పుస్తకం.

నేను వచ్చి పక్కన నుంచునే వరకూ ఆమె నన్ను గమనించలేదు. గమనించాక కళ్ళు పైకెత్తి రెండు పెద్ద ఆల్చిప్పలు తెరుచుకున్నట్లుగా చూసింది. ఆ కళ్లు నీకు గుర్తున్నాయా, ఆమె చూసే విధానం అందులో మెరుపు వేరుగా ఉంటుంది. అది ఈలాంటి కాండిల్ వెలుగు మూలంగా వచ్చింది కాదు. సహజంగానే ఆ కళ్ళల్లో మెరుపుంది. కాని, ఆమెలో ఏ మాత్రం ఉత్సాహం లేదు. మొహం పాలిపోయి ఉంది.

“ఒంట్లో బాగా లేదా” ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూచుంటూ ఆమె మొహంలోకి చూస్తూ అడిగాను.

ఆమె నావైపు చూసింది కాని ఏం మాట్లాడలేదు.

ఆ చూపులో ఏదో ఉంది. ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఆ క్షణాలు చాలా ముఖ్యమైనది.

ఆ చూపులో ఏవో ప్రశ్నలు, ఆమె నన్నేదో అడగాలనుకుంటున్నట్లుగా ఉంది.

‘కావేరీ నాకు ఇది చెప్పు, మధ్యహ్నం చెప్పకుండా ఎందుకెళ్ళావ్’ అని అడగాలనుకున్నాను. కాని ఆమె చూపులకి నా మాటల్ని నేను మింగేసాను. అడిగే ధైర్యం లేకపోయింది.

నేను కూడా నా చూపుని తిప్పుకోలేదు. ఆ క్షణం నా మనసుని అదుపులో ఉంచుకున్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను

లోపల ఏదో కలవరం. నాలో ఎన్నో ప్రశ్నలున్నాయి. మొదటి ప్రశ్న, ‘కావేరీ, నువ్వు టౌన్‌కి వెళ్తున్నట్లు నాకు ఎందుకు చెప్పలేదు, ఒక్కదానివి వెళ్ళావా, శివరామ్‌తో కలిసి వెళ్ళావా’

ఇంకా ఇలాంటి ప్రశ్నలే ఉన్నాయి.

ఆమెని అడగాలా వద్దా! అడిగి నన్ను నేను సంస్కారం లేని వాడిగా ప్రవర్తించాలా! ఏమీ తెలీని వాడిలా ఉండాలా! అలా ఉండడం సాధ్యం అవుతుందా! మనసంతా అలజడి.

కాని ఏదీ పైకి కనిపించనివ్వలేదు.

ఎందుకంటే ఆ ఉదయం సంఘటన ఇంకా కలిచి వేస్తోంది. తాజాగా, అప్పుడే జరిగినట్లుగా ఉంది. నీ వేట, తప్పిన నీ గురి, అన్నీ నా మనసులో ఇంకా అలాగే ఉన్నాయి. ఎవరితోనైనా పంచుకోవాలని ఉంది. కాని ఎవరితో చెప్పుకోగలను.

నాకు దగ్గరిగా ఉన్నవాళ్ళతో చెప్పుకోగలను. కాని ఆ దగ్గర వాళ్ళు ఎవరు. కావేరి, సీతమ్మ.

కావేరితో చెప్పనా వద్దా, చెప్పి, నా స్నేహితుడి విలువని ఈమె దృష్టిలో తగ్గించాలా, ఈమెతో చెప్పకపోతే మరి ఇంక ఎవరితో చెప్పాలి, సీతమ్మ, నాకే ఏది స్పష్టత లేనప్పుడు సీతమ్మకి చెప్పడం ఎందుకు అనవసరం.

బాగా ఆలోచించిన తరవాత ఎవరికీ చెప్పకూడదని అనుకున్నాను. నా జీవితంలో నేను ఈ ఇద్దరిని పూర్తిగా నమ్మాను. ఆ ఇద్దరికి కూడా చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. ఈ రహస్యాన్ని నాలోనే ఉంచుకోవాలి.

శివరాం మీద నాకు అనుమానం ఉంది అని కావేరితో అనలేను.

నా ప్రాణ స్నేహితుడివి నువ్వు, నా హృదయానికి బాగా దగ్గరికి వచ్చిన మనిషివి. నువ్వే ఇలా చేస్తే. నాలో నేను జీర్ణించుకోలేకపోవడంతో పిచ్చి పట్టినట్లైంది.

అసలు ఆరోజున నీ ప్రవర్తన కొంచెం వేరుగా అనిపించింది. రాత్రి భోంచేస్తున్నప్పుడు ఏం తెలీనట్లుగా ఉన్నావు. అసలు ఆ ఉదయం వేటలో ఏం జరగలేదన్నట్లుగా మనం కలుసుకోనట్లుగా నువ్వున్నావు. వేటకి వెళ్ళలేదన్నట్లుగా ఉన్నావు.

కావేరి గదిలోకి వెళ్ళాను.

ఆమె ఏదో పుస్తకం చదువుతోంది. అప్పుడు నాకు అంతకు ముందు ఇలాంటి సీన్ గుర్తొచ్చింది. కొన్నిరోజుల క్రితం కూడా ఇలాగే ఓసారి కావేరి చదువుతూ కనిపించింది. అప్పుడు నువ్వు ఆమె పక్కన ఉన్న కుర్చీలో కూచున్నావు.

నువ్వు కూచోడం చూసి పక్కకి తిరిగింది. ఆ రోజున జరిగిన సంభాషణ నాకు గుర్తున్నది చెప్తాను. నువ్వు ఏం చదువుతున్నావని అడిగావు.

నీకు ఆమెకి మధ్య సంభాషణ చాలా సేపే జరిగింది. ఆ పుస్తకం పేరేంటో కూడా నువ్వు అడిగావు. అంతే కాదు, ఆ పుస్తకం మీద ఆమె అభిప్రాయం అడిగావు.

తరవాత నువ్వు చదివిన పుస్తకాల్లోని, ప్రదేశాలలోని మనుషుల జీవితాల గురించి చాలా సేపు మాట్లాడావు. ఆ సబ్జెక్ట్ అంటే నీకు చాలా ఇష్టం అన్నట్లుగా మాట్లాడావు. నిజానికి నేను కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, కాని అక్కడ కూచో బుద్ధి కాలేదు. అయినా బావుండదని కాస్సేపు కూచున్నాను. విన్నాను.

ఆరోజున మీ ఇద్దరూ మాటలు విన్నాక నాకు అక్కడ ఉండాలనిపించ లేదు. పైకి చెప్పలేని మథనం.

కావేరి నాకు అర్థం అవడం లేదు. ఆమె నా నుంచి దూరం వెళ్తోందనిపించింది.

కాని ఆమెని ఏమీ అడగ లేను. తెలుసుకోలేను.

కాని తెలుసుకోవలంటే డైరీ ఒక్కటే మార్గం.

ఆ డైరీ ఆమె మనసు. ఆమె ఆంతరంగం.

అది చదివితే ఆమె కాస్త అర్థం అవుతుందేమో అనుకున్నాను.

ఆమె అన్నీ అందులో రాస్తుందని తెలుసు. ఇదివరకు ఎన్నో సార్లు చూపించింది. అందులో ఏం ఉందో అదే నాకు చెప్పింది. అందుకే డైరీ చదవాలి. డైరీ ఎక్కడుంటుందో నాకు తెలుసు.

కావేరి లేని సమయం చూసి ఆమె గదిలోకి వెళ్ళాను. డైరీ తీసుకుని చదివితే ఆమె మనసులో ఏం ఉందో తెలుసోవచ్చు. ఆమెని అడగాల్సిన అవసరం ఉండదని అనుకుని డైరీ కోసం సొరుగు తీసి చూసాను. అది కనిపించలేదు.

ఆ గది అంతా తిరిగాను. ఎక్కడైనా పొరపాటున రాస్తూ రాస్తూ పెట్టేసిందేమోనని అన్ని చోట్లా వెదికాను. డైరీ కనిపించలేదు కాని, ఏవో పుస్తకాలు చాలా కనిపించాయి. పుస్తకాలు చూసేకా, కావేరిని అడిగాను ఎక్కడిది ఈ పుస్తకాలు అని. వాటిని నువ్వు ఇచ్చావని అంది. ఆ పుస్తకాలని ఏ విధంగా తెప్పించావో కూడా చెప్పింది. కావేరికిష్టమైన పుస్తకాలని నువ్వు టౌన్‌లో ఆర్డర్ చేసావని, వాటిని కావేరికి ఇచ్చావని.

అప్పుడు తెలిసింది మీ ఇద్దరి మధ్య నాకు తెలీని బంధం ఏదో అల్లుకుంటోంది.

అది ఏంటో మీరిద్దరూ కూడా నాకు చెప్పదలుచుకోలేదు. అందుకే ఈ విషయాన్ని మీరిద్దరూ నాకు చెప్పలేదు. మీ ఇద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారా అన్న అనుమానం కలిగింది. అదేది తెలీనట్లుగా పట్టించుకోనట్లుగా ఉన్నాను కాని, బాధ. ఎవరితోనూ చెప్పుకోలేని బాధ. ఎక్కడో గుచ్చుకుంటోంది. కాని బయట పడదలుచుకోలేదు. హుందాగా ప్రవర్తించాను. అందుకే మీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడ కూర్చుకోలేదు. ఎందుకంటే మీరు మాట్లాడుకుంటున్న విషయాలు నాకు నచ్చినవే అయినా ఏదో పోస్ట్ వచ్చిందని దాన్ని చూడాలని వెళ్ళి పోయాను.

ఒక్కటి మాత్రం నిజం, నాకు ఏమాత్రం అనుమానం రాకుండా మీ ఇద్దరూ కూడా మీ మీ పాత్రలు బాగా పోషించారు.

ఆ రోజున, నువ్వు ఇలాగే ఇక్కడే ఈ పెద్ద కుర్చీలో కూచున్నావు. మీరిద్దరూ ఆ వేడి ప్రదేశాల గురించి, లండన్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తరవాత నువ్వు బండి తెప్పించుకుని వెళ్ళి పోయావు. ఇవన్నీ కూడా వేటాడిన రోజున జరిగింది.” అని ఎదురుగా ఉన్న శివరామ్‌ని చూసాడు.

బ్రహ్మాజీ గొంతులో సంతృప్తి, తను చెప్పాలనుకున్నవి అన్నీ చెప్పేసాడు.

ఓ రిపోర్టర్ తన ఉద్యోగాన్ని సక్రమంగా నెరవేర్చినట్లుగా అనిపించింది.

శివరామ్ చేతులు కట్టుకుని ఉన్నాడు. అంటే అంతా విన్నాడు.

(సశేషం)

Exit mobile version